కర్నూలు(అర్బన్): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ఎస్సీ సబ్‌ప్లాన్ పథకానికి నీలినీడలు కమ్ముకున్నాయి. గతేడాది ఆర్భాటంగా రూ.45 కోట్ల విలువైన వివిధ రకాల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం చేసిన పనులకు నిధులను విడుదల చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తోంది. దీంతో సబ్‌ప్లాన్ కింద మంజూరైన పలు పనులు నత్తనడకన సాగుతున్నాయి.
సాంఘిక సంక్షేమశాఖ వసతి గృహాల్లో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులకు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి నయాపైసా నిధులు కూడ విడుదల చేయలేదు. దీంతో పనులు చేసిన కాంట్రాక్టర్లు బిల్లులు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రూ.2.99 కోట్లతో జిల్లాలోని 27 ఎస్సీ వసతి గృహాలకు ప్రహరీలు నిర్మించే పనులు దాదాపు పూర్తయ్యాయి. 38 వసతి గృహాల్లో రూ.3.68 కోట్లతో టాయ్‌లెట్స్, స్నానపు గదుల మరమ్మతులు, వైట్‌వాష్, సింటెక్స్ ట్యాంక్స్ ఏర్పాటు, విద్యుత్, కొత్త మోటార్ల ఏర్పాటుకు రూ.3.68 కోట్లతో చేపట్టిన పనులు కూడా పూర్తి చేశారు. రూ.1 కోటితో 25 వసతి గృహాల్లో 130 టాయ్‌లెట్స్, 131 స్నానపుగదుల నిర్మాణాల పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి.
మొత్తం రూ.7.67 కోట్ల పనులు చేపట్టగా, ఈ ఏడాది మొదట్లో కేవలం రూ.1.67 కోట్లు మాత్రమే విడుదల కాగా, నేటి వరకు రూ. 6 కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన రూ.37 కోట్లతో చేపట్టిన నూతన వసతి గృహాల భవనాల నిర్మాణాలకు కూడా అంతంత మాత్రంగానే బిల్లులు అందుతున్నట్లు సమాచారం. 25 శాతం చేసిన పనులకు సంబంధించిన బిల్లులను మాత్రమే పెట్టాలని, మొదలు పెట్టని పనులు ప్రారంభిచొద్దని ఆర్థిక శాఖ ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సబ్‌ప్లాన్ కింద మంజూరై ఇంకా ప్రారంభం కాని పనులు రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పనులన్నింటిని గతేడాది డిసెంబర్‌లో ప్రారంభం కాగా, నిధుల విడుదలలో నెలకొన్న జాప్యం కారణంగా పలు పనులు అసంపూర్తిగా ఉన్నాయి.
నిర్మాణంలో ఉన్న పనులు
జిల్లాలోని ఆదోని, గూడురు, కోసిగి, పత్తికొండ, నందవరం ప్రాంతాల్లో రూ.15 కోట్లతో ఇంటిగ్రేటెడ్ వెల్ఫేర్ హాస్టల్ కాంప్లెక్స్‌ల నిర్మాణాలు మంజూరు కాగా, నందవరంలో స్థల సమస్యతో ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదు. మిగిలిన నాలుగు ప్రాంతాల్లో పనులు జరుగుతున్నాయి. హర్దగేరి, సీ బెళగల్, ఆస్పరి, ఓర్వకల్, హోళగుంద, వెంకటాపురం, జూపాడుబంగ్లా, పాణ్యం, పేరుసోముల ప్రాంతాల్లో రూ.4 కోట్లతో నూతన భవనాలు నిర్మించాల్సి ఉండగా, పేరుసోములలో స్థల సమస్య వల్ల పనులు ప్రారంభం కాలేదు.
మిగిలిన చోట్ల పనులు కొనసాగుతున్నాయి. శిథిలావస్థలో ఉన్న ఉయ్యాలవాడ, ఎర్రగుంట్ల, మద్దికెర, పెద్దపాడు, కోడుమూరు ప్రాంతాల్లో రూ.3.20 కోట్లతో కొత్త హాస్టళ్ల నిర్మాణాలు చేపట్టగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. కళాశాలలకు సంబంధించి కర్నూలులో బాలుర, బాలికల వసతి గృహాలు మంజూరు కాగా, బాలుర వసతి గృహానికి స్థలం దొరకనట్లు తెలుస్తోంది. నంద్యాలలో రెండు హాస్టళ్లకు రూ.2.50 కోట్లు కేటాయించారు. అయితే ఈ పనులకు సంబంధించిన బిల్లుల మంజూరుకు పలు ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఎస్సీ సబ్‌ప్లాన్‌కు నిధులు కేటాయించాలని పలువురు కోరుతున్నారు.
‘ఎస్సీ సబ్‌ప్లాన్’కు నీలినీడలు
Published Thu, Aug 28 2014 4:12 AM | Last Updated on Tue, Jul 24 2018 2:22 PM
Advertisement
Advertisement