దోపిడీకి ప్లాన్‌ | planning to robbery | Sakshi
Sakshi News home page

దోపిడీకి ప్లాన్‌

Published Mon, Mar 5 2018 10:45 AM | Last Updated on Thu, Aug 30 2018 4:20 PM

planning to robbery - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

పాలకొల్లుటౌన్‌ : ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులు తెలుగుదేశం నాయకులకు కల్పతరువుగా మారాయి. కాంట్రాక్టర్లు, అధికారులకు కాసులవర్షం కురిపిస్తున్నాయి. ఇది పాలకొల్లు మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతికి అద్దం పడుతోంది. పాలకొల్లు మున్సిపాలిటీకి ప్రభుత్వం ఎస్సీ సబ్‌ప్లాన్‌  ద్వారా రూ.18 కోట్లు మంజూరు చేసింది. 2017–18లో ఈ నిధులు ఖర్చు చేయాలి. అయితే మున్సిపల్‌ అధికారులు పనులకు టెండర్లు ఖరారు చేసి ఏడాది పూర్తవుతున్నా ఇప్పటివరకు ఆ పనులను పూర్తి చేయలేదు. మార్చి నెలాఖరు సమీపిస్తుండడంతో నిధులు తిరిగి వెనక్కు మళ్లుతాయనే భయంతో హడావుడిగా టీడీపీ నాయకులు పనులను వేగవంతం చేశారు. సబ్‌ప్లాన్‌ చట్టాన్ని కూడా అతిక్రమించి నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలిచ్చి భారీ అవినీతికి పాల్పడుతున్నారు. 

పాలకొల్లు బెత్లహాంపేటలో ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులతో నాణ్యత లేకుండా నిర్మిస్తున్న సీసీ డ్రెయిన్‌ 

7 ఎస్సీ వార్డులు 
పాలకొల్లులో మొత్తం 31 వార్డులు ఉన్నాయి. వీటిలో ఏడు ఎస్సీ వార్డులు.  ఈ వార్డుల్లో ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులతో డ్రెయినేజీ, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పిం చాల్సిన బాధ్యత మున్సిపాలిటీపై ఉంది. జనాభాలో 40శాతం ఎస్సీలు ఉన్న ప్రాంతాల్లో ఈ నిధులు వాడాలి.

టీడీపీ నేతల కోసం రోడ్డు 
అయితే ఎస్సీలు 10శాతం కూడా లేని ప్రాంతాల్లో పనులు చేపడుతున్నారు. వాస్తవానికి 17, 18 వార్డుల్లో ఎస్సీలు పదిశాతం కూడా ఉండరు. ఇలాంటిచోట పలువురు టీడీపీ నాయకులు వారి పొలాలను రియల్‌ఎస్టేట్‌ వ్యాపారంగా మార్చుకోవడానికి రూ.50లక్షల సబ్‌ప్లాన్‌ నిధులతో నిబంధనలకు విరుద్ధంగా  బీటీ రోడ్డు నిర్మించారు. దీంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్డు నిర్మాణంతో ఇప్పటికే ఈ ప్రాంతంలో అనేక పొలాలు, కొబ్బరితోటలు తొలగించి చకాచకా లేఅవుట్లకు సిద్ధం చేస్తున్నారు. 

నాసిరకంగా పనులు 
ఇదిలా ఉంటే 18వ వార్డు బెత్లహాంపేట, 16వ వార్డులో ఎస్సీ సబ్‌ప్లాన్, మున్సిపల్‌ జనరల్‌ ఫండ్‌ దాదాపు రూ.4కోట్లతో నిర్మితమవుతున్న రోడ్లు, సీసీ డ్రెయిన్‌ నిర్మాణ పనులు నాసిరకంగా జరుగుతున్నాయి. దీనిలో భారీ అవినీతి జరుగుతున్నట్టు సమాచారం.  కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కైనట్టు తెలుస్తోంది. నాసిరకం సిమెంటు వినియోగిస్తున్నట్టు సమాచారం.  ఇసుకపాళ్లు ఎక్కువ వేసి  తూతూమంత్రంగా పనులు చేపట్టినట్టు స్థానికులు విమర్శిస్తున్నారు. ఫలితంగా  వేసిన 2రోజులకే రోడ్డు, డ్రెయిన్లు బీటలు తీశాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  మరికొన్ని ఎస్సీవార్డుల్లో డ్రెయినేజీ నిర్మాణం లేకుండా హడావుడిగా రోడ్డు నిర్మాణాలు చేపట్టారని స్థానికులు చెబుతున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులు రూ.కోటి వ్యయంతో 16వ వార్డులో నిర్మిస్తున్న డ్రెయిన్‌ దృశ్యం  
 
టీడీపీ నేతల కనుసన్నల్లోనే 
పట్టణంలో ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులతో చేపట్టిన పనులన్నీ టీడీపీ నేతల కనుసన్నల్లోనే జరుగుతున్నట్టు సమాచారం. నాసిరకంగా పనులు చేపట్టడంపై  దళిత సంఘాలు మండిపడుతున్నాయి. అయినా ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు.  పనులు జరుగుతున్న ఎస్సీ వార్డుల్లో ఆ ప్రాంతాలకు చెందిన కొంతమంది టీడీపీ వార్డు కౌన్సిలర్లు నాయకులు కాంట్రాక్టర్లు తమను ప్రసన్నం చేసుకోకపోతే బిల్లులు నిలిపేస్తామని బెదిరింపులకు దిగుతున్నట్టు సమాచారం.

కొంతమంది టీడీపీ నేతలు డబ్బులు చేతిలో పడితేగానీ పనులు సాగనీయడం లేదని ™ లుస్తోంది. వీటిపై మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశాల్లో ప్రతిపక్ష నేత యడ్ల తాతాజీ అనేకసార్లు మున్సిపల్‌ చైర్మన్‌ వల్లభు నారాయణమూర్తి, కొందరు టీడీపీ నేతలపై ధ్వజమెత్తారు. వారు రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేసుకోవడానికి రూ.50లక్షలు సబ్‌ప్లాన్‌ నిధులతో రోడ్డు నిర్మించారని విమర్శించారు. దీనిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పోరాడినా ఫలితం లేదు.

7 వార్డుల్లో 86 పనులు 
పాలకొల్లు మున్సిపాలిటీలో 7వార్డుల్లో 86 పనులను చేపట్టారు.  ప్రస్తుతం 48పనులు నూరుశాతం పూర్తికాగా మరో 38 పనులు 75శాతం పూర్తయ్యాయని మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ అధికారులు చెబుతున్నారు. మార్చి 15లోపు మిగిలిన పనులు పూర్తిచేస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం 10, 11, 15, 21, 31 వార్డుల్లో జరుగుతున్న  అభివృద్ధి పనుల్లో నాణ్యతాప్రమాణాలకు కాంట్రాక్టర్లు తిలోదకాలిచ్చినా అధికారులు పట్టించుకోని దుస్థితి నెలకొంది.  

రెండు రోజులకే బీటలు 
బెత్లహాంపేటలో డ్రెయిన్‌ నిర్మాణం చేపట్టారు. అయితే  2రోజులకే ఎక్కడికక్కడ కాంక్రీటు రాలిపోయింది. ప్లాస్టరింగ్‌ కూడా చేయలేదు. డ్రెయిన్‌ మార్జిన్‌ పూడ్చమని అడిగితే ఎవరింటిముందు వాళ్లే పూడ్చుకోవాలని చెబుతున్నారు. ఇది చాలా దారుణం. అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలి.
– షేక్‌ మీరాఉద్దీన్, బెత్లహాంపేట,

డ్రెయిన్‌ లేకుండానే రోడ్డు 
మా వార్డులో అధికారులు సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. అయితే డ్రెయినేజీ లేకుండా రోడ్డు ఎలా నిర్మిస్తారని అడిగితే రోడ్డు పూర్తయ్యాక డ్రెయిన్‌ నిర్మిస్తామని అధికారులు చెబుతున్నారు. డ్రెయిన్‌ నిర్మాణం లేకుండా రోడ్డువేస్తే కుంగిపోతుంది. డ్రెయినేజీ లేకపోవడం వల్ల ఎక్కడి మురుగు అక్కడే ఉంటుంది. పందులు, దోమలు పెరిగి అనారోగ్యం పాలవుతున్నాం. ఇది చాలా దారుణం. అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి.
– నగరపు సత్తెమ్మ, రాజీవ్‌నగర్‌ కాలనీ,  

పర్యవేక్షిస్తున్నారు
పాలకొల్లు మున్సిపాలిటీలో ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులతో రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం జరుగుతోంది. ఈ పనుల్లో నాణ్యతాప్రమాణాలను ఎప్పటికప్పుడు ఇంజినీరింగ్‌ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. పనుల్లో ఎక్కడైనే నాణ్యత లోపించినట్లు గుర్తిస్తే ఆ పనులకు బిల్లులు నిలిపివేస్తాం. క్వాలిటీ కంట్రోల్, థర్డ్‌ పార్టీతో నాణ్యత ప్రమాణాల పరిశీలన అనంతరమే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తాం. నాణ్యత ప్రమాణాలు లోపించిన చోట ప్రజలు గమనించి తమ దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకుంటాం. 
– ఎ.రామ్మోహనరావు, 
మున్సిపల్‌ కమీషనర్, పాలకొల్లు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement