Housing and social welfare departments
-
బాబును నమ్మితే అప్పులే మిగిలాయి...
సాక్షి, దత్తిరాజేరు: గజపతినగరం నియోజకవర్గ వ్యాప్తంగా ఎంతో మంది ఎన్టీఆర్ గృహకల్ప లబ్ధిదారులు బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు. గృహాలు నిర్మించుకోమని అధికారులు చెప్పిన వెంటనే అప్పులు చేసి మరీ ఇళ్ల నిర్మాణం చేపట్టారు. తీరా నిర్మాణాలు పూర్తయినా నేటికీ బిల్లులు పూర్తి స్థాయిలో అందలేదని లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా వేలాది మందికి 2018లో ఎన్టీఆర్ ఇళ్లు మంజూరు చేశారు. ఒక్కో ఇంటికి లక్షన్నర రూపాయలు మంజూరు చేస్తామని అధికారులు ప్రకటించడంతో లబ్ధిదారులు ఎంతో ఆనందంతో నిర్మాణాలు చేపట్టారు. అయితే వారి ఆనందం ఎంతో కాలం నిలువలేదు. కొంతమంది ఒక బిల్లు అయితే మరికొంతమందికి రెండు బిల్లులు మాత్రమే అయ్యాయి. ఎవ్వరికీ పూర్తిస్థాయిలో బిల్లులు అయిన దాఖలాలు లేవు. బిల్లుల కోసం అధికారులను ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అప్పుల భారం.. సొంతింటి కల నెరవేరుతుందనే ఆశతో చాలామంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలకు నడుంబిగించారు. పునాదులు, స్లేడు, శ్లాబు దశల్లో మొత్తం లక్షన్నర రూపాయలు అందజేస్తామని అధికారులు చెప్పారు. దీంతో లబ్ధిదారులు నిర్మాణాలు చేపట్టారు. వాస్తవానికి ప్రభుత్వం చెల్లించే మొత్తం ఎందుకూ సరిపోదు. కాని సొంత ఇల్లు కావాలనే ఉద్దేశంతో చాలామంది అప్పులు చేసి మరీ నిర్మాణాలు చేపట్టారు. అయితే ప్రభుత్వం ఇవ్వాల్సిన బిల్లులు ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. అటు చేసిన అప్పులుకు వడ్డీలు కట్టలేక.. ఇటు బిల్లులు కాక తలలు పట్టుకుంటున్నారు. చాలామంది ఇళ్ల నిర్మాణాలు దాదాపు పూర్తయిన డబ్బుల్లేక గృహ ప్రవేశాలు చేసుకోలేని దుస్థితి నెలకొంది. ఈ విషయమై గృహ నిర్మాణ శాఖ వర్క్ ఇన్స్పెక్టర్ రామారావు వద్ద ప్రస్తావించగా.. ఉపాధి పథకం నుంచి బిల్లులు రావాల్సి ఉందన్నారు. అవి కూడా రెండు విడతల్లో మంజూరవుతాయని చెప్పారు. అయితే అధికారులు స్పందించి బిల్లులు త్వరగా మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఎప్పుడు అందుతాయో.. నాకు పక్కా గృహం మంజూరైంది. మొదట విడత రూ. 19 వేలు.. రెండో విడత రూ.42 వేలు చెల్లించారు. తర్వాత బిల్లు మంజూరు కాలేదు. బిల్లులు త్వరగా మంజూరవుతాయనే ఉద్దేశంతో రెండు లక్షల రూపాయలు అప్పు చేసి మరీ నిర్మాణం పూర్తి చేశాను. వడ్డీలు కట్టలేకపోతున్నాను. – గంగిరెడ్ల లక్ష్మి, సిరిపురం, గంట్యాడ ఒక్క బిల్లే అందింది.. నాపేరు మీద 2018లో ఇళ్లు మంజూరైంది. ప్రస్తుతం శ్లాబు దశలో ఉంది. ఇప్పటికి ఒక్క బిల్లు మాత్రమే అందించి. బయట అప్పులు చేసి నిర్మాణం చేపట్టాను. వడ్డీలు కట్టలేకపోతున్నాను. అధికారులు స్పందించి బిల్లులు అందేలా చర్యలు తీసుకోవాలి. – పల్లా శారద, పెదమానాపురం, త్వరలోనే బిల్లులు నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులందరికీ త్వరలోనే బిల్లులు వారి బ్యాంక్ ఖాతాల్లోకి చేరుతాయి. బిల్లుల విషయంలో ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. నిధులు మంజూరవ్వగానే పంపిణీ చేస్తాం. – ఉమామహేశ్వరరావు గృహనిర్మాణ అధికారి, దత్తిరాజేరు -
‘ఎస్సీ సబ్‌ప్లాన్’కు నీలినీడలు
కర్నూలు(అర్బన్): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ఎస్సీ సబ్‌ప్లాన్ పథకానికి నీలినీడలు కమ్ముకున్నాయి. గతేడాది ఆర్భాటంగా రూ.45 కోట్ల విలువైన వివిధ రకాల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం చేసిన పనులకు నిధులను విడుదల చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తోంది. దీంతో సబ్‌ప్లాన్ కింద మంజూరైన పలు పనులు నత్తనడకన సాగుతున్నాయి. సాంఘిక సంక్షేమశాఖ వసతి గృహాల్లో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులకు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి నయాపైసా నిధులు కూడ విడుదల చేయలేదు. దీంతో పనులు చేసిన కాంట్రాక్టర్లు బిల్లులు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రూ.2.99 కోట్లతో జిల్లాలోని 27 ఎస్సీ వసతి గృహాలకు ప్రహరీలు నిర్మించే పనులు దాదాపు పూర్తయ్యాయి. 38 వసతి గృహాల్లో రూ.3.68 కోట్లతో టాయ్‌లెట్స్, స్నానపు గదుల మరమ్మతులు, వైట్‌వాష్, సింటెక్స్ ట్యాంక్స్ ఏర్పాటు, విద్యుత్, కొత్త మోటార్ల ఏర్పాటుకు రూ.3.68 కోట్లతో చేపట్టిన పనులు కూడా పూర్తి చేశారు. రూ.1 కోటితో 25 వసతి గృహాల్లో 130 టాయ్‌లెట్స్, 131 స్నానపుగదుల నిర్మాణాల పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. మొత్తం రూ.7.67 కోట్ల పనులు చేపట్టగా, ఈ ఏడాది మొదట్లో కేవలం రూ.1.67 కోట్లు మాత్రమే విడుదల కాగా, నేటి వరకు రూ. 6 కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన రూ.37 కోట్లతో చేపట్టిన నూతన వసతి గృహాల భవనాల నిర్మాణాలకు కూడా అంతంత మాత్రంగానే బిల్లులు అందుతున్నట్లు సమాచారం. 25 శాతం చేసిన పనులకు సంబంధించిన బిల్లులను మాత్రమే పెట్టాలని, మొదలు పెట్టని పనులు ప్రారంభిచొద్దని ఆర్థిక శాఖ ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సబ్‌ప్లాన్ కింద మంజూరై ఇంకా ప్రారంభం కాని పనులు రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పనులన్నింటిని గతేడాది డిసెంబర్లో ప్రారంభం కాగా, నిధుల విడుదలలో నెలకొన్న జాప్యం కారణంగా పలు పనులు అసంపూర్తిగా ఉన్నాయి. నిర్మాణంలో ఉన్న పనులు జిల్లాలోని ఆదోని, గూడురు, కోసిగి, పత్తికొండ, నందవరం ప్రాంతాల్లో రూ.15 కోట్లతో ఇంటిగ్రేటెడ్ వెల్ఫేర్ హాస్టల్ కాంప్లెక్స్‌ల నిర్మాణాలు మంజూరు కాగా, నందవరంలో స్థల సమస్యతో ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదు. మిగిలిన నాలుగు ప్రాంతాల్లో పనులు జరుగుతున్నాయి. హర్దగేరి, సీ బెళగల్, ఆస్పరి, ఓర్వకల్, హోళగుంద, వెంకటాపురం, జూపాడుబంగ్లా, పాణ్యం, పేరుసోముల ప్రాంతాల్లో రూ.4 కోట్లతో నూతన భవనాలు నిర్మించాల్సి ఉండగా, పేరుసోములలో స్థల సమస్య వల్ల పనులు ప్రారంభం కాలేదు. మిగిలిన చోట్ల పనులు కొనసాగుతున్నాయి. శిథిలావస్థలో ఉన్న ఉయ్యాలవాడ, ఎర్రగుంట్ల, మద్దికెర, పెద్దపాడు, కోడుమూరు ప్రాంతాల్లో రూ.3.20 కోట్లతో కొత్త హాస్టళ్ల నిర్మాణాలు చేపట్టగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. కళాశాలలకు సంబంధించి కర్నూలులో బాలుర, బాలికల వసతి గృహాలు మంజూరు కాగా, బాలుర వసతి గృహానికి స్థలం దొరకనట్లు తెలుస్తోంది. నంద్యాలలో రెండు హాస్టళ్లకు రూ.2.50 కోట్లు కేటాయించారు. అయితే ఈ పనులకు సంబంధించిన బిల్లుల మంజూరుకు పలు ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఎస్సీ సబ్‌ప్లాన్‌కు నిధులు కేటాయించాలని పలువురు కోరుతున్నారు.