దత్తిరాజేరులో పూర్తయిన ఇల్లు
సాక్షి, దత్తిరాజేరు: గజపతినగరం నియోజకవర్గ వ్యాప్తంగా ఎంతో మంది ఎన్టీఆర్ గృహకల్ప లబ్ధిదారులు బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు. గృహాలు నిర్మించుకోమని అధికారులు చెప్పిన వెంటనే అప్పులు చేసి మరీ ఇళ్ల నిర్మాణం చేపట్టారు. తీరా నిర్మాణాలు పూర్తయినా నేటికీ బిల్లులు పూర్తి స్థాయిలో అందలేదని లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా వేలాది మందికి 2018లో ఎన్టీఆర్ ఇళ్లు మంజూరు చేశారు.
ఒక్కో ఇంటికి లక్షన్నర రూపాయలు మంజూరు చేస్తామని అధికారులు ప్రకటించడంతో లబ్ధిదారులు ఎంతో ఆనందంతో నిర్మాణాలు చేపట్టారు. అయితే వారి ఆనందం ఎంతో కాలం నిలువలేదు. కొంతమంది ఒక బిల్లు అయితే మరికొంతమందికి రెండు బిల్లులు మాత్రమే అయ్యాయి. ఎవ్వరికీ పూర్తిస్థాయిలో బిల్లులు అయిన దాఖలాలు లేవు. బిల్లుల కోసం అధికారులను ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
అప్పుల భారం..
సొంతింటి కల నెరవేరుతుందనే ఆశతో చాలామంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలకు నడుంబిగించారు. పునాదులు, స్లేడు, శ్లాబు దశల్లో మొత్తం లక్షన్నర రూపాయలు అందజేస్తామని అధికారులు చెప్పారు. దీంతో లబ్ధిదారులు నిర్మాణాలు చేపట్టారు. వాస్తవానికి ప్రభుత్వం చెల్లించే మొత్తం ఎందుకూ సరిపోదు. కాని సొంత ఇల్లు కావాలనే ఉద్దేశంతో చాలామంది అప్పులు చేసి మరీ నిర్మాణాలు చేపట్టారు. అయితే ప్రభుత్వం ఇవ్వాల్సిన బిల్లులు ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు.
అటు చేసిన అప్పులుకు వడ్డీలు కట్టలేక.. ఇటు బిల్లులు కాక తలలు పట్టుకుంటున్నారు. చాలామంది ఇళ్ల నిర్మాణాలు దాదాపు పూర్తయిన డబ్బుల్లేక గృహ ప్రవేశాలు చేసుకోలేని దుస్థితి నెలకొంది. ఈ విషయమై గృహ నిర్మాణ శాఖ వర్క్ ఇన్‌స్పెక్టర్ రామారావు వద్ద ప్రస్తావించగా.. ఉపాధి పథకం నుంచి బిల్లులు రావాల్సి ఉందన్నారు. అవి కూడా రెండు విడతల్లో మంజూరవుతాయని చెప్పారు. అయితే అధికారులు స్పందించి బిల్లులు త్వరగా మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
ఎప్పుడు అందుతాయో..
నాకు పక్కా గృహం మంజూరైంది. మొదట విడత రూ. 19 వేలు.. రెండో విడత రూ.42 వేలు చెల్లించారు. తర్వాత బిల్లు మంజూరు కాలేదు. బిల్లులు త్వరగా మంజూరవుతాయనే ఉద్దేశంతో రెండు లక్షల రూపాయలు అప్పు చేసి మరీ నిర్మాణం పూర్తి చేశాను. వడ్డీలు కట్టలేకపోతున్నాను.
– గంగిరెడ్ల లక్ష్మి, సిరిపురం, గంట్యాడ
ఒక్క బిల్లే అందింది..
నాపేరు మీద 2018లో ఇళ్లు మంజూరైంది. ప్రస్తుతం శ్లాబు దశలో ఉంది. ఇప్పటికి ఒక్క బిల్లు మాత్రమే అందించి. బయట అప్పులు చేసి నిర్మాణం చేపట్టాను. వడ్డీలు కట్టలేకపోతున్నాను. అధికారులు స్పందించి బిల్లులు అందేలా చర్యలు తీసుకోవాలి.
– పల్లా శారద, పెదమానాపురం,
త్వరలోనే బిల్లులు
నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులందరికీ త్వరలోనే బిల్లులు వారి బ్యాంక్ ఖాతాల్లోకి చేరుతాయి. బిల్లుల విషయంలో ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. నిధులు మంజూరవ్వగానే పంపిణీ చేస్తాం.
– ఉమామహేశ్వరరావు గృహనిర్మాణ అధికారి, దత్తిరాజేరు
Comments
Please login to add a commentAdd a comment