ఎక్కడికక్కడ మాజీ సర్పంచ్‌లను అరెస్టు చేసిన పోలీసులు
పలు పోలీస్‌స్టేషన్లకు తరలింపు
వారికి మద్దతుగా మాజీ మంత్రి హరీశ్‌రావు, ఇతర బీఆర్‌ఎస్ నేతల ఆందోళన
పెండింగ్ బిల్లులు చెల్లించకుండా ఎన్నికలు నిర్వహించొద్దని మాజీ సర్పంచ్‌ల డిమాండ్
తమను సీఎం రేవంత్‌రెడ్డి చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి
బంజారాహిల్స్/ రసూల్‌పురా (హైదరాబాద్): గ్రామ పంచాయతీల్లో చేసిన వివిధ పనులకు సంబంధించి తమకు రావాల్సి ఉన్న పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలంటూ సర్పంచుల సంఘం చేపట్టిన చలో హైదరాబాద్ పోరుబాట కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. సోమవారం ఆందోళనకు సిద్ధమైన మాజీ సర్పంచులను రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌కు చేరుకుని, పోరుబాటకు సిద్ధమైన మాజీ సర్పంచులు, సంఘం నేతలను బంజారాహిల్స్ పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.
చలో పోరుబాట పేరుతో సీఎం రేవంత్‌రెడ్డిని కలసి వినతిపత్రాన్ని అందజేస్తామని వారు కోరినా పోలీసులు వినిపించుకోలేదు. ఈ సమయంలో సర్పంచుల సంఘం అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్, ఇతర నేతలు మీడియాతో మాట్లాడారు. గ్రామాల్లో అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించకుండా.. ప్రభుత్వం వచ్చే నెలలో పంచాయతీ ఎన్నికలకు వెళతామనడం సరికాదని పేర్కొన్నారు.
2019 నుంచి హరిత హారం, మిషన్ భగీరథ, నర్సరీల పెంపకం, వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డుల, రైతు వేదికలు, సీసీ రోడ్ల నిర్మాణంతోపాటు ఇతర అభివృద్ధి పనులకు అప్పటి సర్పంచులు అప్పులు చేశారని.. పెండింగ్‌లో ఉన్న ఆ బిల్లు లు ఇవ్వకుండా ఎన్నికలకు ఎలా వెళ్తారని ప్రశ్నించా రు. పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే మాజీ సర్పంచుల కుటుంబాలు చిన్నాభిన్నమవుతాయని వాపోయారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్‌రెడ్డి, మాట్ల మధు, కార్యదర్శి రాపాక నాగయ్య, నవీన్‌గౌడ్, సుభా‹Ùగౌడ్, గణేశ్ ముదిరాజ్, రాజేందర్, మల్లేశ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ సర్పంచ్‌లకు మద్దతుగా హరీశ్‌రావు నిరసన
పోలీసులు మాజీ సర్పంచ్‌లను అదుపులోకి తీసుకుని బొల్లారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీనితో మాజీ మంత్రి హరీశ్‌రావు, పలువురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు అక్కడికి చేరుకుని మాజీ సర్పంచులకు మద్దతుగా ఆందోళనకు దిగారు. దీనితో పోలీసులు హరీశ్‌రావు, ఇతర నేతలను అదుపులోకి తీసుకుని తిరుమలగిరి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీనితో వారు పోలీస్‌స్టేషన్ ఎదుట రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. చలో హైదరాబాద్‌కు పిలుపునిచి్చన మాజీ సర్పంచులను ఎక్కడికక్కడ దొంగలనో, టెర్రరిస్టులనో అరెస్టు చేసినట్టుగా అదుపులోకి తీసుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. మాజీ సర్పంచుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.
వారు అప్పులు చేసి, భార్యాపిల్లల మీద బంగారం అమ్మి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేశారని.. ఆ పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరితే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ నిరసనలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సంజయ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి. పద్మా దేవేందర్‌రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు.
సర్పంచ్ల బకాయిలకు మాదీ గ్యారంటీ
» పొలిటికల్ ట్రాప్‌లో పడకండి: పొన్నం
» సర్పంచుల ఆత్మహత్యలకుకారణం బీఆర్‌ఎస్ ప్రభుత్వమే
సాక్షి, హైదరాబాద్: సర్పంచులు పొలిటికల్ ట్రాప్ లో పడొద్దని, వారి బకాయిలను చెల్లించే గ్యారంటీ తాము తీసుకుంటామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. నాడు సర్పంచ్‌ల ఆత్మహత్యలకు కారణమైన బీఆర్‌ఎస్ ఇప్పుడు ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాహుల్‌గాంధీ పర్యటన ఏర్పాట్లపై సమావేశం నిర్వహించేందుకు సోమవారం గాంధీభవన్‌కు వచ్చిన ఆయన మీడియాతో ఇష్టాగోష్టి మాట్లాడారు.
సర్పంచులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఓపిక పట్టాలని, మార్చి నెలాఖరులోగా సర్పంచుల బకాయిలు దఫాలవారీగా చెల్లిస్తామని అన్నారు. సర్పంచులకు నిధుల బకాయిలు బీఆర్‌ఎస్ చేసిన పాపమేనని, వారి ఆత్మహత్యలకు బీఆర్‌ఎస్ కారణం కాదా అని ప్రశ్నించారు.
కిషన్‌రెడ్డిది తెలంగాణ డీఎన్‌ఏ కాదు
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి తెలంగాణ డీఎన్‌ఏ లేదని, ఆ డీఎన్‌ఏ ఉంటే తెలంగాణ కోసం ఆయన ఏదైనా చేసేవారని మంత్రి పొన్నం వ్యాఖ్యానించారు. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో అమరవీరుల స్తూపం వద్ద చర్చకు రావాలని ఆ పార్టీ నేతలకు పొన్నం సవాల్ విసిరారు. కేసీఆర్ సలహాతో బీజేపీ అధ్యక్షుడు అయిన కిషన్‌రెడ్డి విమర్శలు చేస్తే తాము ఊరుకోవాలా అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment