ntr gruha pathakam
-
మీరు డబ్బులిస్తేనే ఇళ్లు మంజూరు చేయిస్తా
సాక్షి, ముమ్మిడివరం(తూర్పు గోదావరి) : డబ్బులిస్తేనే ఇల్లు మంజూరు చేయిస్తామని డబ్బులు తీసుకున్న ఓ ‘తెలుగు తమ్ముడి’పై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తన అనుచరులతో దండెత్తాడు. వివరాల్లోకి వెళితే.. కాట్రేనికోన మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన ఓలేటి ధర్మారావు ఏడాది క్రితం ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకంలో ఇంటికోసం దరఖాస్తు చేసుకున్నారు. తనకు రూ.50 వేలు ఇస్తే నీ ఇంటిబిల్లులు మంజూరు చేయిస్తానంటూ తెలుగుదేశం నాయకుడు కాలాడి వీరబాబు ఆయనకు చెప్పాడు. ఇంటి బిల్లులు నిలిచిపోవడంతో ధర్మారావు ఈఏడాది ఫిబ్రవరి నెలలో రూ.50 వేలు వీరబాబుకు ఇచ్చారు. అయినా పని కాకపోవడంతో శుక్రవారం ఓలేటి ధర్మారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఆగ్రహించిన కాలాడి వీర బాబు శనివారం తన అనుచరులతో ధర్మారావుపై దండెత్తాడు. ‘ఇంటి మంజూరు కోసం నేను సొమ్ము తీసుకున్నానని నాపై పోలీసు ఫిర్యాదు చేస్తావా?’ అంటూ వీరబాబు, ఆయన అనుచరులు తనపై దాడి చేశారని ధర్మారావు మరలా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొత్తపాలెం గ్రామానికి ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకంలో 9 ఇళ్లు మంజూరయ్యాయి. వాటి ఒక్కొక్క లబ్ధిదారు నుంచి రూ.50 వేలు చొప్పున వీరబాబు వసూలు చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. మండల పరిధిలో టీడీపీ నాయకులు గృహనిర్మాణ లబ్ధిదారుల నుంచి భారీ మొత్తంలో వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. -
సొమ్ములు పోయినా సొంతగూడు దక్కలేదు
సాక్షి, భీమవరం (పశ్చిమ గోదావరి): టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నిన్నటి వరకు అధికారపార్టీ నాయకుల ఆగడాలకు భయపడి వారంతా ముందుకు రాలేదు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాప్రభుత్వం అధికారంలోకి రావడంతో తమ బాధలను ఏకరువు పెడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎక్కడా పేదలకు ఇల్లు కట్టించకపోయినా ఆ పార్టీ నాయకులు ఇళ్ల పేరుతో పేదలను దోచుకున్నారు. దీనిలో భాగంగా భీమవరం మండలం వెంప గ్రామంలో కొత్తకాలనీ ఇళ్ళ నిర్మాణం పేరుతో ఆ ప్రాంత టీడీపీ నాయకులు పెద్ద మొత్తంలో వసూళ్లు చేసి తమను నట్టేట ముంచారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత మూడేళ్ళుగా ఇళ్ళ నిర్మాణం నిలిచిపోవడంతో 56 కుటుంబాలకు నిలువనీడ లేక రోడ్డున పడ్డాయి. తెలుగుదేశం ప్రభుత్వంలో మూడేళ్ళ క్రితం వెంప కొత్తకాలనీ ప్రభుత్వ భూమిని ఇళ్లస్థలాలుగా 56 మంది లబ్ధిదారులకు కేటాయించారు. వీరందరికీ ఎన్టీఆర్ గృహ పథకంలో ఇళ్లను మంజూరు చేసినట్లు నాయకులు ఆర్భాటంగా ప్రకటించారు. ప్రభుత్వం గృహ నిర్మాణానికి రూ.1.50 లక్షలు మాత్రమే ఇస్తుందని ఆ సొమ్ములతో ఇళ్ల నిర్మాణం పూర్తికాదని కొంతమంది టీడీపీ నాయకులు లబ్ధిదారుల ఒక్కొక్కరి నుంచి సుమారు రూ.లక్ష వసూలు చేశారు. దీంతో తమకు సొంత గూడు ఏర్పడుతుందని లబ్ధిదారులు ఆశపడ్డారు. సొమ్ములు వసూలు చేసి మూడేళ్లు గడిచిపోయినా ప్రస్తుతం ఆ కాలనీలో కొన్ని ఇళ్లు పునాదుల్లో నిలిచిపోతే, మరికొన్ని శ్లాబ్ వేసి ఆగిపోయాయి. ఇళ్లు మంజూరై మూడేళ్లు గడుస్తున్నా నిర్మాణం పూర్తికాకపోవడంతో లబ్ధిదారులు ఇతర ప్రాంతాల్లో అద్దె ఇళ్లల్లో నివసించాల్సి వస్తోంది. ఇళ్ల నిర్మాణం పూర్తిచేయకపోవడంతో ఆ ప్రాంతం పిచ్చి మొక్కలతో చిట్టడవిని తలపిస్తోంది. ఎన్నికల కోడ్ కారణంగా నిర్మాణం నిలిచిపోయిందని డబ్బులు వసూలు చేసిన పెద్దలు చెబుతున్నారని, అయితే గత మూడేళ్లుగా ఎలాంటి అడ్డంకులు లేవని వారు వాపోతున్నారు. మూడేళ్లుగా సాగని నిర్మాణాలు మూడేళ్ల క్రితం ఇళ్లు మంజూరైనా ఇప్పటికీ నిర్మాణం జరగడంలేదు. ఈ కాలనీలో నా కుమార్తె కట్టా నాగవేణికి ఇల్లు మంజూరైంది. గృహ నిర్మాణానికి ముందుగా రూ.లక్ష ఇవ్వాలని చెప్పడంతో వడ్డీకీ తెచ్చి మరీ ఇచ్చాం. ఇప్పటి వరకు నా కుమార్తెకు పట్టా ఇవ్వలేదు సరికదా, అసలు ఇల్లు ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి. - కొప్పిశెట్టి నాగ చంద్రరావు శ్లాబ్ వేసి నిలిపేశారు నాకు ఇల్లు మంజూరైందని చెప్పడంతో ఎంతో ఆనందించా. నిర్మాణం ప్రారంభం కాగానే సొంత ఇంటి కల సాకారమవుతుందని ఆశపడ్డా. అయితే ఇంటికి శ్లాబ్ వేసి చాలా కాలమైనా మిగిలిన పనులు ఆగిపోయాయి - శింగారపు నాగమణి పునాదులు కూడా వేయలేదు ఇల్లు కట్టించి ఇస్తామని నా వద్ద రూ.లక్ష తీసుకున్నారు. కనీసం పునాదులు కూడా వేయలేదు. నా బిడ్డ వికలాంగుడు. ఎంతో పేదరికంలో ఉన్నా సొంత గూడు ఏర్పడుతుందని సొమ్ములు ఇచ్చా. ఇప్పడేమో ప్రభుత్వం మారిపోయింది. పాత ఇళ్లకు నిధులు మంజూరుకావని చెబుతున్నారు. - కాలా మాణిక్యం -
చంద్ర‘గృహ’ణం
స్థల సేకరణకే పరిమితం:ఎన్టీఆర్ ఇళ్ల నిర్మాణం హుళక్కి మైదుకూరు : మైదుకూరు మున్సిపాలిటీలో ఎన్టీఆర్ అర్బన్ గృహ నిర్మాణం పథకం స్థలసేకరణకే పరిమితమైంది. మున్సిపాలిటీకి 920 ఇళ్లు మంజూరైనా వాటి నిర్మాణం కోసం స్థల సేకరణపైనే కాలం కరిగిపోయి జాప్యం జరిగింది. స్థానిక వనిపెంట రోడ్డులోని ఇందిరమ్మ కాలనీకి దగ్గరలో సర్వే నంబర్ 1963లో ఎన్టీఆర్ ఇళ్ల నిర్మాణం కోసం 12 ఎకరాల స్థలాన్ని సేకరించారు. గత ఏడాది డిసెంబర్ 11న జమ్మలమడుగు ఆర్డీఓ నాగన్న ఆ స్థలాన్ని పరిశీలించారు. అయితే ఇళ్ల నిర్మాణం కోసం ఆ 12 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారా లేదా అనే విషయాన్ని రెవెన్యూ అధికారులు వెల్లడించలేదు కానీ మున్సిపల్ అధికారులు మాత్రం స్థలాన్ని సేకరించినట్లు చెబుతున్నారు. 920 ఇళ్లకు 6వేలు దరఖాస్తులు ఎన్టీఆర్ అర్బన్ హౌసెస్ కింద మున్సిపాలిటీకి 6వేల మంది ఇళ్లులేని నిరుపేదల నుంచి దరఖాస్తులు అందాయి. అయితే 920 ఇళ్లు మాత్రమే మంజూరు కావడంతో లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు అధికారులు 1400 దరఖాస్తులను పరిశీలించారు. పట్టణాల్లోని పేదలకు సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం(పీఎంఏవై), హౌసింగ్ ఫర్ ఆల్ (ఎన్టీఆర్ నగర్)లో అపార్ట్మెంట్ పద్ధతిలో ఇళ్లు నిర్మిస్తున్నారు. మన రాష్ట్రంలో ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ స్కీం పేరుతో ఏపీ టిడ్కో ద్వారా వీటిని నిర్మిస్తున్నారు. నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ దీన్ని కాంట్రాక్టు తీసుకుంది. మలేషియాలో ఉపయోగించే షియర్ వాల్ టెక్నాలజీ పేరుతో పునాదులు, పిల్లర్లు లేకుండానే ఇళ్లు నిర్మిస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లా కేంద్రమైన కడపలో సరోజినీ నగర్ వద్ద దీన్ని మొదలు పెట్టారు. ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, బద్వేల్, రాయచోటి, ఎర్రగుంట్లలో ఇప్పుడిప్పుడే పనులు మొదలవుతున్నాయి. షియర్ వాల్ టెక్నాలజీ పేరుతో పునాదులు, పిల్లర్లు లేకుండానే ఈ ఇళ్లను నిర్మించారు. ఈ ఇళ్లు ఎంత పటిష్టంగా ఉంటాయో ఉన్న అనుమానంతో ప్రజలు ఎక్కువగా వీటి వైపు మొగ్గు చూపలేదు. సాధారణంగా చిన్న ఇళ్లకు సైతం 12ఎంఎం ఇనుప కడ్డీలు వాడుతారు, అపార్ట్మెంట్లకైతే 16 ఎంఎం కడ్డీలు వాడుతుంటారు. ఎన్టీఆర్ హౌసింగ్‌లో నిర్మించే ఈ ఇళ్లకు మాత్రం కేవలం 8ఎంఎం సైజు కడ్డీలు ఉపయోగించి బెత్తెడు వెడల్పు మందంతో గోడలు నిర్మించారు. 8ఎంఎం కడ్డీలతోనే జీ ప్లస్ 3 అపార్ట్మెంట్లు నిర్మించారు. స్లాబ్ మందం మాత్రం 6 ఇంచ్‌లు వేస్తుండటంతో ఆ బరువును నాలుగు ఇంచ్ మందం ఉన్న గోడలు ఎంతమేరకు భరిస్తాయోనన్న అనుమానాలు ఉన్నాయి. ఏ ఇంటికైనా స్లాబ్ వేసినప్పుడు కనీసం 18 రోజులైనా క్యూరింగ్ చేయాల్సి ఉంది. ఇక్కడ ఇళ్లు మొత్తం సిమెంటు కాంక్రీటుతోనే నిర్మిస్తున్నందున ఈ తరహాలోనే క్యూరింగ్ చేయాల్సి ఉంది. అయితే కాంట్రాక్టు సంస్థ మాత్రం వాల్‌షీట్లు వేసి అందులో సిమెంటు కాంక్రీటు వేసి ఆరిపోగానే తీసివేస్తున్నారు. ఏడు రోజులు మాత్రమే నీళ్లు పోసి క్యూరింగ్ చేస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో ఇంటి నిర్మాణాలు పగుళ్లు బారే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైఎస్ జగన్ హామీతో ముందుకొచ్చిన లబ్ధిదారులు ఎన్టీఆర్ నగర్లో ప్లాట్లు తీసుకోవడానికి మొదట ప్రజలు ఆసక్తి చూపలేదు. ఇళ్లన్నీ తక్కువ విస్తీర్ణంలో అగ్గిపెట్టెల తరహాలో ఉండటం, బ్యాంకులకు చెల్లించాల్సిన డబ్బు లక్షల్లో ఉండటం, సన్నటి కడ్డీలతో నిర్మించడం వల్ల నాణ్యత, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరాపై ఉన్న అనుమానాలతోనే చాలా మంది ముందుకు రాలేదు. ఇళ్లకు సరఫరా చేసే నీటి ట్యాంకులు చిన్నవిగా ఉండటం కూడా మరో కారణం. కాగా ఎన్టీఆర్ నగర్లలో ఇళ్లు పొందిన లబ్ధిదారులకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో బ్యాంకులకు కంతులు చెల్లించే అవసరం లేకుండా ఆ ఇళ్లను వారిపేరుతోనే రిజిస్ట్రేషన్ చేయిస్తామని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించడంతో వాటికి డిమాండ్ పెరిగింది. మొదట కొంత మొత్తం చెల్లించి ప్లాట్ తీసుకుంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉచితంగా ఇల్లు వస్తుంది కదా అని కొందరు ముందుకు వచ్చి ప్లాట్లు తీసుకున్నారు. మొండిగోడలతో దర్శనమిస్తున్న ఇళ్లు ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ స్కీం కింద మూడు దశల్లో మొత్తం 19232 ఇళ్లు నిర్మించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం కాగా మొదటి దశలో మొత్తం 4092 ఇళ్లను నిర్మించాల్సి ఉంది. కడపలో 33 బ్లాకులు కోర్టులో పెండింగ్ ఉన్నాయి. రెండవ దశలో 13213 ఇళ్లు నిర్మించనుండగా, ఇందులో కడపలో 2281, ప్రొద్దుటూరులో 2150, బద్వేల్లో 808, రాయచోటిలో 1011, రాజంపేటలో 1279, ఎర్రగుంట్లలో 2046, జమ్మలమడుగులో 1415, పులివెందులలో 2143 చొప్పున నిర్మించాల్సి ఉంది. మూడవ దశలో 1927 ఇళ్లను నిర్మిచాల్సి ఉండగా ఇందులో మైదుకూరులో 927, పులివెందులలో 1000 చొప్పున నిర్మించాల్సి ఉంది. కాగా మైదుకూరు మినహా అన్ని మున్సిపాలిటీల్లో నిర్మాణ పనులు మొదలయ్యాయి. అయితే అన్ని ప్రాంతాల్లో ఇళ్లన్నీ అసంపూర్తిగా మొండిగోడలతో దర్శనమిస్తున్నాయి. కడప, జమ్మలమడుగులో నిర్మిస్తున్న ప్లాట్లు మార్చి నాటికి అందుబాటులోకి వస్తాయని చెప్పినా కార్యరూపం దాల్చలేదు. కడపలో 2600 మంది దరఖాస్తు చేసుకోగా కేవలం 940 ఇళ్లు మాత్రమే పూర్తి కావడంతో, 670 ఇళ్లే లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రెండవ దశలో ఇళ్లు నిర్మాణ దశలోనే ఉన్నాయి. జమ్మలమడుగులో కూడా అరకొరగానే ఇళ్లు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్టీఆర్ నగర్ పనులు చేపట్టి ఉంటే ఈ పాటికి అన్ని ఇళ్లు పూర్తయి ఉండేవి. కానీ ఆఖరు సంవత్సరంలో పనులు మొదలు పెట్టడం వల్ల అవి మధ్యలోనే ఆగిపోయాయి. ఇళ్లే పూర్తికాని ఎన్టీఆర్ నగర్లలో రోడ్లు, కాలువలు, విద్యుత్, డ్రై నేజీ, తాగునీరు వంటి మౌలిక వసతులు అసలే కల్పించలేదు. అసంపూర్తి నిర్మాణాలు రాయచోటి అర్బన్:రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో సుండుపల్లె మార్గంలో 13. 11 ఎకరాల విస్తీర్ణంలో పిఎంఏవై, అర్బన్ ఎన్టిఆర్ హౌసింగ్ కింద ఇళ్ల నిర్మాణానికి అధికారులు శ్రీకారం చుట్టారు. 2017–18 సంవత్సరానికి గా ను ఫేజ్– 2 కింద రాయచోటికి 1011 ఇళ్లు మంజూరయ్యాయి. నిర్మాణం పనులు చేపట్టిన కాంట్రాక్టు సంస్థకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో పనుల వేగం పూర్తి స్థాయిలో మందగించింది. ఇళ్ల మంజూరు కోసం 1011మందిలో కేవలం 290 మంది లబ్ధిదారులు మాత్రమే డిపాజిట్ సొమ్మును చెల్లించారు. డిపాజిట్ చెల్లించిన 290 మందిలో కూడా 200 మందికే అధికారులు బ్లాకులలో ప్లాట్లు కేటాయించి మిగిలిన వారికి మంజూరు చేయలేదు. పునాదులకే పరిమితమైన బ్లాకుల నిర్మాణం పనులు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కూడా సెంటులోపే ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ స్కీంలో కేంద్ర ప్రభుత్వం రూ.1.50లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు సబ్సిడీ ఇస్తాయి. 300 చదరపు అడుగులు(రూ.6.03లక్షలు), 365 చదరపు అడుగులు(రూ.7.08లక్షలు), 430 చదరపు అడుగులు(రూ.8.20లక్షలు) వంటి మూడు కేటగిరీలలో ప్రభుత్వం ఇళ్లు నిర్మిస్తోంది. ఈ మొత్తంలో ప్రభుత్వాలు ఇచ్చే రూ.3లక్షలు పోను మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారుడు బ్యాంకుకు కంతుల రూపేణ చెల్లించాలి. రెండు, మూడు కేటగిరి ఇళ్లను ఎంచుకునే వారు లబ్ధిదారుని వాటా కింద వరుసగా రూ.50వేలు, లక్ష రూపాయలు నాలుగు విడతల్లో చెల్లించాలి. ఇందులో మొదటి రెండు కేటగిరీలు సింగిల్ బెడ్రూమ్ ఇళ్లుకాగా, మూడో కేటగిరి డబుల్బెడ్రూమ్ ఇళ్లు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో ఎడమ వైపు న ఉన్న ఇళ్లకు బెడ్రూమ్కు వంటగదికి మధ్య బాత్రూమ్, మరుగుదొడ్డి ఏర్పాటు చేశారు. ఎవరూ కూడా వంటగది పక్కన బాత్రూమ్, మరుగుదొడ్డి ఏర్పాటు చేసుకోరు. అలాంటిది ఎన్టీఆర్ నగర్ ఇళ్లలో ఇలా ఉండటంపై లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మూడు కేటగిరిల్లో పెద్దదిగా చెప్పబడే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేవలం సెంటు విస్తీర్ణంలో నిర్మిస్తున్నారంటే అవి ఎంత పెద్దగా ఉన్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ భారం మోయలేం ప్రొద్దుటూరు టౌన్: ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 40 వార్డుల్లో నివాసం ఉంటున్న పేదలకు హౌసింగ్ ఫర్ ఆల్ పథకం కింద మొదటి విడతలో 2000 గృహాలు, రెండో విడతలో 2,150 గృహాలు మంజూరయ్యాయి. చంద్రబాబు అధికారంలోకి రావడానికి ప్రజలకు చెప్పినట్లు ఉచితంగా ఇళ్లు కట్టివ్వకపోగా ఒక్కొక్కరిపై రూ.8 లక్షల భారం మోపడంతో లబ్ధిదారులు ఎవ్వరూ ఈ ఇళ్లు తీసుకునేందుకు ముందుకు రాలేదు. మూడు రకాల ఇళ్లు కట్టిస్తున్నామని రూ.500 కడితే ఇళ్లు సొంతం అవుతుందని మొదటలో అధికార పార్టీ నేతలు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. ఆ తరువాత రూ.2.65 లక్షలు బ్యాంకు నుంచి రుణం కాంట్రాక్టర్ తీసుకొని దాన్ని ప్రజలు 20 ఏళ్లపాటు ప్రతి నెల అసలు, వడ్డీ కలిపి దాదాపు రూ.3000 కట్టాల్సి వస్తుందని తెలుసుకొని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే రెండో రకం ఇంటికి లబ్ధిదారుడు రూ.50వేలు, మూడో రకం ఇంటికి రూ.లక్ష చెల్లించాలని చెప్పడంతో ప్రజలు అవాక్కయ్యారు. ఉచితం అయితే తీసుకుంటాం కానీ డబ్బు మా వద్దలేదని ప్రజలు అధికార పార్టీ నేతలకు తేల్చి చెప్పారు. ఇప్పటి దాకా కేవలం 850 ఇళ్లకే అంగీకార పత్రాలు వచ్చాయి. పైన పటారం.. లోన లొటారం కడపలో సరోజినీ నగర్ వద్ద కట్టిన ఎన్టీఆర్ నగర్ ఇళ్లు ముప్పుతిప్పలు పెడుతున్నారు గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పేదలకు ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. ఐదేళ్లు పూర్తయినా ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. అర్బన్ హౌసింగ్ పథకం కింద అపార్ట్మెంట్ పద్ధతిలో ముక్కాలు సెంట్లో నిర్మించే ఇంటికి రూ.8లక్షలకుపైగా పేదలు చెల్లించాల్సి వస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రూ.3లక్షలు సబ్సిడీతోనే ఇల్లు నిర్మించే అవకాశం ఉన్నా బ్యాంకు రుణాల పేరుతో ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నారు. – ఉస్మాన్, ప్రొద్దుటూరు పిచ్చుకగూళ్లు..! జమ్మలమడుగు/జమ్మలమడుగు రూరల్: జమ్మలమడుగు పట్టణ వాసులకు గూడెంచెరువు సమీపంలో 1415 మందికి మూడు రకాల ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. పట్టణానికి దాదాపు మూడున్నర కిలోమీటర్లు దూరంగా ఉండటంతో ప్రజలు అంతదూరం వెళ్లాలా అంటూ మండిపడుతున్నారు. ఇష్టారాజ్యంగా నిర్మాణాలు.. ఏపీ టిట్కో ఆధ్వర్యంలో చేపట్టే నిర్మాణాలు సక్రమంగా లేవనే విమర్శలు వస్తున్నాయి. భవన నిర్మాణాల కోసం ఏర్పాటు చేసిన కడ్డీలు బయట పడుతున్నాయి. కొన్ని చోట్ల అపార్టుమెంట్‌కు నెర్రెలు చీలుతున్నాయి. ఇవన్నీ చూసిన లబ్ధిదారులు ఈ అపార్టుమెంట్ ఎంతకాలం నిలబడుతుందో అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. చేనేతలకు ఉపయోగకరంగా లేవు.. నియోజకవర్గంతోపాటు జమ్మలమడుగు పట్టణంలో ఎక్కువగా చేనేత కార్మికులు ఉన్నారు. వారు మగ్గం పెట్టుకోవటానికి విశాలమైన స్థలం కావాలి. అపార్టుమెంట్ నిర్మాణం చేసి ఇస్తే ఉండటానికి మాత్రమే పనికి వస్తాయి. పనులు చేసుకోవటానికి పనికిరావు. చేనేతలు ఎలా బతుకుతారు. – రమేష్, చేనేత ఐక్యవేదిక నియోజకవర్గ కన్వీనర్ క్యూరింగ్ లేకుండా నిర్మాణాలు చేస్తున్నారు పేద ప్రజల కోసం నిర్మించే ఇళ్లు పది కాలాల పాటు ఉండాలి. అలాంటి నిర్మాణాల్లో ఏపీ టిట్కో కంపెనీ అధికారులు భవనాలకు క్యూరింగ్ లేకుండానే నిర్మాణాలు చేస్తున్నారు. ఇద్దరు నివాసం ఉండటానికి ఇళ్లు సరిపోతాయి. మూడో వ్యక్తి ఇంట్లోకి వెళితో మరో వ్యక్తి బయటికి రావాల్సిందే. – పి.నాగేశ్వరరెడ్డి, గూడెంచెరువు. -
గూడు జాడ లేదు
కూడు.. గూడు.. గుడ్డ.. ప్రతి మనిషికీ కనీస అవసరాలు. కానీ ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతావనిలో తలదాచుకునేందుకు కాసింత నీడలేక ఎందరో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైఎస్సార్ హయాంలో అడిగిన వారందరికీ పక్కా ఇళ్లు కట్టించగా...టీడీపీ సర్కార్ మాత్రం జనం గూడు గోడు పట్టించుకోలేదు. అందరికీ ఇళ్లంటూ ప్రచారం హోరెత్తించి...లబ్ధిదారుల వాటా కింద డబ్బు వసూలు చేసి... ఇళ్ల నిర్మాణంపై దృష్టి సారించలేదు. ఐదేళ్లూ హామీలతోనే కాలం గడిపేసింది. ఒక్క ఇంటినీ పూర్తి చేయకపోవడంతో వేలమంది నిరుపేదలు అద్దె ఇళ్లలో అవస్థలు పడుతున్నారు. అప్పులు చేసి డీడీ కట్టినా తమకెందుకీ అవస్థలని ప్రశ్నిస్తున్నారు. రూ.500 డీడీలు తీసిన వారు : 2,640 (ఫస్ట్ కేటగిరీ) రూ.12,500 డీడీలు తీసినవారు : 1,240 (సెకండ్ కేటగిరీ) రూ.25,000 డీడీలు తీసినవారు :1,248 (మూడో కేటగిరీ) ఎక్కడికక్కడ నిలిచిపోయిన పనులు ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఎన్టీఆర్ గృహ నిర్మాణం పథకానికి బ్రేక్ పడింది. జిల్లాలోని 10 మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో ఎక్కడి పనులు అక్కడే∙ఆగిపోయాయి. నిర్మాణ పనులు చేపట్టిన షాపూర్పల్లోంజీ కంపెనీకి ప్రభుత్వం రూ.వందల కోట్లలో బకాయిలు చెల్లించాల్సి ఉంది. దీంతో నెల రోజులుగా పనులు ఆగిపోయాయి. ఫలితంగా 61,556 ఇళ్ల నిర్మాణాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. సొంతింటిపై ఆశతో పైసా, పైసా కూడబెట్టిన మొత్తంతో పాటు, అప్పులు చేసి తమ వాటా కింద డీడీలు కట్టిన నిరుపేదల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మూడు కేటగిరీల్లో అర్బన్ హౌసింగ్ 2017లో కేంద్రం ప్రధాన మంత్రి ఆవాస్ యోజనను ప్రవేశపెట్టింది. ఏపీ ప్రభుత్వం పీఎంఏవై, ఎన్టీఆర్ నగర్ పేరిట పథకాన్ని ప్రారంభించింది. మూడు కేటగిరీల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొదటి కేటగిరీలో 300 చదరపు అడుగుల ఇల్లు, రెండో కేటగిరిలో 365 చదరపు అడుగులు, మూడో కేటగిరీలో 430 చదరపు అడుగుల ఇళ్లను నిర్మిస్తారు. అన్ని కేటగిరీలకు కేంద్ర ప్రభుత్వం రూ.3 లక్షలు సబ్సిడీ అందజేస్తుంది. మిగతా మొత్తం బ్యాంకు ద్వారా రుణం తీసుకోవడంతో పాటు లబ్ధిదారుడు కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. రూ.వెయ్యి కోట్ల బకాయి జిల్లాలోని వివిధ మున్సిపాలిటీ, నగరపాలక సంస్థకు సంబంధించి రూ.2,400 కోట్లతో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలుస్తోంది. మొదటి విడతకు సంబంధించే కాంట్రాక్ట్ కంపెనీకి రూ.వెయ్యి కోట్ల వరకు ప్రభుత్వం బకాయిలుగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో కాంట్రాక్ట్ సంస్థ పనులు అర్ధాంతరంగా ఆపేసినట్లు సమాచారం. బకాయిలు చెల్లించాకే పనులు మొదలుపెడుతామని కంపెనీ నిర్వాహకులు ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. టీడీపీ పాలన ఐదేళ్లు పూర్తయి ఎన్నికూడా రావడంతో.. పనులు ఇప్పట్లో ప్రారంభమయ్యే పరిస్థితి కన్పించడం లేదు. 61,556 ఇళ్లకు బ్రేక్ జిల్లాలోని 10 మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థకు మంజూరైన 61,556 ఇళ్లకు బ్రేక్ పడింది. వాస్తవంగా కేంద్రం మొదటి రెండు దశల్లో తాడిపత్రికి 3,009 (రూ.165 కోట్లు), గుత్తికి 398, పామిడి 2,599, కళ్యాణదుర్గం 1,393, ధర్మవరం 8,832, కదిరి 3,762, పుట్టపర్తి 1,243, హిందూపురానికి 2,750 ఇళ్లను మంజూరు చేశారు. మూడో దశలో అనంతపురం నగరపాలక సంస్థకు 6,017, రాయదుర్గానికి 1,791, తాడిపత్రికి 3,520, గుంతకల్లు 4719, హిందూపురం 10,781, అహుడా పరిధిలో 4,379 ఇళ్లు మంజూరు చేశారు. అనంతపురం నగరపాలక సంస్థకు నాల్గో దశలో 6,263 ఇళ్లను మంజూరు చేశారు. అప్పు చేసి రూ.50 వేలు డీడీలు కట్టా.. నాకు అఫోర్టబుల్ హౌసింగ్(ఏహెచ్‌పీ) కింద ఇల్లు మంజూరైంది. క్యాటగిరీ–3 కింద 430 చదరపు అడుగుల గల ఇంటి నిర్మాణానికి లబ్ధిదారుని వాటా రూ.లక్ష కాగా... నాలుగు విడతల్లో చెల్లించాలని చెప్పారు. నేను ఇప్పటికి అప్పు చేసి రెండు కంతులు రూ.50 వేలు చెల్లించా. బ్యాంకు రుణానికి డాక్యుమెంటేషన్ చేయించా. ఇంకా గృహ నిర్మాణం పూర్తి కాలేదు. ఇపుడేమో ఎన్నికలొచ్చాయి. అద్దె ఇంటి కష్టాలు ఇంకా ఎన్నేళ్లు పడాలో.. అర్థం కావడం లేదు. – పీఎస్ రవిరాజు, ఏహెచ్‌పీ లబ్ధిదారుడు, పామిడి మభ్యపెట్టి మోసం చేశారు పక్కా గృహ నిర్మాణం పేరుతో ప్రజలను టీడీపీ ప్రభుత్వం మభ్య పెట్టింది. ఐదేళ్లుగా పేదల గురించి పట్టించుకోలేదు. ఎన్నికలు దగ్గర పడినప్పుడు హడావిడిగా ఇల్లు ఇచ్చేస్తామంటున్నారు. ఇంత వరకూ ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాలేదు. అద్దె ఇంటిలోనే కష్టంగా బతుకుతున్నాం. ఎమ్మెల్యే బాలకృష్ణ వల్ల ఎలాంటి లాభమూ లేదు. – జబీనా, హస్నాబాద్, హిందూపురం పునాది దశలోనే ఆగిపోయిన అపార్ట్మెంట్ నిర్మాణం పునాది దశలోనే.. రాయదుర్గం మున్సిపాలిటీలో అఫర్ట్బుల్ హౌసింగ్ కింద 2,418 మంది దరఖాస్తు చేసుకోగా ఇప్పటి దాకా 1,791 మంది అర్హులుగా తేలారు. వీరిలో దాదాపు వందమందికిపైగా డీడీలు చెల్లించారు. పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలోని మల్లాపురం సమీపంలో అర్బన్ హౌసింగ్ స్కీం కింద అపార్ట్మెంట్ల నిర్మాణాన్ని చేపట్టారు. అయితే పట్టణానికి దూరంగా ఉండడం, వసతుల కల్పనపై స్పష్టత లేకపోవడంతో అపార్ట్మెంట్ నిర్మాణ పనులు పునాది దశలోనే ఆగిపోయాయి. – రాయదుర్గం టౌన్ సందిగ్ధంలో లబ్ధిదారులు ఈమె పేరు కటికే మోతీబాయి. భర్త మృతి చెందగా ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు అయ్యాయి. రాయదుర్గంలోని ఐదో వార్డులో బాడుగ ఇంటిలో నివసిస్తున్నారు. నాలుగు నెలల క్రితం రెండో కేటగిరి ఇంటి కోసం అప్పు చేసి రూ.12,500 డీడీ చెల్లించారు. అయితే నేటికీ ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేదు. ఎప్పుడు పూర్తి చేస్తారో ఎవరూ చెప్పడం లేదు. కట్టిన డబ్బు వాపసు వస్తుందో లేదా అపార్ట్మెంట్ నిర్మించి ఇల్లు మంజూరు చేస్తారో లేదోననే సందిగ్ధంలో ఆమె నలిగిపోతోంది. ఇప్పటి వరకు హౌస్ ఫర్ ఆల్ స్కీంకు డీడీల రూపంలో చెల్లించిన మొత్తం వివరాలిలా.. అనంతపురం శివారులోని ప్రసన్నాయపల్లి వద్ద అర్ధా్ధంతరంగా ఆగిపోయిన ఎన్టీఆర్ గృహ నిర్మాణ పనులు అర్హులైన వారందరికీ ఇల్లు కట్టిస్తున్నాం. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా ముందుకెళ్తున్నామంటూ మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రచారం హోరెత్తించారు. అధునాతన భవనాలు ఏర్పాటు చేస్తున్నామని అరచేతిలో వైకుంఠం చూపారు. వీరి మాటలు నమ్మి అప్పులు చేసి తమ వాటా కట్టిన లబ్ధిదారులు ఇపుడు ఆందోళన చెందుతున్నారు. అద్దె ఇళ్లలో మగ్గుతున్నాం సొంతింటి కల నెరవేరుతుందని చాలా ఆశపడ్డాం. డిపాజిట్లు కట్టాలని చెబితే ఏడాది క్రితమే చెల్లించాం. ఇప్పటికీ మాకు ఇల్లు మంజూరు కాలేదు. అన్నీ అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలకే కేటాయించుకున్నారు. దివ్యాంగులకు రెండు, మూడు అంతస్తుల్లో కేటాయించారు. ఇది చాలా అన్యాయం. వేలాది రూపాయలు నెలనెలా చెల్లిస్తూ అద్దె ఇళ్లలోనే మగ్గుతున్నాం. గృహ నిర్మాణం మొత్తం ప్రభుత్వం భరించకుండా బ్యాంక్ లింకేజీ పేరుతో మమ్మల్ని అప్పుల పాలు చేయాలని చూస్తున్నారు. రోజు వారి కూలి పనులతో పొట్ట పోసుకునే వారు బ్యాంక్ రుణాన్ని ఎలా చెల్లించగలుగుతారో ప్రభుత్వ పెద్దలకు అర్థం కాకపోవడం దురదృష్టకరం. – రాము పుట్టపర్తి -
వసూల్ సొమ్ము వెనక్కి
ప్రభుత్వ భూమిలో ప్లాట్ల కోసం వసూలు చేసిన డబ్బు లబ్ధిదారులకు తిరిగి అందించేందుకు గుడుపల్లె నేతలు సిద్ధమవుతున్నారు. నాలుగేళ్ల క్రితం వసూలు చేసిన డబ్బు అధికార పార్టీకి చెందిన గుడుపల్లె ప్రధాన నేతలు పంచుకున్నారు. లబ్ధిదారులకు ప్లాట్లు కేటాయించడంలో విఫలమయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ, జనం ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేమని భావించి, తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. సాక్షి, కుప్పం : చిత్తూరు జిల్లా గుడుపల్లె సమీపంలోని రాళ్లగంగమాంబ దేవస్థానం వదళ్లున్న 52 సెంట్ల పశువులమేత బీడును చదును చేసి ప్లాట్లుగా మార్చిన విషయం తెలిసిందే. 36 మంది వద్ద ప్లాట్లు రూ.30వేల నుంచి రూ.50వేల వరకు అధికార పార్టీ నేతలు వసూలు చేశారు. ఎన్టీఆర్ గృహకల్పనలో పశువుల మేతబీడును కాలనీ గృహాలు నిర్మించాలని గతంలో ప్రణాళిక సిద్ధం చేసి, వసూలు కార్యక్రమం సాగించారు. ఈ విధంగా రూ.పది లక్షలకుపైగా వసూలు చేసిన గుడుపల్లె మండల ప్రధాన నేతలు కొందరు పంచుకున్నట్లు ఆరోపణలు ఉన్నా యి. నాలుగేళ్లు పూర్తయినా, లబ్ధిదారులకు ప్లాట్లు, ఎన్టీఆర్ గృహకల్పన కింద ఇళ్లు ఇవ్వలేదు. డబ్బు వాపస్.. రెండు నెలల క్రితం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన ప్లాట్ల విక్రయాలు కథనంపై అధికార పార్టీ అధినేతలు స్పందించినట్లు సమాచారం. ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజల వద్దకు వెళితే ఆ డబ్బుపై ప్రశ్నిస్తే ఎలాంటి సమాధానాలు చెప్పాలో అని తర్జనభర్జన పడుతున్నారు. ప్రభుత్వ భూమిలో ప్లాట్ల కేటాయింపులో ఇబ్బంది పడుతున్నామని చెబుతూ, తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వడానికి అధికార పార్టీ నేతలు సిద్ధపడినట్లు సమాచారం ఎవరెవరి దగ్గర ఎంతెంత డబ్బు తీసుకున్నామనే విషయాలు తెలుసుకుని, వారికి తిరిగి చెల్లించాలని మండలానికి చెందిన ప్రధాన నేత మార్కెట్ కమిటీ చైర్మన్ సన్నిహితులతో చర్చించినట్లు సమాచారం. ఆ... ఆదేశాలతోనే... ఎన్నికల దృష్ట్యా తీసుకున్న నగదు తిరిగి చెల్లించాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానం వసూళ్లకు పాల్పడ్డ కొందరు నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. నోటిఫికేషన్ వెలువడకముందే లబ్ధిదారులకు డబ్బు తిరిగి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. -
బాబును నమ్మితే అప్పులే మిగిలాయి...
సాక్షి, దత్తిరాజేరు: గజపతినగరం నియోజకవర్గ వ్యాప్తంగా ఎంతో మంది ఎన్టీఆర్ గృహకల్ప లబ్ధిదారులు బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు. గృహాలు నిర్మించుకోమని అధికారులు చెప్పిన వెంటనే అప్పులు చేసి మరీ ఇళ్ల నిర్మాణం చేపట్టారు. తీరా నిర్మాణాలు పూర్తయినా నేటికీ బిల్లులు పూర్తి స్థాయిలో అందలేదని లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా వేలాది మందికి 2018లో ఎన్టీఆర్ ఇళ్లు మంజూరు చేశారు. ఒక్కో ఇంటికి లక్షన్నర రూపాయలు మంజూరు చేస్తామని అధికారులు ప్రకటించడంతో లబ్ధిదారులు ఎంతో ఆనందంతో నిర్మాణాలు చేపట్టారు. అయితే వారి ఆనందం ఎంతో కాలం నిలువలేదు. కొంతమంది ఒక బిల్లు అయితే మరికొంతమందికి రెండు బిల్లులు మాత్రమే అయ్యాయి. ఎవ్వరికీ పూర్తిస్థాయిలో బిల్లులు అయిన దాఖలాలు లేవు. బిల్లుల కోసం అధికారులను ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అప్పుల భారం.. సొంతింటి కల నెరవేరుతుందనే ఆశతో చాలామంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలకు నడుంబిగించారు. పునాదులు, స్లేడు, శ్లాబు దశల్లో మొత్తం లక్షన్నర రూపాయలు అందజేస్తామని అధికారులు చెప్పారు. దీంతో లబ్ధిదారులు నిర్మాణాలు చేపట్టారు. వాస్తవానికి ప్రభుత్వం చెల్లించే మొత్తం ఎందుకూ సరిపోదు. కాని సొంత ఇల్లు కావాలనే ఉద్దేశంతో చాలామంది అప్పులు చేసి మరీ నిర్మాణాలు చేపట్టారు. అయితే ప్రభుత్వం ఇవ్వాల్సిన బిల్లులు ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. అటు చేసిన అప్పులుకు వడ్డీలు కట్టలేక.. ఇటు బిల్లులు కాక తలలు పట్టుకుంటున్నారు. చాలామంది ఇళ్ల నిర్మాణాలు దాదాపు పూర్తయిన డబ్బుల్లేక గృహ ప్రవేశాలు చేసుకోలేని దుస్థితి నెలకొంది. ఈ విషయమై గృహ నిర్మాణ శాఖ వర్క్ ఇన్స్పెక్టర్ రామారావు వద్ద ప్రస్తావించగా.. ఉపాధి పథకం నుంచి బిల్లులు రావాల్సి ఉందన్నారు. అవి కూడా రెండు విడతల్లో మంజూరవుతాయని చెప్పారు. అయితే అధికారులు స్పందించి బిల్లులు త్వరగా మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఎప్పుడు అందుతాయో.. నాకు పక్కా గృహం మంజూరైంది. మొదట విడత రూ. 19 వేలు.. రెండో విడత రూ.42 వేలు చెల్లించారు. తర్వాత బిల్లు మంజూరు కాలేదు. బిల్లులు త్వరగా మంజూరవుతాయనే ఉద్దేశంతో రెండు లక్షల రూపాయలు అప్పు చేసి మరీ నిర్మాణం పూర్తి చేశాను. వడ్డీలు కట్టలేకపోతున్నాను. – గంగిరెడ్ల లక్ష్మి, సిరిపురం, గంట్యాడ ఒక్క బిల్లే అందింది.. నాపేరు మీద 2018లో ఇళ్లు మంజూరైంది. ప్రస్తుతం శ్లాబు దశలో ఉంది. ఇప్పటికి ఒక్క బిల్లు మాత్రమే అందించి. బయట అప్పులు చేసి నిర్మాణం చేపట్టాను. వడ్డీలు కట్టలేకపోతున్నాను. అధికారులు స్పందించి బిల్లులు అందేలా చర్యలు తీసుకోవాలి. – పల్లా శారద, పెదమానాపురం, త్వరలోనే బిల్లులు నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులందరికీ త్వరలోనే బిల్లులు వారి బ్యాంక్ ఖాతాల్లోకి చేరుతాయి. బిల్లుల విషయంలో ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. నిధులు మంజూరవ్వగానే పంపిణీ చేస్తాం. – ఉమామహేశ్వరరావు గృహనిర్మాణ అధికారి, దత్తిరాజేరు -
ఇదండీ ఇంటిగుట్టు
ఎట్టకేలకు గృహ ప్రవేశాలకు సర్కారు గురువారం ముహూర్తం పెట్టింది. ఇందుకోసం ఆర్భాటంగా ఏర్పాట్లు చేస్తోంది. తమ హయాంలో పేదలకుఇళ్లు నిర్మించామని వచ్చే ఎన్నికల్లోచెప్పుకోడానికి అస్త్రం సిద్ధం చేసుకుంటోంది. కానీ ఈ ఇళ్ల లెక్కలు చూస్తే అంతాగారడీగా కనిపిస్తోంది. జిల్లాకు కేటాయించిన ఇళ్లలో కనీసం సగం కూడాపూర్తి కాలేదు. నాలుగేళ్లలోఇందుకోసం సరైన కృషిజరగకపోవడమే కారణం. చిత్తూరు కలెక్టరేట్: ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో అధికార టీడీపీలో అలజడి మొదలైంది. నాలుగేళ్లుగా చతికిలపడిన పథకాలకు బూ జు దులపడం మొదలెట్టింది. ఇందులో గృహ నిర్మాణ పథకమొకటి. ఇన్నాళ్లూ దీని ఊసే సర్కారుకు పట్టలేదు. పుణ్య కాలం కాస్తా గడిచిపోతుండటతో ఆదరాబాదరాగా కొన్నయినా పూర్తి చేశామని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటివరకూ పూర్తయిన ఎన్టీఆర్ పక్కా గృహ నిర్మాణాల్లో ఈనెల5న అట్టహాసంగా గృహప్రవేశాల కార్యక్రమాలు చేపడుతోంది. జిల్లాలో 2016 నుంచి ఇప్పటి వరకు ఎన్టీ ఆర్ గృహనిర్మాణ పథకం కింద 55,351 పక్కా ఇళ్లను ప్రభుత్వం కేటాయించింది. తర్వాత దీనిపై అంతగా దృష్టి పెట్టలేదు. దీంతో 43,252 ఇళ్లు మాత్రమే మంజూరయ్యాయి. వివిధ కారణాలతో 12,099 ఇళ్లు కనీసం మంజూరుకు నోచుకోలేదు. గ్రామీణ ప్రాంతాల్లో 44,650 గృహాలకు గాను 35,788 మంజూరు చేయగా, 19,747 ఇళ్లు మా త్రమే నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం పీఎంఈవై కింద 589 మంజూరు చే యగా అందులో 516 పక్కాగృహాల నిర్మాణాలు చేపట్టారు. కానీ 288 గృహాల నిర్మాణాలు మాత్ర మే పూర్తయ్యాయి. పట్టణ ప్రాంతాల్లో 10,112 కేటాయించగా 6,948 ఇళ్లు మంజూరయ్యాయి. అందులో 2,495 నిర్మాణాలు పూర్తి అయ్యాయి. ఈ లెక్కన జిల్లావ్యాప్తంగా 22,530 గృహాల నిర్మాణాలు పూర్తి అయినట్లు అధికారిక లెక్కలు చెబు తున్నాయి. ఈ అన్ని ఇళ్లలో ఇప్పుడు గృహ ప్రవేశాలు జరుగుతున్నాయా అంటే అదీ లేదు. ఈనెల 5న 20,783 ఇళ్లలో గృహప్రవేశ కార్యక్రమాలను సర్కారు నిర్వహించనుంది. ఇందుకు సర్కారు హంగామా చేస్తోంది. అధికార పార్టీ వారికే అగ్రాసనం.. ఇళ్ల మంజూరులో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా పక్షపాతం చూపిందనే విమర్శలున్నాయి. గూడులేని నిరుపేదలను విస్మరించింది. అధికార పార్టీకి సానుభూతిపరులకే పక్కా గృహాలు మంజూరయ్యాయి. అనర్హులైనా ఇళ్లను కేటాయించారని తె లిసింది. జన్మభూమి కమిటీల ఆమోదాన్ని తప్పనిసరి చేసి పూర్తిగా పార్టీ కార్యక్రమంగా మార్చేసింది. కమిటిల్లో అధికార పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులే ఉంటారు. దీంతో వీరంతా విపక్షాలకు చెందిన వారు అర్హులైనా పక్కనపెట్టేశారు. దీంతో నిరుపేదలకు సొంతగూడు కలగానే మిగిలిపోయింది. నిర్మాణాల్లో అలసత్వం.. ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం నిర్మాణాల్లో ప్రభు త్వ అలసత్వం కొట్టొచ్చినట్లు ఉంది. ఇప్పటికీ 15,521 ఇళ్ల నిర్మాణాలలో పునాది దశ పూర్తి చేసుకున్నవి 9,006 మాత్రమే. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. నిధులు సరైన సమయంలో విడుదల చేయకపోవడం జాప్యానికి కారణం. లబ్ధి దారులు సకాలంలో నిర్మించుకోలేకపోతున్నారు. ప్రభుత్వ నిధులు కూడా అంతంతమాత్రమే ఇస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో పక్కా గృహానికి రూ.1.50 లక్షలు ఇస్తోంది. పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షలిస్తోంది. పెరిగిన రేట్లలో ఇవి ఏమాత్రం సరిపోవడం లేదని లబ్ధిదారులు చెబుతున్నారు. రెండేళ్లుగా కేటాయించిన వాటిలో 12,099 గృహాలు మంజూరుకు నోచుకోలేదు. అధికార పార్టీ నాయకుల కన్నుసన్నల్లో లబ్ధిదారుల ఎంపికను చేపట్టడమే ఇందుకు కారణం. సాధారణంగా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన వారిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుత అధికార పార్టీ జన్మభూమి కమిటీ ఆమోదంతోనే ఎంపిక ప్రక్రియను చేపట్టింది. దీంతో కేటాయిం పుల మేరకు ఎంపిక జరగలేదు. రెండు నెలల్లో లబ్ధిదారుల ఎంపిక లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మరో రెండు నెలల్లో వందశాతం పూర్తి చేస్తాం. మంజూ రుకు నోచుకోనివి ఇప్పటివి కావు. 2019 జనవరి నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. –రామచంద్రారెడ్డి, హౌసింగ్ పీడీ -
జనవరిలో కొత్త గృహ నిర్మాణాలకు శ్రీకారం
తాడేపల్లిగూడెం రూరల్ : వచ్చే ఏడాది జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్నదని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి, జిల్లా ఇ¯ŒSచార్జ్ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. మండలంలోని నీలాద్రిపురంలో రూ.1.13కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, రూ.10లక్షలతో శ్మశాన వాటిక నిర్మాణ పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంక్రాంతి కానుకగా మరో రెండు లక్షల మంది అర్హులైనవారికి తెల్ల కార్డులు అందజేయనున్నట్టు వివరించారు. జిల్లా పరిషత్ చైర్మ¯ŒS ముళ్ళపూడి బాపిరాజు మాట్లాడుతూ స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా తాడేపల్లిగూడెం మండలాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అంగర రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యే ఈలి నాని, మున్సిపల్ చైర్మ¯ŒS బొలిశెట్టి శ్రీనివాస్, ఎంపీపీ గన్నమని దొరబాబు, ఏఎంసీ చైర్మ¯ŒS పాతూరి రామ్‌ప్రసాద్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.