సాక్షి, ముమ్మిడివరం(తూర్పు గోదావరి) : డబ్బులిస్తేనే ఇల్లు మంజూరు చేయిస్తామని డబ్బులు తీసుకున్న ఓ ‘తెలుగు తమ్ముడి’పై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తన అనుచరులతో దండెత్తాడు. వివరాల్లోకి వెళితే.. కాట్రేనికోన మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన ఓలేటి ధర్మారావు ఏడాది క్రితం ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకంలో ఇంటికోసం దరఖాస్తు చేసుకున్నారు. తనకు రూ.50 వేలు ఇస్తే నీ ఇంటిబిల్లులు మంజూరు చేయిస్తానంటూ తెలుగుదేశం నాయకుడు కాలాడి వీరబాబు ఆయనకు చెప్పాడు.
ఇంటి బిల్లులు నిలిచిపోవడంతో ధర్మారావు ఈఏడాది ఫిబ్రవరి నెలలో రూ.50 వేలు వీరబాబుకు ఇచ్చారు. అయినా పని కాకపోవడంతో శుక్రవారం ఓలేటి ధర్మారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఆగ్రహించిన కాలాడి వీర బాబు శనివారం తన అనుచరులతో ధర్మారావుపై దండెత్తాడు. ‘ఇంటి మంజూరు కోసం నేను సొమ్ము తీసుకున్నానని నాపై పోలీసు ఫిర్యాదు చేస్తావా?’ అంటూ వీరబాబు, ఆయన అనుచరులు తనపై దాడి చేశారని ధర్మారావు మరలా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొత్తపాలెం గ్రామానికి ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకంలో 9 ఇళ్లు మంజూరయ్యాయి. వాటి ఒక్కొక్క లబ్ధిదారు నుంచి రూ.50 వేలు చొప్పున వీరబాబు వసూలు చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. మండల పరిధిలో టీడీపీ నాయకులు గృహనిర్మాణ లబ్ధిదారుల నుంచి భారీ మొత్తంలో వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment