చంద్ర‘గృహ’ణం | Chandrababu Government Pending Works Of NTR Gruha Pathakam | Sakshi
Sakshi News home page

చంద్ర‘గృహ’ణం

Published Mon, Apr 1 2019 10:24 AM | Last Updated on Mon, Apr 1 2019 10:26 AM

Chandrababu Government Pending Works Of NTR Gruha Pathakam - Sakshi

స్థల సేకరణకే పరిమితం:ఎన్టీఆర్‌ ఇళ్ల నిర్మాణం హుళక్కి
మైదుకూరు : మైదుకూరు మున్సిపాలిటీలో ఎన్టీఆర్‌ అర్బన్‌ గృహ నిర్మాణం పథకం స్థలసేకరణకే పరిమితమైంది. మున్సిపాలిటీకి 920 ఇళ్లు మంజూరైనా వాటి నిర్మాణం కోసం స్థల సేకరణపైనే కాలం కరిగిపోయి జాప్యం జరిగింది. స్థానిక వనిపెంట రోడ్డులోని ఇందిరమ్మ కాలనీకి దగ్గరలో సర్వే నంబర్‌ 1963లో ఎన్టీఆర్‌ ఇళ్ల నిర్మాణం కోసం 12 ఎకరాల స్థలాన్ని సేకరించారు. గత ఏడాది డిసెంబర్‌ 11న జమ్మలమడుగు ఆర్డీఓ నాగన్న ఆ స్థలాన్ని పరిశీలించారు. అయితే ఇళ్ల నిర్మాణం కోసం ఆ 12 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారా లేదా అనే విషయాన్ని రెవెన్యూ అధికారులు వెల్లడించలేదు కానీ మున్సిపల్‌ అధికారులు మాత్రం స్థలాన్ని సేకరించినట్లు చెబుతున్నారు. 

920 ఇళ్లకు 6వేలు దరఖాస్తులు 
ఎన్టీఆర్‌ అర్బన్‌ హౌసెస్‌ కింద మున్సిపాలిటీకి 6వేల మంది ఇళ్లులేని నిరుపేదల నుంచి దరఖాస్తులు అందాయి. అయితే 920 ఇళ్లు మాత్రమే మంజూరు కావడంతో లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు అధికారులు 1400 దరఖాస్తులను పరిశీలించారు.  

పట్టణాల్లోని పేదలకు సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకం(పీఎంఏవై), హౌసింగ్‌ ఫర్‌ ఆల్‌ (ఎన్‌టీఆర్‌ నగర్‌)లో అపార్ట్‌మెంట్‌ పద్ధతిలో ఇళ్లు నిర్మిస్తున్నారు. మన రాష్ట్రంలో ఎన్‌టీఆర్‌ అర్బన్‌ హౌసింగ్‌ స్కీం పేరుతో ఏపీ టిడ్కో ద్వారా వీటిని నిర్మిస్తున్నారు. నాగార్జున కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ దీన్ని కాంట్రాక్టు తీసుకుంది. మలేషియాలో ఉపయోగించే  షియర్‌ వాల్‌ టెక్నాలజీ పేరుతో పునాదులు, పిల్లర్లు లేకుండానే ఇళ్లు నిర్మిస్తున్నారు. వైఎస్‌ఆర్‌ జిల్లా కేంద్రమైన కడపలో సరోజినీ నగర్‌ వద్ద దీన్ని మొదలు పెట్టారు. ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, బద్వేల్, రాయచోటి, ఎర్రగుంట్లలో ఇప్పుడిప్పుడే పనులు మొదలవుతున్నాయి.

షియర్‌ వాల్‌ టెక్నాలజీ పేరుతో పునాదులు, పిల్లర్లు లేకుండానే ఈ ఇళ్లను నిర్మించారు. ఈ ఇళ్లు ఎంత పటిష్టంగా ఉంటాయో ఉన్న అనుమానంతో ప్రజలు ఎక్కువగా వీటి వైపు మొగ్గు చూపలేదు. సాధారణంగా  చిన్న ఇళ్లకు సైతం 12ఎంఎం ఇనుప కడ్డీలు వాడుతారు, అపార్ట్‌మెంట్లకైతే 16 ఎంఎం కడ్డీలు వాడుతుంటారు. ఎన్‌టీఆర్‌ హౌసింగ్‌లో నిర్మించే ఈ ఇళ్లకు  మాత్రం కేవలం 8ఎంఎం సైజు కడ్డీలు ఉపయోగించి బెత్తెడు వెడల్పు మందంతో గోడలు నిర్మించారు. 8ఎంఎం కడ్డీలతోనే జీ ప్లస్‌ 3 అపార్ట్‌మెంట్లు నిర్మించారు. స్లాబ్‌ మందం మాత్రం 6 ఇంచ్‌లు వేస్తుండటంతో ఆ బరువును నాలుగు ఇంచ్‌ మందం ఉన్న గోడలు ఎంతమేరకు భరిస్తాయోనన్న అనుమానాలు ఉన్నాయి.

 ఏ ఇంటికైనా స్లాబ్‌ వేసినప్పుడు కనీసం 18 రోజులైనా క్యూరింగ్‌ చేయాల్సి ఉంది. ఇక్కడ ఇళ్లు మొత్తం సిమెంటు కాంక్రీటుతోనే నిర్మిస్తున్నందున ఈ తరహాలోనే క్యూరింగ్‌ చేయాల్సి ఉంది. అయితే కాంట్రాక్టు సంస్థ మాత్రం వాల్‌షీట్లు వేసి అందులో సిమెంటు కాంక్రీటు వేసి ఆరిపోగానే తీసివేస్తున్నారు. ఏడు రోజులు మాత్రమే నీళ్లు పోసి క్యూరింగ్‌ చేస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో ఇంటి నిర్మాణాలు పగుళ్లు బారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వైఎస్‌ జగన్‌ హామీతో ముందుకొచ్చిన లబ్ధిదారులు
ఎన్‌టీఆర్‌ నగర్‌లో ప్లాట్లు తీసుకోవడానికి మొదట ప్రజలు ఆసక్తి చూపలేదు.  ఇళ్లన్నీ తక్కువ విస్తీర్ణంలో అగ్గిపెట్టెల తరహాలో ఉండటం, బ్యాంకులకు చెల్లించాల్సిన డబ్బు లక్షల్లో ఉండటం,  సన్నటి కడ్డీలతో నిర్మించడం వల్ల నాణ్యత, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరాపై ఉన్న అనుమానాలతోనే చాలా మంది ముందుకు రాలేదు.  ఇళ్లకు సరఫరా చేసే నీటి ట్యాంకులు చిన్నవిగా ఉండటం కూడా మరో కారణం. కాగా  ఎన్‌టీఆర్‌ నగర్‌లలో ఇళ్లు పొందిన లబ్ధిదారులకు వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో బ్యాంకులకు కంతులు చెల్లించే అవసరం లేకుండా ఆ ఇళ్లను వారిపేరుతోనే రిజిస్ట్రేషన్‌ చేయిస్తామని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడంతో వాటికి డిమాండ్‌ పెరిగింది. మొదట కొంత మొత్తం చెల్లించి ప్లాట్‌ తీసుకుంటే వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో ఉచితంగా ఇల్లు వస్తుంది కదా అని కొందరు ముందుకు వచ్చి ప్లాట్లు తీసుకున్నారు.  

మొండిగోడలతో దర్శనమిస్తున్న ఇళ్లు
ఎన్‌టీఆర్‌ అర్బన్‌ హౌసింగ్‌ స్కీం కింద  మూడు దశల్లో మొత్తం 19232 ఇళ్లు నిర్మించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం కాగా మొదటి దశలో మొత్తం 4092 ఇళ్లను నిర్మించాల్సి ఉంది. కడపలో 33 బ్లాకులు కోర్టులో పెండింగ్‌ ఉన్నాయి.  రెండవ దశలో 13213 ఇళ్లు నిర్మించనుండగా, ఇందులో కడపలో 2281, ప్రొద్దుటూరులో 2150, బద్వేల్‌లో 808, రాయచోటిలో 1011, రాజంపేటలో 1279,  ఎర్రగుంట్లలో 2046, జమ్మలమడుగులో 1415, పులివెందులలో 2143 చొప్పున నిర్మించాల్సి ఉంది. మూడవ దశలో 1927 ఇళ్లను నిర్మిచాల్సి ఉండగా ఇందులో మైదుకూరులో 927, పులివెందులలో 1000 చొప్పున నిర్మించాల్సి ఉంది. కాగా మైదుకూరు మినహా అన్ని మున్సిపాలిటీల్లో నిర్మాణ పనులు మొదలయ్యాయి.

అయితే అన్ని ప్రాంతాల్లో ఇళ్లన్నీ అసంపూర్తిగా మొండిగోడలతో దర్శనమిస్తున్నాయి. కడప, జమ్మలమడుగులో నిర్మిస్తున్న ప్లాట్లు మార్చి నాటికి అందుబాటులోకి వస్తాయని చెప్పినా కార్యరూపం దాల్చలేదు. కడపలో 2600 మంది దరఖాస్తు చేసుకోగా కేవలం 940 ఇళ్లు మాత్రమే పూర్తి కావడంతో,  670 ఇళ్లే లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రెండవ దశలో ఇళ్లు నిర్మాణ దశలోనే ఉన్నాయి. జమ్మలమడుగులో కూడా అరకొరగానే ఇళ్లు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్‌టీఆర్‌ నగర్‌ పనులు చేపట్టి ఉంటే ఈ పాటికి అన్ని ఇళ్లు పూర్తయి ఉండేవి. కానీ ఆఖరు సంవత్సరంలో పనులు మొదలు పెట్టడం వల్ల  అవి మధ్యలోనే ఆగిపోయాయి.  ఇళ్లే పూర్తికాని ఎన్‌టీఆర్‌ నగర్‌లలో రోడ్లు, కాలువలు, విద్యుత్, డ్రై నేజీ, తాగునీరు వంటి మౌలిక వసతులు అసలే కల్పించలేదు.  

అసంపూర్తి నిర్మాణాలు
రాయచోటి అర్బన్‌:రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో సుండుపల్లె మార్గంలో 13. 11 ఎకరాల విస్తీర్ణంలో పిఎంఏవై, అర్బన్‌ ఎన్‌టిఆర్‌ హౌసింగ్‌ కింద ఇళ్ల నిర్మాణానికి అధికారులు శ్రీకారం చుట్టారు. 2017–18 సంవత్సరానికి గా ను ఫేజ్‌– 2 కింద రాయచోటికి 1011 ఇళ్లు మంజూరయ్యాయి.  నిర్మాణం పనులు చేపట్టిన కాంట్రాక్టు సంస్థకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో పనుల వేగం పూర్తి స్థాయిలో మందగించింది. ఇళ్ల మంజూరు కోసం 1011మందిలో కేవలం 290 మంది లబ్ధిదారులు మాత్రమే డిపాజిట్‌ సొమ్మును చెల్లించారు. డిపాజిట్‌ చెల్లించిన 290 మందిలో కూడా 200 మందికే అధికారులు బ్లాకులలో ప్లాట్లు కేటాయించి మిగిలిన వారికి మంజూరు చేయలేదు.   

పునాదులకే పరిమితమైన బ్లాకుల నిర్మాణం పనులు 

డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కూడా సెంటులోపే
ఎన్‌టీఆర్‌ అర్బన్‌ హౌసింగ్‌ స్కీంలో కేంద్ర ప్రభుత్వం రూ.1.50లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు సబ్సిడీ ఇస్తాయి. 300 చదరపు అడుగులు(రూ.6.03లక్షలు), 365 చదరపు అడుగులు(రూ.7.08లక్షలు), 430 చదరపు అడుగులు(రూ.8.20లక్షలు)  వంటి మూడు కేటగిరీలలో ప్రభుత్వం ఇళ్లు నిర్మిస్తోంది. ఈ మొత్తంలో ప్రభుత్వాలు ఇచ్చే రూ.3లక్షలు పోను మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారుడు బ్యాంకుకు కంతుల రూపేణ చెల్లించాలి. రెండు, మూడు కేటగిరి ఇళ్లను ఎంచుకునే వారు లబ్ధిదారుని వాటా కింద వరుసగా రూ.50వేలు, లక్ష రూపాయలు నాలుగు విడతల్లో చెల్లించాలి.  

ఇందులో మొదటి రెండు కేటగిరీలు సింగిల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లుకాగా, మూడో కేటగిరి డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లలో ఎడమ వైపు న ఉన్న ఇళ్లకు బెడ్‌రూమ్‌కు వంటగదికి మధ్య బాత్‌రూమ్, మరుగుదొడ్డి ఏర్పాటు చేశారు. ఎవరూ కూడా వంటగది పక్కన బాత్‌రూమ్, మరుగుదొడ్డి ఏర్పాటు చేసుకోరు. అలాంటిది ఎన్‌టీఆర్‌ నగర్‌ ఇళ్లలో ఇలా ఉండటంపై లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  మూడు కేటగిరిల్లో పెద్దదిగా చెప్పబడే డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కేవలం సెంటు విస్తీర్ణంలో నిర్మిస్తున్నారంటే అవి ఎంత పెద్దగా ఉన్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

ఈ భారం మోయలేం
ప్రొద్దుటూరు టౌన్‌: ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 40 వార్డుల్లో నివాసం ఉంటున్న పేదలకు హౌసింగ్‌ ఫర్‌ ఆల్‌ పథకం కింద మొదటి విడతలో 2000 గృహాలు, రెండో విడతలో 2,150 గృహాలు మంజూరయ్యాయి. చంద్రబాబు అధికారంలోకి రావడానికి ప్రజలకు చెప్పినట్లు ఉచితంగా ఇళ్లు కట్టివ్వకపోగా ఒక్కొక్కరిపై రూ.8 లక్షల భారం మోపడంతో లబ్ధిదారులు ఎవ్వరూ ఈ ఇళ్లు తీసుకునేందుకు ముందుకు రాలేదు. మూడు రకాల ఇళ్లు కట్టిస్తున్నామని రూ.500 కడితే ఇళ్లు సొంతం అవుతుందని మొదటలో అధికార పార్టీ నేతలు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు.

ఆ తరువాత రూ.2.65 లక్షలు బ్యాంకు నుంచి రుణం కాంట్రాక్టర్‌ తీసుకొని దాన్ని ప్రజలు 20 ఏళ్లపాటు ప్రతి నెల అసలు, వడ్డీ కలిపి దాదాపు రూ.3000 కట్టాల్సి వస్తుందని తెలుసుకొని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే రెండో రకం ఇంటికి లబ్ధిదారుడు రూ.50వేలు, మూడో రకం ఇంటికి రూ.లక్ష చెల్లించాలని చెప్పడంతో ప్రజలు అవాక్కయ్యారు. ఉచితం అయితే  తీసుకుంటాం కానీ డబ్బు మా వద్దలేదని ప్రజలు అధికార పార్టీ నేతలకు తేల్చి చెప్పారు. ఇప్పటి దాకా కేవలం 850 ఇళ్లకే అంగీకార పత్రాలు వచ్చాయి.  



పైన పటారం.. లోన లొటారం కడపలో సరోజినీ నగర్‌ వద్ద కట్టిన ఎన్‌టీఆర్‌ నగర్‌ ఇళ్లు 
ముప్పుతిప్పలు పెడుతున్నారు
గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పేదలకు ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. ఐదేళ్లు పూర్తయినా ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. అర్బన్‌ హౌసింగ్‌ పథకం కింద అపార్ట్‌మెంట్‌ పద్ధతిలో ముక్కాలు సెంట్‌లో నిర్మించే ఇంటికి రూ.8లక్షలకుపైగా పేదలు చెల్లించాల్సి వస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రూ.3లక్షలు సబ్సిడీతోనే ఇల్లు నిర్మించే అవకాశం ఉన్నా బ్యాంకు రుణాల పేరుతో ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నారు. 

ఉస్మాన్, ప్రొద్దుటూరు 

పిచ్చుకగూళ్లు..! 

జమ్మలమడుగు/జమ్మలమడుగు రూరల్‌: జమ్మలమడుగు పట్టణ వాసులకు గూడెంచెరువు సమీపంలో 1415 మందికి మూడు రకాల ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు.  పట్టణానికి దాదాపు మూడున్నర కిలోమీటర్లు దూరంగా ఉండటంతో ప్రజలు అంతదూరం వెళ్లాలా అంటూ మండిపడుతున్నారు. 

ఇష్టారాజ్యంగా నిర్మాణాలు.. 
ఏపీ టిట్కో ఆధ్వర్యంలో చేపట్టే నిర్మాణాలు సక్రమంగా లేవనే విమర్శలు వస్తున్నాయి. భవన నిర్మాణాల కోసం ఏర్పాటు చేసిన కడ్డీలు బయట పడుతున్నాయి. కొన్ని చోట్ల అపార్టుమెంట్‌కు నెర్రెలు చీలుతున్నాయి. ఇవన్నీ చూసిన లబ్ధిదారులు  ఈ అపార్టుమెంట్‌ ఎంతకాలం నిలబడుతుందో అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.  

చేనేతలకు ఉపయోగకరంగా లేవు..
నియోజకవర్గంతోపాటు జమ్మలమడుగు పట్టణంలో ఎక్కువగా చేనేత కార్మికులు ఉన్నారు. వారు మగ్గం పెట్టుకోవటానికి విశాలమైన స్థలం కావాలి. అపార్టుమెంట్‌ నిర్మాణం చేసి ఇస్తే ఉండటానికి మాత్రమే పనికి వస్తాయి. పనులు చేసుకోవటానికి పనికిరావు. చేనేతలు ఎలా బతుకుతారు.

– రమేష్, చేనేత ఐక్యవేదిక నియోజకవర్గ కన్వీనర్‌ 

క్యూరింగ్‌ లేకుండా నిర్మాణాలు చేస్తున్నారు 
పేద ప్రజల కోసం నిర్మించే ఇళ్లు పది కాలాల పాటు ఉండాలి. అలాంటి నిర్మాణాల్లో ఏపీ టిట్‌కో కంపెనీ అధికారులు భవనాలకు క్యూరింగ్‌ లేకుండానే నిర్మాణాలు చేస్తున్నారు. ఇద్దరు నివాసం ఉండటానికి ఇళ్లు సరిపోతాయి. మూడో వ్యక్తి ఇంట్లోకి వెళితో మరో వ్యక్తి బయటికి రావాల్సిందే. 

– పి.నాగేశ్వరరెడ్డి, గూడెంచెరువు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement