ఎట్టకేలకు గృహ ప్రవేశాలకు సర్కారు గురువారం ముహూర్తం పెట్టింది. ఇందుకోసం ఆర్భాటంగా ఏర్పాట్లు చేస్తోంది. తమ హయాంలో పేదలకుఇళ్లు నిర్మించామని వచ్చే ఎన్నికల్లోచెప్పుకోడానికి అస్త్రం సిద్ధం చేసుకుంటోంది. కానీ ఈ ఇళ్ల లెక్కలు చూస్తే అంతాగారడీగా కనిపిస్తోంది. జిల్లాకు కేటాయించిన ఇళ్లలో కనీసం సగం కూడాపూర్తి కాలేదు. నాలుగేళ్లలోఇందుకోసం సరైన కృషిజరగకపోవడమే కారణం.
చిత్తూరు కలెక్టరేట్: ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో అధికార టీడీపీలో అలజడి మొదలైంది. నాలుగేళ్లుగా చతికిలపడిన పథకాలకు బూ జు దులపడం మొదలెట్టింది. ఇందులో గృహ నిర్మాణ పథకమొకటి. ఇన్నాళ్లూ దీని ఊసే సర్కారుకు పట్టలేదు. పుణ్య కాలం కాస్తా గడిచిపోతుండటతో ఆదరాబాదరాగా కొన్నయినా పూర్తి చేశామని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటివరకూ పూర్తయిన ఎన్టీఆర్ పక్కా గృహ నిర్మాణాల్లో ఈనెల5న అట్టహాసంగా గృహప్రవేశాల కార్యక్రమాలు చేపడుతోంది.
జిల్లాలో 2016 నుంచి ఇప్పటి వరకు ఎన్టీ ఆర్ గృహనిర్మాణ పథకం కింద 55,351 పక్కా ఇళ్లను ప్రభుత్వం కేటాయించింది. తర్వాత దీనిపై అంతగా దృష్టి పెట్టలేదు. దీంతో 43,252 ఇళ్లు మాత్రమే మంజూరయ్యాయి. వివిధ కారణాలతో 12,099 ఇళ్లు కనీసం మంజూరుకు నోచుకోలేదు. గ్రామీణ ప్రాంతాల్లో 44,650 గృహాలకు గాను 35,788 మంజూరు చేయగా, 19,747 ఇళ్లు మా త్రమే నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం పీఎంఈవై కింద 589 మంజూరు చే యగా అందులో 516 పక్కాగృహాల నిర్మాణాలు చేపట్టారు. కానీ 288 గృహాల నిర్మాణాలు మాత్ర మే పూర్తయ్యాయి. పట్టణ ప్రాంతాల్లో 10,112 కేటాయించగా 6,948 ఇళ్లు మంజూరయ్యాయి. అందులో 2,495 నిర్మాణాలు పూర్తి అయ్యాయి. ఈ లెక్కన జిల్లావ్యాప్తంగా 22,530 గృహాల నిర్మాణాలు పూర్తి అయినట్లు అధికారిక లెక్కలు చెబు తున్నాయి. ఈ అన్ని ఇళ్లలో ఇప్పుడు గృహ ప్రవేశాలు జరుగుతున్నాయా అంటే అదీ లేదు. ఈనెల 5న 20,783 ఇళ్లలో గృహప్రవేశ కార్యక్రమాలను సర్కారు నిర్వహించనుంది. ఇందుకు సర్కారు హంగామా చేస్తోంది.
అధికార పార్టీ వారికే అగ్రాసనం..
ఇళ్ల మంజూరులో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా పక్షపాతం చూపిందనే విమర్శలున్నాయి. గూడులేని నిరుపేదలను విస్మరించింది. అధికార పార్టీకి సానుభూతిపరులకే పక్కా గృహాలు మంజూరయ్యాయి. అనర్హులైనా ఇళ్లను కేటాయించారని తె లిసింది. జన్మభూమి కమిటీల ఆమోదాన్ని తప్పనిసరి చేసి పూర్తిగా పార్టీ కార్యక్రమంగా మార్చేసింది. కమిటిల్లో అధికార పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులే ఉంటారు. దీంతో వీరంతా విపక్షాలకు చెందిన వారు అర్హులైనా పక్కనపెట్టేశారు. దీంతో నిరుపేదలకు సొంతగూడు కలగానే మిగిలిపోయింది.
నిర్మాణాల్లో అలసత్వం..
ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం నిర్మాణాల్లో ప్రభు త్వ అలసత్వం కొట్టొచ్చినట్లు ఉంది. ఇప్పటికీ 15,521 ఇళ్ల నిర్మాణాలలో పునాది దశ పూర్తి చేసుకున్నవి 9,006 మాత్రమే. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. నిధులు సరైన సమయంలో విడుదల చేయకపోవడం జాప్యానికి కారణం. లబ్ధి దారులు సకాలంలో నిర్మించుకోలేకపోతున్నారు. ప్రభుత్వ నిధులు కూడా అంతంతమాత్రమే ఇస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో పక్కా గృహానికి రూ.1.50 లక్షలు ఇస్తోంది. పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షలిస్తోంది. పెరిగిన రేట్లలో ఇవి ఏమాత్రం సరిపోవడం లేదని లబ్ధిదారులు చెబుతున్నారు. రెండేళ్లుగా కేటాయించిన వాటిలో 12,099 గృహాలు మంజూరుకు నోచుకోలేదు. అధికార పార్టీ నాయకుల కన్నుసన్నల్లో లబ్ధిదారుల ఎంపికను చేపట్టడమే ఇందుకు కారణం. సాధారణంగా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన వారిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుత అధికార పార్టీ జన్మభూమి కమిటీ ఆమోదంతోనే ఎంపిక ప్రక్రియను చేపట్టింది. దీంతో కేటాయిం పుల మేరకు ఎంపిక జరగలేదు.
రెండు నెలల్లో లబ్ధిదారుల ఎంపిక
లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మరో రెండు నెలల్లో వందశాతం పూర్తి చేస్తాం. మంజూ రుకు నోచుకోనివి ఇప్పటివి కావు. 2019 జనవరి నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.
–రామచంద్రారెడ్డి, హౌసింగ్ పీడీ
Comments
Please login to add a commentAdd a comment