కర్నూలు(అర్బన్): అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నచందంగా తయారైంది జిల్లా కేంద్రంలోని ఎస్‌సీ కళాశాల బాలికల వసతి గృహం పరిస్థితి. దాదాపు 200 మంది బాలికలకు వసతి సౌకర్యాలు కల్పించే విధంగా రూ.2.50 కోట్లు వెచ్చించి.. అన్ని హంగులతో భవనాన్ని నిర్మించారు. అయితే విద్యుత్ సౌకర్యం లేక పోవడంతో అది నిరుపయోగంగా మారింది. జిల్లా కేంద్రంలో ప్రస్తుతం కళాశాల విద్యను అభ్యసిస్తున్న ఎస్‌సీ బాలికలకు రెండు వసతి గృహాలు ఉన్నాయి. నరసింహారెడ్డి నగర్, ధర్మపేటలోని ఈ రెండు వసతి గృహాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. అరకొర వసతుల మధ్యనే విద్యార్థినులు కాలం వెళ్లదీస్తున్నారు. వీరి కోసం స్థానిక బీ క్యాంప్‌లోని ప్రభుత్వ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల ప్రాంగణంలో విశాలమైన స్థలంలో కళాశాల వసతి గృహాన్ని నిర్మించారు. విద్యార్థినులకు అవసరమైన గదులు, కిచెన్, డైనింగ్ హాల్, టాయ్‌లెట్లు, బాత్‌రూములు నిర్మించారు. విద్యుత్ సౌకర్యం కల్పించడంతోపాటు నీటి నిల్వకు సంబంధించిన ట్యాంకులను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ రెండు కారణాలతో ఈ విద్యా సంవత్సరంలో హాస్టల్ ప్రారంభానికి నోచుకుంటుందా? లేదా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. విద్యుత్ సౌకర్యం కల్పించాలని సంబంధిత కాంట్రాక్టర్ దాదాపు నెల రోజుల క్రితమే ఏపీ ట్రాన్స్‌కో అధికారులకు దరఖాస్తు చేస్తున్నా.. వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
డోలాయమానంలో కొత్త విద్యార్థినులు..
బీ క్యాంప్‌లో కొత్తగా నిర్మించిన వసతి గృహం నేటికీ ప్రారంభం కాకపోవడంతో కొత్త విద్యార్థులు ఏ కళాశాలలో చేరాలో తెలియని స్థితిని ఎదుర్కొంటున్నారు. చాలా మంది కేవీఆర్ మహిళా కళాశాలలోనే విద్యను అభ్యసిస్తున్నారు. కొత్త హాస్టల్ ప్రారంభమైతే, బీ క్యాంప్ నుంచి నిత్యం కేవీఆర్ కళాశాలకు రావాలంటే రోజుకు రూ.20 ఖచ్చితంగా ఆటో చార్జీలకు వెచ్చించాల్సి ఉంటుంది. రెన్యూవల్ విద్యార్థినులను మినహాయిస్తే కొత్తగా హాస్టల్ వసతి కోరుకునే వారు బీ క్యాంప్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరే అవకాశం ఉంది. ఇది ప్రారంభమైతే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరే విద్యార్థినులకు ఉపయోకరంగా ఉంటుంది.
త్వరలోనే సమస్యకు పరిష్కారం
విద్యుత్ సమస్యకు త్వరలోనే పరిష్కారం లభించనుంది. పదిహేను రోజుల్లోపు విద్యుత్ సౌకర్యంతో పాటు వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేయించేందుకు చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే ఏపీ ట్రాన్స్‌కో ఉన్నతాధికారులను కూడా కలిశాం. వసతి గృహం ప్రారంభమైన వెంటనే అద్దె భవనాల్లో కొనసాగుతున్న రెండు వసతి గృమాలను ఇక్కడికి మార్చేస్తాం. నిబంధనల మేరకు విద్యుత్ శాఖకు డబ్బు చెల్లించేందుకు కూడా సిద్దంగా ఉన్నాం. అయితే వారు అంచనాలు రూపొందిచాల్సి ఉంది.
-ఆర్.రవీంద్రనాథ్‌రెడ్డి,
సహాయ సాంఘిక సంక్షేమాధికారి
విద్యుత్ సమస్యే అడ్డుపడుతోంది..!
Published Thu, Jul 9 2015 2:32 AM | Last Updated on Sat, Sep 15 2018 3:01 PM
Advertisement
Advertisement