నెల్లూరు, సిటీ: నగర పాలక సంస్థ పరిధిలో జరిగే అభివృద్ధి పనుల్లో 20 శాతం వాటా ముట్టజెప్పాల్సిందేనని కొందరు కార్పొరేటర్లు, మహిళా కార్పొరేటర్ల భర్తలు కాంట్రాక్టర్లకు హుకుం జారీ చేశారు. ఏ డివిజన్‌లో పనిచేసినా వాటా అందాల్సిందేనని వారు స్పష్టం చేశారు. రెండు రోజుల క్రితం ఒక ప్రైవేటు అతిథిగృహంలో మున్సిపల్ కాంట్రాక్టర్లతో ఈ కార్పొరేటర్లు సమావేశమైనట్లు విశ్వసనీయ సమాచారం. ఆ కార్పొరేటర్లందరూ కార్పొరేషన్‌లో కీలకంగా వ్యవహరిస్తున్న ఒక నేత అనుచరులుగా ముద్ర ఉంది.
ఈ నేపథ్యంలో కార్పొరేషన్‌లో ఏపని జరగాలన్నా తమ కనుసన్నల్లోనే జరుగుతాయని వారంతా కాంట్రాక్టర్లను నమ్మించే ప్రయత్నం చేశారు. ఇటీవల చెల్లించిన బకాయిలు కూడా తమ ఒత్తిడి మేరకే చెల్లించారని వారు పేర్కొన్నట్లు తెలిసింది. లక్షలు కుమ్మరించి ఎన్నికైన తాము ఆ మాత్రం వాటా తీసుకోకపోతే రాజకీయం కూడా చేయలేమని అన్నట్టు చెబుతున్నారు. పని ప్రారంభించే మొదలు బిల్లులు చెల్లించేవరకు అన్నీ తామై చూసుకుంటామని కాంట్రాక్టర్లకు వారు భరోసా ఇచ్చారు. మీరు చేపట్టే పనుల్లో నాణ్యతను పరిశీలించే సమయంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని కాంట్రాక్టర్లుకు వారు హామీ ఇచ్చారు.
ఆందోళనలో అధికారులు
ఈ సమావేశం వివరాలు బయటకు పొక్కడంతో కార్పొరేషన్ అధికారులతో పాటు ఇతర కార్పొరేటర్లు ఆందోళన చెందుతున్నారు. తమ వార్డుల్లో జరిగే పనులకు కూడా వారే వాటాలు తీసుకుంటే తమ పరిస్థితి ఏమిటని మిగిలిన వారు వాపోతున్నారు. మరోవైపు అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బందిలోనూ ఈ వ్యవహారం గందరగోళానికి దారితీస్తోంది. నాణ్యత లేకుండా జరిగే పనులకు అంతిమంగా తామే బాధ్యత వహించాల్సి ఉంటుందని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహస్య సమావేశంలో జరిగిన విధంగానే అభివృద్ధి పనుల కేటాయింపులు, కమిషన్‌లు ఇచ్చినట్లయితే ఇక్కడ పనిచేయాల్సిన అవసరం లేదని కిందిస్థాయి సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నారు. కార్పొరేటర్లు, పైస్థాయి అధికారులు ఒక్కటైతే నిత్యం పనులు పర్యవేక్షించాల్సిన కిందిస్థాయి సిబ్బంది బలిపశువులు కాకతప్పదని ఆవేదనకు గురవుతున్నారు.
చెప్పేదొకటి.. చేసేదొకటి...
అధికార పార్టీ నాయకులు, నగర మేయర్, కార్పొరేటర్లు నిత్యం పత్రికల్లో అభివృద్ధికి టీడీపీ ముందుంటుందని డప్పు కొట్టుకునే విషయం తెలిసిందే. అయితే ఈ విధంగా కార్పొరేటర్లే దిగజారి వాటాలకు కక్కుర్తి పడటం పట్ల కాంట్రాక్టర్లు ఇదేమి చోద్యమని ఆశ్చర్యానికి గురవుతున్నారు. నగరాన్ని సుందరవనంగా తీర్చుదిద్దుతామని, అభివృద్ధికి బాటలు వేస్తామని రోజూ ఏదో ఒక కార్యక్రమంలో వారు చెబుతూనే ఉంటారు. అయితే దానికి భిన్నంగా వ్యవహరించడంపై కాంట్రాక్టర్లే అసహనం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్ కమిషనర్‌గా ఐఏఎస్ చక్రధర్‌బాబు రావడంతో కార్పొరేషన్ దారిలో పడుతుందని నగర ప్రజలందరూ అనుకున్నారు. అయితే అధికారి పార్టీ కార్పొరేటర్ల తీరు చూస్తుంటే అభివృద్ధి ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి కనపడుతుంది. ఈ విషయంపై కమిషనర్ దృష్టిసారించాల్సి ఉంది.
వాటా ఇవ్వాల్సిందే..
Published Fri, Mar 13 2015 2:05 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement