కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా..జిల్లాలో పచ్చదనం కనిపించడం లేదు. పంట పొలాలన్నీ వర్షం కోసం నోళ్లు తెరిచి ఉన్నాయి. చెరువులు, కుంటలు అడుగంటి కళావిహీనంగా మారాయి. జిల్లా వ్యాప్తంగా కరువు పరిస్థితులు నెలకొనడంతో విత్తనాలకు డిమాండ్ తగ్గింది. సబ్సిడీతో వేరుశనగ సహా వివిధ విత్తనాలను పంపిణీ చేస్తున్న వాటిని రైతులు పట్టించుకోవడం లేదు. దీంతో సబ్సిడీ విత్తన పంపిణీ కేంద్రాలు వెలవెలబోతున్నాయి.
ఖరీఫ్ సీజన్‌లో 15 లక్షల ఎకరాల్లో విత్తనం పనులు పూర్తి కావాల్సి ఉంది. గతేడాది ఈ స్థాయిలో విత్తనం పనులు పూర్తయ్యాయి. ఈ సారి జూన్ మొదటి వారం వర్షాలు ఓ మోస్తరుగా పడి ఆ తర్వాత మొండికేశాయి. ఎల్‌నినో ప్రభావంతో చినుకు జాడ కరువైంది. ఈ నేపథ్యంలో వేరుశనగకు డిమాండ్ ఉండదని వ్యవసాయ అధికారులు 5 వేల క్వింటాళ్లు మాత్రమే పొజిషన్ చేయాలని నిర్ణయించారు. ఇందులో కూడా 3700 క్వింటాళ్లు మాత్రమే పొజిషన్ అయ్యాయి. ప్రస్తుతం 1378 క్వింటాళ్లు పంపిణీ చేశారు. వర్షాలు పడకపోవడంతో ప్రస్తుతం అన్ని మండలాల్లో వేరుశనగ పంపిణీ కేంద్రాలు ఖాళీగా ఉండిపోయాయి.
ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్ధం చేస్తున్న అధికారులు..
రోజులు గడుస్తున్నా వర్షాల జాడ లేకపోవడంతో వ్యవసాయం సంక్షోభంలో పడినట్లయింది. వేసిన పంటలు కూడా ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నిన్న, మొన్నటి వరకు ఇదిగో వర్షాలు పడతాయని ఆశలు రేకెత్తించిన అధికారులు ఇప్పుడు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను రూపొందించడంపై దృష్టి పెట్టారు. ఈనెల 15 నుంచి దీనిని అమలులోకి తీసుకువచ్చే దిశగా చర్యలు చేపట్టారు. వర్షాలు మరింత ఆలస్యమైతే ఎర్ర నేలల్లో ఎటువంటి పంటలు వేసుకోవచ్చు. నల్ల నేలల్లో ఏయే పంటలు వేసుకోవచ్చు అనే దానిపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే జేడీఏ ఠాగూర్ నాయక్, నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్ డాట్ సెంటర్ సైంటిస్టులతో చర్చలు జరిపారు.
సాగు..లేదు బాగు!
Published Fri, Jul 4 2014 1:51 AM | Last Updated on Sat, Sep 2 2017 9:46 AM
Advertisement
Advertisement