నాన్‌ సబ్సిడీ సీడ్‌ పంపిణీ ఎప్పుడో? | Farmers worried about when seeds will arrive: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

నాన్‌ సబ్సిడీ సీడ్‌ పంపిణీ ఎప్పుడో?

Published Fri, Jun 21 2024 4:52 AM | Last Updated on Fri, Jun 21 2024 4:52 AM

Farmers worried about when seeds will arrive: Andhra Pradesh

ఎన్నికలకు ముందే విత్తన కంపెనీలను సిద్ధం చేసిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం

ఎన్నికల కోడ్‌తో ఆగిన ఒప్పందాలు 

ఒక్క అడుగూ ముందుకు వేయని నూతన ప్రభుత్వం

ఆర్బీకేల ద్వారా నాన్‌ సబ్సిడీ విత్తన పంపిణీపై నీలినీడలు

విత్తనాలు ఎప్పుడు వస్తాయో తెలియక రైతుల ఆందోళన

సాక్షి, అమరావతి:  నాన్‌ సబ్సిడీ విత్తన పంపిణీ ఈసారి మరింత ఆలశ్యమయ్యేట్టు కన్పిస్తోంది. ప్రతీ ఏటా సబ్సిడీ విత్తనంతో పాటు నాన్‌ సబ్సిడీ విత్తనాలను కూడా ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచేవారు. కానీ ఈసారి ఆ దిశగా ప్రయత్నాలు జరగడంలేదు. ఎన్నికల వేళ.. ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు ఇబ్బంది పడకూడదన్న ముందుచూపుతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలను సిద్ధం చేసింది.

ఎన్నికల కోడ్‌ కారణంగా ఈసారి కాస్త ఆలశ్యంగా ప్రారంభమైనప్పటికీ, సబ్సిడీ విత్తన పంపిణీ జోరుగా సాగుతోంది. అగ్రి ల్యాబ్‌్సలో సర్టిఫై చేసిన సీడ్‌ను ఆర్బీకేల్లో నిల్వ చేసి రిజిస్ట్రేషన్‌ చేసుకున్న రైతులకు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ పూర్తి కాగా, వేరుశనగ విత్తన పంపిణీ 90 శాతం పూర్తయింది. వరితో సహా ఇతర విత్తనాల పంపిణీ ఊపందుకుంటోంది.

ఇప్పటికే 3.11లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాల పంపిణీ
ఖరీఫ్‌ సీజన్‌ కోసం 6.32 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనం అవసరం కాగా, 6.28 లక్షల క్వింటాళ్ల విత్తనం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే అందుబాటులో ఉంచింది. 4.38 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని ఆర్బీకేల్లో ఉంచింది. ఇప్పటి వరకు 34,500 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలతో పాటు 2,55,899 క్వింటాళ్ల వేరుశనగ, 20,340 క్వింటాళ్ల వరి, 95 క్వింటాళ్ల అపరాలు చొప్పున 3.11 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని పంపిణీ చేశారు.

రెండేళ్లలో 305 క్వింటాళ్ల నాన్‌ సబ్సిడీ విత్తనం
సీజన్‌లో నాణ్యమైన విత్తనం దొరక్క మిరప, పత్తి రైతులు నకిలీల బారిన పడి, కోట్ల విలువైన పెట్టుబడి, ఉత్పత్తి నష్టాల బారిన పడకుండా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఐదేళ్లు సర్టిఫై చేసిన నాణ్యమైన నాన్‌ సబ్సిడీ సీడ్‌నే మార్కెట్‌లో అందుబాటులో ఉంచింది. రైతుల నుంచి వచ్చే డిమాండ్‌ మేరకు నాన్‌ సబ్సిడీ విత్తనాలను పంపిణీ చేసేది. ఇందుకోసం ప్రైవేటు కంపెనీలతో ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ఏటా సీజన్‌కు ముందే ఒప్పందాలు చేసుకునేది.

ఇలా గత రెండేళ్లలో 305.43 క్వింటాళ్ల నాన్‌ సబ్సిడీ విత్తనాన్ని పంపిణీ చేసింది. ఖరీఫ్‌–2022లో 108.44 క్వింటాళ్ల పత్తి, 2.52 క్వింటాళ్ల మిరప, 2.25 క్వింటాళ్ల సజ్జలు, 37.20 క్వింటాళ్ల సోయాబీన్‌ విత్తనాల పంపిణీ జరిగింది. గడిచిన ఖరీఫ్‌–2023లో సైతం 17.38 క్వింటాళ్ల పత్తి, 0.64 క్వింటాళ్ల మిరప, 137 క్వింటాళ్ల సోయాబీన్‌ విత్తనాలను పంపిణీ చేసింది.

నకిలీల బారిన పడకుండా చర్యలు
ఈసారి కూడా ఖరీఫ్‌ సీజన్‌కు 3 నెలల ముందుగానే పత్తి, మిరప ఇతర పంటల విస్తీర్ణానికి తగినట్టుగా విత్తనాలు సరఫరా చేసేలా కంపెనీలను గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సిద్ధం చేసింది. ముఖ్యంగా 29 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అవసరం కాగా, ప్రస్తుతం మార్కెట్లో 30 లక్షల ప్యాకెట్లు అందుబాటులోకి తెచ్చింది. నకిలీల నివారణకు విస్తృతంగా తనిఖీలు చేసి, ముగ్గురు విత్తన డీలర్లపై 6 ఏ కేసులు నమోదు చేసింది. 7.77 లక్షల విలువైన పత్తి, మిరప విత్తనాలను జప్తు చేసింది. 2.13 కోట్ల విలువైన 435 క్వింటాళ్ల పత్తి, మిరప, ఇతర విత్తనాల అమ్మకాలను నిలిపివేసింది.

ఫలితంగా ఎక్కడా నాసిరకం అనే మాటే విన్పించలేదు. సీజన్‌కు ముందే ప్రైవేటు కంపెనీలతో ఒప్పందానికి ఏర్పాట్లు చేసినా ఎన్నికల కోడ్‌ కారణంగా ముందుకు సాగలేదు.  ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు. దీంతో ఈ ఏడాది ఆర్బీకేల ద్వారా నాన్‌ సబ్సిడీ విత్తన పంపిణీపై ఈసారి నీలినీడలు కమ్ముకుంటున్నాయి. విత్తనాలు ఎప్పుడు వస్తా­యో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement