విత్తనాల కొనుగోలు నేరమట..
అనుమతి లేకుండా తెచ్చుకున్నారని రైతులపై కేసు నమోదు
పెదకాకాని: వారు వ్యాపారులు కారు.. డీలర్లూ కాదు.. సొంత పొలంలో వరి పంట విత్తుకోవడానికి కొందరు కలిసి విత్తనం తెచ్చుకున్న అన్నదాతలు. అదే వారి పాలిట శాపమైంది. వారేదో మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తున్నట్లు అధికారుల తనిఖీలు.. పోలీసుల రంగ ప్రవేశం.. కేసుల నమోదు.. అసలు రాష్ట్రంలో నెల రోజులకు పైగా ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు. పొలం వాళ్లది.. డబ్బులు వాళ్లవి.. శ్రమ వాళ్లది.. చేతనైతే సహకరించాల్సింది పోయి రైతులపై కేసులు పెట్టడం ఏమిటి? మునుపటికొకడు ఎద్దు ఈనిందంటే గాటికి కట్టేయండి.. అన్న చందంగా ఎవరో ఫిర్యాదు చేస్తే సరిగా విచారించకుండానే ఈ దుందుడుకు చర్యలు ఏమిటి?
గుంటూరు జిల్లా పెదకాకాని మండలం వెంకటకృష్ణాపురం గ్రామానికి చెందిన అమ్మిశెట్టి రోజేశ్వరరావు, మరికొందరు రైతులు కలిసి ఈ నెల 2వ తేదీన 30 కిలోల బరువుగల 58 సంచుల వరి విత్తనాలను తెలంగాణ నుంచి తెప్పించారు. వాటిని రోజేశ్వరరావు తన గోడౌన్‌లో దించుకున్నారు. అదేరోజు గుంటూరు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు అందిన సమాచారం మేరకు మండల వ్యవసాయాధికారి (ఏవో) పి.సంధ్యారాణి గ్రామానికి వచ్చారు. వరి విత్తనాలు ఎక్కడ కొనుగోలు చేశారు.. అనుమతులున్నాయా అంటూ విచారించారు.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం పెదపాపయ గ్రామం నుంచి నందీశ్వర సీడ్స్ పేరుతో ఉన్న వరి విత్తనాలను తామంతా కలిసి కొనుగోలు చేసినట్లు రైతులు తెలిపారు. అందుకు సంబంధించిన బిల్లు కూడా చూపించారు. ఒక్కరి పేరుతో ఇన్ని విత్తనాలు కొనుగోలు చేయకూడదని, షెడ్డులో ఉన్న 58 బస్తాలు సీజ్ చేస్తామని ఏవో చెప్పారు. తాము ఏటా వంద ఎకరాలకు పైగా వరి సాగు చేస్తామని రైతులు రోజేశ్వరరావు, మల్లికార్జునరావు, సాంబశివరావు తదితరులు విత్తనాలు సీజ్ చేయకుండా అడ్డుకున్నారు. దీంతో రైతులు తమ విధులకు ఆటంకం కలిగించారని ఏవో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసినట్లు శనివారం సీఐ కె.వీరాస్వామి తెలిపారు. రైతులపై కేసు నమోదు చేయడం పట్ల చుట్టుపక్కల గ్రామాల్లోని రైతుల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ ప్రభుత్వం రైతులకు ఇస్తున్న గౌరవం ఇదేనా అంటూ ప్రశి్నస్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని, రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment