పశువులు పస్తులేనా..!
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితు కారణంగా వరి సాగు విస్తీర్ణం భారీగా తగ్గింది. వర్షాల్లేక పచ్చిగడ్డి, వరి సాగు లేక ఎండుగడ్డి దొరకడం గగనంగా మారింది. వచ్చే వేసవిలో మూగజీవాలకు మేత దొరకడం కష్టం కానుంది. జిల్లాలో గేదెలు, ఆవులు, ఎద్దులు అన్నీ కలిపి 10లక్షలకు పైగా ఉన్నాయి. ఎక్కువగా పత్తి, సోయాబీన్, ఆ తర్వాత వరి సాగు చేస్తుంటారు. ధాన్యం దిగుబడి అనంతరం ఎండుగడ్డి పశువులకు మేతగా ఉపయోగపడేది. కానీ తగ్గిన వర్షాల కారణంగా జిల్లాలో 60వేల హెక్టార్లలో వరి సాగు కావాల్సి ఉండగా.. 20వేల ఎక్టార్లకు పడిపోయింది.
దీంతో ఎండాకాలంలో ఎండుగడ్డి దొరకలేని పరిస్థితి ఏర్పడనుంది. గడ్డి విత్తనాలు పశుసంవర్ధక శాఖ పంపిణీ చేసినా కరెంటు కోతల కారణంగా సాగుకు రైతులు ముందుకు రావడం లేదు. నీటి సదుపాయం ఉన్న కొంతమంది రైతులు విత్తనాలు తీసుకెళ్లినా తీవ్రమైన కరెంటు కోతల కారణంగా విత్తుకున్నా గడ్డిని వృథాగా వదిలేశారు. చెరువులు, కుంటలు నిండకపోవడంతో తాగునీటి ఎద్దడి ఎదురయ్యే అవకాశం ఉంది. ఏటా జనవరి మాసం పూర్తయ్యే సరికి పశువులకు మేత కరువు ఉండేది కాదు. ప్రస్తుతం నవంబర్‌లోనే కనుచూపు మేరలో పచ్చగడ్డి కనిపించడం లేదు.
వాణిజ్య పంటల సాగుకే ప్రాధన్యం..
జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే తక్కువగా కురవడంతో వరి, జొన్న, మొక్కజొన్న సాగుకు ఎక్కువగా నీటి అవసరం ఉన్నందునా వర్షాలు లేక ఎక్కువగా వేసుకోలేదు. ఈ పంటల దిగుబడి అనంతరం ఎండుగడ్డిగా పశువులకు ఆహారంగా ఉపయోగపడేది. తగ్గిన వర్షాల కారణంగా పత్తి, సోయా, కంది పంటలు వేసుకున్నారు. ఈ పంటల దిగుబడి అనంతరం ఎండుగడ్డిగా కూడా పశువులకు ఉపయోగకరంగా ఉండదు.
అరకొరగా గడ్డి విత్తనాలు
రైతులు పశువుల పెంపకానికి 75 శాతం రాయితీపై మేలు రకపు గడ్డి విత్తనాలు అందజేస్తున్నారు. గడ్డి విత్తనాల పెంపకంపై అవగహన కల్పించి పశు సంతతిని కాపాడుకునేందుకు అధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధికారులు జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో కొన్ని మండలాల్లో పంపిణీ చేసి చేతులు దులిపేసుకున్నారు. తూర్పు ప్రాంతాంలో విత్తన పంపిణీ ఊసే లేకుండా పోయింది.
అవగాహన కరువు..
ప్రభుత్వ పథకాలపై పాడి రైతులుకు అవగాహన కల్పించే వారు కరువయ్యారు. పశుగ్రాసం కోసం రబీలో నీటి సౌకర్యం ఉన్న రైతులకు గడ్డి విత్తనాలు రాయితీపై అందించాలి. దీనిపై గ్రామాల వారీగా ప్రచారం చేయకపోవడంతో రైతులు పశుగ్రాసం కోసం నానా తంటాలు పడుతున్నారు. విత్తనాలు పంపిణీ చేస్తున్నామని అధికారులు పేర్కొంటున్నా అవి ఎవరికి చేరుతున్నాయో తెలియడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. పశుసంపద అభివృద్ధి దిశగా పశుసంవర్ధక శాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో గడ్డి విత్తనాల పంపిణీపై అంతగా అవగాహన ఉండడం లేదు.
మార్చి తర్వాతే కష్టాలు..
ప్రతీ ఏటా జనవరి, ఫిబ్రవరి, మార్చిలో పంటలు చేతికొస్తాయి. ఈ దశలో పశుగ్రాసానికి ఇబ్బందులు ఉండవు. మార్చి తర్వాత సమస్య మొదలయ్యేది. కానీ ఈ ఏడాది డిసెంబర్‌కు ముందే పాడి రైతులకు కష్టాలు మొదలయ్యాయి. ఎండుగడ్డి దొరకని పరిస్థితి నెలకొంది. ఏప్రిల్, మే,జూన్ వరకు పశుగ్రాసం దొరకక మూగజీవులు అల్లాడాల్సిందే. మేకలు, గొర్రెలు పెంపకందారుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. వాటిని మేపేందుకు సుదూర ప్రాంతాలకు వెళ్లి రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. మూగజీవాలను కాపాడుకునే మార్గం తెలియక కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వం పాడి రైతుల కష్టాలు తెలుసుకుని వారికి సైతం వంద శాత ం రాయితీపై గడ్డివిత్తనాలు అందజేసి ఆదుకోవాలని కోరుతున్నారు. ప్రతి గ్రామంలో నీటితొట్టెలు ఏర్పాటు చేయాలని పేర్కొంటున్నారు.