అన్ని నేలల్లోనూ ఆముదం పండించొచ్చు
ఆముదం పంట మన రాష్ట్రంలో సుమారు 2.3 లక్షల హెక్టార్లలో సాగువుతున్నది. ఖరీఫ్‌లో ఈ పంటను మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి, కరీంనగర్, కర్నూలు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పండిస్తున్నారు. ఆముదం పంటకు అడవి పందుల బెడద లేకపోవడం విశేషం. కావున పందుల బెడద ఉన్న ప్రాంతాల్లో సాగుకు అనుకూలం.
అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. కానీ, నీరు బాగా ఇంకే నేలలు అనుకూలం. జూలై 31 వరకు నేల బాగా పదునైన తరువాత విత్తుకోవాలి. ఖరీఫ్ ఆముదాన్ని వర్షాధారంగా పండించుకోవచ్చు. అయితే, బెట్ట పరిస్థితుల్లో, నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో 1-2 తడులు ఇస్తే 15-20% దిగుబడి పెరుగుతుంది.
అధిక దిగుబడినిచ్చే సూటి రకాలైన క్రాంతి, హరిత, కిరణ్, జ్యోతి, జ్వాల, హైబ్రిడ్ రకాలైన పీసీహెచ్-111, పీసీహెచ్-222, జీసీహెచ్-4, డీసీహెచ్-177, డీసీహెచ్-519తో పాటు ప్రైవేట్ హైబ్రిడ్‌లు కూడా వేసుకోవచ్చు.
సాలుకు సాలుకు మధ్య 90 సెం. మీ., మొక్కకు మొక్కకు మధ్య 45 సెం. మీ. ఉండేవిధంగా 4 కిలోల సూటి రకాలను విత్తుకోవాలి.మొలకకుళ్లు తెగులు, ఆల్టర్‌నేరియం ఆకుమచ్చ తెగులు, కొంత వరకు వడలు తెగులును అరికట్టడానికి కిలో విత్తనానికి 3 గ్రా. థైరమ్ లేదా కాప్టాన్ అనే మందును కలిపి విత్తనశుద్ధి చేయాలి. వడలు తెగులు నివారణకు కిలో విత్తనానికి 3గ్రా. కార్బండజిమ్ లేదా 10 గ్రా. ట్రైకోడెర్మా విరిడితో విత్తనశుద్ధి చేయాలి.
కలుపు సమస్యను అధిగమించడానికి విత్తిన 24-48 గంటల్లోపు భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు పెండిమిథాలిన్ లేదా అలాక్లోర్ రసాయన కలుపు మందును 5-6 మి.లీ./లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. క్విజలోఫాప్ పి ఇథైల్/ఫినాక్సాఫాప్ పి ఇథైల్/ప్రొపక్విజఫాప్ అనే మందును 1.5 - 2,0 మి. లీ. లేక సైహలోఫాప్ బ్యూటైల్ 1.5 మి.లీ./లీటరు నీటికి కలిపి విత్తిన 20 రోజులకు పిచికారీ చేసి గడ్డి జాతి కలుపును నివారించుకోవచ్చు.
సూటి రకాలను సాగు చేసేటప్పుడు 12 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాషియం కలిగిన ఎరువులను విత్తేటప్పుడు వేసుకోవాలి. పైపాటుగా 6 కిలోల నత్రజని విత్తిన 30-35 రోజులకు, మిగిలిన 6 కిలోల నత్రజని విత్తిన 60-65 రోజులకు వేసుకోవాలి. సంకర రకాలు సాగు చేసేటప్పుడు అదనంగా మరో 6 కిలోల నత్రజనిని వత్తిన 9-95 రోజులకు వేసుకోవాలి.
తక్కువ ఖర్చుతో అధిక దిగుబడికి సూచనలు :
1. నాణ్యత గల విత్తనాన్ని వాడాలి. 2. తప్పనిసరిగా విత్తన శుద్ధి చేయాలి. 3. ఎరువులను తగు మోతాదులో సరైన సమయంలో వేయాలి. 4. కీలక దశల్లో వీలైతే నీరు పెట్టాలి. 5. సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించాలి. 6. సరైన సమయంలో కోయడం, నూర్చడం చాలా ముఖ్యం.
- డా. దండ రాజిరెడ్డి, విస్తరణ సంచాలకులు, ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్