అడుగంటిన ఆశలు | Declining groundwater | Sakshi
Sakshi News home page

అడుగంటిన ఆశలు

Published Mon, Mar 6 2017 10:45 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

అడుగంటిన ఆశలు - Sakshi

అడుగంటిన ఆశలు

► మండుతున్న ఎండలు.. ఎండుతున్న వరి చేలు
► తగ్గుతున్న భూగర్భజలాలు, వట్టిపోతున్న బోరుబావులు
► సాగునీరు అందక 400 ఎకరాల్లో పంట ఎండుముఖం
► పశువులకు మేతగా మారిన పైర్లు
► నష్టపరిహారం అందించాలని రైతుల వేడుకోలు


వరి చేలకు నీళ్లు లేక అన్నదాతకు కన్నీళ్లే మిగిలాయి. మండే ఎండలతో పొలాలు నెర్రెలు బారుతున్నాయి. పంట ఎండిపోవడంతో పశువులకు మేతగా మారుతోంది. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి ఎన్నో ఆశలతో సాగు చేసిన వరి చేతికందని పరిస్థితులతో రైతులు వేదనకు గురవుతున్నారు. మండుతున్న భానుడితో చెరువులు, కుంటల్లో నీటిమట్టం తగ్గిపోతోంది. బోర్లు ఎండిపోతున్నాయి. ఇబ్రహీంపట్నం మండలంలో సుమారు 400 ఎకరాల్లో వరికి నీళ్లు అందక ఎండిపోయింది. వ్యవసాయానికి 9 గంటలపాటు విద్యుత్‌ సరాఫరా అవుతున్నా.. భూగర్భ జలాలు అడుగంటడంతో ఎటువంటి ప్రయోజనం లేకుండాపోయింది.

ఇబ్రహీంపట్నం/ఇబ్రహీంపట్నం రూరల్‌: సాగునీరు పుష్కలంగా ఉంటుందన్న ఆశతో రైతులు యాసంగిలో ఉత్సాహంగా వరి పంట సాగు చేశారు. ఈసారి కాస్తో కూస్తో కురిసిన వర్షాలతో భూగర్భ జలాలు పెరిగి బోర్లు, బావుల్లో నీరు ఉందనే ఆలోచనతో ఎక్కువ విస్తీర్ణంలో పంట వేశారు. గత ఖరీఫ్‌లో 425 హెక్టార్లలో సాగవ్వగా.. ఈ యాసంగిలో సాధారణ విస్తీర్ణం 625 హెక్టార్లు కాగా సుమారు 800 హెక్టార్లలో సాగు చేశారు. ఈ నేపథ్యంలో దండుమైలారం, నెర్రపల్లి, పోల్కంపల్లి, రాయపోల్, ముకునూర్‌ గ్రామాల్లో ఎన్నడూ లేనివిధంగా ఈసారి వేసవికి ముందే భూగర్భ జలాలు పడిపోయాయి. దీంతో చేతికొచి్చన పంటలు ఎండుముఖం పట్టాయి.

ఎగువ భాగమైన కప్పపహాడ్, ఎల్మినేడు, కొంగరకలాన్, పోచారం, ఉప్పరిగూడ, తులేకలాన్, రాందాస్‌పల్లి గ్రామాల్లో పెద్దగా పంటలు ఎండిపోలేదు. దిగువభాగంలోని దండుమైలారం, నెర్రపల్లి, ముకునూర్‌ గ్రామాల్లో 400 ఎకరాలకు పైగా పంట ఎండిపోయింది. ప్రస్తుతం ఎండలు ఏమాత్రం ముదరక ముందే ఈ పరిస్థితి దాపురించిందంటే రాబోయే రోజుల్లో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉండనుందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం రైతులకు 9 గంటల కరెంట్‌ ఇస్తున్నప్పటికీ బోరుబావుల్లో నీరు లేకపోవడంతో ఇంతటి గడ్డు పరిస్థితి దాపురించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎకరాకు రూ.25 వేలకుపైగా పంటకు పెట్టుబడులు పెట్టామని, నీళ్లు లేక వరి చేలు కళ్లముందే ఎండిపోతుంటే తల్లడిల్లుతున్నారు. ఎండిపోయిన పంటకు నష్ట పరిహారం చెల్లించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇప్పటికే మండలంలో 400 ఎకరాలకు పైగా పంటలు ఎండిపోతున్నా వ్యవసాయ అధికారులు మాత్రం గ్రామాల్లో పర్యటించి పంట నష్టం అంచనా వేసిన దాఖలాలు లేకుండా పోయాయని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా వారు స్పందించి చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.  

ఇబ్బడి ముబ్బడిగా బోరుబావులు
వేసవికాలంలో నీటి ఎద్దడిని తీర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. అవగాహన లేకుండా బోర్లు వేసి రైతులు అప్పులపాలవుతున్నారు. కొద్దిగా నీరు వచ్చిన తరువాత ఎండిపోతున్నాయి. సహజ వనరులను కాపాడేందుకు తీసుకొచి్చన వాల్టా చట్టం కేవలం కాగితాలకే పరిమితమైంది. మండలంలోని వాల్టా చట్టానికి ప్రత్యేక కమిటీలుంటాయి. తహసీల్దార్‌ చైర్మన్ గా వ్యవహరిస్తారు. 

బోరు వేసే ముందు తహసీల్దార్‌ అనుమతి తీసుకుని నిర్ణీత రుసుము చెల్లించాలి. అధికారులు సూచించిన లోతును మాత్రమే బోరుబావులు తవ్వించాల్సి ఉంటుంది. ప్రతి బోరుకు 250 మీటర్ల దూరం ఉండాలి. అనుమతులు తీసుకోకుండా అక్రమంగా వేసే బోరు యంత్రాలను వేసిన బోర్లను సీజ్‌ చేసే అధికారం తహసీల్దార్‌కు ఉంటుంది.  షాబాద్‌

పంట నష్టం అంచనా వేస్తాం
ప్రస్తుతం భూగర్భ జలాలు అడుగంటడంతో నెర్రపల్లి, దండుమైలారం, రాయపోల్, ముకునూర్‌ గ్రామాల్లో పంటలు ఎండిపోతున్న విషయం మా దృష్టికొచ్చింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. గ్రామాల్లో పర్యటించి పంట నష్టం అంచనా వేస్తాం. రైతులను ఆదుకుంటాం.   – వరప్రసాద్‌రెడ్డి, ఏఓ, ఇబ్రహీంపట్నం

బోరుకు బంగారం తాకట్టు పెట్టాం
నాలుగు ఎకరాల్లో వరి పంట వేశా. పుష్కలంగా నీరు ఉందన్న ఆశతో సాగు చేస్తే ప్రస్తుతం ఎండిపోయింది. రూ.70 వేలు ఖర్చు చేసి బోర్లు వేశాం. బంగారం తాకట్టు పెట్టి బోరు వేయిస్తే చుక్క నీరు రాలేదు. అప్పు చేసి సాగు చేసిన పంట ఎండిపోవడంతో ఏం చేయాలో తోచడం లేదు. – దోర్నాల అబ్బసాయిలు, రైతు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement