భూగర్భ శోకం | Hazardous have fallen to the level of water | Sakshi
Sakshi News home page

భూగర్భ శోకం

Published Sun, Apr 19 2015 12:50 AM | Last Updated on Sun, Sep 3 2017 12:28 AM

Hazardous have fallen to the level of water

- ప్రమాదకర స్థాయికి పడిపోయిన నీరు
- ములుగు, తూప్రాన్‌లో 34 మీటర్ల లోతుకు..
- ఏడాదిలోనే 6.31 మీటర్ల దిగువకు
- బోర్లు తవ్వుతున్నా పడని నీరు
-ఈ వేసవిలో తాగునీటి సమస్య తీవ్రం
- వచ్చే సీజన్‌లో కురిసే వర్షాలే ఆధారం 

     
జిల్లాలో ప్రమాద ఘంటికలు ముంచుకొస్తున్నాయి... రోజు రోజుకూ భూగర్భజలాలు పడిపోతున్నాయి... బోరుబావులు, చేతిపంపులు ఎండిపోతున్నాయి... చెరువుల్లో నీరు లేకుండా పోయింది... అక్కడక్కడా అవసరానికి మించి నీటి విని యోగం పెరిగిపోయింది... ఎన్ని బోర్లు వేసినా నీరొచ్చే పరిస్థితి లేదు. విషయం తెలియని రైతులు బోర్ల మీద బోర్లు వేస్తూ అప్పుల పాలవుతున్నారు... ఈ వేసవిలో తాగు నీటికీ కష్టాలు తప్పేట్టు లేదు... వచ్చే సీజన్‌లో వాన దేవుడు కరుణించకపోతే నీటి యుద్ధాలు తప్పేట్టు లేదు.

సాక్షి, సంగారెడ్డి :జిల్లాలో భూగర్భ జలాలు ప్రమాదకరస్థాయికి పడిపోతున్నాయి. గత ఏడేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది భూగర్భ జలాలు పడిపోయాయి. గత ఏడాదితో పోలిస్తే 6.31 మీటర్ల లోతుకు చేరాయి. గత ఏడాది మార్చిలో 12.48 మీటర్ల లోతులో ఉండగా ప్రస్తుతం 18.79 మీటర్లకు చేరుకున్నాయి. ప్రస్తుత వేసవిలో తీవ్రమైన తాగునీటి ఎద్దడి నెలకొంది. దీనికితోడు భూగర్భ జలాలు రోజురోజుకూ అడుగంటుతోండడం ఆందోళన కలిగిస్తోంది.

జిల్లాలోని చాలా ప్రాంతాల్లో బోరుబావులు ఇప్పటికే ఎండిపోయాయి. దీనికితోడు చేతి పంపులు పనిచేయడం లేదు. దీంతో తాగునీటి సమస్య మరింత తీవ్రమయ్యే పరిస్థితి నెలకొంది. వర్షాభావం కారణంగా ఈ ఏడాది పంటలు సరిగ్గా పండలేదు. భూగర్భ జలాలు మరింత లోతుకు పడిపోవడంతో వ్యవసాయ బోరుబావులు సైతం నీరు పోయడం తగ్గింది. రబీలో వరి, చెరకు పంటలు సాగు చేసిన రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అవసరానికి మించి బోర్లు వేయటం.

భూగర్భజలాలను  వాడుకోవటం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. బోరుబావుల ద్వారా వందశాతం భూగర్భజలాలు వాడుతున్న గ్రామాలు జిల్లాలో 377 వరకున్నాయి. డార్క్ ఏరియా ప్రాంతాలు అత్యధికంగా ఉన్న జిల్లాగా రాష్ట్రంలోనే మెదక్ అగ్రభాగాన ఉంది. భూగర్భ జలాలు పడిపోతున్నా ఇది తెలి యక రైతులు ఆశతో బోర్లు వేసి నీళ్లు పడక అప్పులపాలవుతున్నారు.

ములుగులో 34.03 మీటర్ల లోతుకు చేరిన నీరు..
సీఎం నియోజకవర్గమైన గజ్వేల్‌లో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. జిల్లాలో అత్యధికంగా ములుగు గ్రామంలో 34.03 మీటర్ల లోతుకు చేరుకున్నాయి. తూప్రాన్‌లో 33.35 మీటర్లు, గజ్వేల్‌లో 30.80 మీటర్ల మేర పడిపోయాయి. కొల్చారం మండలం రంగంపేటలో 32.50, టేక్మాల్ 29.10, రామచంద్రాపురం 28.38, జిన్నారం మండలం అన్నారం గ్రామంలో 27.90, దౌల్తాబాద్ మండలం రాయిపోల్‌లో 26.31, దుబ్బాక మండలం చిట్టాపూర్‌లో 26.23, దుబ్బాక మండలం గంబీర్‌పూర్‌లో 25.21 మీటర్ల మేరకు చేరుకున్నాయి.

జగదేవపూర్ మండలం ధర్నారంలో 23.59, ములుగు మండలం జప్తిసింగపల్లిలో 23.57 మీ., మునిగడపలో 22.50 మీ., జహీరాబాద్ మండలం రంజోల్‌లో 21.50 మీ., ములుగు మండలం అడవి మజీద్‌పల్లిలో 21.42 మీ., మనూరు మండలం పూసల్‌పాడ్ గ్రామంలో 20.75 మీ., చిన్నకోడూరు మండలం అనంతసాగర్ గ్రామంలో 20.29 మీటర్ల మేర భూగర్భ జలాలు పడిపోయాయి. వీటికితోడు 10 మండలాల్లో 20 నుంచి 15 మీటర్లకు భూగర్భ జలాలు చేరుకున్నాయి. భూగర్భ జలాలు క్రమంగా పడిపోతుండడంతో గ్రామాల్లో చేతిపంపులు, బోర్లు ఎండిపోతున్నాయి. బావుల్లో సైతం నీళ్లు అడుగంటుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్‌లో సమస్య మరింత తీవ్రమవుతుంది.

వర్షాల పైనే ఆశ..
కురిసిన ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టి భూగర్భంలోకి పంపితేనే మేలు ఉంటుంది. రాబోయే రోజుల్లో వర్షాలు కురిస్తేనే జిల్లాలో భూగర్భ జలాలు పెరిగే (పైకి వచ్చే) అవకాశం ఉంది. లేనిపక్షంలో పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముంది. కాగా జిల్లాలో ప్రస్తుతం 1.60 లక్షల వ్యవసాయ బోర్లు ఉన్నాయి. వీటి ద్వారా ప్రస్తుతం అవసరానికి మించి నీటిని వాడుతున్నారు. బోరుబావులున్న రైతులు మైక్రో ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్ వైపు మళ్లితే ఫలితం ఉంటుంది. అధికారులు వాల్టా చట్టాన్ని కచ్చితంగా అమలు చేస్తే మేలు జరుగుతుంది.

Related News By Category

Related News By Tags

Advertisement