In the summer
-
వేసవిలో బదిలీలు చేయూలి
ఖమ్మం: వేసవి సెలవుల్లోనే ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను నిర్వహించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు కృష్ణమోహన్ డిమాండ్ చేశారు. సంఘం జిల్లా సమావేశం ఆదివారం ఖమ్మం నగరంలో జరిగింది. ఈ సందర్భంగా కృష్ణమోహన్ మా ట్లాడుతూ పాఠశాలలో ఉపాధ్యాయుల సర్వీసు గరిష్ట కాలపరిమిపై హడావుడిగా కాకుండా శాస్త్రీయ దృష్టితో స్థిరమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. పదోన్నతులు ఎలా సాధ్యమైతే ఆలా నిర్ణయం తీసుకోవాలని అన్నారు. పదవ తరగతి మూల్యాంకనం రేట్లను మూడు రెట్లు పెంచాలని, స్పెషల్ అసిస్టెంట్లకు డీఏ ఇవ్వాలని, నూతన పీఆర్సీ ప్రకారం టీఏ, డీఏ అమలయ్యేలా స్పాట్ ముగిసేలోపు ఉత్తర్వ్యూలు జారీ చేయాలన్నారు. రేషలైజేషన్ ఆలోచనను విరమించుకోవాలని ప్రాథమిక పాఠశాలలను విలీనంచేసి ఆంగ్లమీడియంబోధన ప్రవేశపెట్టాలని సమావేశంలో తీర్మానం చేశారు. పీఆర్సీ బకాయిలు, జీపీఎఫ్ నగదు ఇవ్వాలని స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, పండిట్, పీఈటీలను అప్‌గ్రేడ్ చేయాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు వెంకటేశ్వర్లు, కనకదుర్గ, వెంకట్‌రెడ్డి, జయరాజ్, శ్రీనివాస్‌చ ప్రసాద్, అబ్రహం, రంగారావు, రియాద్, నరసయ్య, వెంకటేశ్వరావు, సోమాల్ల తదితరులు పాల్గొన్నారు. -
భూగర్భ శోకం
- ప్రమాదకర స్థాయికి పడిపోయిన నీరు - ములుగు, తూప్రాన్‌లో 34 మీటర్ల లోతుకు.. - ఏడాదిలోనే 6.31 మీటర్ల దిగువకు - బోర్లు తవ్వుతున్నా పడని నీరు -ఈ వేసవిలో తాగునీటి సమస్య తీవ్రం - వచ్చే సీజన్లో కురిసే వర్షాలే ఆధారం జిల్లాలో ప్రమాద ఘంటికలు ముంచుకొస్తున్నాయి... రోజు రోజుకూ భూగర్భజలాలు పడిపోతున్నాయి... బోరుబావులు, చేతిపంపులు ఎండిపోతున్నాయి... చెరువుల్లో నీరు లేకుండా పోయింది... అక్కడక్కడా అవసరానికి మించి నీటి విని యోగం పెరిగిపోయింది... ఎన్ని బోర్లు వేసినా నీరొచ్చే పరిస్థితి లేదు. విషయం తెలియని రైతులు బోర్ల మీద బోర్లు వేస్తూ అప్పుల పాలవుతున్నారు... ఈ వేసవిలో తాగు నీటికీ కష్టాలు తప్పేట్టు లేదు... వచ్చే సీజన్లో వాన దేవుడు కరుణించకపోతే నీటి యుద్ధాలు తప్పేట్టు లేదు. సాక్షి, సంగారెడ్డి :జిల్లాలో భూగర్భ జలాలు ప్రమాదకరస్థాయికి పడిపోతున్నాయి. గత ఏడేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది భూగర్భ జలాలు పడిపోయాయి. గత ఏడాదితో పోలిస్తే 6.31 మీటర్ల లోతుకు చేరాయి. గత ఏడాది మార్చిలో 12.48 మీటర్ల లోతులో ఉండగా ప్రస్తుతం 18.79 మీటర్లకు చేరుకున్నాయి. ప్రస్తుత వేసవిలో తీవ్రమైన తాగునీటి ఎద్దడి నెలకొంది. దీనికితోడు భూగర్భ జలాలు రోజురోజుకూ అడుగంటుతోండడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో బోరుబావులు ఇప్పటికే ఎండిపోయాయి. దీనికితోడు చేతి పంపులు పనిచేయడం లేదు. దీంతో తాగునీటి సమస్య మరింత తీవ్రమయ్యే పరిస్థితి నెలకొంది. వర్షాభావం కారణంగా ఈ ఏడాది పంటలు సరిగ్గా పండలేదు. భూగర్భ జలాలు మరింత లోతుకు పడిపోవడంతో వ్యవసాయ బోరుబావులు సైతం నీరు పోయడం తగ్గింది. రబీలో వరి, చెరకు పంటలు సాగు చేసిన రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అవసరానికి మించి బోర్లు వేయటం. భూగర్భజలాలను వాడుకోవటం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. బోరుబావుల ద్వారా వందశాతం భూగర్భజలాలు వాడుతున్న గ్రామాలు జిల్లాలో 377 వరకున్నాయి. డార్క్ ఏరియా ప్రాంతాలు అత్యధికంగా ఉన్న జిల్లాగా రాష్ట్రంలోనే మెదక్ అగ్రభాగాన ఉంది. భూగర్భ జలాలు పడిపోతున్నా ఇది తెలి యక రైతులు ఆశతో బోర్లు వేసి నీళ్లు పడక అప్పులపాలవుతున్నారు. ములుగులో 34.03 మీటర్ల లోతుకు చేరిన నీరు.. సీఎం నియోజకవర్గమైన గజ్వేల్‌లో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. జిల్లాలో అత్యధికంగా ములుగు గ్రామంలో 34.03 మీటర్ల లోతుకు చేరుకున్నాయి. తూప్రాన్‌లో 33.35 మీటర్లు, గజ్వేల్‌లో 30.80 మీటర్ల మేర పడిపోయాయి. కొల్చారం మండలం రంగంపేటలో 32.50, టేక్మాల్ 29.10, రామచంద్రాపురం 28.38, జిన్నారం మండలం అన్నారం గ్రామంలో 27.90, దౌల్తాబాద్ మండలం రాయిపోల్‌లో 26.31, దుబ్బాక మండలం చిట్టాపూర్‌లో 26.23, దుబ్బాక మండలం గంబీర్‌పూర్‌లో 25.21 మీటర్ల మేరకు చేరుకున్నాయి. జగదేవపూర్ మండలం ధర్నారంలో 23.59, ములుగు మండలం జప్తిసింగపల్లిలో 23.57 మీ., మునిగడపలో 22.50 మీ., జహీరాబాద్ మండలం రంజోల్‌లో 21.50 మీ., ములుగు మండలం అడవి మజీద్‌పల్లిలో 21.42 మీ., మనూరు మండలం పూసల్‌పాడ్ గ్రామంలో 20.75 మీ., చిన్నకోడూరు మండలం అనంతసాగర్ గ్రామంలో 20.29 మీటర్ల మేర భూగర్భ జలాలు పడిపోయాయి. వీటికితోడు 10 మండలాల్లో 20 నుంచి 15 మీటర్లకు భూగర్భ జలాలు చేరుకున్నాయి. భూగర్భ జలాలు క్రమంగా పడిపోతుండడంతో గ్రామాల్లో చేతిపంపులు, బోర్లు ఎండిపోతున్నాయి. బావుల్లో సైతం నీళ్లు అడుగంటుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్‌లో సమస్య మరింత తీవ్రమవుతుంది. వర్షాల పైనే ఆశ.. కురిసిన ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టి భూగర్భంలోకి పంపితేనే మేలు ఉంటుంది. రాబోయే రోజుల్లో వర్షాలు కురిస్తేనే జిల్లాలో భూగర్భ జలాలు పెరిగే (పైకి వచ్చే) అవకాశం ఉంది. లేనిపక్షంలో పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముంది. కాగా జిల్లాలో ప్రస్తుతం 1.60 లక్షల వ్యవసాయ బోర్లు ఉన్నాయి. వీటి ద్వారా ప్రస్తుతం అవసరానికి మించి నీటిని వాడుతున్నారు. బోరుబావులున్న రైతులు మైక్రో ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్ వైపు మళ్లితే ఫలితం ఉంటుంది. అధికారులు వాల్టా చట్టాన్ని కచ్చితంగా అమలు చేస్తే మేలు జరుగుతుంది. -
చుర్రుమంటోంది..
ఠారెత్తిస్తున్న ఎండలు ఉష్ణోగ్రతలు ఉధృతం గాలులతో కాస్త ఉపశమనం ఎండలు ఠారెత్తించడంతో జిల్లాలో కాక పుడుతోంది. ఉదయం నుంచి ఉడుకు మొదలవుతోంది. వేసవి ఊపందుకోవడంతో దాని ఉధృతి కూడా పెరుగుతోంది. ఏప్రిల్ మొదటి వారంలోనే సాధారణంకంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతోంది. మరోవైపు విశాఖపై ఎలాంటి ద్రోణులూ ప్రభావం చూపడం లేదు. అందువల్ల ఆకాశంలో మేఘాలు లేవు. దీంతో భానుడి ప్రతాపం నేరుగా భూమిపై పడి సత్వరమే వేడెక్కుతూ సెగలకు కారణమవుతోంది. విశాఖపట్నం: జిల్లా గరంగరంగా మారిపోతోంది. ఉదయం 9 గంటలకే చుర్రుమంటోంది. వీథుల్లోకి అడుగు పెట్టడానికి జనం భయపడుతున్నారు. హుద్‌హుద్ దెబ్బకు లక్షల చెట్లు నేలకూలాయి. ఫలితంగా ఆ ప్రభావం కూడా ఇప్పుడు ఇటు విశాఖపైన, అటు జిల్లాపైన పడుతోంది. వాహనాలు, పరిశ్రమలు విడుదల చేసే కార్బన్ డయాక్సైడ్ను చెట్లు పీల్చుకుంటాయి. ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. అయితే హుద్‌హుద్‌కు జిల్లాలో చెట్లు చాలావరకు ధ్వంసమయ్యాయి. దీనివల్ల విడుదలవుతున్న కార్బన్ డయాక్సైడ్ గాలిలో అలాగే ఉండిపోతోంది. దీంతో భూతాపం పెరిగిపోతూ ఉష్ణ తీవ్రతకు కారణమవుతోంది. విశాఖలో ఆదివారం 36 డిగ్రీల పగటి (గరిష్ట) ఉష్ణోగ్రత రికార్డయింది. ఇది సాధారణం కంటే ఒక డిగ్రీ ఎక్కువ. గాలులతో మేలు.. : వేసవి వచ్చిందంటే విశాఖ వాసులకు ఉక్కపోత బెడద వెంటాడుతుంది. ఇతర ప్రాంతాల కంటే విశాఖలో గాలిలో తేమ అధికంగా ఉంటుంది. గాలి కూడా తగ్గుతుంది. చెట్లు లేకపోతే తేమ శాతం మరింత పెరుగుతుంది. వెరసి ఉక్కపోతకు దారితీస్తుంది. అదృష్టవశాత్తూ ప్రస్తుతం దక్షిణ, నైరుతి గాలులు వీస్తున్నాయి. అందువల్ల గాలిలో తేమను ఒక చోట ఉంచకుండా ఉక్కపోత లేకుండా చేస్తున్నాయి. కొద్దిరోజులపాటు గాలులు వీస్తాయని, గాలులు తగ్గితే ఉక్కపోత మొదలవుతుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం మాజీ అధికారి ఆర్.మురళీకృష్ణ ‘సాక్షి’కి తెలిపారు. -
హాయి హాయిలే వాటర్ మేలే నులే!
ఎర్రటి ఎండల్లో ఎర్రెర్రెగా నోరూరించే వాటర్మెలాన్లు చూసి లొట్టలేయకుండా వాటిని హాయి హాయిగా చల్లచల్లగా ఆరగించండి. ఎండకు గట్టి పోటీ ఇవ్వండి. కూల్‌గా ఉండండి. ఇంతకీ ఏమిటా లాభాలు? ఇదిగో: వేసవి దాహాన్ని తట్టుకోవడానికి మానవాళికి ప్రకృతి ప్రసాదించిన బహుమతి వాటర్ మెలాన్. దాహం తీర్చడమే కాదు విటమిన్-ఎ తాలూకు సంపూర్ణ ఫలితాలను ఇస్తుంది వేసవిలో చర్మసంరక్షణకు తోడ్పడుతుంది గుండెకు సంబంధించి రుగ్మతలు, ఎండ దెబ్బ నుంచి కాపాడుతుంది శక్తి ఉత్పత్తికి అవసరమయ్యే విటమిన్-బి దీనిలో ఉంటుంది. గమనిక: ఉప్పులాంటి వేవీ అద్దుకోకుండా, వీటిని తాజాగా, సహజంగా తింటేనే మంచిది. ఒక చల్లటి పొగడ్త: సుఖాలలోకెల్లా గొప్ప సుఖం... వాటర్ మెలాన్ను భుజించడం. దేవుడి ఆశీస్సులతో ఈ భూమి మీద ఉన్న అన్ని పండ్లకు రారాజుగా కొనసాగుతోంది. దేవతలు ఏంతింటారో తెలుసుకోవాలనుకునేవారు దీన్ని తింటే చాలు.. తెలిసిపోతుంది. - మార్క్టైన్, రచయిత -
కాటన్ దుస్తులు కళకళలాడాలంటే...
వేసవి వచ్చిందంటే మన వస్త్రధారణను ఉన్నపళాన మార్చేస్తాం. కాటన్ తప్ప మరో మెటీరియల్ వైపు చూడటానికి కూడా భయపడతాం. వేసవి ఉగ్రత నుంచి కాపాడటమే కాక... కాటన్ మనకు అందాన్ని, హుందాతనాన్ని కూడా తెచ్చిపెడుతుంది. అయితే కాటన్‌కు అందాన్ని తెచ్చేది మాత్రం గంజి! నిజానికి మార్కెట్లో దొరికే గంజి పౌడర్ కంటే... ఇంట్లో చేసుకున్న గంజివల్ల బట్టలు మరింత అందంగా ఉంటాయంటారు వస్త్ర నిపుణులు. అంతేకాదు.. ఆరు రకాలుగా గంజిని తయారు చేసుకోవచ్చని కూడా చెబుతున్నారు. ఇవే ఆ ఆరు రకాలు... మొక్కజొన్న పిండిని చల్లని నీటిలో వేసి కలిపి బాగా మరిగించాలి. ఇందులో ముంచి ఆరబెడితే కాటన్ దుస్తులు చక్కగా ఫెళఫెళలాడతాయి. బంగాళాదుంప ఆరోగ్యానికి ఎంత మంచిదో, కాటన్ దుస్తులకూ అంతే మంచిది. బంగాళాదుంపలను శుభ్రంగా కడిగి, నీటిలో వేసి ఉడికించాలి. ఆ నీటిని రాత్రంతా ఉంచి, ఉదయం లేచాక వడగట్టుకుని బట్టలకు పెట్టాలి. అన్నం ఉడికించిన నీటిని తీసుకుని, అందులో కొద్దిగా నీళ్లు కలిపితే మంచి గంజి తయారవుతుంది. ఆరోగ్యాన్ని ఇనుమడింపజేసే కూరగాయలు, కాటన్ దుస్తుల అందాన్నీ ఇనుమడింపజేస్తాయి. పచ్చి కూరగాయల్ని శుభ్రంగా కడిగి, నీటిలో వేసి ఉడికించాలి. తర్వాత ఆ నీటిని వడపోసుకుని, అందులో బట్టల్ని ముంచి తీసి ఆరబెట్టాలి. చేమదుంపల్ని కెమికల్ ట్రీటెడ్ స్టార్చ్ తయారీలో ఉపయోగిస్తుంటారు. కాబట్టి దీనితో కూడా మనం గంజి చేసుకోవచ్చు. ముందుగా వీటిని చెక్కి, మెత్తగా రుబ్బి, కాసిన్ని నీళ్లుపోసి మరిగించాలి. తర్వాత దాన్ని వడగట్టి బట్టలకు పట్టించాలి.అన్నం ఉడికించిన నీళ్లు గంజిలా ఉపయోగపడినట్టే... గోధుమల్ని ఉడికించిన నీళ్లు కూడా గంజిలాగా ఉపయోగపడతాయి. కాబట్టి అలా ప్రయత్నించినా ఫర్వాలేదు. గమనిక: ఏ గంజి అయినాగానీ... చల్లారిన తర్వాతే దుస్తులకు పెట్టాలి తప్ప వేడిగా ఉన్నప్పుడు పెట్టకూడదు. -
వాతావరణ మార్పులతో వచ్చే సమస్యలు
హోమియో చికిత్స క్రమంగా వేసవి వస్తోంది. పగటి వేళల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉన్నా రాత్రుళ్లు మాత్రం ఇంకా చలి పూర్తిగా తగ్గలేదు. ఇలాంటి సంధి దశలో కొన్ని రకాల అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. పగటివేళల్లో వేడి వల్ల దగ్గు వస్తుంది. అలాగే రాత్రివేళల్లో చలివల్ల తేమ పెరుగుతుంది. ఈ రెండు అంశాలూ అలర్జీ, ఆస్తమా లాంటి జబ్బులకు దారితీసే అవకాశం ఉంది. ఎందుకంటే పైన పేర్కొన్న దుమ్ము, రాత్రివేళల్లోని నెమ్ము ఈ రెండూ అలర్జీ, ఆస్తమాలకు ట్రిగరింగ్ ఫాక్టర్లే. దాంతో అలర్జీ, ఆస్తమా వంటి వ్యాధులతో బాధపడేవారికి ఈ వాతావరణం ప్రతికూలంగా పరిణమిస్తుంది. దుమ్ము, నెమ్ములకు ఎక్స్పోజ్ అయినప్పుడు ఏ చిన్నపని చేసినా ఆయాసపడటం, అలసిపోవడం, ముక్కులు బిగుతుగా మారడం, శ్వాసతీసుకుంటున్నప్పుడు పిల్లి కూతలు వినిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు పదేపదే పునరావృతం కావడం వల్ల రోగిలో వ్యాధినిరోధకత తగ్గుతుంది. ఫలితంగా ఇతర ఇన్ఫెక్షన్లూ తేలికగా సోకే అవకాశం ఉంది. అంతేకాదు... ఊపిరితిత్తులు సైతం వాటి సాగే గుణాన్ని, పనిచేసే సామర్థ్యాన్ని కోల్పోతాయి. ఒక్కోసారి బ్రాంకైటిస్, న్యుమోనియా వంటి ఒకింత ప్రమాదకరమైన పరిస్థితులకూ దారితీయవచ్చు. అలర్జీలు, ఆస్తమా అనేవి సాధారణంగా కొందరిలో పుట్టుకతోనే వస్తాయి. మరికొందరికి పెరిగాక వాతావరణంలోని దుమ్మూధూళి సరిపడక రావచ్చు. ఈ తరహా రుగ్మతలను హోమియో వైద్యచికిత్సా విధానం ద్వారా తేలిగ్గా తగ్గించవచ్చు. లక్షణాలను బట్టి వాటికి వాడాల్సిన మందులివి... యాంట్ టార్ట్ : జలుబు, దగ్గు, కొన్నిసార్లు దగ్గుతో కఫం ఉండటం, ఎంత ప్రయత్నించినా బయటకు రాకపోవడం వంటి లక్షణాలకు. ఆర్స్ ఆల్బ్ : దుమ్ములోకి వెళ్లినప్పుడు తుమ్ములు రావడం, ముక్కులు మూసుకుపోవడం, తుమ్ములతో పాటు ముక్కుల నుంచి నీళ్లు కారడం వంటి లక్షణాలకు, అలాగే వెన్నుపై పడుకుంటే ఉబ్బసం ఎక్కువైనప్పుడు. హెపార్‌సల్ఫ్ : చాలా చలిగా అనిపిస్తుంటే. చలిని ఏమాత్రం తట్టుకోలేక పోతుంటే. చల్లని-పొడి వాతావరణంలో ఆస్తమా వస్తుంటే. కూర్చుని తలవాల్చి పడుకున్నప్పుడు మాత్రమే ఉపశమనం లభిస్తుంటే. సోరియమ్ : ఎండాకాలంలోనూ దుప్పటి కప్పుకుని కూర్చోవాలనిిపిస్తుంటే. ప్రతి చలికాలంలోనూ ఆయాసం వస్తుంటే. నేట్రమ్ సల్ఫ్ : నేలమాళిగలు, సెలార్స్లో ఉండేవాళ్లకు జలుబు, దగ్గు వంటి లక్షణాలు కనిపించినప్పుడు. కఫం పచ్చరంగులో ఉన్నప్పుడు. దగ్గు ఎక్కువగా ఉండి, ఛాతీని పట్టుకుని దగ్గుతున్నప్పుడు. ఫాస్ : మెత్తటి స్వభావం, ఊరికే సాయం చేసే గుణం ఉన్నప్పుడు. క్షయ వ్యాధి ఉన్నా కూడా. రోడో : వర్షం ముందుగా లక్షణాలు కనిపిస్తూ రోగిలో మార్పులు వస్తుంటే, మెరుపులంటే భయం భయంగా ఉంటుంటే. కాలీ సల్ఫ్: ముక్కుదిబ్బడ, సైనసైటిస్ తోపాటు, ఆయాసం ఎక్కువగా ఉంటే. మెర్క్‌సాల్ : ఒంట్లో చురుగ్గా లేనప్పుడు, అపనమ్మకంగా ఉన్నప్పుడు, పట్టుదల కోల్పోతే, కుడివైపు తిరిగి నిద్రపోలేనప్పుడు, కఫం పచ్చగా పడుతుంటే... ఈ మందులు వాడవచ్చు. -
కొత్త బోర్లొద్దు..
భూగర్భ నీటి వినియోగానికి పరిమితి 194 గ్రామాల్లో కొత్త బోర్ల నిషేధం త్వరలో అమలులోకి రానున్న విధానం హన్మకొండ : వేసవి రాకముందే కష్టాలు మొదలయ్యూరుు. జిల్లాలో భూగర్భ నీటిమట్టం ప్రమాదకర స్థారుుకి చేరింది. దీంతో అందుబాటులో ఉన్న భూగర్భ నీటి నిల్వలకంటే ఇక్కడ వినియోగం ఎక్కువగా ఉండడంతో కొత్త బోర్లు వేయడాన్ని నిషేధించనున్నారు. ఈ మేరకు భూగర్భ నీటిమట్టం అంచనా కమిటీ(గ్రౌండ్ వాటర్ ఎస్టిమేషన్ కమిటీ, జీడబ్ల్యూఈసీ)కి సిఫార్సులు అందాయి. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయి. ఎక్కువైతే నిషేధమే భూగర్భ జల నిల్వల కంటే నీటి వినియోగం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను దేశవ్యాప్తంగా గుర్తిస్తున్నారు. ఒక ప్రాంతంలో కురుస్తున్న సగటు వర్షపాతం ఆధారంగా ఆ ప్రాంతంలో ఉండే భూగర్భ నీటిమట్టం, అక్కడి నీటి వినియోగం తదితర సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని గ్రౌండ్ వాటర్ ఎస్టిమేట్ కమిటీ సేకరిస్తోంది. దీని ఆధారంగా ప్రాంతాలవారీగా భూగర్భ జల నిల్వలను అంచనా వేస్తారు. సగటు భూగర్భజల నిల్వలకు మించి నీటి వినియోగం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొత్త బోర్లకు అనుమతి ఇవ్వడం వల్ల పాత బోర్లకు నీటి లభ్యత తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఫలితంగా ఆ ప్రాంతంలో నీటి లభ్యతలో అసమానతలు ఏర్పడే అవకాశం ఉంది. దీంతో అందుబాటులో ఉన్న భూగర్భ నిల్వల కంటే నీటి వినియోగం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో కొత్త బోర్లు వేయడాన్ని నిషేధించాలని జీడబ్ల్యూఈసీ నిర్ణయించింది. ఐదో వంతు ప్రాంతం కేంద్ర భూగర్భ నీటిమట్టం అంచనా కమిటీ సూచనల ప్రకారం జిల్లా భూగర్భ జల వనరుల శాఖ అధికారులు 2011-12లో జిల్లావ్యాప్తంగా మొదటి దశ సర్వే చేపట్టారు. ఆ తర్వాత ఈ సమాచారాన్ని ఆ ప్రాంతంలో కురిసే సగటు వర్షపాతం, అక్కడి నేల స్వభావం తదితర అంశాలతో పలుమార్లు క్రోడీకరించారు. తుది ఫలితాల్లో జిల్లావ్యాప్తంగా 194 గ్రామాల్లో నీటి వినియోగం ఎక్కువగా ఉన్నట్లుగా తేలింది. దీంతో గ్రౌండ్ వాటర్ ఎస్టిమేషన్ కమిటీ నిబంధనల ప్రకారం ఈ ప్రాంతాల్లో కొత్తగా వ్యవసాయ, గృహ, వాణిజ్య అవసరాలకు సంబంధించి కొత్త బోర్లు వేయడాన్ని నిషేధిస్తారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయి. జిల్లావ్యాప్తంగా 965 గ్రామ పంచాయతీలు ఉండగా.. వీటిలో 194 పంచాయతీలు ప్రమాదకర స్థాయిలో నీటి నిల్వలు తగ్గిపోయాయి. దాదాపుగా జిల్లాలో ఐదోవంతు ప్రాంతంలో కొత్త బోర్లు వేసేందుకు భవిష్యత్తులో అనుమతులు లభించవు. జనగామలో అత్యధికం జిల్లాలో జనగామ డివిజన్ తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతంగా పేరొందింది. ఇక్కడ చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు సైతం సకాలంతో రైతులకు అందుబాటులోకి రాలేదు. దీంతో ఈ డివిజన్ పరిధిలో రైతులు బోర్లపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. దీనికితోడు భూగర్భ నీటి వినియోగం పరిమితికి మించి తోడేస్తుండటంతో ఇక్కడ నీటి నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయి. జిల్లావ్యాప్తంగా 194 గ్రామాల్లో ప్రమాదకర స్థితిలో నీటి వినియోగం ఉందని గుర్తించగా.. వీటిలో 76 గ్రామాలు జనగామ రెవిన్యూ డివిజన్ పరిధిలోనే ఉన్నాయి. ముఖ్యంగా మద్దూరు మండలం పరిధిలో 20 గ్రామ పంచాయతీలు ఉండగా.. వీటిలో 18 గ్రామ పంచాయతీల్లో కొత్తగా బోర్లు వేయడాన్ని నిషేధించనున్నారు. వీటి తర్వాత జనగామ మండలంలో 12 గ్రామ పంచాయతీలు, బచ్చన్నపేట మండలంలో 11 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జిల్లాలో రెవిన్యూ డివిజన్లవారీగా ములుగు పరిధిలో 31, మహబూబాబాద్ పరిధిలో 23, వరంగల్ పరిధిలో 59, నర్సంపేట పరిధిలో 2 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. -
టార్గెట్ 140 మిలియన్ యూనిట్లు
వేసవి అవసరాలకు ప్రత్యామ్నాయాలు సిద్ధం చేయండి ట్రాన్స్‌కోను కోరిన తెలంగాణ సీఎం కార్యాలయం సాక్షి, హైదరాబాద్: రబీ, రానున్న వేసవి అవసరాల దృష్ట్యా తెలంగాణలో విద్యుత్తు కొరతను అధిగమించే ప్రత్యామ్నాయాలు సిద్ధం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ జెన్కోకు ఆదేశాలు జారీ చేసింది. నెల రోజులుగా రాష్ట్రంలో సగటున రోజుకు మూడు మిలియన్ యూనిట్ల (ఎంయూ) విద్యుత్తు కొరత నెలకొంది. చలి తీవ్రతతో విద్యుత్తు డిమాండ్ తక్కువగా ఉన్నందున ప్రస్తుతానికి ఇబ్బంది లేదని క్రమంగా పెరిగిపోనున్న అవసరాలకు అనుగుణంగా రోజుకు 140 మిలియన్ యూనిట్ల విద్యుత్తు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించింది. అవసరమైతే వివిధ ఏజెన్సీల నుంచి కొనుగోలు చేయాలని.. టెండర్లకు ముందుకొచ్చిన కంపెనీల నుంచి విద్యుత్తును సమకూర్చుకోవాలని.. ఇటీవల పలు సమీక్ష సమావేశాల్లో స్వయంగా సీఎం కేసీఆర్ జెన్కో, ట్రాన్స్‌కో అధికారులకు సూచించారు. కోతలు మితిమీరకుండా రబీకి విద్యుత్తు సరఫరా చేసేందుకు సిద్ధం చేసుకున్న ప్రణాళిక వివరాలను పంపాలని సీఎం కార్యాలయం ఇప్పటికే ట్రాన్స్‌కో, డిస్కంలకు లేఖ రాసింది. అప్పట్నుంచీ జెన్కో, ట్రాన్స్‌కో అధికారులు అంతమేరకు విద్యుత్తును సమకూర్చేందుకు కసరత్తు ముమ్మరం చేశారు. ప్రస్తుతం రోజుకు 128 ఎంయూల విద్యుత్తు అందుబాటులో ఉంది. రోజువారీ డిమాండ్, ఉత్పత్తి, సరఫరా నివేదికల ప్రకారం జనవరి 13న తెలంగాణ జెన్కో ద్వారా 40.53 ఎంయూల థర్మల్ విద్యుత్తు, 2.82 ఎంయూల జల విద్యుత్తు తెలంగాణకు సరఫరా అవుతోంది. మొత్తంగా 128.05 మిలియన్ యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో లోటును పూడ్చుకునేందుకు ట్రాన్స్‌కో కసరత్తు ముమ్మరం చేసింది. ప్రాజెక్టుల్లో నీటి మట్టం గణనీయంగా పడిపోవటంతో జల విద్యుదుత్పత్తి అవకాశాలు అడుగంటాయి. నాగార్జునసాగర్ నుంచి గత నెల 8 నుంచే విద్యుదుత్పత్తి ఆగిపోయింది. కృష్ణా జలాలపై ఏపీ అభ్యంతరం తెలిపినప్పటికీ శ్రీశైలం ఎడమగట్టు నుంచి వీలైనంత విద్యుత్తు ఉత్పత్తి చేసింది. నీటి మట్టం తగ్గకుండా రివర్స్ పంపింగ్‌ను విద్యుదుత్పత్తికి వినియోగించింది. ప్రస్తుతం అక్కడ రోజువారీ ఉత్పత్తి రెండు ఎంయూలకు మించటం లేదు. అత్యవసర సందర్భాల్లో తప్ప శ్రీశైలం నుంచి విద్యుదుత్పత్తి చేసుకునే అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో వేసవి ముగిసేంత వరకు థర్మల్, సంప్రదాయేతర ఇంధన వనరులపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. అందుకే సౌర, థర్మల్ విద్యుత్తు కొనుగోలు టెండర్లపై ట్రాన్స్‌కో ఆశలు పెంచుకుంది. వీలైనంత తొందరగా విద్యుత్ సరఫరా చేసే కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవాలని యోచిస్తోంది. -
ప్రాణాలు పోతున్నా..పట్టించుకోరా...
సాక్షి, హన్మకొండ: ఒక్కరు.. ఇద్దరు కాదు... వారం రోజుల వ్యవధిలో సుమారు 12 మంది చిన్నారులు నీటిలో మునిగి చనిపోయారు. వేసవిలో ఈత కొట్టాలన్న సరదా వారి నూరేళ్ల జీవితాన్ని నీట ముంచడమే కాకుండా కన్నవారి ప్రేమను కన్నీటి పాలు చేస్తోంది. వారం రోజులుగా జిల్లాలోని ఏదో ఒక ప్రాంతంలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీళ్లలో పడి పిల్లలు చనిపోతున్న దుర్ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తల్లిదండ్రుల కళ్ల నుంచి కన్నీటి వరద పారుతోంది. అయినప్పటికీ జిల్లా యంత్రాంగంలో చిన్నపాటి కదలిక కూడా లేదు. రోజుకో ఇంటిదీపం ఆరిపోతున్నా... పట్టించుకున్న పాపన పోవట్లేదు. చెరువుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, చెరువుల్లో ఈత కొట్టకుండా కాపలా కాసేందుకు తాత్కలికంగా ఓ వ్యక్తిని నియమించే ఆలోచన చేయడం లేదు. రోజుకో మరణం సంభవిస్తున్నా... జిల్లా యంత్రాంగం, నీటిపారుదల శాఖ పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నారుు. ప్రాణాలు తీస్తున్న ‘ఉపాధి’ గుంతలు ఉపాధి హామీ పథకంలో భాగంగా చెరువుల్లో చేపట్టిన పూడికతీత చిన్న పిల్లల పాలిట శాపంగా మారింది. సాధారణంగా చెరువు గట్టు నుంచి లోపలి వైపుకు ఏటవాలు పద్ధతిలో పూడిక తీస్తూ వెళితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. చెరువు సహజ స్వభావం, స్వరూపం దెబ్బతినదు. కానీ... కూలీలకు కూలీ గిట్టేందుకు ఈ పద్ధతిని పాటించ లేదు. రికార్డుల్లో లెక్క సరిగా కనిపించేందుకు లోతు, పొడవు, వెడల్పు పద్ధతిలో తీయడం వల్ల చెరువులు సహజ స్వభావాన్ని కోల్పోయి గుంతలమయంగా మారాయి. దీంతో చెరువులో ఎక్కడ గుంత ఉంది... ఎక్కడ మెరక ప్రాంతం ఉంది అనేది గుర్తించలేని పరిస్థితి నెలకొంది. పైగా ఉపాధి హామీ పనులను చెరువుల్లో నీరు లేని సమయంలో చేపట్టారు. తర్వాత వర్షాలకు చెరువుల గుంతల్లోకి నీరు చేరుకుంది. ప్రస్తుతం వేసవి కావడం, సెలవులు ఉండడం వల్ల పిల్లలు చెరువుల్లో స్నానాలు చేసేందుకు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. చెరువులో ఏ ప్రాంతంలో ఎక్కడ గుంత ఉన్న విషయం తెలియకపోవడంతో నీటిలో దిగిన చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. పట్టించుకోని గ్రామ పంచాయతీలు వేసవిలో చెరువుల్లో దిగి చిన్నారులు ప్రాణాలు పోగొట్టుకుంటున్న నేపథ్యంలో తగిన జాగ్రత్త చర్యలు చేపట్టాల్సిన గ్రామ పంచాయతీ సిబ్బంది మిన్నకుండిపోయూరు. ఉపాధి హామీ పథకం పనులు గ్రామ పంచాయతీల అధ్వర్యంలోనే జరుగుతున్నాయి. చెరువుల్లో ఎక్కడ.. ఎంత మట్టి తీసిన విషయం ఆయా పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్లకు తెలుసు. ఎక్కడ గుంతలు ఉన్నయో తెలిపే బోర్టులు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత వారిపై ఉంది. అదేవిధంగా వేసవిలో చెరువుల పర్యవేక్షణ కోసం తాత్కాలిక ప్రతిపాదికన సిబ్బంది నియమించడం ద్వారా చెరువుల్లో ఈత కొట్టేందుకు వచ్చే వారిని నివారించే అవకాశం ఉంది. కానీ.. ఇప్పటివరకు అటువంటి చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. అదే దారిలో అధికార యంత్రాంగం వారం రోజులుగా పిల్లల ప్రాణాలు పిట్టల్లా రాలుతున్నా... జిల్లా యంత్రాంగం పట్టించుకున్న పాపానపోలేదు. కేసముద్రం మండలంలో ఆదివారం ముగ్గురు పిల్లలు చెరువులో పడి మృతిచెందిన ఘటన మరచిపోకముందే... నర్సింహులపేట మండలంలో సోమవారం ఇద్దరు పిల్లలు బావి నీళ్లలో మునిగి చనిపోయారు. అరుునప్పటికీ ప్రభుత్వం తరఫున పైస్థాయి అధికారులు స్పందించలేదు. ఒక్క ఆత్మకూరు పరిధిలో మాత్రమే పోలీస్ శాఖ స్పందించింది. పిల్లలు ఈతకు వెళ్లకుండా.. తల్లిదండ్రులు జాగ్రత్త వహించేలా దండోరా వేయాలని మండల పరిధిలోని గ్రామసర్పంచ్‌లకు సలహా ఇచ్చారు. అదేవిధంగా చెరువులు, బావుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని గ్రామ రెవెన్యూ సహాయకులకు సూచించారు. అదేవిధంగా తమ శాఖ తరఫున ప్రత్యేక పెట్రోలింగ్ చేపట్టారు. ఈ మేరకు అన్ని మండలాల్లో చర్యలు చేపడితే కొంతమేర ఫలితం ఉండే అవకాశముంది.