టార్గెట్ 140 మిలియన్ యూనిట్లు
- వేసవి అవసరాలకు ప్రత్యామ్నాయాలు సిద్ధం చేయండి
- ట్రాన్స్‌కోను కోరిన తెలంగాణ సీఎం కార్యాలయం
సాక్షి, హైదరాబాద్: రబీ, రానున్న వేసవి అవసరాల దృష్ట్యా తెలంగాణలో విద్యుత్తు కొరతను అధిగమించే ప్రత్యామ్నాయాలు సిద్ధం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ జెన్‌కోకు ఆదేశాలు జారీ చేసింది. నెల రోజులుగా రాష్ట్రంలో సగటున రోజుకు మూడు మిలియన్ యూనిట్ల (ఎంయూ) విద్యుత్తు కొరత నెలకొంది. చలి తీవ్రతతో విద్యుత్తు డిమాండ్ తక్కువగా ఉన్నందున ప్రస్తుతానికి ఇబ్బంది లేదని క్రమంగా పెరిగిపోనున్న అవసరాలకు అనుగుణంగా రోజుకు 140 మిలియన్ యూనిట్ల విద్యుత్తు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించింది.
అవసరమైతే వివిధ ఏజెన్సీల నుంచి కొనుగోలు చేయాలని.. టెండర్లకు ముందుకొచ్చిన కంపెనీల నుంచి విద్యుత్తును సమకూర్చుకోవాలని.. ఇటీవల పలు సమీక్ష సమావేశాల్లో స్వయంగా సీఎం కేసీఆర్ జెన్‌కో, ట్రాన్స్‌కో అధికారులకు సూచించారు. కోతలు మితిమీరకుండా రబీకి విద్యుత్తు సరఫరా చేసేందుకు సిద్ధం చేసుకున్న ప్రణాళిక వివరాలను పంపాలని సీఎం కార్యాలయం ఇప్పటికే ట్రాన్స్‌కో, డిస్కంలకు లేఖ రాసింది. అప్పట్నుంచీ జెన్‌కో, ట్రాన్స్‌కో అధికారులు అంతమేరకు విద్యుత్తును సమకూర్చేందుకు కసరత్తు ముమ్మరం చేశారు.
ప్రస్తుతం రోజుకు 128 ఎంయూల విద్యుత్తు అందుబాటులో ఉంది. రోజువారీ డిమాండ్, ఉత్పత్తి, సరఫరా నివేదికల ప్రకారం జనవరి 13న తెలంగాణ జెన్‌కో ద్వారా 40.53 ఎంయూల థర్మల్ విద్యుత్తు, 2.82 ఎంయూల జల విద్యుత్తు తెలంగాణకు సరఫరా అవుతోంది. మొత్తంగా 128.05 మిలియన్ యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో లోటును పూడ్చుకునేందుకు ట్రాన్స్‌కో కసరత్తు ముమ్మరం చేసింది. ప్రాజెక్టుల్లో నీటి మట్టం గణనీయంగా పడిపోవటంతో జల విద్యుదుత్పత్తి అవకాశాలు అడుగంటాయి.
నాగార్జునసాగర్ నుంచి గత నెల 8 నుంచే విద్యుదుత్పత్తి ఆగిపోయింది. కృష్ణా జలాలపై ఏపీ అభ్యంతరం తెలిపినప్పటికీ శ్రీశైలం ఎడమగట్టు నుంచి వీలైనంత విద్యుత్తు ఉత్పత్తి చేసింది. నీటి మట్టం తగ్గకుండా రివర్స్ పంపింగ్‌ను విద్యుదుత్పత్తికి వినియోగించింది. ప్రస్తుతం అక్కడ రోజువారీ ఉత్పత్తి రెండు ఎంయూలకు మించటం లేదు.
అత్యవసర సందర్భాల్లో తప్ప శ్రీశైలం నుంచి విద్యుదుత్పత్తి చేసుకునే అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో వేసవి ముగిసేంత వరకు థర్మల్, సంప్రదాయేతర ఇంధన వనరులపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. అందుకే సౌర, థర్మల్ విద్యుత్తు కొనుగోలు టెండర్లపై ట్రాన్స్‌కో ఆశలు పెంచుకుంది. వీలైనంత తొందరగా విద్యుత్ సరఫరా చేసే కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవాలని యోచిస్తోంది.