ఉక్కకోత
- ఉద్యోగుల సమ్మె ఎఫెక్ట్..
- ఎడాపెడా విద్యుత్ కోత
- సరఫరా తగ్గి.. పలుచోట్ల ‘కట్’కట
సాక్షి, సిటీబ్యూరో: విద్యుత్ ఉద్యోగుల మెరుపు సమ్మె సోమవారం నగరవాసులకు పట్టపగలే చుక్కలు చూపింది. ఒకపక్క కరెంట్ కోత.. మరోపక్క ఉక్కపోత ముచ్చెమటలు పట్టించాయి. ఎన్టీపీఎస్, కేటీపీఎస్, రాయలసీమ, శ్రీశైలం తదితర విద్యుత్ కేంద్రాల్లో ఉద్యోగుల సమ్మెతో ఉత్పత్తి నిలిచిపోవడంతో ఆయా కేంద్రాల నుంచి నగరానికి సరఫరా కావాల్సిన విద్యుత్‌పై కోత పడింది. ప్రస్తుతం నగరవాసుల అవసరాలకు రోజుకు సగటున 48-50 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం.
ప్రస్తుతం ఇది 42 మిలియన్ యూనిట్లకు పడిపోయింది. సరఫరా- డిమాండ్ మధ్య భారీ వ్యత్యాసం నమో దు కావడంతో సోమవారం ఎడాపెడా కోతలు విధించారు. పలుచోట్ల ఏకధాటిగా మూడు గంటల పాటు విద్యుత్ జాడలేకుండా పోయిం ది. కొన్నిచోట్ల అరగంటకోసారి వస్తూ, పోతూ ఇబ్బంది పెట్టింది.
ఎప్పుడొస్తుందో, పోతుం దో తెలియని విద్యుత్‌తో ఫ్యాన్లు తిరగక, ఏసీలు, కూలర్లు పని చేయక నగరవాసులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు. కాగా, 1104, 327 యూనియన్ నాయకులు మింట్ కాంపౌండ్‌లోని సీపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం సహా, సీజీఎం, ఇతర కార్యాలయాల్లోకి ఉద్యోగులు వెళ్లకుండా అడ్డుకున్నారు. కార్యాలయాల ప్రధాన గేట్లకు తాళాలు వేసి, బైఠాయించడంతో ఉద్రిక్తత నెలకొంది.