మృతుడు కరుణాకర్(ఫైల్)
సాక్షి, అనంతపురం(కూడేరు): విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారింది. చాలా ప్రాంతాల్లో విద్యుత్ తీగలు యమపాశాల్లా తెగిపడుతున్నాయి. వీటి బారిన పడి ఇప్పటికే చాలా మంది మృతి చెందారు. పలువురు అంగవైకల్యంతో బాధపడుతున్నారు. అయినా విద్యుత్ శాఖ అధికారుల్లో మార్పు రాలేదు. అదే నిర్లక్ష్యం... అదే ఉదాసీనత. తాజాగా విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి కూడేరులో ఓ యువరైతు కరెంటు తీగకు బలయ్యాడు.
తండ్రికి చేదోడుగా..
కూడేరు మండలం గొటుకూరుకు చెందిన బోయ నల్లప్ప, ఓబుళమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో మొదటి కుమారుడు కేశవయ్య గ్రామంలోనే ఉంటూ తండ్రితో పాటు వ్యవసాయ పనులు చేస్తున్నాడు. రెండో కుమారుడు కరుణాకర్ (22) బీటెక్ ద్వితీయ సంవత్సరంతో చదువు మానేసి తండ్రికి చేదోడుగా వ్యవసాయ పనులు చేపట్టాడు.
పుట్టిన రోజే మృత్యు గీతిక
ఈ నెల 4న తన పుట్టిన రోజు కావడంతో వేకువజామునే కరుణాకర్ నిద్రలేచాడు. ‘అమ్మా! ఈ రోజు నా పుట్టిన రోజు. ఏదైనా స్పెషల్ చేసిపెట్టు’ అంటూ తల్లిని అడిగిన కరుణాకర్.. అనంతరం పంటకు నీరు పెట్టి వస్తానంటూ తండ్రితో చెప్పి ద్విచక్ర వాహనంపై పొలానికి బయలుదేరాడు. అప్పటికే ఆ మార్గంలో 11కేవీ విద్యుత్ తీగ తెగి పడి ఉంది. ఈ విషయాన్ని గమనించిన మరో రైతు ప్రతాపరెడ్డి.. వెంటనే ఫోన్ ద్వారా విద్యుత్ శాఖ అధికారులను అప్రమత్తం చేశాడు.
అనంతరం అటుగా ఎవరైనా వచ్చి ప్రమాదం బారిన పడుతారని భావించిన ఆయన కాసేపు అక్కడే నిలబడ్డాడు. అదే సమయంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న కరుణాకర్‌ను చూసి కేకలు వేసి అప్రమత్తం చేసేందుకు ప్రయత్నించాడు. అప్పటికే సమయం మించి పోయింది. రోడ్డుకు అడ్డుగా వేలాడుతున్న విద్యుత్ తీగ నేరుగా కరుణాకర్‌ను తాకడంతో అతను కుప్పకూలాడు. ఉపశమన చర్యలు చేపట్టే లోపు మృతి చెందాడు.
త్వరగా వస్తానంటివి కదయ్యా..
‘పుట్టిన రోజును స్నేహితుల మధ్య జరుపుకోవాలని సరదా పడితివి. ఏదైనా స్పెషల్ చేసి పెట్టు, త్వరగా వస్తానంటవి. ఇంతలోనే ఎంత పనైంది దేవుడా!’ అంటూ కరుణాకర్ మృతదేహంపై పడి తల్లి ఓబుళమ్మ, తండ్రి నల్లప్ప బోరున విలపించారు. ‘పుట్టిన రోజే ఇలా చేశావేమయ్యా’ అంటూ గుండెలవిసేలా రోదించారు.
మృతదేహంతో రాస్తారోకో
విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లనే కరుణాకర్ మృతి చెందాడంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. కరుణాకర్ మృతదేహాన్ని జాతీయ రహదారిపైకి చేర్చి రాస్తారోకో చేపట్టారు. దీంతో వాహన రాకపోకలు స్తంభించాయి. విషయం తెలుసుకున్న సీఐ శేఖర్, ఎస్‌ఐ సత్యనారాయణ అక్కడకు చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. విద్యుత్ శాఖ అధికారులు సకాలంలో స్పందించి ఉంటే ప్రాణాలు పోయేవి కావని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేకూరేవరకూ ఆందోళన విరమించబోమని భీష్మించారు. దీంతో విద్యుత్ శాఖ అధికారులతో పోలీసు అధికారులు ఫోన్‌లో మాట్లాడారు. విద్యుత్ శాఖ ఏఈ సెలవులో ఉన్నారని తెలియడంతో ఆందోళనకారులతో చర్చించి న్యాయం చేకూరుస్తామంటూ భరోసానిచ్చారు. దీంతో గ్రామస్తులు ఆందోళనను విరమించారు.
ఆర్థిక సాయం అందజేస్తాం
కరుణాకర్ మృతిపై విద్యుత్ శాఖ ఏఈ రాజేష్ మాట్లాడుతూ.. జరిగిన ఘటనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామన్నారు. మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తానని పేర్కొన్నారు.
విద్యుదాఘాతంతో కౌలురైతు...
ఉరవకొండ: విద్యుత్ షాక్‌కు గురై ఓ కౌలురైతు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... ఉరవకొండ మండలం నింబగల్లుకు చెందిన నరసింహులు, భీమక్క దంపతుల కుమారుడు మారుతి (21) వ్యవసాయ పనులతో జీవనం సాగిస్తున్నాడు. గ్రామానికి చెందిన మరో రైతు వద్ద ఐదు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని తన తండ్రితో కలసి మిర్చి పంట సాగు చేపట్టాడు.
మంగళవారం ఉదయం పంటకు నీరు పెట్టేందుకు వెళ్లిన మారుతి... స్టార్టర్ బాక్స్ వద్ద స్విచ్ ఆన్ చేస్తుండగా విద్యుత్‌షాక్‌కు గురై కుప్పకూలాడు. గమనించిన చుట్టుపక్కల పొలాల్లోని రైతులు వెంటనే మారుతిని 108 అంబులెన్స్ ద్వారా ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై ఉరవకొండ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment