సాక్షి, హన్మకొండ: ఒక్కరు.. ఇద్దరు కాదు... వారం రోజుల వ్యవధిలో సుమారు 12 మంది చిన్నారులు నీటిలో మునిగి చనిపోయారు. వేసవిలో ఈత కొట్టాలన్న సరదా వారి నూరేళ్ల జీవితాన్ని నీట ముంచడమే కాకుండా కన్నవారి ప్రేమను కన్నీటి పాలు చేస్తోంది. వారం రోజులుగా జిల్లాలోని ఏదో ఒక ప్రాంతంలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీళ్లలో పడి పిల్లలు చనిపోతున్న దుర్ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
తల్లిదండ్రుల కళ్ల నుంచి కన్నీటి వరద పారుతోంది. అయినప్పటికీ జిల్లా యంత్రాంగంలో చిన్నపాటి కదలిక కూడా లేదు. రోజుకో ఇంటిదీపం ఆరిపోతున్నా... పట్టించుకున్న పాపన పోవట్లేదు. చెరువుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, చెరువుల్లో ఈత కొట్టకుండా కాపలా కాసేందుకు తాత్కలికంగా ఓ వ్యక్తిని నియమించే ఆలోచన చేయడం లేదు. రోజుకో మరణం సంభవిస్తున్నా... జిల్లా యంత్రాంగం, నీటిపారుదల శాఖ పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నారుు.
ప్రాణాలు తీస్తున్న ‘ఉపాధి’ గుంతలు
ఉపాధి హామీ పథకంలో భాగంగా చెరువుల్లో చేపట్టిన పూడికతీత చిన్న పిల్లల పాలిట శాపంగా మారింది. సాధారణంగా చెరువు గట్టు నుంచి లోపలి వైపుకు ఏటవాలు పద్ధతిలో పూడిక తీస్తూ వెళితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. చెరువు సహజ స్వభావం, స్వరూపం దెబ్బతినదు. కానీ... కూలీలకు కూలీ గిట్టేందుకు ఈ పద్ధతిని పాటించ లేదు. రికార్డుల్లో లెక్క సరిగా కనిపించేందుకు లోతు, పొడవు, వెడల్పు పద్ధతిలో తీయడం వల్ల చెరువులు సహజ స్వభావాన్ని కోల్పోయి గుంతలమయంగా మారాయి.
దీంతో చెరువులో ఎక్కడ గుంత ఉంది... ఎక్కడ మెరక ప్రాంతం ఉంది అనేది గుర్తించలేని పరిస్థితి నెలకొంది. పైగా ఉపాధి హామీ పనులను చెరువుల్లో నీరు లేని సమయంలో చేపట్టారు. తర్వాత వర్షాలకు చెరువుల గుంతల్లోకి నీరు చేరుకుంది. ప్రస్తుతం వేసవి కావడం, సెలవులు ఉండడం వల్ల పిల్లలు చెరువుల్లో స్నానాలు చేసేందుకు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. చెరువులో ఏ ప్రాంతంలో ఎక్కడ గుంత ఉన్న విషయం తెలియకపోవడంతో నీటిలో దిగిన చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు.
పట్టించుకోని గ్రామ పంచాయతీలు
వేసవిలో చెరువుల్లో దిగి చిన్నారులు ప్రాణాలు పోగొట్టుకుంటున్న నేపథ్యంలో తగిన జాగ్రత్త చర్యలు చేపట్టాల్సిన గ్రామ పంచాయతీ సిబ్బంది మిన్నకుండిపోయూరు. ఉపాధి హామీ పథకం పనులు గ్రామ పంచాయతీల అధ్వర్యంలోనే జరుగుతున్నాయి. చెరువుల్లో ఎక్కడ.. ఎంత మట్టి తీసిన విషయం ఆయా పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్లకు తెలుసు. ఎక్కడ గుంతలు ఉన్నయో తెలిపే బోర్టులు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత వారిపై ఉంది. అదేవిధంగా వేసవిలో చెరువుల పర్యవేక్షణ కోసం తాత్కాలిక ప్రతిపాదికన సిబ్బంది నియమించడం ద్వారా చెరువుల్లో ఈత కొట్టేందుకు వచ్చే వారిని నివారించే అవకాశం ఉంది. కానీ.. ఇప్పటివరకు అటువంటి చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు.
అదే దారిలో అధికార యంత్రాంగం
వారం రోజులుగా పిల్లల ప్రాణాలు పిట్టల్లా రాలుతున్నా... జిల్లా యంత్రాంగం పట్టించుకున్న పాపానపోలేదు. కేసముద్రం మండలంలో ఆదివారం ముగ్గురు పిల్లలు చెరువులో పడి మృతిచెందిన ఘటన మరచిపోకముందే... నర్సింహులపేట మండలంలో సోమవారం ఇద్దరు పిల్లలు బావి నీళ్లలో మునిగి చనిపోయారు. అరుునప్పటికీ ప్రభుత్వం తరఫున పైస్థాయి అధికారులు స్పందించలేదు. ఒక్క ఆత్మకూరు పరిధిలో మాత్రమే పోలీస్ శాఖ స్పందించింది. పిల్లలు ఈతకు వెళ్లకుండా.. తల్లిదండ్రులు జాగ్రత్త వహించేలా దండోరా వేయాలని మండల పరిధిలోని గ్రామసర్పంచ్‌లకు సలహా ఇచ్చారు. అదేవిధంగా చెరువులు, బావుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని గ్రామ రెవెన్యూ సహాయకులకు సూచించారు. అదేవిధంగా తమ శాఖ తరఫున ప్రత్యేక పెట్రోలింగ్ చేపట్టారు. ఈ మేరకు అన్ని మండలాల్లో చర్యలు చేపడితే కొంతమేర ఫలితం ఉండే అవకాశముంది.
ప్రాణాలు పోతున్నా..పట్టించుకోరా...
Published Tue, May 27 2014 3:05 AM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM
Advertisement