Swimming fun
-
హోలీలో అపశ్రుతి
పుల్కల్(అందోల్): రెండు కుటుంబాల్లో హోలీ పండగ విషాదాన్ని నింపింది. ఇద్దరు విద్యార్థులు నదిలో నీట మునిగి దుర్మరణం పాలైన సంఘటన పుల్కల్ మండలం కొర్పోల్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కొర్పోల్ గ్రామానికి చెందిన కిషన్, మంజుల దంపతుల కొడుకు సాయికిరణ్, యాదయ్య, వీరమణి దంపతుల కొడుకు సాయికుమార్లు మధ్యాహ్నం వరకు హోలీ ఆడారు. అనంతరం వారిద్దరూ మరో ఐదుగురితో కలిసి స్నానానికని మంజీర నదికి వెళ్లారు. ఇందులో ఈత రాని ఐదుగురు నది ఒడ్డున స్నానం చేస్తున్నారు. ఈ క్రమంలో సాయికిరణ్, సాయికుమార్‌లతోపాటు మరో ఇద్దరు నీట మునగడాన్ని ఇంటర్ విద్యార్థి మల్లేశం గమనించాడు. వెంటనే నీట మనుగుతున్న ఇద్దరిని కాపాడి బయటకు తీశాడు. కానీ సాయికిరణ్, సాయికుమార్‌లను కాపాడేంత శక్తి లేకపోవడంతో గ్రామానికి చెందిన పలువురికి సమాచారం ఇచ్చాడు. కానీ అంతలోపే సాయికుమార్, సాయికిరణ్‌లు నీటిలో మునిగి దుర్మరణం పాలయ్యారు. మృతి చెందిన వారిద్దరూ 10వ తరగతి విద్యార్థులే. వీరి మృతి విషయం తెలుసుకున్న స్థానికులు మంజీర నదికి వెళ్లి వారి మృతదేహాలను బయటకు తీశారు. వెంటనే పుల్కల్ పోలీసులకు సమాచారం ఇవ్వగా ఏఎస్ఐ ప్రభాకర్ సంఘటన స్థలానికి చెరేకున్నారు. ఇద్దరూ ప్రాణ స్నేహితులే.. మంజీర నదిలో స్నానం చేయడం కోసం వెళ్లి మృతి చెందిన సాయికుమార్, సాయికిరణ్‌లు ఇద్దరూ ప్రాణస్నేహితులని తోటి విద్యార్థులు తెలిపారు. ఐదవ తరగతి నుంచి 10వ తరగతి వరకు కలిసి చదువుకుంటున్నారని, ఎప్పుడూ వారు కలిసే ఉండే వారన్నారు. ఇద్దరూ తల్లిదండ్రులకు ఒక్కగానొక్కరే.. సాయికుమార్, సాయికిరన్లు ఇద్దరు కూడా వారి తల్లిదండ్రులకు ఒక్కొక్కరే కావడంతో ఆ కుటుంబాల్లో విషాదం అలుముకుంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన సాయికుమార్ తండ్రి యాదయ్య ఆరేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. తల్లి వీరమణి కూలీ పని చేస్తూ తన కొడుకును చదివిస్తోంది. మరో విద్యార్థి సాయికిరణ్ సైతం వారి తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు. గ్రామంలో విషాదం.. అందరూ ఆనందోత్సాహాల మధ్య హోలీ వేడుకలు జరుపుకుంటుంటే ఆ గ్రామంలోని రెండు కుటుంబాల్లో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు విద్యార్థులు మృతి చెందడం గ్రామస్తులను కలచివేసింది. ఇదిలా ఉంటే ఇద్దరు విద్యార్థులు మంజీర నదిలోనే పడి మృతి చెందారని, వారికి పోస్టుమార్టం నిర్వహించవద్దని స్థానికులు పోలీసులకు మొరపెట్టుకున్నారు. కానీ స్థానికంగా నెలకొన్న పరిస్థితి దృష్ట్యా కేసు నమోదు చేశామని, పోస్టుమార్టం కోసం మృతదేహాలను జోగిపేట ఆస్పత్రికి తరలించామని ఏఎస్ఐ ప్రభాకర్ తెలిపారు. -
ఈతకెళ్లి ఇద్దరు బాలుర దుర్మరణం
సాక్షి, దావణగెరె: ఈత సరదా ఇద్దరు బాలుర ప్రాణాలు తీసింది. కర్ణాటకలోని దావణగెరె నగరానికి సమీపంలోని ఆవరగెరెలో ఈ సంఘటన మంగళవారం జరిగింది. ఈత కొట్టేందుకు ఆవరగెరెకు చెందిన గిరీష్(10), ధృవ(10)లు చెరువులోకి దిగారు. అయితే బురదలో చిక్కుకుని ఊపిరాడక మృత్యువాత పడ్డారు. విషయం తెలిసిన వెంటనే స్థానికులు చెరువు వద్దకు చేరుకున్నారు. చెరువులో గాలింపు జరిపి మృతదేహాలను వెలికితీసి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై విద్యానగర పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. -
బెస్తం చెరువులో విద్యార్థి గల్లంతు
క్షేమంగా బయటపడిన ముగ్గురు విద్యార్థులు శోకసంద్రంలో లెనిన్‌నగర్ మామునూరు : ఈత సరదాతో చెరువులోకి దిగిన ఓ విద్యార్థి ప్రమాదవశాత్తూ గల్లంతయ్యాడు. ఈ ఘటన హన్మకొండ మండలం తిమ్మాపురం గ్రామ పరిధిలోని బెస్తం చెరువులో గురువారం మధ్యాహ్నం జరిగింది. నాయుడు పెట్రోల్‌బంక్ కాలనీ ప్రాంతంలోని లెనిన్‌నగర్‌కు చెందిన ఇమ్మడి మొగిళి, ఆరుణ దంపతులు రెవెన్యూ కార్యాలయంలో అటెండర్లుగా ఉద్యోగం చేస్తున్నారు. వారికి కుమారుడు భవన్(16), కూతురు ఆకాంక్ష ఉన్నారు. రంగశాయిపేట ప్రభుత్వ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న వెల్పుగొండ వినీత్, పోలపాక టోని, రెపాక రోహిత్ కలిసి గురువారం ఉదయం వారి స్నేహితుడైన ఇమ్మడి భవన్ ఇంటికి వెళ్లారు. కొద్దిసేపు కబుర్లు చెప్పుకొని సరదాగా ఈత కొట్టేందుకు బెస్తం చెరువుకు వెళ్లారు. చెరువు అంచులోనే సరదాగా ఈత కొడుతున్నారు. వారిలో వినీత్‌కు కొద్దిదూరం వెళ్లగలిగేంత ఈత రాగా, మిగతావారికి ఈత రాదు. అనుకోకుండా ఒకరి చెప్పు నీళ్లలో కొద్దిదూరంలో పడిపోయింది. దానిని తీసుకొచ్చేందుకు వినీత్ వెళ్లాడు. అయితే అతడు నీటిలో మునుగుతుండడంతో ఇమ్మడి భవన్ అతడికి చేయి అందించబోయి నీటమునిగాడు. ఈలోగా వినీత్ ఒడ్డుకు చేరుకున్నాడు. ముగ్గురు ఒడ్డుకు చేరుకొని కేకలు వేయడంతో అక్కడే బతుకమ్మ మైదాన ఏర్పాట్లలో ఉన్న కార్మికులు వచ్చి నీళ్లలోకి దిగి వెతకగా జాడ తెలియలేదు. సమాచారం అందుకున్న లెనిన్‌నగర్ వాసులు చెరువు వద్దకు చేరుకుని బాలుడి కోసం నీళ్లలోకి దిగి గాలించారు. తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు. సీఐ పి.శ్రీనివాస్, ఎస్సై రాంప్రసాద్ ఘటన స్థలానికి చేరుకొని హెడ్‌కానిస్టేబుల్ సాంబయ్య, కానిస్టేబుల్ ప్రసాద్‌తో బాలుడి జాడ కోసం వెతికించారు. భవన్ స్నేహితులను ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
- బావిలో మునిగి బాలుడి మృతి - సూర్యాపేటలో ఘటన - మృతుడు హైదరాబాద్ వాసి - సూర్యాపేట మున్సిపాలిటీ ఈత సరదా ఓ బాలుడి ప్రాణం తీసింది. ఈ ఘటన సూర్యాపేట పట్టణంలో శుక్రవారం చోటుచేసుకుంది. మృతుడి బంధువులు, పోలీసులు తెలి పిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని రామచంద్రాపురం కాలనీకి చెం దిన శాస్త్రీ చంద్రం-రజిత దంపతులు పిల్లలతో కలిసి తన స్నేహితుడు సుతారపు సోమనర్సయ్య కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు ఈ నెల 5వ తేదీన సూర్యాపేట పట్టణంలోని మామిళ్లగడ్డకు వచ్చారు. 6వ తేదీన వివాహ వేడుకలో పాల్గొన్నారు. గురువారమే హైదరాబాద్ వెళ్లాల్సి ఉండగా బస్సులు నడవకపోవడంతో సూర్యాపేటలోనే ఆగిపోయారు. కాగా, శుక్రవారం ఉద యం చంద్రం కుమారుడు భానుప్రసాద్(14) తన స్నేహితులతో కలిసి ఇంది రమ్మ కాలనీలో గల బాపనబావి వద్దకు వెళ్లాడు. మిగతా స్నేహితులు ఈత కొ డుతుండడాన్ని చూసి భానుప్రసాద్ కూ డా బావిలోకి దిగాడు. అతడికి ఈత రా కపోవడంతో బావి నీటిలో మునిగి మృతిచెందాడు. భానుప్రసాద్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. కుమారుడు మృతిచెందాడన్న విషయం తెలుసుకుని తల్లిద్రండులు రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. మృతుడి తండ్రి చంద్రం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బాలుడి ప్రాణం తీసిన ఈత సరదా
ఫైర్ సిబ్బంది సాయంతో మృతదేహం వెలికితీత కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు వర్ధన్నపేట, న్యూస్‌లైన్ : ఈత సరదా ఓ బాలుడి ప్రాణం తీసింది. స్నేహితులతో ఈత కొట్టేందుకు వెళ్లిన ఓ బాలుడు బావిలో మునిగి మృతిచెందిన సంఘ టన మండల కేంద్రంలో శనివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. వర్ధన్నపేటకు చెందిన వల్లెపు వెంకటేశ్వర్లు, ఉపేంద్ర దంపతులకు కుమారుడు, కూతురు ఉన్నారు. కుమారుడు వంశీ(15) తన స్నేహితులైన బొంత సోమనాథం, వేణు ఇతర స్నేహితులతో కలిసి శనివారం ఉదయం 10 గంటలకు వర్ధన్నపేట శివారు కోనాపురం రోడ్డుకు ఆనుకుని ఉన్న బొంత యాకమల్లు వ్యవసాయ ఓడల బావిలో ఈతకు దిగాడు. ఈ క్రమంలో ఒడ్డు నుంచి వెళ్లి బావిలో దూకిన అతడు ఎంతకూ పైకి రాకపోవడంతో స్నేహితులు భయపడి పొరుగున ఉన్న రైతులను పిలిచారు. వారు ఎంత ప్రయత్నించినా బాలు డు దొరకకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వలలు, కొక్కెల సాయంతో ప్రయత్నించినా ఆచూకీ దొరకకపోవడంతో నీటిని తోడేందుకు రెండు విద్యుత్ మోటర్లను వినియోగించారు. సుమారు మూడు గంటల తర్వాత ఫైరింజన్, గజ ఈత గాళ్లను రప్పించి బావిలో నుంచి వంశీ మృతదేహాన్ని బయటకు తీశారు. ఒక్కగానొక్క కుమారుడి మృతితో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యూరు. ‘కొడుకా ఒక్కసారి మాట్లాడరా’ అంటూ తన ఒడిలోకి తీసుకుని తల్లి ముద్దులు పెడుతూ రోదించిన తీరును అందరిని కలచివేసింది. తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజయ్య, ఎస్సై రవీందర్ తెలిపారు. -
ప్రాణాలు పోతున్నా..పట్టించుకోరా...
సాక్షి, హన్మకొండ: ఒక్కరు.. ఇద్దరు కాదు... వారం రోజుల వ్యవధిలో సుమారు 12 మంది చిన్నారులు నీటిలో మునిగి చనిపోయారు. వేసవిలో ఈత కొట్టాలన్న సరదా వారి నూరేళ్ల జీవితాన్ని నీట ముంచడమే కాకుండా కన్నవారి ప్రేమను కన్నీటి పాలు చేస్తోంది. వారం రోజులుగా జిల్లాలోని ఏదో ఒక ప్రాంతంలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీళ్లలో పడి పిల్లలు చనిపోతున్న దుర్ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తల్లిదండ్రుల కళ్ల నుంచి కన్నీటి వరద పారుతోంది. అయినప్పటికీ జిల్లా యంత్రాంగంలో చిన్నపాటి కదలిక కూడా లేదు. రోజుకో ఇంటిదీపం ఆరిపోతున్నా... పట్టించుకున్న పాపన పోవట్లేదు. చెరువుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, చెరువుల్లో ఈత కొట్టకుండా కాపలా కాసేందుకు తాత్కలికంగా ఓ వ్యక్తిని నియమించే ఆలోచన చేయడం లేదు. రోజుకో మరణం సంభవిస్తున్నా... జిల్లా యంత్రాంగం, నీటిపారుదల శాఖ పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నారుు. ప్రాణాలు తీస్తున్న ‘ఉపాధి’ గుంతలు ఉపాధి హామీ పథకంలో భాగంగా చెరువుల్లో చేపట్టిన పూడికతీత చిన్న పిల్లల పాలిట శాపంగా మారింది. సాధారణంగా చెరువు గట్టు నుంచి లోపలి వైపుకు ఏటవాలు పద్ధతిలో పూడిక తీస్తూ వెళితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. చెరువు సహజ స్వభావం, స్వరూపం దెబ్బతినదు. కానీ... కూలీలకు కూలీ గిట్టేందుకు ఈ పద్ధతిని పాటించ లేదు. రికార్డుల్లో లెక్క సరిగా కనిపించేందుకు లోతు, పొడవు, వెడల్పు పద్ధతిలో తీయడం వల్ల చెరువులు సహజ స్వభావాన్ని కోల్పోయి గుంతలమయంగా మారాయి. దీంతో చెరువులో ఎక్కడ గుంత ఉంది... ఎక్కడ మెరక ప్రాంతం ఉంది అనేది గుర్తించలేని పరిస్థితి నెలకొంది. పైగా ఉపాధి హామీ పనులను చెరువుల్లో నీరు లేని సమయంలో చేపట్టారు. తర్వాత వర్షాలకు చెరువుల గుంతల్లోకి నీరు చేరుకుంది. ప్రస్తుతం వేసవి కావడం, సెలవులు ఉండడం వల్ల పిల్లలు చెరువుల్లో స్నానాలు చేసేందుకు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. చెరువులో ఏ ప్రాంతంలో ఎక్కడ గుంత ఉన్న విషయం తెలియకపోవడంతో నీటిలో దిగిన చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. పట్టించుకోని గ్రామ పంచాయతీలు వేసవిలో చెరువుల్లో దిగి చిన్నారులు ప్రాణాలు పోగొట్టుకుంటున్న నేపథ్యంలో తగిన జాగ్రత్త చర్యలు చేపట్టాల్సిన గ్రామ పంచాయతీ సిబ్బంది మిన్నకుండిపోయూరు. ఉపాధి హామీ పథకం పనులు గ్రామ పంచాయతీల అధ్వర్యంలోనే జరుగుతున్నాయి. చెరువుల్లో ఎక్కడ.. ఎంత మట్టి తీసిన విషయం ఆయా పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్లకు తెలుసు. ఎక్కడ గుంతలు ఉన్నయో తెలిపే బోర్టులు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత వారిపై ఉంది. అదేవిధంగా వేసవిలో చెరువుల పర్యవేక్షణ కోసం తాత్కాలిక ప్రతిపాదికన సిబ్బంది నియమించడం ద్వారా చెరువుల్లో ఈత కొట్టేందుకు వచ్చే వారిని నివారించే అవకాశం ఉంది. కానీ.. ఇప్పటివరకు అటువంటి చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. అదే దారిలో అధికార యంత్రాంగం వారం రోజులుగా పిల్లల ప్రాణాలు పిట్టల్లా రాలుతున్నా... జిల్లా యంత్రాంగం పట్టించుకున్న పాపానపోలేదు. కేసముద్రం మండలంలో ఆదివారం ముగ్గురు పిల్లలు చెరువులో పడి మృతిచెందిన ఘటన మరచిపోకముందే... నర్సింహులపేట మండలంలో సోమవారం ఇద్దరు పిల్లలు బావి నీళ్లలో మునిగి చనిపోయారు. అరుునప్పటికీ ప్రభుత్వం తరఫున పైస్థాయి అధికారులు స్పందించలేదు. ఒక్క ఆత్మకూరు పరిధిలో మాత్రమే పోలీస్ శాఖ స్పందించింది. పిల్లలు ఈతకు వెళ్లకుండా.. తల్లిదండ్రులు జాగ్రత్త వహించేలా దండోరా వేయాలని మండల పరిధిలోని గ్రామసర్పంచ్‌లకు సలహా ఇచ్చారు. అదేవిధంగా చెరువులు, బావుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని గ్రామ రెవెన్యూ సహాయకులకు సూచించారు. అదేవిధంగా తమ శాఖ తరఫున ప్రత్యేక పెట్రోలింగ్ చేపట్టారు. ఈ మేరకు అన్ని మండలాల్లో చర్యలు చేపడితే కొంతమేర ఫలితం ఉండే అవకాశముంది. -
కడుపు కోత
కేసముద్రం, న్యూస్‌లైన్ : సరదాగా ఈత పండ్ల కోసమని వెళ్లిన ముగ్గురు చిన్నారులు కొద్ది గంటల్లోనే విగతజీవులయ్యూరు. ఈత కొట్టేందు కు చెరువులో దిగి మృత్యు ఒడికి చేరారు. కనిపెంచిన తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు. ఈ హృదయవిదారక సంఘటన మండలంలోని రంగాపురం గ్రామశివారు రాజీవ్ నగర్ తండాలో ఆదివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం... రాజీవ్‌నగర్‌తండాకు చెందిన లకావత్ బావుసింగ్‌కు ఇద్దరు భార్యలు. పెద్ద భార్య లక్ష్మికి కుమార్తెలు శాంతి, కావేరి, సంధ్య(13) ఉండగా, చిన్నభార్య సాల్కికి కుమారులు సురేష్, తరుణ్(10) ఉన్నారు. ఉమ్మడి కుటుంబంలోనే కలిసిమెలిసి జీవనం సాగిస్తున్నారు. కాగా ఇదే తండాకు చెందిన దేవోజీ, చిలుకమ్మ దంపతుల కుమార్తె నీలకు ఇదే మండలం మహముద్‌పట్నం తండాకు చెందిన హరితో వివాహమైంది. ఆ దంపతులకు కుమార్తె శారద, కుమారులు సురేష్, నరేష్(9) ఉన్నారు. తన తల్లిదండ్రులు తిరుపతికి వెళుతుండడంతో వారిని సాగనంపేందుకు నీల శనివారం పుట్టింటికి వచ్చింది. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం బావుసింగ్ కుమార్తె సంధ్య, కుమారుడు తరుణ్ , నీల కుమారుడు నరేష్‌తోపాటు ఇదే తండాకు చెందిన భద్రు కుమారుడు రమేష్, కుమార్తె మౌనిక, గుగులోతు నంద కుమార్తె శిరీష కలిసి ఈత పండ్ల కోసం సమీపంలోని ఎదళ్ల చెరువు కట్ట మీదకు వెళ్లారు. అందరు కలిసి ఒక కవర్లో ఈత పండ్లను ఏరుకున్నారు. తిరిగి ఇంటికొస్తుండగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో చెరువులో ఈత కొడదామంటూ నీళ్లలోకి దిగా రు. ముందుగా తరుణ్, సంధ్య, నరేష్, శిరీష లోపలికి వెళ్లగా గుంత ఉండటంతో ఒక్కసారిగా మునిగిపోయారు. కొంతదూరం వెళ్లిన రమేష్, మౌనిక మునుగుతున్న మిత్రులను చూసి కేకలు పెట్టారు. ఇంతలో అటుగా బహిర్భూమికి వెళ్లిన దారావత్ వీరన్న వారిని గమనించి పరుగుపరుగున చెరువులో దూకాడు. అప్పటికే మునిగిపోయి అపస్మారక స్థితికి చేరుకున్న శిరీషను ఒడ్డుకు చేర్చాడు. అలాగే రమేష్, మౌనికను ఒడ్డుకు తీసుకొచ్చాడు. చెరువులో మునిగిపోయిన వారిని గాలించి బయటకు తీసుకొచ్చినప్పటికీ అప్పటికే తరుణ్, సంధ్య, నరేష్ ప్రాణాలు విడిచారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపిస్తూ సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతురాలు సంధ్య కేసముద్రంవిలేజ్లోని కస్తూర్భా పాఠశాలలో ఏడో తరగతి పూర్తి చేయగా, తరుణ్ ధన్నసరి గ్రామంలోని సెయింట్‌జాన్స్ స్కూల్లో 2వ తరగతి చదివాడు. నరేష్ మహముద్‌పట్నం తండాలోని మూడో తరగతి పూర్తి చేశాడు. తాత దగ్గరకుపోతనని వత్తివి కదరా.. మీ తాతను చూత్తానికి పోతనని గార్బం చేసి వత్తివి కదరా కొడుకా.. ఇప్పుడు మమ్మల్ని ఒక్కసారి సూడ్రా కొడుకా.. మమ్మల్ని వదిలిపెట్టి పోదానికే వచ్చినవారా కొడుకా.. అంటూ నరేష్ తండ్రి హరి కొడుకును ముద్దాడుతూ విల పించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. నా కొడుకుకు ఎండగొడతాందంటూ తల్లి తన చీరకొంగును కొడుకు శవం పై కప్పుతూ రోదించడం స్థానికులను కలచివేసింది. నాకెమయిందో తెల్వలే : శిరీష చెరువులో అందరితో కలిసి దిగిన.. ఒక్కసారే పెద్ద బొంద వచ్చింది. అందరం మునిగినం. ఏడుసుకుంటూ అరిసిన ం. నీళ్లన్ని మింగినంక నాకు ఏమైందో తెల్వలే. వీరన్న నన్ను బయటకు తీసి నా పొట్టమీద గట్టిగా వత్తిండు. మెలకువ వచ్చింది. నా దోస్తులు చచ్చిపోయిండ్రని తెల్వంగనే నాకు భయమైంది. మృతులంతా బంధువులే.. సంధ్య, తరుణ్ తండ్రి అయిన బావుసింగ్‌కు నరేష్ అమ్మమ్మ చిలుకమ్మ స్వయూన సోదరి. మృతుల కుటుంబాల మధ్య దగ్గరి బంధుత్వం ఉండటంతో వారి బంధువుల ఇళ్లల్లో విషాదం అలుముకుంది. సంఘటన స్థలానికి రూరల్ సీఐ వాసాల సతీష్, ఏఎస్సై రాంజీనాయక్ చేరుకుని కేసు నమో దు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మానుకోట ఆస్పత్రికి తరలించారు. నరేష్ మృతదేహన్ని తరలించే క్రమంలో అతడి తండ్రి తన కొడుకుకు పోస్టుమార్టం వద్దని వాదించాడు. తన తండాకు తీసుకెళ్తానని చెప్పి ఆటోలో తీసుకెళ్లాడు. అయితే అక్కడి నుంచి పోలీసులు పోస్టుమార్టంకు తరలించారు. ముందుగా వచ్చుంటే అందర్ని కాపాడేటోన్ని పిల్లలు మునిగినంక కొద్దిసేపటి వరకు కేకలు వినపడలేదు. తీరా చెరువు దగ్గరకు వచ్చినంక వారిని చూసి ఒక్కసారిగా చెరువులోకి దూకిన. అప్పటికే ఒడ్డుకున్న ఇద్దరితోపాటు, స్పృహ కోల్పోయిన శిరీషను కాపాడిన. ఇంకా ముందు వచ్చి ఉంటే ఆ ముగ్గుర్ని కాపాడేటోన్ని. అమ్మమ్మ, తాతను తిరుపతికి సాగనంపడానికి వచ్చి... మహముద్‌పట్నం గ్రామశివారు తండా కు చెందిన గుగులోతు నీల తన తల్లిదండ్రులు దేవోజీ, చిలుకమ్మ తిరుపతికి వెళ్తుండటంతో శనివారం తన కొడు కు నరేష్‌తో కలిసి రాజీవ్‌నగర్ తండాకు వచ్చింది. రోజంతా తాతతో సరదాగా గడిపిన నరేష్ ఆదివారం తాత, అమ్మమ్మకు టాటా చెప్పి పంపాడు. ఆ తర్వా త ఉన్నంటుండి బయటకు వెళ్లిన నరేష్ చెరువులో మునిగి ప్రాణాలొదిలాడు. అయితే కేసముద్రంకు చేరుకున్న దేవోజీ, చిలుకమ్మ రైలు రావడంలో ఆలస్యం కావడంతో రైల్వేస్టేషన్లోనే ఉండిపోయారు. ఇంతలో మనవడి మరణవార్త తెలియడంతో వారు బోరున విలపిస్తూ తిరిగొచ్చారు. -
ప్రాణాలు తీసిన ఈత సరదా
పోపూరు (చందర్లపాడు), న్యూస్‌లైన్ : ఇద్దరు చిన్నారుల ఈత సరదా వారి ప్రాణాలనే తీసింది. మండలంలోని పోపూరులో బుధవారం జరిగిన ఈ ఘటన వారి కన్నవారికి తీరని శోకం మిగిల్చింది. గ్రామశివారులోని ఆంజనేయ స్వామి ఆలయానికి సమీపంలో కొంతకాలంగా గ్రావెల్ క్వారీ కొనసాగుతోంది. ఇటీవల కురిసిన వర్షాలకు క్వారీలో భారీగా నీరు చేరింది. సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో నందిగామలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న గడ్డం సాంబశివరావు (11), స్థానిక ఎంపీపీ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న గడ్డం మణికంఠ (9) ఇంటి వద్దే ఉంటున్నారు. బుధవారం ఆటలాడుకుంటూ గ్రామ శివారులోని క్వారీ వద్దకు వెళ్లి ఈత కొట్టేందుకు యత్నించారు. ఒక్కసారిగా లోతైన ప్రదేశంలోకి వెళ్లడంతో మునిగిపోయారు. పరిసరాల్లో ఎవరూ లేకపోవడంతో కాపాడేవారు లేక నీటిలో ఊపిరాడక మృతి చెందారు. ఎంతసేపటికీ పిల్లలు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వాకబు చేయడంతో క్వారీలోకి దిగిన విషయం తెలిసింది. గ్రామస్తుల నీటిలో గాలించగా మృతదేహాలు బయటపడ్డాయి. సాంబశివరావు తండ్రి పెదపుల్లయ్య మూడేళ్ల క్రితమే అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో తల్లి తిరుపతమ్మే వ్యవసాయ పనులకు వెళ్లి ముగ్గురు మగ పిల్లలనూ పోషిస్తోంది. పెద్ద కుమారుడైన సాంబశివరావు ఇప్పుడు మృతిచెందడంతో అతని తల్లి తిరుపతమ్మ గుండెలవిసేలా రోదిస్తోంది. భర్త చనిపోవడంతో పెద్ద కుమారుడు త్వరగా అందివస్తాడనుకున్నానని, చిన్న వయసులోనే ఇలా దూరమవుతాడనుకోలేదని భోరున విలపిస్తోంది. మరో బాలుడు మణికంఠ తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, మల్లీశ్వరిలకు ఇద్దరు పిల్లలు. మణికంఠతో పాటు మరో కుమార్తె ఉంది. ఉన్న ఒక్క మగ సంతానం దూరమవడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతిచెందిన బాలుర కుటుంబసభ్యులు వ్యవసాయ కూలీలుగా చేస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులను గ్రామ సర్పంచ్ సంగం శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకుడు మామిళ్ల నాగిరెడ్డి తదితరులు పరామర్శించారు. ఘటనాస్థలాన్ని ఎస్ఐ చంద్రశేఖర్ సిబ్బందితో కలసి పరిశీలించారు. కృష్ణానదిలో బాలుడి గల్లంతు విజయవాడ : కృష్ణానదిలో స్నానానికి వెళ్లి రణదివె నగర్‌కు చెందిన కంభంపాటి రవికుమార్ గల్లంతయ్యాడు. బుధవారం ఇంటి సమీపంలో జరిగిన దినకర్మ భోజనాల అనంతరం సమీపంలోని నది వద్ద స్నానానికి వెళ్లాడు. ప్రవాహం అధికంగా ఉండటంతో పట్టు తప్పి నీటిలో కొట్టుకుపోవడాన్ని స్థానికులు, కుటుంబ సభ్యులు గమనించి నదిలో దిగి గాలించినా ఫలితం లేకపోయింది. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. -
కృష్ణానదిలో ఇద్దరు గల్లంతు
విజయవాడ, న్యూస్‌లైన్ : ఈత సరదా ఇద్దరిని బలిగొంది. రణదీవె నగర్ కరకట్ట ప్రాంతంలో ఆరుగురు యువకులు వినాయక చవితి పందిరి వేశారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వినాయకుడుకి పూజలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో శనివారం సాయంత్రం నాలుగు గంటలకు ఈ ఆరుగురు యువకులు కృష్ణానదిలో స్నానంచేసివచ్చి యథావిధిగా వినాయకుడికి పూజ చేయాలని నిర్ణయించుకున్నారు. వీరంతా వారధి కింద స్నానానికి దిగారు. స్నానాలు ముగించుకుని తిరిగి వస్తుండగా, వరుసకు అన్నదమ్ములైన పినెటి రాజు (19), కెల్ల చందు(16) మరికొద్దిసేపు ఈత కొడదామని మరలా వెనక్కి వెళ్లారు. అంతే ఇక తిరిగి రాలేదు. నది ప్రవాహం ఎక్కువగా ఉండడంతో 32,33 ఖానాల వరకు కొట్టుకుపోయారు. నదిలో స్నానం చేస్తున్న చందు, రాజు ఎంతకూ తిరిగి రాకపోవడంతో ఒడ్డున ఉన్న మిగతా నలుగురికి అనుమానం వచ్చి నదిలో పరికించి చూడగా ఇరువురి చేతులు కనపడ్డాయి. దీంతో వారు కుటుంబసభ్యలకు సమాచారం అందించారు. వెంటనే కొంతమంది నదిలో దూకి చందూ, రాజుల ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే వారు మృతిచెందారు. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కృష్ణలంక సీఐ టిఎస్ఆర్కె.ప్రసాద్ వివరాలు సేకరించారు. కుటుంబానికి అండగా ఉంటానని వచ్చి...... శ్రీకాకుళానికి చెందిన పినెటి అప్పన్న, దుర్గంబలకు ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు. పేదరికంలో ఉన్న కుటుంబానికి సాయపడాలని పెద్ద కుమారుడైన పినెటి రాజు (19) తల్లిదండ్రులను వదలి నగరానికి వచ్చాడు. రణదీవెనగర్‌లో నివాసముంటున్న మేనమామ కీర్తి రాజీనాయుడు దగ్గరకు చేరాడు. తాపీపని చేసి జీవనయానం సాగిస్తున్నాడు. అలాగే అదే ప్రాంతంలో నివాసముంటూ కూలిపని చేసుకుంటూ జీవనం సాగించే కెల్ల దుర్గారావు, నర్సమ్మలకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు పెద్ద కుమారుడు చందు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఫోన్లో సమాచారం.... కృష్ణానదిలో రాజు గల్లంతైన విషయం శ్రీకాకుళంలోని రాజు తల్లిదండ్రులకు, అతని మేనమామ రాజీనాయుడు ఫోన్లో సమాచారం అందించారు. వార్తను విన్న వారు హుటాహుటిన నగరానికి బయలుదేరారు. చేతికి అంది వచ్చిన కొడుకు చనిపోయాడని తెలుసుకున్న రాజు తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నట్లు రాజీనాయుడు తెలిపారు. కాగా చందూ కృష్ణానదిలో మునిగి పోవడంతో అతని కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. -
యువకుడి ప్రాణం తీసిన ఈత సరదా
యనమదల(నూజివీడురూరల్) : ఈత సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. మండలంలోని యనమదలలో బుధవా రం ఈ ఘటన జరిగింది. రూరల్ ఎస్సై బి.ఆదిప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం ..నూజివీడు రెల్లిపేటకు చెందిన దలాయి నాగశేషు(27) మరో నలుగురు సరదాగా గడిపేందుకు బుధవారం మండలంలోని యనమదల గ్రామానికి చేరుకున్నారు. మధ్యాహ్నం గ్రామ శివారులోని నీలాద్రి చెరువులో స్నానం కోసం దిగారు. నాగశేషు లోతుగా ఉన్న వైపు వెళ్లి ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. నాగశేషు వెంట ఉన్న నలుగురు వ్యక్తులు విషయాన్ని అతడి కుటుంబసభ్యులకు తెలపడంతో వారు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశా రు. రూరల్ పోలీసులు, అగ్నిమాపక సి బ్బందితో చెరువు వద్దకు వచ్చి, గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం వరకు నాగశేషు ఆచూకీ లభించకపోవడంతో ఉ న్నతాధికారుల సూచనల మేరకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్డీఆర్ఎఫ్) సిబ్బంది గ్రామానికి చేరుకొని నాగశేషు కోసం గాలించారు. సాయంత్రం ఏడున్న ర గంటల సమయంలో అతడి మృతదేహం లభ్యమవ్వటంతో పోస్టుమార్టం కో సం నూజివీడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చే సి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్సై ఆదిప్రసాద్ తెలిపారు. ఘటనాస్థలిని సీఐ మురళీకృష్ణ, డిప్యూటీ తహశీల్దార్ ఎస్వీ జగన్నాధరావు తదితరులు పరిశీలించారు.