మృతులు సాయి కిరణ్, సాయికుమార్‌లు( ఇన్‌సెట్లో ఫైల్ ఫోటోలు)
పుల్‌కల్(అందోల్): రెండు కుటుంబాల్లో హోలీ పండగ విషాదాన్ని నింపింది. ఇద్దరు విద్యార్థులు నదిలో నీట మునిగి దుర్మరణం పాలైన సంఘటన పుల్‌కల్ మండలం కొర్పోల్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కొర్పోల్ గ్రామానికి చెందిన కిషన్, మంజుల దంపతుల కొడుకు సాయికిరణ్, యాదయ్య, వీరమణి దంపతుల కొడుకు సాయికుమార్‌లు మధ్యాహ్నం వరకు హోలీ ఆడారు. అనంతరం వారిద్దరూ మరో ఐదుగురితో కలిసి స్నానానికని మంజీర నదికి వెళ్లారు. ఇందులో ఈత రాని ఐదుగురు నది ఒడ్డున స్నానం చేస్తున్నారు.
ఈ క్రమంలో సాయికిరణ్, సాయికుమార్‌లతోపాటు మరో ఇద్దరు నీట మునగడాన్ని ఇంటర్ విద్యార్థి మల్లేశం గమనించాడు. వెంటనే నీట మనుగుతున్న ఇద్దరిని కాపాడి బయటకు తీశాడు. కానీ సాయికిరణ్, సాయికుమార్‌లను కాపాడేంత శక్తి లేకపోవడంతో గ్రామానికి చెందిన పలువురికి సమాచారం ఇచ్చాడు. కానీ అంతలోపే సాయికుమార్, సాయికిరణ్‌లు నీటిలో మునిగి దుర్మరణం పాలయ్యారు. మృతి చెందిన వారిద్దరూ 10వ తరగతి విద్యార్థులే. వీరి మృతి విషయం తెలుసుకున్న స్థానికులు మంజీర నదికి వెళ్లి వారి మృతదేహాలను బయటకు తీశారు. వెంటనే పుల్‌కల్ పోలీసులకు సమాచారం ఇవ్వగా ఏఎస్‌ఐ ప్రభాకర్ సంఘటన స్థలానికి చెరేకున్నారు.
ఇద్దరూ ప్రాణ స్నేహితులే..
మంజీర నదిలో స్నానం చేయడం కోసం వెళ్లి మృతి చెందిన సాయికుమార్, సాయికిరణ్‌లు ఇద్దరూ ప్రాణస్నేహితులని తోటి విద్యార్థులు తెలిపారు. ఐదవ తరగతి నుంచి 10వ తరగతి వరకు కలిసి చదువుకుంటున్నారని, ఎప్పుడూ వారు కలిసే ఉండే వారన్నారు.
ఇద్దరూ తల్లిదండ్రులకు ఒక్కగానొక్కరే..
సాయికుమార్, సాయికిరన్‌లు ఇద్దరు కూడా వారి తల్లిదండ్రులకు ఒక్కొక్కరే కావడంతో ఆ కుటుంబాల్లో విషాదం అలుముకుంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన సాయికుమార్ తండ్రి యాదయ్య ఆరేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. తల్లి వీరమణి కూలీ పని చేస్తూ తన కొడుకును చదివిస్తోంది. మరో విద్యార్థి సాయికిరణ్ సైతం వారి తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు.
గ్రామంలో విషాదం..
అందరూ ఆనందోత్సాహాల మధ్య హోలీ వేడుకలు జరుపుకుంటుంటే ఆ గ్రామంలోని రెండు కుటుంబాల్లో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు విద్యార్థులు మృతి చెందడం గ్రామస్తులను కలచివేసింది. ఇదిలా ఉంటే ఇద్దరు విద్యార్థులు మంజీర నదిలోనే పడి మృతి చెందారని, వారికి పోస్టుమార్టం నిర్వహించవద్దని స్థానికులు పోలీసులకు మొరపెట్టుకున్నారు. కానీ స్థానికంగా నెలకొన్న పరిస్థితి దృష్ట్యా కేసు నమోదు చేశామని, పోస్టుమార్టం కోసం మృతదేహాలను జోగిపేట ఆస్పత్రికి తరలించామని ఏఎస్‌ఐ ప్రభాకర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment