ఆ విద్యార్థుల బంగారు భవిష్యత్తును రోడ్డు ప్రమాదాలు చిదిమేశాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో శుక్రవారం జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు పదో తరగతి విద్యార్థులు మృత్యువాత పడ్డారు. రాజమహేంద్రవరం స్నేహితులతో సరదాగా బైక్‌పై హాటల్‌కి బయలుదేరిన ఇద్దరు విద్యార్థులు డివైడర్‌ను ఢీకొని తిరిగిరానిలోకాలకు వెళ్లిపోయారు. తుని మండలం ఎస్. అన్నవరం శివారులో ఒక శుభకార్యక్రమానికి వెళ్లి కాలినడకన తిరిగివస్తున్న విద్యార్థిని మోటార్ సైక్లిస్ట్ ఢీకొనడంతో అసువులు బాసాడు. ఎంతో భవిష్యత్తు వున్న తమ పిల్లలు ఇలా అర్థాంతరంగా తనువు చాలించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
రాజమహేంద్రవరం రూరల్: టెన్త్ క్లాస్ ఫ్రీ ఫైనల్ పరీక్షలు పూర్తయ్యాయి. స్నేహితులతో సరదాగా హోటల్‌కు వెళదామని బైక్‌పై బయలుదేరిన ఎన్.లక్ష్మీనారాయణ (15), బి.లాస్య (15) లారీని తప్పించబోయి డివైడర్‌ను ఢీకొట్టడంతో మృతిచెందారు. ఈ విషాద ఘటన జాతీయ రహదారిపై కవలగొయ్యి సెంటర్‌కు కొద్దిదూరంలో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. డివైడర్‌ను ఢీకొట్టడంతో తీవ్ర గాయాలైన వారిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. లాస్య అప్పటికే మృతిచెందగా, లక్ష్మీనారాయణ చికిత్స పొందుతూ మృతిచెందాడు.
పోలీసుల కథనం ప్రకారం బొమ్మూరుకు చెందిన లక్ష్మీనారాయణ, ధవళేశ్వరం ఎర్రకొండకు చెందిన లాస్య బొమ్మూరులోని ఇంగ్లిషు మీడియం స్కూల్లో పదో తరగతి చదువుతున్నారు. ప్రీ ఫైనల్ పరీక్షలు పూర్తవడంతో ప్రిపరేషన్ హాలీడేస్ ఇచ్చారు. దీంతో హోటల్‌కు వెళదామని వీరు స్నేహితులతో కలిసి బైక్‌లపై బొమ్మూరు నుంచి లాలాచెరువు వైపు బయలుదేరారు. జాతీయ రహదారిపై కవలగొయ్యి సెంటర్ దాటిన తరువాత కొద్దిదూరంలో లారీని తప్పించుకుని ముందుకు వెళుతుండగా డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరి తలలకు తీవ్రగాయాలు కావడంతో అంబులెన్స్‌లో స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి తండ్రి నల్లంరెడ్డి ఉమామహేశ్వర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రకాశంనగర్ పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ పవన్‌కుమార్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తల్లిదండ్రుల ఆశలు అడియాస
బాగా చదువుకుని ఉన్నత స్థాయికి వెళతారన్న వారి తల్లిదండ్రుల ఆశలు అడియాసలయ్యాయి. బొమ్మూరుకు చెందిన ఉమామహేశ్వర్ హార్లిక్స్ ఫ్యాక్టరీలో టెంపరరీగా పనిచేస్తూ, కిరాణాషాపు నిర్వహిస్తూ కుమార్తె, కుమారుడిని చదివిస్తున్నారు. సంతానంలో రెండోవాడైన లక్ష్మీనారాయణ రోడ్డుప్రమాదంలో మృత్యువాతపడడంతో ఆ తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు చూపరులకు కంటతడి పెట్టించింది. ధవళేశ్వరం ఎర్రకొండ ప్రాంతానికి చెందిన బి.శ్రీనివాస్ రెస్టారెంట్‌లో పనిచేస్తూ లాస్య ఏకైక కుమార్తె కావడంతో గారాబంగా పెంచుకున్నారు. లాస్య మృతిచెందడంపై తల్లిదండ్రులు జీరి్ణంచుకోలేకపోతున్నారు. అందరితోను నవ్వుతూ మాట్లాడే లక్ష్మీనారాయణ, లాస్యలు మృతిచెందడంతో అటు పాఠశాలలోను, వారి నివాసప్రాంతాల్లోను విషాద ఛాయలు అలుముకున్నాయి.
మోటార్ సైకిల్ ఢీకొని విద్యార్థి మృతి
తుని రూరల్: మండలంలోని ఎస్.అన్నవరం శివారు సాయివేదిక సమీపంలో మోటార్ సైకిల్ ఢీకొనడంతో తుని పట్టణానికి చెందిన యండమూరి ఠాకూర్ సాయిశ్రీకర్ (15) మృతి చెందినట్టు రూరల్ ఎస్సై ఎ.బాలాజీ శుక్రవారం తెలిపారు. గురువారం రాత్రి వేదికలో జరిగిన శుభకార్యానికి హాజరై తుని నడచివస్తుండగా మోటార్ సైకిలిస్టు ఢీకొన్నాడు. తీవ్రంగా గాయపడిన సాయి శ్రీకర్‌ను తుని ఏరియా ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మృతి చెందినట్టు ఎస్సై వివరించారు. సాయిశ్రీకర్ పదో తరగతి చదువుతున్నాడన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment