ప్రమాదంలో ధ్వంసమైన కారు
కృష్ణరాజపురం: విద్యార్థుల లాంగ్ డ్రైవ్ తిరిగి రాలేని దూరతీరాలకు చేరింది. ప్రమాదం జరిగి నలుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటన హోసకోట తాలూకా అట్టూరు గేట్ వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగింది. వివరాలు.. బెంగళూరు కృష్ణరాజపురం గార్డె్డన్ సిటీ కాలేజీకి చెందిన ఆరుగురు విద్యార్థులు తమిళనాడు నంబర్ కారులో మంగళవారం విహారయాత్రకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కోలారు జిల్లా నరసాపుర వద్ద ఉన్న కెఫే కాఫీ డేకు వెళ్లారు. అక్కడి నుంచి బెంగళూరుకు వస్తుండగా తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో అట్టూరు గేట్ వద్ద జాతీయరహదారిపై కారు అదుపు తప్పింది.
తొలుత డివైడర్‌ను ఢీకొని గాల్లో పల్టీలు కొడుతూ అవతలి రోడ్డులో బెంగళూరు నుంచి కోలారు వైపు వెళ్తున్న ఏపీ 07 టీహెచ్ 6898 నంబర్ లారీని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జుయ్యింది. హొసకోటె పోలీసులు వచ్చి అతికష్టం మీద వాహనంలో ఉన్నవారిని బయటకు తీశారు. వెంకట్, సిరిల్, వైష్ణవి, భరత్ అనే విద్యార్థులు మృతి చెందినట్లు గుర్తించారు. వీరందరి వయస్సు 23– 26 ఏళ్ల మధ్య ఉంటుంది. సిరికృష్ణ, అంకితారెడ్డిలు తీవ్రంగా గాయపడగా హోసకోటె ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాధితులు బెంగళూరు విల్సన్ గార్డెన్ నివాసులుగా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment