సాక్షి, మణికొండ( హైదరాబాద్): గండిపేట పరిధిలోని చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీబీఐటీ) వద్ద గురువారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బ్యాగ్‌లాగ్ క్లియర్ చేయడానికి వచ్చిన ఓ విద్యార్థికి తోడుగా మరో నలుగురు స్నేహితులు ఆకలి తీర్చుకోవడానికి వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని నార్సింగి పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదానికి గురైన కారు భారత్ క్వాలిటీ ఇంజినీర్స్ సంస్థ పేరుతో ఉంది. జీడిమెట్ల సమీపంలోని కొంపల్లి, సుచిత్ర ప్రాంతాలకు చెందిన కౌస్తుభ్ (21) సీబీఐటీలో ఇంజినీరింగ్ (ఈఈఈ) విద్యనభ్యసించాడు. ఉన్నత విద్యనభ్యసించడానికి విదేశాలకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు. బ్యాక్‌లాగ్‌గా ఉన్న ఒక సబ్జెక్ట్ పూర్తి చేసుకుంటేనే అది సాధ్యమవుతుందనే ఉద్దేశంతో దానిపై దృష్టి పెట్టాడు.
తిని వద్దామని బయల్దేరగా..
గురువారం బ్యాక్‌లాగ్ సబ్జెక్ట్‌కు సంబంధించిన పరీక్ష రాయడానికి వస్తున్న కౌస్తుభ్ వెంట అతడి స్నేహితులు జోడెన్ (21), ప్రకాష్, దీపక్, ఆశీష్ వచ్చారు. ఈ నలుగురితో కౌస్తుభ్ తన మారుతి కారులో సీబీఐటీ కళాశాల వద్దకు చేరుకున్నారు. పరీక్ష ప్రారంభం కావడానికి అరగంటకు పైగా సమయం ఉండటంతో ఏదైనా తినివద్దామని కారులో సీబీఐటీ నుంచి ఖానాపూర్‌లోని దాబాకు బయలుదేరారు. కౌస్తుభ్ వాహనాన్ని నడుపుతుండగా.. పక్కన సీట్లో జోడెన్, వెనుక సీటులో మిగిలిన ముగ్గురూ కూర్చున్నారు.
అదుపు తప్పి.. స్తంభాన్ని ఢీకొట్టి..
ఈ అయిదుగురు ప్రయాణిస్తున్న కారు వేగంగా వెళుతోంది. స్నేహితులంతా మాటల్లో మునిగిపోయారు. ఈ నేపథ్యంలోనే ఎదురుగా వెళ్తున్న ఆటోను దూరం నుంచి గమనించలేకపోయారు. సమీపంలోకి వచ్చాక హఠాత్తుగా ఆటోను చూసిన కౌస్తుభ్ దానిని తప్పించే ప్రయత్నంలో ఎడమ వైపునకు కట్ చేశాడు. అదుపుతప్పిన వాహనం హైటెన్షన్ కరెంట్ స్తంభాన్ని ఢీకొంది. దాదాపు సగభాగం విరిగిపోయిన ఆ స్తంభంలోని ఓ భాగం కారుపై పడింది. అది తగలడంతో జోడెన్ అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. తీవ్రంగా గాయపడిన కౌస్తుభ్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో కన్నుమూశాడు. క్షతగాత్రులైన ముగ్గురిని సమీపంలోకి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మాదాపూర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్, నార్సింగి పోలీస్‌స్టేషన్ అడ్మిన్ ఎస్సై అనిల్‌కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment