సాక్షి, మణికొండ (హైదరాబాద్): వారంతా ఇంటర్, డిగ్రీ చదువుతున్న పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పిల్లలు. వేసవి సెలవులు కావటంతో ఓ రోజంతా ఓషన్ పార్కు, వండర్‌లా లాంటి ప్రదేశాల్లో సరదాగా గడుపుదామని స్నేహితులతో కలిసి బయలుదేరారు. ఒకే కారులో 11 మంది ఎక్కారు. కబుర్లు చెప్పుకుంటూ, ఉత్సాహంగా వెళుతున్న వారికి ఊహించని ప్రమాదం ఎదురయ్యింది. ముందు వెళుతున్న బస్సును ఓవర్‌టేక్ చేసే క్రమంలో.. ఆగి ఉన్న లారీని కారు వేగంగా ఢీకొట్టింది. పిల్లల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పార్క్ తెరవక పోవడంతో..
వీరంతా కూకట్‌పల్లి సమీపంలోని నిజాంపేట్‌లో నివసిస్తూ వాచ్‌మెన్‌లు, కూలీలుగా పనిచేస్తూ.. చిన్నచిన్న ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్న కుటుంబాల పిల్లలు. వీరిలో నిజాంపేటలో కూరగాయల వ్యాపారి అయిన ఈదులపల్లి శివారెడ్డి కుమార్తెలు అక్షిత, అంకిత కూడా ఉన్నారు. వీరు శుక్రవారం ఉదయమే స్నేహితులతో కలిసి తమ ట్రైబర్ (టీఎస్ 08 జీడబ్ల్యూ 3102) కారులో బయలుదేరారు. నిజాంపేటలో బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్న ప్రసాద్ కారును నడుపుతున్నాడు. మొదట గండిపేటలోని ఓషన్ పార్కుకు 9.30 గంటల సమయంలో చేరుకున్నారు. అప్పటికి పార్కు తెరవక పోవటంతో గండిపేట చెరువు వెనుక ఖానాపూర్ వైపు అల్పాహారం కోసం వెళ్లారు.
తిరిగి పార్కుకు వస్తూ ఖానాపూర్ గ్రామం దాటగానే లక్షమ్మ అమ్మవారి దేవాలయం వద్ద ముందు వెళుతున్న బస్సును ఎడమవైపు నుంచి ఓవర్ టేక్ చేసేందుకు ప్రసాద్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో రోడ్డుకు ఎడమవైపు నిలిచి ఉన్న లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారు ఎడమమైపు పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. దాంతో అటువైపే కూర్చున్న అంకిత (16), అక్షిత (18)లతో పాటు నితిన్ (17) అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా వారిని పోలీసు లు, స్థానికులు మెహిదీపట్నంలోని ప్రీమియర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తాటి అమృత్ (25) అనే విద్యార్థి మృతి చెందాడు. ప్రమాద సమయంలో కారు 100 కి.మీ పైగా వేగంతో వెళుతున్నట్లు తెలిసింది.
ముగ్గురి పరిస్థితి విషమం..
కారును నడుపుతున్న ప్రసాద్‌కు తీవ్ర గాయా లు కావటంతో తొలుత మెహిదీపట్నంలోని ఆసుపత్రికి, అనంతరం కిమ్స్ ఆసుపత్రికి తర లించారు. అతనితో పాటు ఎమలాపురి అర్జున్, చిన్నవుల ప్రదీప్‌కుమార్‌ల పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. ఎమలాపురి దివ్య, చిన్నవుల సుస్మిత, సత్యవాడ అఖిల, తాటి దనుష్యలు కూడా గాయపడ్డారని, వారి పరిస్థితి సాధారణంగానే ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అర్జున్, దివ్యలు అక్కా, తమ్ముడు కాగా.. రెండు కుంటుంబాలకు చెందిన ఇద్దరు మృతి చెందటం, ఇద్దరు గాయపడటంతో వారి తల్లిదండ్రులు ఆసుపత్రుల కన్నీరుమున్నీరుగా విలపించారు.
అతి వేగమే కారణం..
అతి వేగంగా కారణంగానే ప్రమాదం జరిగిందని, నార్సింగి పోలీసులతో పాటు ఖానాపూర్ వాసులు తెలిపారు. బైక్ మెకానిక్‌గా పనిచేసే యువకుడు కారును నడపటం, ఎడమవైపు నుంచి ఓవర్ టేక్ చేయాలనుకోవటం, రోడ్డు పక్కన నిలిచి ఉన్న లారీని గమనించక పోవడం వల్లే ప్రమాదం జరిగిందని వారు పేర్కొన్నారు.
చదవండి: TS: రెండ్రోజులు సాధారణ ఉష్ణోగ్రతలే
Comments
Please login to add a commentAdd a comment