బెస్తం చెరువులో విద్యార్థి గల్లంతు
-
క్షేమంగా బయటపడిన ముగ్గురు విద్యార్థులు
-
శోకసంద్రంలో లెనిన్‌నగర్
మామునూరు :
ఈత సరదాతో చెరువులోకి దిగిన ఓ విద్యార్థి ప్రమాదవశాత్తూ గల్లంతయ్యాడు. ఈ ఘటన హన్మకొండ మండలం తిమ్మాపురం గ్రామ పరిధిలోని బెస్తం చెరువులో గురువారం మధ్యాహ్నం జరిగింది. నాయుడు పెట్రోల్‌బంక్ కాలనీ ప్రాంతంలోని లెనిన్‌నగర్‌కు చెందిన ఇమ్మడి మొగిళి, ఆరుణ దంపతులు రెవెన్యూ కార్యాలయంలో అటెండర్లుగా ఉద్యోగం చేస్తున్నారు. వారికి కుమారుడు భవన్(16), కూతురు ఆకాంక్ష ఉన్నారు. రంగశాయిపేట ప్రభుత్వ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతున్న వెల్పుగొండ వినీత్, పోలపాక టోని, రెపాక రోహిత్ కలిసి గురువారం ఉదయం వారి స్నేహితుడైన ఇమ్మడి భవన్ ఇంటికి వెళ్లారు. కొద్దిసేపు కబుర్లు చెప్పుకొని సరదాగా ఈత కొట్టేందుకు బెస్తం చెరువుకు వెళ్లారు. చెరువు అంచులోనే సరదాగా ఈత కొడుతున్నారు. వారిలో వినీత్‌కు కొద్దిదూరం వెళ్లగలిగేంత ఈత రాగా, మిగతావారికి ఈత రాదు. అనుకోకుండా ఒకరి చెప్పు నీళ్లలో కొద్దిదూరంలో పడిపోయింది. దానిని తీసుకొచ్చేందుకు వినీత్ వెళ్లాడు. అయితే అతడు నీటిలో మునుగుతుండడంతో ఇమ్మడి భవన్ అతడికి చేయి అందించబోయి నీటమునిగాడు. ఈలోగా వినీత్ ఒడ్డుకు చేరుకున్నాడు. ముగ్గురు ఒడ్డుకు చేరుకొని కేకలు వేయడంతో అక్కడే బతుకమ్మ మైదాన ఏర్పాట్లలో ఉన్న కార్మికులు వచ్చి నీళ్లలోకి దిగి వెతకగా జాడ తెలియలేదు. సమాచారం అందుకున్న లెనిన్‌నగర్ వాసులు చెరువు వద్దకు చేరుకుని బాలుడి కోసం నీళ్లలోకి దిగి గాలించారు. తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు. సీఐ పి.శ్రీనివాస్, ఎస్‌సై రాంప్రసాద్ ఘటన స్థలానికి చేరుకొని హెడ్‌కానిస్టేబుల్ సాంబయ్య, కానిస్టేబుల్ ప్రసాద్‌తో బాలుడి జాడ కోసం వెతికించారు. భవన్ స్నేహితులను ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.