బాలుడి ప్రాణం తీసిన ఈత సరదా
- ఫైర్ సిబ్బంది సాయంతో మృతదేహం వెలికితీత
- కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు
వర్ధన్నపేట, న్యూస్‌లైన్ : ఈత సరదా ఓ బాలుడి ప్రాణం తీసింది. స్నేహితులతో ఈత కొట్టేందుకు వెళ్లిన ఓ బాలుడు బావిలో మునిగి మృతిచెందిన సంఘ టన మండల కేంద్రంలో శనివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. వర్ధన్నపేటకు చెందిన వల్లెపు వెంకటేశ్వర్లు, ఉపేంద్ర దంపతులకు కుమారుడు, కూతురు ఉన్నారు.
కుమారుడు వంశీ(15) తన స్నేహితులైన బొంత సోమనాథం, వేణు ఇతర స్నేహితులతో కలిసి శనివారం ఉదయం 10 గంటలకు వర్ధన్నపేట శివారు కోనాపురం రోడ్డుకు ఆనుకుని ఉన్న బొంత యాకమల్లు వ్యవసాయ ఓడల బావిలో ఈతకు దిగాడు. ఈ క్రమంలో ఒడ్డు నుంచి వెళ్లి బావిలో దూకిన అతడు ఎంతకూ పైకి రాకపోవడంతో స్నేహితులు భయపడి పొరుగున ఉన్న రైతులను పిలిచారు.
వారు ఎంత ప్రయత్నించినా బాలు డు దొరకకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వలలు, కొక్కెల సాయంతో ప్రయత్నించినా ఆచూకీ దొరకకపోవడంతో నీటిని తోడేందుకు రెండు విద్యుత్ మోటర్లను వినియోగించారు.
సుమారు మూడు గంటల తర్వాత ఫైరింజన్, గజ ఈత గాళ్లను రప్పించి బావిలో నుంచి వంశీ మృతదేహాన్ని బయటకు తీశారు. ఒక్కగానొక్క కుమారుడి మృతితో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యూరు. ‘కొడుకా ఒక్కసారి మాట్లాడరా’ అంటూ తన ఒడిలోకి తీసుకుని తల్లి ముద్దులు పెడుతూ రోదించిన తీరును అందరిని కలచివేసింది. తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజయ్య, ఎస్సై రవీందర్ తెలిపారు.