కడుపు కోత | Abdominal incision | Sakshi
Sakshi News home page

కడుపు కోత

Published Mon, May 26 2014 4:12 AM | Last Updated on Sat, Sep 2 2017 7:50 AM

Abdominal incision

కేసముద్రం, న్యూస్‌లైన్ : సరదాగా ఈత పండ్ల కోసమని వెళ్లిన ముగ్గురు చిన్నారులు కొద్ది గంటల్లోనే విగతజీవులయ్యూరు. ఈత కొట్టేందు కు చెరువులో దిగి మృత్యు ఒడికి చేరారు. కనిపెంచిన తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు. ఈ హృదయవిదారక సంఘటన మండలంలోని రంగాపురం గ్రామశివారు రాజీవ్ నగర్ తండాలో ఆదివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం... రాజీవ్‌నగర్‌తండాకు చెందిన లకావత్ బావుసింగ్‌కు ఇద్దరు భార్యలు. పెద్ద భార్య లక్ష్మికి కుమార్తెలు శాంతి, కావేరి, సంధ్య(13) ఉండగా, చిన్నభార్య సాల్కికి కుమారులు సురేష్, తరుణ్(10) ఉన్నారు. ఉమ్మడి కుటుంబంలోనే కలిసిమెలిసి జీవనం సాగిస్తున్నారు.
 
కాగా ఇదే తండాకు చెందిన దేవోజీ, చిలుకమ్మ దంపతుల కుమార్తె నీలకు ఇదే మండలం మహముద్‌పట్నం తండాకు చెందిన హరితో వివాహమైంది. ఆ దంపతులకు కుమార్తె శారద, కుమారులు సురేష్, నరేష్(9) ఉన్నారు. తన తల్లిదండ్రులు తిరుపతికి వెళుతుండడంతో వారిని సాగనంపేందుకు నీల శనివారం పుట్టింటికి వచ్చింది.
 
ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం బావుసింగ్ కుమార్తె సంధ్య, కుమారుడు తరుణ్ , నీల కుమారుడు నరేష్‌తోపాటు ఇదే తండాకు చెందిన భద్రు కుమారుడు రమేష్, కుమార్తె మౌనిక, గుగులోతు నంద కుమార్తె శిరీష కలిసి ఈత పండ్ల కోసం సమీపంలోని ఎదళ్ల చెరువు కట్ట మీదకు వెళ్లారు. అందరు కలిసి ఒక కవర్లో ఈత పండ్లను ఏరుకున్నారు. తిరిగి ఇంటికొస్తుండగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో చెరువులో ఈత కొడదామంటూ నీళ్లలోకి దిగా రు.

ముందుగా తరుణ్, సంధ్య, నరేష్, శిరీష లోపలికి వెళ్లగా గుంత ఉండటంతో ఒక్కసారిగా మునిగిపోయారు. కొంతదూరం వెళ్లిన రమేష్, మౌనిక మునుగుతున్న మిత్రులను చూసి కేకలు పెట్టారు. ఇంతలో అటుగా బహిర్భూమికి వెళ్లిన దారావత్ వీరన్న వారిని గమనించి పరుగుపరుగున చెరువులో దూకాడు. అప్పటికే మునిగిపోయి అపస్మారక స్థితికి చేరుకున్న శిరీషను ఒడ్డుకు చేర్చాడు. అలాగే రమేష్, మౌనికను ఒడ్డుకు తీసుకొచ్చాడు.

చెరువులో మునిగిపోయిన వారిని గాలించి బయటకు తీసుకొచ్చినప్పటికీ అప్పటికే తరుణ్, సంధ్య, నరేష్ ప్రాణాలు విడిచారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపిస్తూ సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతురాలు సంధ్య కేసముద్రంవిలేజ్‌లోని కస్తూర్భా పాఠశాలలో ఏడో తరగతి పూర్తి చేయగా, తరుణ్ ధన్నసరి గ్రామంలోని సెయింట్‌జాన్స్ స్కూల్‌లో 2వ తరగతి చదివాడు. నరేష్ మహముద్‌పట్నం తండాలోని మూడో తరగతి పూర్తి చేశాడు.
 
తాత దగ్గరకుపోతనని వత్తివి కదరా..

మీ తాతను చూత్తానికి పోతనని గార్బం చేసి వత్తివి కదరా కొడుకా.. ఇప్పుడు మమ్మల్ని ఒక్కసారి సూడ్రా కొడుకా.. మమ్మల్ని వదిలిపెట్టి పోదానికే వచ్చినవారా కొడుకా.. అంటూ నరేష్ తండ్రి హరి కొడుకును ముద్దాడుతూ విల పించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. నా కొడుకుకు ఎండగొడతాందంటూ తల్లి తన చీరకొంగును కొడుకు శవం పై కప్పుతూ రోదించడం స్థానికులను కలచివేసింది.
 
నాకెమయిందో తెల్వలే : శిరీష

చెరువులో అందరితో కలిసి దిగిన.. ఒక్కసారే పెద్ద బొంద వచ్చింది. అందరం మునిగినం. ఏడుసుకుంటూ అరిసిన ం. నీళ్లన్ని మింగినంక  నాకు ఏమైందో తెల్వలే. వీరన్న నన్ను బయటకు తీసి నా పొట్టమీద గట్టిగా వత్తిండు. మెలకువ వచ్చింది. నా దోస్తులు చచ్చిపోయిండ్రని తెల్వంగనే నాకు భయమైంది.
 
మృతులంతా బంధువులే..


సంధ్య, తరుణ్ తండ్రి అయిన బావుసింగ్‌కు నరేష్ అమ్మమ్మ చిలుకమ్మ స్వయూన సోదరి. మృతుల కుటుంబాల మధ్య దగ్గరి బంధుత్వం ఉండటంతో వారి బంధువుల ఇళ్లల్లో విషాదం అలుముకుంది. సంఘటన స్థలానికి రూరల్ సీఐ వాసాల సతీష్, ఏఎస్సై రాంజీనాయక్ చేరుకుని కేసు నమో దు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మానుకోట ఆస్పత్రికి తరలించారు. నరేష్ మృతదేహన్ని తరలించే క్రమంలో అతడి తండ్రి తన కొడుకుకు పోస్టుమార్టం వద్దని వాదించాడు. తన తండాకు తీసుకెళ్తానని చెప్పి ఆటోలో తీసుకెళ్లాడు. అయితే అక్కడి నుంచి పోలీసులు పోస్టుమార్టంకు తరలించారు.
 
 ముందుగా వచ్చుంటే అందర్ని కాపాడేటోన్ని
 పిల్లలు మునిగినంక కొద్దిసేపటి వరకు కేకలు వినపడలేదు. తీరా చెరువు దగ్గరకు వచ్చినంక వారిని చూసి ఒక్కసారిగా చెరువులోకి దూకిన. అప్పటికే ఒడ్డుకున్న ఇద్దరితోపాటు, స్ప­ృహ కోల్పోయిన శిరీషను కాపాడిన. ఇంకా ముందు వచ్చి ఉంటే ఆ ముగ్గుర్ని కాపాడేటోన్ని.
 
 అమ్మమ్మ, తాతను తిరుపతికి సాగనంపడానికి వచ్చి...

 మహముద్‌పట్నం గ్రామశివారు తండా కు చెందిన గుగులోతు నీల తన తల్లిదండ్రులు దేవోజీ, చిలుకమ్మ తిరుపతికి వెళ్తుండటంతో శనివారం తన కొడు కు నరేష్‌తో కలిసి రాజీవ్‌నగర్ తండాకు వచ్చింది. రోజంతా తాతతో సరదాగా గడిపిన నరేష్ ఆదివారం తాత, అమ్మమ్మకు టాటా చెప్పి పంపాడు. ఆ తర్వా త ఉన్నంటుండి బయటకు వెళ్లిన నరేష్ చెరువులో మునిగి ప్రాణాలొదిలాడు. అయితే కేసముద్రంకు చేరుకున్న దేవోజీ, చిలుకమ్మ రైలు రావడంలో ఆలస్యం కావడంతో రైల్వేస్టేషన్‌లోనే ఉండిపోయారు. ఇంతలో మనవడి మరణవార్త తెలియడంతో వారు బోరున విలపిస్తూ తిరిగొచ్చారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement