చుర్రుమంటోంది..
ఠారెత్తిస్తున్న ఎండలు
ఉష్ణోగ్రతలు ఉధృతం
గాలులతో కాస్త ఉపశమనం
ఎండలు ఠారెత్తించడంతో జిల్లాలో కాక పుడుతోంది. ఉదయం నుంచి ఉడుకు మొదలవుతోంది. వేసవి ఊపందుకోవడంతో దాని ఉధృతి కూడా పెరుగుతోంది. ఏప్రిల్ మొదటి వారంలోనే సాధారణంకంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతోంది. మరోవైపు విశాఖపై ఎలాంటి ద్రోణులూ ప్రభావం చూపడం లేదు. అందువల్ల ఆకాశంలో మేఘాలు లేవు. దీంతో భానుడి ప్రతాపం నేరుగా భూమిపై పడి సత్వరమే వేడెక్కుతూ సెగలకు కారణమవుతోంది.
విశాఖపట్నం: జిల్లా గరంగరంగా మారిపోతోంది. ఉదయం 9 గంటలకే చుర్రుమంటోంది. వీథుల్లోకి అడుగు పెట్టడానికి జనం భయపడుతున్నారు. హుద్‌హుద్ దెబ్బకు లక్షల చెట్లు నేలకూలాయి. ఫలితంగా ఆ ప్రభావం కూడా ఇప్పుడు ఇటు విశాఖపైన, అటు జిల్లాపైన పడుతోంది. వాహనాలు, పరిశ్రమలు విడుదల చేసే కార్బన్ డయాక్సైడ్‌ను చెట్లు పీల్చుకుంటాయి. ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. అయితే హుద్‌హుద్‌కు జిల్లాలో చెట్లు చాలావరకు ధ్వంసమయ్యాయి. దీనివల్ల విడుదలవుతున్న కార్బన్ డయాక్సైడ్ గాలిలో అలాగే ఉండిపోతోంది. దీంతో భూతాపం పెరిగిపోతూ ఉష్ణ తీవ్రతకు కారణమవుతోంది. విశాఖలో ఆదివారం 36 డిగ్రీల పగటి (గరిష్ట) ఉష్ణోగ్రత రికార్డయింది. ఇది సాధారణం కంటే ఒక డిగ్రీ ఎక్కువ.
గాలులతో మేలు.. : వేసవి వచ్చిందంటే విశాఖ వాసులకు ఉక్కపోత బెడద వెంటాడుతుంది. ఇతర ప్రాంతాల కంటే విశాఖలో గాలిలో తేమ అధికంగా ఉంటుంది. గాలి కూడా తగ్గుతుంది. చెట్లు లేకపోతే తేమ శాతం మరింత పెరుగుతుంది. వెరసి ఉక్కపోతకు దారితీస్తుంది. అదృష్టవశాత్తూ ప్రస్తుతం దక్షిణ, నైరుతి గాలులు వీస్తున్నాయి. అందువల్ల గాలిలో తేమను ఒక చోట ఉంచకుండా ఉక్కపోత లేకుండా చేస్తున్నాయి. కొద్దిరోజులపాటు గాలులు వీస్తాయని, గాలులు తగ్గితే ఉక్కపోత మొదలవుతుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం మాజీ అధికారి ఆర్.మురళీకృష్ణ ‘సాక్షి’కి తెలిపారు.