తాటాకులు, కొబ్బరిబోండాలు, అరటికాయలతో సిద్ధం చేసిన మండపం
నేటి ఆధునిక కాలంలో పెళ్లిళ్ల తంతు అంతా కృత్రిమమే... ఫంక్షన్ హాళ్లు, సెట్టింగ్‌లు మొదలు పందిళ్లు, తోరణాలు, చివరకు గ్లాసులు, విస్తళ్ల వరకు అన్నీ ప్లాస్టిక్‌మయమే... కానీ ఆ ఇంట మాత్రం కొబ్బరాకులు, అరిటాకులు, అరటికాయలు, పూలతో తయారు చేసిన పెళ్లి మండపం.. పింగాణి ప్లేట్ల స్థానంలో మోదుగు, అడ్డాకుల ప్లేట్లలో భోజనం, కూల్‌డ్రింక్‌ల స్థానంలో చెరకు, ద్రాక్ష రసం.. చికెన్, మటన్ బదులు సేంద్రియ ఎరువులతో పండించిన కాయగూరల భోజనం.. ఇదీ ఓ ఆదర్శ రైతు ఇంట జరిగిన ‘ఆర్గానిక్’ వివాహం. ఒంటికి ఆరోగ్యం, కంటికి ఆహ్లాదం కలిగేలా నిర్వహించిన ఈ వివాహం ప్రత్యేకంగా నిలవడమే కాక ఆ రైతుకు ప్రకతిపై ఉన్న ప్రేమను చాటిచెప్పింది.
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కోయచెలక గ్రామానికి చెందిన ఆదర్శ రైతు చెరుకూరి రామారావు తన కుమారుడు కిరణ్ వివాహాన్ని సైతం అందరికీ ఆదర్శంగా నిర్వహించాడు. పెళ్లి ప్రక్రియలో ఆసాంతం ప్రకతికి పెద్దపీట వేశాడు. రామారావుకు తల్లిదండ్రులు రంగమ్మ, సత్యం, భార్య రమణతోపాటు ఇద్దరు కుమారులు కిరణ్, సురేశ్ ఉన్నారు. పెద్ద కుమారుడు కిరణ్ కోయంబత్తూరులో మెకానికల్ ఇంజనీరింగ్ చేసి నాలుగేళ్లుగా ఖమ్మంలో ఆర్గానిక్ స్టోర్ నిర్వహిస్తున్నాడు.
ఆయన వివాహం బంధువుల అమ్మాయి ఉదయశ్రీతో నిశ్చయమైంది. శుక్రవారం జరిగిన ఈ వివాహాన్ని మధురమైన జ్ఞాపకంగా చేసుకోవడంతోపాటు ఆశీర్వదించడానికి వచ్చిన అతిథులకు మంచి ఆహారం అందించాలని రైతు రామారావు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఎక్కడా ప్లాస్టిక్ వాడకుండా, ఫంక్షన్ హాల్‌లో కాకుండా ఇంట్లోనే పెళ్లి చేశాడు. పెళ్లి మండపాన్ని జమ్మిగడ్డి, కొబ్బరికాయలు, అరటిగెలలు, పూలతో చూపరులను ఆకట్టుకునేలా అలంకరించారు.
భోజనాలకు బెంగళూరు నుంచి అడ్డాకు ప్లేట్లు, ఇతర ప్రాంతాల నుంచి మోదుగు ఆకు ప్లేట్లు తెప్పించారు. ఇక వంటలకు తమ పొలంలో ఎటువంటి రసాయన ఎరువులను వాడకుండా పండించిన కూరగాయలనే వాడారు. వంటకాల కోసం చెక్కగానుగ నూనె, రాక్ సాల్ట్, దేశీయ స్వచ్ఛమైన దేశీ ఆవు నెయ్యి, సహజంగా తయారు చేసిన బెల్లం, పెనగంచిప్రోలు నుంచి ఎండుమిర్చి కారం, ఏలూరు నుంచి కొబ్బరిబొండాలు, అరటిగెలలు, దమ్మపేట నుంచి కొబ్బరి మొక్కలు తెప్పించారు.
వివిధ ప్రాంతాల ఆదర్శ రైతులతో వధూవరులు
పెళ్లి వంటకాలు ఇవే..
పెళ్లిలో మాంసాహారానికి బదులు ముద్దపప్పు, నెయ్యి, వడియాల చారు, గోంగూర పచ్చడి, నాటుదోసకాయ పచ్చడి, వంకాయ, నాటు చిక్కుడుకాయ కూరలు, మష్రూమ్ ధమ్ బిర్కానీ, ఖద్దూకా ఖీర్, చెరుకు రసం, ద్రాక్ష జ్యూస్ ఏర్పాటు చేశారు. ఈ వివాహానికి బంధువులతోపాటు వ్యవసాయ శాస్త్రవేత్త పురుషోత్తం, ఏలూరు, అనంతపురం, జహీరాబాద్, చిక్‌బళ్లాపూర్ తదితర ప్రాంతాల నుంచి 300 మంది ఆదర్శ రైతులు, కేవీకే, జేడీఏ, హార్టికల్చర్ అధికారులను ఆహ్వానించారు. వారంతా నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఇంటికి తాళం వేయొద్దని..
ఫంక్షన్‌హాల్‌లో వివాహం చేసుకుంటే హడావుడి తప్ప ఆనందం ఉండదు. అదే ఇంటి వద్ద అయితే రెండు, మూడు రోజులు ఇల్లంతా సందడిగా ఉంటుంది. ఇక ఫంక్షన్ హాల్‌లో పెళ్లయితే ఇంటికి తాళం వేసి అంతా వెళ్లాలి. అలా చేయడం నాకు, మా నాన్నకు ఇష్టం లేదు. అందుకే ఇంటి వద్ద వివాహం చేసుకున్నా.
– చెరుకూరి కిరణ్, పెళ్లి కుమారుడు
ప్రకృతికి విరుద్ధంగా ఉండొద్దనే..
ప్రకతి మనకు ఎన్నో ఇచ్చింది. అలాంటి ప్రకృతికి విరుద్ధంగా వ్యవహరించొద్దనే ఉద్దేశంతోనే పెళ్లి ప్రక్రియలో ఎక్కడా ప్లాస్టిక్‌ను వాడలేదు. అతిథులు మరిచిపోలేని విధంగా సేంద్రియ ఆహారం వడ్డించాం.
– చెరుకూరి రామారావు, ఆదర్శ రైతు
Comments
Please login to add a commentAdd a comment