Organic vegetables
-
స్వచ్ఛమైన ఉత్పత్తులకు సేంద్రియ విధానం
-
క్రమంగా సేంద్రియ సాగువైపు మళ్లుతున్న రైతులు
-
సంప్రదాయ పంటల సాగుతో పోలిస్తే కూరగాయల సాగు లాభదాయకం
-
కూరగాయల సాగుతో అద్భుతాలు సృష్టిస్తున్న రైతు సోదరులు
-
క్రమంగా సేంద్రియ సాగుబాట పడుతున్న రైతన్నలు
-
రసాయనాలు లేని ఆహారం కోసం ఇదే సరైన పరిష్కారం
-
ఏడాదికి మూడు పంటలు పండిస్తూ మంచి లాభాలు
-
పైసా పెట్టుబడి లేదు సేంద్రియ పద్దతుల్లో ఇంట్లోనే కూరగాయల సాగు...
-
ఆదర్శ రైతు ఇంట.. ‘ఆర్గానిక్’ పెళ్లంట
నేటి ఆధునిక కాలంలో పెళ్లిళ్ల తంతు అంతా కృత్రిమమే... ఫంక్షన్ హాళ్లు, సెట్టింగ్‌లు మొదలు పందిళ్లు, తోరణాలు, చివరకు గ్లాసులు, విస్తళ్ల వరకు అన్నీ ప్లాస్టిక్‌మయమే... కానీ ఆ ఇంట మాత్రం కొబ్బరాకులు, అరిటాకులు, అరటికాయలు, పూలతో తయారు చేసిన పెళ్లి మండపం.. పింగాణి ప్లేట్ల స్థానంలో మోదుగు, అడ్డాకుల ప్లేట్లలో భోజనం, కూల్‌డ్రింక్‌ల స్థానంలో చెరకు, ద్రాక్ష రసం.. చికెన్, మటన్ బదులు సేంద్రియ ఎరువులతో పండించిన కాయగూరల భోజనం.. ఇదీ ఓ ఆదర్శ రైతు ఇంట జరిగిన ‘ఆర్గానిక్’ వివాహం. ఒంటికి ఆరోగ్యం, కంటికి ఆహ్లాదం కలిగేలా నిర్వహించిన ఈ వివాహం ప్రత్యేకంగా నిలవడమే కాక ఆ రైతుకు ప్రకతిపై ఉన్న ప్రేమను చాటిచెప్పింది. సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కోయచెలక గ్రామానికి చెందిన ఆదర్శ రైతు చెరుకూరి రామారావు తన కుమారుడు కిరణ్ వివాహాన్ని సైతం అందరికీ ఆదర్శంగా నిర్వహించాడు. పెళ్లి ప్రక్రియలో ఆసాంతం ప్రకతికి పెద్దపీట వేశాడు. రామారావుకు తల్లిదండ్రులు రంగమ్మ, సత్యం, భార్య రమణతోపాటు ఇద్దరు కుమారులు కిరణ్, సురేశ్ ఉన్నారు. పెద్ద కుమారుడు కిరణ్ కోయంబత్తూరులో మెకానికల్ ఇంజనీరింగ్ చేసి నాలుగేళ్లుగా ఖమ్మంలో ఆర్గానిక్ స్టోర్ నిర్వహిస్తున్నాడు. ఆయన వివాహం బంధువుల అమ్మాయి ఉదయశ్రీతో నిశ్చయమైంది. శుక్రవారం జరిగిన ఈ వివాహాన్ని మధురమైన జ్ఞాపకంగా చేసుకోవడంతోపాటు ఆశీర్వదించడానికి వచ్చిన అతిథులకు మంచి ఆహారం అందించాలని రైతు రామారావు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఎక్కడా ప్లాస్టిక్ వాడకుండా, ఫంక్షన్ హాల్లో కాకుండా ఇంట్లోనే పెళ్లి చేశాడు. పెళ్లి మండపాన్ని జమ్మిగడ్డి, కొబ్బరికాయలు, అరటిగెలలు, పూలతో చూపరులను ఆకట్టుకునేలా అలంకరించారు. భోజనాలకు బెంగళూరు నుంచి అడ్డాకు ప్లేట్లు, ఇతర ప్రాంతాల నుంచి మోదుగు ఆకు ప్లేట్లు తెప్పించారు. ఇక వంటలకు తమ పొలంలో ఎటువంటి రసాయన ఎరువులను వాడకుండా పండించిన కూరగాయలనే వాడారు. వంటకాల కోసం చెక్కగానుగ నూనె, రాక్ సాల్ట్, దేశీయ స్వచ్ఛమైన దేశీ ఆవు నెయ్యి, సహజంగా తయారు చేసిన బెల్లం, పెనగంచిప్రోలు నుంచి ఎండుమిర్చి కారం, ఏలూరు నుంచి కొబ్బరిబొండాలు, అరటిగెలలు, దమ్మపేట నుంచి కొబ్బరి మొక్కలు తెప్పించారు. వివిధ ప్రాంతాల ఆదర్శ రైతులతో వధూవరులు పెళ్లి వంటకాలు ఇవే.. పెళ్లిలో మాంసాహారానికి బదులు ముద్దపప్పు, నెయ్యి, వడియాల చారు, గోంగూర పచ్చడి, నాటుదోసకాయ పచ్చడి, వంకాయ, నాటు చిక్కుడుకాయ కూరలు, మష్రూమ్ ధమ్ బిర్కానీ, ఖద్దూకా ఖీర్, చెరుకు రసం, ద్రాక్ష జ్యూస్ ఏర్పాటు చేశారు. ఈ వివాహానికి బంధువులతోపాటు వ్యవసాయ శాస్త్రవేత్త పురుషోత్తం, ఏలూరు, అనంతపురం, జహీరాబాద్, చిక్‌బళ్లాపూర్ తదితర ప్రాంతాల నుంచి 300 మంది ఆదర్శ రైతులు, కేవీకే, జేడీఏ, హార్టికల్చర్ అధికారులను ఆహ్వానించారు. వారంతా నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇంటికి తాళం వేయొద్దని.. ఫంక్షన్హాల్లో వివాహం చేసుకుంటే హడావుడి తప్ప ఆనందం ఉండదు. అదే ఇంటి వద్ద అయితే రెండు, మూడు రోజులు ఇల్లంతా సందడిగా ఉంటుంది. ఇక ఫంక్షన్ హాల్లో పెళ్లయితే ఇంటికి తాళం వేసి అంతా వెళ్లాలి. అలా చేయడం నాకు, మా నాన్నకు ఇష్టం లేదు. అందుకే ఇంటి వద్ద వివాహం చేసుకున్నా. – చెరుకూరి కిరణ్, పెళ్లి కుమారుడు ప్రకృతికి విరుద్ధంగా ఉండొద్దనే.. ప్రకతి మనకు ఎన్నో ఇచ్చింది. అలాంటి ప్రకృతికి విరుద్ధంగా వ్యవహరించొద్దనే ఉద్దేశంతోనే పెళ్లి ప్రక్రియలో ఎక్కడా ప్లాస్టిక్‌ను వాడలేదు. అతిథులు మరిచిపోలేని విధంగా సేంద్రియ ఆహారం వడ్డించాం. – చెరుకూరి రామారావు, ఆదర్శ రైతు -
ఉల్లి తప్ప ఏమీ కొనను!
వ్యవసాయ శాఖలో అదనపు సంచాలకురాలిగా పనిచేస్తున్న ఉషారాణి తమ కుటుంబం కోసం ఇంటిపైనే సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను సాగు చేస్తున్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని రైతు శిక్షణా కేంద్రంలో సహాయ సంచాలకులుగా పనిచేస్తున్న ఉషారాణి బిహెచ్ఇఎల్ సమీపంలోని తమ స్వగృహంపై ఇంటిపంటలు సాగు చేస్తూ.. ఉల్లిపాయలు తప్ప ఇతరత్రా అన్నీ తానే పండించుకుంటున్నారు. ఆమె భర్త యలమంద వృత్తిరీత్యా బీహెచ్ఈఎల్ ఇంజినీర్. ఆయన సహాయంతో టెర్రస్‌పై ఇనుప ఊచలతో పందిరిని ఏర్పాటు చేసుకొని తీగజాతి కూరగాయ పాదులను దానిపైకి పాకిస్తూ, నిశ్చింతగా ఇంటిపంటలు పండిస్తున్నారు. 200 లీటర్ల ఫైబర్ డ్రమ్మును మధ్యకు కత్తిరించి రెండు మడులుగా వాడుతున్నారు. వీటితోపాటు ప్లాస్టిక్ కుండీలు, ఖాళీ బక్కెట్లలో కూడా అనేక రకాల ఆకుకూరలతోపాటు కూరగాయలను సాగు చేస్తున్నారు. డ్రమ్ముల అడుగున హాలో బ్రిక్స్ పెట్టడం వల్ల టెర్రస్‌పైన పడిన నీరు వెంటనే పల్లానికి వెళ్లిపోవడానికి వీలవుతోంది. ఎర్రమట్టి, కొబ్బరిపొట్టు, వర్మీకంపోస్టు సమపాళ్లలో వేస్తారు. వేపపిండి, బోన్మీల్, జీవన ఎరువులు కొద్ది మొత్తంలో కలుపుతారు. వంటింటి వ్యర్థాలు, ఎండు పూలతో ఆవు పేడ స్లర్రీని వేసి కంపోస్టును తయారు చేసుకుంటారు. ఈ కంపోస్టును, సముద్రపు నాచుతో తయారైన గ్రాన్యూల్స్‌ను పూత, కాత సమయాల్లో మొక్కలకు అడపా దడపా వేస్తుంటారు. పురుగులు ఏమైనా కనిపిస్తే అవి చిన్నగా ఉన్నప్పుడే పుల్లమజ్జిగ, పచ్చిమిర్చి వెల్లుల్లి ద్రావణం వంటి వాటిని పిచికారీ చేస్తుంటారు. 6 రకాల వంకాయలను సాగు చేస్తున్నారు. బెండ, వంగ, బంగాళదుంపలు, ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ వంటి కూరగాయలను సాగు చేస్తున్నారు. దొండ పాదును ఇనుప పందిరిపైకి పాకించలేదు. ఇది బాగా అల్లుకుపోయి ఇతర కూరగాయ మొక్కలను పెరగకుండా చేస్తుందన్న భావనతో ట్రెల్లిస్పైకి పాకించానని ఉషారాణి తెలిపారు. అనేక పండ్ల మొక్కలను కూడా ఆమె సాగు చేస్తున్నారు. స్వీట్ లైమ్, వాటర్ ఆపిల్, అంజూర, నిమ్మ, దానిమ్మ, మామిడి, ప్యాషన్ ఫ్రూట్ తదితర పండ్ల మొక్కలను సాగు చేస్తున్నారు. ప్యాషన్ ఫ్రూట్ పాదును ఇంటి ముందు నేలలో నాటి, మేడపైకి పాకించారు. అత్యంత పోషక విలువలున్న ఈ పండ్లు చాలా ఎక్కువ సంఖ్యలో కాస్తున్నాయని ఆమె తెలిపారు. ప్యాషన్ ఫ్రూట్ రసం చాలా రుచికరంగా ఉంటుందన్నారు. ఇంటిపంటలకు అందుబాటులో ఉన్న ఏదో ఒక పోషక పదార్థాన్ని అడపా దడపా వేస్తూ ఉంటే పోషక లోపం లేకుండా మొక్కలు చక్కగా పెరుగుతూ దిగుబడులనిస్తాయని ఆమె అన్నారు. ఆపిల్ బెర్ మొక్క ఒకసారి ఎండిపోయింది. శిలీంద్రనాశిని అయిన ట్రైకోడెర్మా విరిడి పొడిని తెచ్చి మట్టిలో కలిపిన తర్వాత తిరిగి కొత్త చిగుర్లు వేసిందని ఆమె తెలిపారు. కొంచెం ప్రణాళికా బద్ధంగా సీజన్ల వారీగా నార్లు పోసుకుంటూ మొక్కలు నాటుకుంటూ ఉంటే ఏడాది పొడవునా ఇంటిపైనే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను సాగు చేసుకోవడం సులువేనని ఆమె తెలిపారు. ఫిబ్రవరిలో కాపు పొందాలనుకుంటున్న కూరగాయ మొక్కలకు సంబంధించి ఇప్పటికే తాను నారు పోశానన్నారు. భవనానికి ఇంటిపంటల కుండీలు, డ్రమ్ములు బరువై పోతాయని, భవనానికి ఏదైనా నష్టం జరుగుతుందన్న అపోహలు అవసరం లేదని ఆమె అంటారు. వాటర్ ప్రూఫింగ్ చేసిన టెర్రస్‌పైన హాలో బ్రిక్స్ పెట్టుకొని వాటిపై కుండీలు, డ్రమ్ములు పెట్టుకుంటే ఎటువంటి సమస్యా ఉండదని ఉషారాణి (81217 96299) అంటున్నారు. శ్రద్ధ ఉంటే ఇంటిపంటల సాగు కష్టమేమీ కాదని ఆమె అన్నారు. -
ప్లాస్టిక్ బాటిల్‌తో పండు ఈగలకు ఎర!
పండు ఈగల వల్ల కూరగాయలు, పండ్లకు నష్టం జరుగుతూ ఉంటుంది. పండు ఈగ కాటేసిన కాయపై ఆ గాటు దగ్గర నుంచి వృత్తాకారంలో కొద్ది రోజుల్లో కుళ్లిపోతుంది. అపురూపంగా పెంచుకుంటున్న సేంద్రియ కూరగాయలు, పండ్లకు పండు ఈగ కలిగించే నష్టం ఇంటిపంటల సాగుదారులను నిరుత్సాహపరుస్తూ ఉంటుంది.. విస్తారంగా సాగు చేసే రైతులను తీవ్ర ఆర్థిక నష్టానికి గురి చేస్తుంటుంది. హైదరాబాద్ జగద్గిరిగుట్ట ఆస్బెస్టాస్ కాలనీకి చెందిన సీనియర్ ఇంటిపంటల సాగుదారు దశిక చంద్రశేఖర శాస్త్రి పండు ఈగలను ఆకర్షించి నశింపజేసేందుకు ప్లాస్టిక్ బాటిల్‌తో ట్రాప్లను తయారు చేసి వాడుతున్నారు. వాడేసిన లీటరు ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌ను తీసుకొని.. దానికి నాలుగు వైపులా ఆంగ్ల క్యాపిటల్ లెటర్ ‘హెచ్’ ఆకారంలో బ్లేడుతో.. కుడి, ఎడమల వైపున రెండు అంగుళాల పొడవున కత్తిరించాలి. మధ్యన (అంగుళం ఎత్తులో) అడ్డంగా కత్తిరించి, ఆ రెండు ముక్కలను(45 డిగ్రీల కోణంలో) లోపలికి వంచాలి. ఈ కిటికీ ద్వారా పండు ఈగ బాటిల్లోకి ప్రవేశించి బయటకు రాలేక.. లోపలే పడిపోతుంది. పండు ఈగను బాటిల్ వైపు ఆకర్షించడానికి పసుపు, నీలం ఆయిల్ పెయింట్ రంగులను బాటిల్‌కు పూస్తున్నారు. పెయింట్ అందుబాటులో లేకపోతే.. ఇన్సులేషన్ టేప్‌ను బాటిల్‌పై అతికించవచ్చని శాస్త్రి సూచిస్తున్నారు. అరటి పండు తొక్కను బెల్లంతో కలిపి.. ఈ బాటిల్లో అడుగున ఉంచాలి. దీని వాసన.. బాటిల్‌పై పసుపు, నీలం రంగులకు పండు ఈగలు ఆకర్షితమై నశిస్తున్నాయని, ఇది చాలా సులభమైన, ఖర్చులేని మార్గమని ఆయన వివరించారు. అరటి పండు తొక్క, బెల్లం పెట్టిన వారం రోజుల వరకు పనిచేస్తుందన్నారు. అరటి తొక్క కుళ్లిపోయిన తర్వాత తీసివేసి, మళ్లీ పెట్టుకోవాలి. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు పండు ఈగలకు ఈ ట్రాప్స్ పెట్టుకుంటే మంచిదని ఆయన తెలిపారు. దీనికి బదులు, చిన్నపాటి సోలార్ ఎల్.ఇ.డి. లైటు కొనుగోలు చేసి పెట్టుకోవచ్చని ఆయన అంటున్నారు. ఈ లైటు పగలు సూర్యరశ్మితో చార్జ్ అవుతుంది. చీకటి పడగానే వెలుగుతుంది. ఈ లైటు అడుగున వాడేసిన ఫుడ్ ప్యాకింగ్ ప్లాస్టిక్ బాక్స్‌ను అమర్చి.. వేపనూనె కలిపిన నీటిని పోయాలి. లైటు రాత్రి 10.30 గం. వరకు వెలుగుతుంది. ఈ వెలుతురుకు దగ్గరకు వచ్చే పండు ఈగలు వేపనూనె నీటిలో పడి చనిపోతాయని శాస్త్రి (81211 58628) వివరించారు. పండు ఈగ సమస్యను అధిగమించడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలకు ‘సాక్షి ఇంటిపంట’ జేజేలు పలుకుతోంది. చంద్రశేఖర శాస్త్రి, ∙పండు ఈగ, సోలార్ లైట్ ట్రాప్ -
26న ఇంటిపంటల సాగుపై హైదరాబాద్‌లో రైతునేస్తం శిక్షణ
ఇంటి ఆవరణలో, మేడలపైన సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు, ఔషధ మొక్కలను పెంచుకునే పద్ధతులపై ఈ నెల 26 (ఆదివారం) హైదరాబాద్, రెడ్‌హిల్స్, లక్డీకాపూల్‌లోని ఫ్యాప్సీ ఆడిటోరియంలో అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై.వెంకటేశ్వరరావు తెలిపారు. ఇంటిపంటల సాగులో అనుభవజ్ఞులు, శాస్త్రవేత్తలు, ఉద్యాన అధికారులు సదస్సులో పాల్గొని సూచనలు ఇస్తారన్నారు. ఉ. 10 గంటల నుంచి సా. 4 గం.ల వరకు సదస్సు జరుగుతుంది. జాతీయ విత్తన సంస్థ వారి కూరగాయ పంటల విత్తనాలను అందిస్తున్నామని, సేంద్రియ భోజనం ఉంటుందన్నారు. ఆసక్తిగల వారు 98493 12629, 94905 59999 నంబర్లలో ముందుగా పేర్లు నమోదు చేయించుకోవాలి. 26న కషాయాలు, ద్రావణాలపై కొర్నెపాడులో రైతులకు శిక్షణ రైతునేస్తం ఫౌండేషన్ ప్రతి ఆదివారం శిక్షణలో భాగంగా ఈ నెల 26న గుంటూరు జిల్లా పుల్లడిగుంట సమీపంలోని కొర్నెపాడులో సేంద్రియ వ్యవసాయంలో పంటలను ఆశించే తెగుళ్లు, చీడపీడల నివారణకు ఉపయోగించే కషాయాలు, ద్రావణాల తయారీ, వరి, కూరగాయల సాగుపై సీనియర్ సేంద్రియ రైతులు విజయ్‌కుమార్ (కడప), ధర్మారం బాజి (గుంటూరు) శిక్షణ ఇస్తారు. ఆసక్తిగల రైతులు 0863 2286255 నంబరులో సంప్రదించవచ్చు. -
ఇంటిపట్టునే సేంద్రియ కూరగాయలు, చేపల సాగు!
- చేపల విసర్జితాలతో కూడిన నీటితోనే పంటల సాగు - మట్టి లేకుండా బేబీ చిప్స్‌లో పంటల సాగు గుప్పెడు మట్టి లేకుండా.. చిటికెడు ఎరువు వే యకుండా, పురుగు మందులను పిచికారీ చేయకుండా ఒకేచోట.. సేంద్రియ పద్ధతుల్లో అటు చేపలు, ఇటు ఆకుకూరలు, కూరగాయలను పండించడాన్ని ‘ఆక్వాపోనిక్స్’ అంటారు. ట్యాంకులో చేపలు, పక్కనే కుండీల్లో కూరగాయ పంటలు పండిస్తూ.. చేపల విసర్జితాలతో కూడిన పోషక జలాన్ని కుండీల్లో మొక్కలకు అందిస్తే.. వేరే ఎరువులు అవసరం లేకుండానే పంటలూ పండుతాయి. ఇదే ఆక్వాపోనిక్స్ పద్ధతి. ఈ పద్ధతిలో ఇంటిపట్టునే సేంద్రియ చేపలు, సేంద్రియ ఇంటిపంటలను సాగు చేస్తున్నాడో వికలాంగ యువకుడు.. అందె జాన్ రాబర్ట్సన్ పోలియో బాధితుడు. చిన్నతనంలోనే పోలియోసోకి ఎడమకాలు చచ్బుబడినా చేతి కర్రలే ఊతంగా నడవడమే కాకుండా.. ఆత్మవిశ్వాసంతో ఆక్వాపోనిక్స్ పద్ధతిలో సేంద్రియ ఇంటిపంటలు పండిస్తున్నాడు. ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం ఆయన స్వగ్రామం. రాబర్ట్సన్ 2014 నవంబర్‌లో ఆక్వాపోనిక్స్ సాగుకు శ్రీకారం చుట్టారు. తొలుత 5 అడుగుల వెడల్పు, 10 అడుగుల పొడవు, 6 అడుగుల ఎత్తు గల ప్లాస్టిక్ ట్యాంక్‌ను ఏర్పాటు చేసి నీటితో నింపారు. అందులో తిలాపియా, జలలు, మట్టగుడిసె, చేదుపక్కెలు వంటి 150 చేపపిల్లలను ఈ ట్యాంక్‌లో వదిలారు. వీటి విసర్జితాల ద్వారా ట్యాంకులో నీరు పోషక జలంగా మారుతుంది. ఈ నీటిని మోటార్ ద్వారా నిలువుగా సగానికి కోసిన ప్లాస్టిక్ డ్రమ్ముల్లో సాగవుతున్న కూరగాయలు, పండ్ల మొక్కలకు అందిస్తున్నారు. చేపల విసర్జితాల ద్వారా విడుదలైన నత్రజని, భాస్వరం వంటి పోషకాలతోనే ఈ పంటలు పండుతున్నాయి. మట్టికి బదులు బేబీ చిప్స్.. ఈ విధానంలో ఇంటిపంటల సాగులో మట్టిని వాడరు. మొక్కల పెంపకానికి 250 లీటర్ల నీరుపట్టే ప్లాస్టిక్ డ్రమ్ములను వాడుతున్నారు. ఒక్కో డ్రమ్మును నిలువుగా రెండు చీలికలు చేసి.. క్రషర్ నుంచి తెచ్చిన సన్న కంకర (బేబీ చిప్స్)తో నింపారు. కంకరలో రెండు అంగుళాల లోతులో నారు లేదా విత్తనాలు నాటుతారు. చేపల ట్యాంక్ నుంచి మొక్కలకు నీటిని అందించేందుకు ప్లాస్టిక్ పైపులను అమర్చారు. నీరు మొక్కలను పెంచే డబ్బాల్లోకి వచ్చేందుకు, తిరిగి చేపల తొట్టెలోకి వెళ్లేందుకు ప్లాస్టిక్ పైపులను అమర్చారు. ఇంటిపంటలకు వీటి ద్వారా రోజూ 10 గంటల పాటు పోషక జలం నిరంతరాయంగా సరఫరా అవుతుంది. నీటిని సరఫరా చేసేందుకు మోటార్‌ను, విద్యుత్ కోసం సౌరఫలకాలను ఏర్పాటు చేసుకున్నారు. ఆక్వాపోనిక్స్ సాగు వ్యవస్థను ఏర్పాటు చేయడానికి మొత్తం రూ. 2 లక్షల ఖర్చయిందని, తన సోదరుడు, స్నేహితుల తోడ్పాటుతో ఏర్పాటు చేశానని రాబర్ట్సన్ తెలిపారు. కుటుంబానికి సరిపడా కూరగాయలు, చేపల సాగు గోంగూర, తోటకూర, పుదీనా వంటి ఆకుకూరలను, బీర, సొర, కాక ర, బెండ, వంగ వంటి కాయగూరలను, బొప్పాయి వంటి పండ్ల మొక్కలను రాబర్ట్సన్ సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఆరుగురు సభ్యులు గల తమ కుటుంబానికి సరిపడా కూరగాయలను పండిస్తున్నారు. చేపలను తమ ఇంటి అవసరాలకు విడతకు పట్టుబడి చేస్తారు. ఏడాదిన్నరలో విడతకు 15 కిలోల చొప్పున 5 సార్లు చేపల దిగుబడి వచ్చింది. ప్రతి రెండు నెలలకోసారి చేపల తొట్టెను ఖాళీ చేసి, కొత్త నీటితో నింపుతారు. చేపలకు, మొక్కలకు ప్రత్యేకంగా ఎటువంటి ఎరువులు, పురుగుమందులు వాడాల్సిన అవసరం లేదని రాబర్ట్సన్ చెబుతున్నాడు. ఎలాంటి రసాయనాలు వేయకుండా పండిస్తున్న ఉత్పత్తులు కావటంతో తమకూ కావాలని కొందరు అడుగుతున్నారు. ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తే.. దీన్ని మరింత విస్తరించి ఉపాధి మార్గంగా మార్చుకుంటానని రాబర్ట్సన్ (99497 19220) అంటున్నారు. వినూత్నమైన స్వయం ఉపాధి మార్గాన్ని ఎంపిక చేసుకున్న రాబర్ట్‌సన్‌కు జేజేలు! - గుర్నాధం, సాక్షి, చీరాల టౌన్, ప్రకాశం జిల్లా