ఇంటిపంటలతో ఉషారాణి, ఇంటిపంటల్లో ఉషారాణి
వ్యవసాయ శాఖలో అదనపు సంచాలకురాలిగా పనిచేస్తున్న ఉషారాణి తమ కుటుంబం కోసం ఇంటిపైనే సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను సాగు చేస్తున్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని రైతు శిక్షణా కేంద్రంలో సహాయ సంచాలకులుగా పనిచేస్తున్న ఉషారాణి బిహెచ్‌ఇఎల్ సమీపంలోని తమ స్వగృహంపై ఇంటిపంటలు సాగు చేస్తూ.. ఉల్లిపాయలు తప్ప ఇతరత్రా అన్నీ తానే పండించుకుంటున్నారు. ఆమె భర్త యలమంద వృత్తిరీత్యా బీహెచ్‌ఈఎల్ ఇంజినీర్. ఆయన సహాయంతో టెర్రస్‌పై ఇనుప ఊచలతో పందిరిని ఏర్పాటు చేసుకొని తీగజాతి కూరగాయ పాదులను దానిపైకి పాకిస్తూ, నిశ్చింతగా ఇంటిపంటలు పండిస్తున్నారు.
200 లీటర్ల ఫైబర్ డ్రమ్మును మధ్యకు కత్తిరించి రెండు మడులుగా వాడుతున్నారు. వీటితోపాటు ప్లాస్టిక్ కుండీలు, ఖాళీ బక్కెట్లలో కూడా అనేక రకాల ఆకుకూరలతోపాటు కూరగాయలను సాగు చేస్తున్నారు. డ్రమ్ముల అడుగున హాలో బ్రిక్స్ పెట్టడం వల్ల టెర్రస్‌పైన పడిన నీరు వెంటనే పల్లానికి వెళ్లిపోవడానికి వీలవుతోంది. ఎర్రమట్టి, కొబ్బరిపొట్టు, వర్మీకంపోస్టు సమపాళ్లలో వేస్తారు. వేపపిండి, బోన్‌మీల్, జీవన ఎరువులు కొద్ది మొత్తంలో కలుపుతారు. వంటింటి వ్యర్థాలు, ఎండు పూలతో ఆవు పేడ స్లర్రీని వేసి కంపోస్టును తయారు చేసుకుంటారు. ఈ కంపోస్టును, సముద్రపు నాచుతో తయారైన గ్రాన్యూల్స్‌ను పూత, కాత సమయాల్లో మొక్కలకు అడపా దడపా వేస్తుంటారు. పురుగులు ఏమైనా కనిపిస్తే అవి చిన్నగా ఉన్నప్పుడే పుల్లమజ్జిగ, పచ్చిమిర్చి వెల్లుల్లి ద్రావణం వంటి వాటిని పిచికారీ చేస్తుంటారు.
6 రకాల వంకాయలను సాగు చేస్తున్నారు. బెండ, వంగ, బంగాళదుంపలు, ముల్లంగి, క్యారెట్, బీట్‌రూట్ వంటి కూరగాయలను సాగు చేస్తున్నారు. దొండ పాదును ఇనుప పందిరిపైకి పాకించలేదు. ఇది బాగా అల్లుకుపోయి ఇతర కూరగాయ మొక్కలను పెరగకుండా చేస్తుందన్న భావనతో ట్రెల్లిస్‌పైకి పాకించానని ఉషారాణి తెలిపారు. అనేక పండ్ల మొక్కలను కూడా ఆమె సాగు చేస్తున్నారు. స్వీట్ లైమ్, వాటర్ ఆపిల్, అంజూర, నిమ్మ, దానిమ్మ, మామిడి, ప్యాషన్ ఫ్రూట్ తదితర పండ్ల మొక్కలను సాగు చేస్తున్నారు. ప్యాషన్ ఫ్రూట్ పాదును ఇంటి ముందు నేలలో నాటి, మేడపైకి పాకించారు. అత్యంత పోషక విలువలున్న ఈ పండ్లు చాలా ఎక్కువ సంఖ్యలో కాస్తున్నాయని ఆమె తెలిపారు. ప్యాషన్ ఫ్రూట్ రసం చాలా రుచికరంగా ఉంటుందన్నారు. ఇంటిపంటలకు అందుబాటులో ఉన్న ఏదో ఒక పోషక పదార్థాన్ని అడపా దడపా వేస్తూ ఉంటే పోషక లోపం లేకుండా మొక్కలు చక్కగా పెరుగుతూ దిగుబడులనిస్తాయని ఆమె అన్నారు.
ఆపిల్ బెర్ మొక్క ఒకసారి ఎండిపోయింది. శిలీంద్రనాశిని అయిన ట్రైకోడెర్మా విరిడి పొడిని తెచ్చి మట్టిలో కలిపిన తర్వాత తిరిగి కొత్త చిగుర్లు వేసిందని ఆమె తెలిపారు. కొంచెం ప్రణాళికా బద్ధంగా సీజన్ల వారీగా నార్లు పోసుకుంటూ మొక్కలు నాటుకుంటూ ఉంటే ఏడాది పొడవునా ఇంటిపైనే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను సాగు చేసుకోవడం సులువేనని ఆమె తెలిపారు. ఫిబ్రవరిలో కాపు పొందాలనుకుంటున్న కూరగాయ మొక్కలకు సంబంధించి ఇప్పటికే తాను నారు పోశానన్నారు. భవనానికి ఇంటిపంటల కుండీలు, డ్రమ్ములు బరువై పోతాయని, భవనానికి ఏదైనా నష్టం జరుగుతుందన్న అపోహలు అవసరం లేదని ఆమె అంటారు. వాటర్ ప్రూఫింగ్ చేసిన టెర్రస్‌పైన హాలో బ్రిక్స్ పెట్టుకొని వాటిపై కుండీలు, డ్రమ్ములు పెట్టుకుంటే ఎటువంటి సమస్యా ఉండదని ఉషారాణి (81217 96299) అంటున్నారు. శ్రద్ధ ఉంటే ఇంటిపంటల సాగు కష్టమేమీ కాదని ఆమె అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment