fruit farmer
-
40 వేల డ్రాగన్ ఫ్రూట్ మొక్కలతో 5 ఎకరాల్లో పంట
-
పండ్ల రైతు కంటతడి..
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ పండ్ల రైతుల కంట కన్నీరు తెప్పిస్తోంది. ఎక్కువగా పండ్ల అమ్మకాలు జరిగే వేసవిలో అనూహ్యంగా తెరపైకి వచ్చిన ఈ మహమ్మారి పండ్ల తోటల్లో కనిపించని విషాదాన్ని నింపుతోంది. లాక్‌డౌన్‌తో రవాణా సమస్య ఎదురవుతుండడం తో ఒక రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే పండ్లను ఇత ర రాష్ట్రాలకు తరలించే అవకాశం లేక..నిల్వ చేయలేని పండ్లను కొన్ని ప్రాంతాల్లో రైతులు పారబోస్తుండగా, మరికొన్ని చోట్ల తక్కువ ధరలకు అమ్మేసుకుని వచ్చినదాంతో సరిపెట్టుకుంటున్నారు. దేశంలో 9కోట్ల మంది రైతులు పండ్లతోటలు, ఉత్పత్తులపై ఆధారపడి వ్యవసాయం చేస్తుండగా, ఈ సీజన్లో అన్ని రకాల ఉద్యానపంటలు కలిపి 310 మిలియన్ టన్నులకు పైగా ఉత్పత్తి అవుతాయని, అందులో 96 మిలియన్ టన్నులు పండ్లు ఉంటా యని భారతీయ రైతు అసోసియేషన్ల కన్సార్షియమ్ లెక్కలు చెబుతున్నాయి. లాక్డౌన్ ఇ లాగే కొనసాగితే ఈ ఏడాది పండ్ల రైతులకు వేల కోట్ల నష్టం వాటిల్లనుందని అంచనా. సీజన్లోనే సమస్య రవాణా, మార్కెట్ సౌకర్యాల్లేక తెలంగాణలో ఎక్కువగా పండే పుచ్చకాయలు రూ.5కే అమ్ముతుండగా, మహారాష్ట్రలో ఆపిల్, ద్రాక్ష పండ్లను రైతులు పారబోస్తున్నారు. అర టి, కర్బూజ, కొబ్బరి బోండాలు వంటి ఇ ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే పంటలు కూడా రావడం తగ్గిపోయాయి. ఇక, గత నెలలోనే చాలా రాష్ట్రాల నుంచి పండ్లు హైదరాబాద్ శివార్లలోని కోల్డ్ స్టోరేజీలకు చేరుకున్నాయి. వీటిని శీతల గిడ్డంగుల్లో నిల్వ ఉంచి దేశంలోని పలు రాష్ట్రాలకు రవాణా చేసుకోవాలన్న ఉద్దేశంతో రైతులు వాటిని తీసుకువచ్చారు. ఇప్పుడు వీటిని తరలించే అవకాశం లేకుండా పోవడంతో ఎక్కడ నష్టపోవాల్సి వస్తుందోనని వాపోతున్నారు. వీటితో పాటు హైదరాబాద్ శివార్లలో ఉన్న వందలాది పాలీహౌస్‌లలో ఎగుమతులకు అనుకూలంగా ఉండే వేలాది టన్నుల పండ్లు ఉత్పత్తి అవుతున్నాయి. వీరికీ నష్టాలు తప్పేలా లేవు. కూరగాయలు కూడా... పండ్లతో పాటు కూరగాయలు కూడా దేశవ్యాప్తంగా రవాణా సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతానికి సమీప ప్రాంతాల్లో రవాణా చేసుకునేందుకు ఇబ్బందులు లేకపోయినా, అంతర్జిల్లా, అంతర్ర్రాష్ట్ర రవాణాకు ప్రస్తుత పరిస్థితులు అనుకూలించడం లేదు. దేశ వ్యాప్తంగా ఏడాదికి వంకాయలు 12.98 మిలియన్ టన్నులు, టమాటా 20, ఆలుగడ్డ 52. 58, ఉల్లిగడ్డలు 23, బఠానీలు 5 మిలియన్ ట న్నులు ఉత్పత్తి అవుతాయని అంచనా. ఇవన్నీ రవాణా సమస్యతో మగ్గిపోతున్నాయి. గతంలో ఎప్పుడూ చూడలేదు ‘కరోనా వైరస్ ప్రభావం పండ్లపై బాగా కనిపిస్తోంది. ఈ వైరస్ నియంత్రణకు చేపడుతున్న చర్యల కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి మార్కెట్లోకి పండ్లు రావడం లేదు. వ్యాపారులు ఇతర రాష్ట్రా లకు వెళ్లి పండ్ల బేరం చేసే అవకాశం లేకపో యింది. లాక్డౌన్ ఎత్తివేసి మళ్లీ సాధారణ పరిస్థితులు ఏర్పడితే కానీ పండ్ల మార్కెట్‌కు మంచి రోజులు రావు.’ – రెహమాన్‌ఖాన్, పండ్లవ్యాపారి, మిర్యాలగూడ -
కానరీ మిలన్
తక్కువ రోజుల్లో ఎక్కువ లాభాలనిచ్చే కొత్త పంట కానరీ మిలన్ పండ్లను సాగు చేస్తున్నారు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మిర్దాపల్లి గ్రామానికి చెందిన ఆదర్శ రైతు కల్లెం నర్సింహారెడ్డి. పసుపురంగులో దోసకాయ మాదిరిగా ఉంటుంది. కానీ ఇది కూరగాయ కాదు. తర్బూజ మాదిరిగా తియ్యగా ఉండే పండు ఇది. నాలుగైదు నెలల్లో కోతకు వచ్చే వరి, మొక్కజొన్న వంటి పంటలు సాగు చేసి సరైన ధర లేక కష్టనష్టాలను ఎదుర్కోవడం కంటే కానరీ మిలన్‌ను సాగు చేయడం మేలని నర్సింహారెడ్డి భావిస్తున్నారు. పంటను ప్యాకింగ్ చేస్తున్న కూలీలు మంచి పోషక విలువలు కలిగి ఉండటంతో కానరీ మిలన్‌ను ఢిల్లీతో పాటు, అనేక ఉత్తరాది రాష్ట్రాల్లో దీనికి డిమాండ్ ఉంది. శీతలగిడ్డంగిలో పెడితే నెల రోజులైనా నిల్వ ఉంటుంది. అరబ్ దేశాలకు కూడా ఎగుమతి అవుతున్నట్లు చెబుతున్నారు. అనంతపురం ప్రాంత రైతులు కొంత కాలం క్రితం నుంచే కానరీ మిలన్‌ను సాగు చేసి ఢిల్లీ మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు. నిజామాబాద్ ప్రాంతంలో తొలుత నర్సింహారెడ్డి ఆరెకరాల్లో ఈ పంటను సాగు చేస్తున్నారు. ఆయన సమీప బందువులు కూడా ఈ పంటను సాగు చేస్తున్నారు. విత్తనం ధర అధికం తైవాన్ నుంచి తెప్పించే హైబ్రిడ్ విత్తనాన్ని వాడాల్సి రావడం వల్ల ధర ఎక్కువగా ఉంటున్నది. ప్రతి పంటకూ విత్తనం కొని వేయాల్సిందే. కానరీ మిలన్లో రెండు రకాలున్నాయి. వేసవి సీజన్లో అధిక దిగుబడినిచ్చే రకం కొయినూర్ రకం. ఇది చలిని తట్టుకోలేదు. చలికాలంలో వేరే రకం వెయ్యాలి. మరో పది రోజుల్లో ఆ రకం విత్తబోతున్నాను అన్నారు నర్సింహారెడ్డి. రవాణా ఖర్చు కిలోకు రూ. 20 ఎకరానికి 10–15 టన్నుల కానరీ మిలన్ పండ్ల దిగుబడి వస్తుంది. ఢిల్లీ తీసుకెళ్లి టోకున అమ్మితే కిలోకు రూ. 50 నుంచి 60 రూపాయల ధర పలుకుతుంది. పాదికి రెండు లేక మూడు పిందెలను మాత్రమే ఉంచుతారు. పండు కిలోన్నర రెండు కిలోల బరువు వరకు పెరుగుతుంది. కిలోకన్నా ఎక్కువ బరువున్న పండే రుచిగా ఉంటుంది. ధర కూడా పలుకుతుంది. అట్ట పెట్టెకు ఆరు నుంచి ఏడు కాయలను ప్యాక్ చేసి లారీల్లో ఢిల్లీ మార్కెట్‌కు రవాణా చేస్తున్నారు. రవాణాకు సిద్ధ్దమైన కానరీ మిలన్, రైతు నర్సింహారెడ్డి అయితే, లారీల్లో సరుకు ఇక్కడి నుంచి తీసుకెళ్లడానికి కిలోకు రూ. 20 వరకు ఖర్చవుతుంది. హైదరాబాద్‌లో దీనికి కిలోకు రూ. 30 ధర వచ్చినా మంచిదే. అయితే, మన వాళ్లకు ఈ పండు తెలియదు. గత ఏడాది శివరాత్రికి పది టన్నులు పంపి హైదరాబాద్‌లో అమ్మాం. స్థానికంగా మార్కెట్ పెరిగితే బాగుంటుందని నర్సింహారెడ్డి అన్నారు. దుక్కికి రూ.10 వేలు, పశువుల ఎరువుకు రూ.పది వేలు, మల్చింగ్, ఎరువులకు మరో రూ.20 వేలు, ఇతర ఖర్చులు మరో 15 వేల వరకు ఉంటాయి. రవాణా ఖర్చులు, మధ్యవర్తుల కమిషన్లు పోగా ఎకరానికి రూ. లక్ష వరకు నికరాదాయం ఆర్జిస్తున్నారు నర్సింహారెడ్డి. రోజూ పొలం అంతా కలియదిరగాలి సున్నితమైన హైబ్రిడ్ పంట కావడంతో పంటను ప్రతిపూటా రైతు స్వయంగా తడిమి చూసుకుంటూ కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి ఉంటుంది. కూలీలపై వదిలేస్తే ఏమాత్రం కుదరదు. రోజూ ఏదో ఒక పూట పొలం అంతా కలియదిరగాల్సిందే. చీడపీడలేమైనా సోకాయేమో స్వయంగా చూసుకోవాలి. దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోకపోతే నష్టాలు పాలు కావాల్సి వస్తుందని నర్సింహారెడ్డి(97052 02562) చెబుతున్నారు. – పాత బాలప్రసాద్, సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ 65 రోజుల్లో పంట చేతికి.. ఇది మెట్ట ప్రాంతపు పంట. నీరు ఎక్కువగా ఉండకూడదు. వర్షాకాలం దీని సాగుకు అనువైన కాలం కాదు. ఈ ఏడాది వర్షాలు నెల రోజులు ఎక్కువగా పడటం వల్ల తమ పంట దెబ్బతిన్నదని నర్సింహారెడ్డి తెలిపారు. వర్షం వల్ల కాయ తీపి కూడా తగ్గిందన్నారు. ఎకరం వరి సాగుకు అవసరమయ్యే నీటితో కనీసం నాలుగు ఎకరాల్లో ఈ పంటను పండించవచ్చని ఆయన చెబుతున్నారు. విత్తనం వేసిన తర్వాత 60 నుంచి 65 రోజుల్లో పంట చేతికందుతుంది. స్వల్పకాలిక పంట కావడంతో ఏడాదిలో రెండు నుంచి మూడు పంటలు పండించవచ్చని నర్సింహాæరెడ్డి తెలిపారు. ఎకరంలో ఎత్తు మడుల(బెడ్స్‌పై)పై మల్చింగ్ షీట్ పరచి సాగు చేయడానికి మొదట సుమారు రూ. 75 వేల వరకు ఖర్చవుతుందని, రెండు, మూడో పంటలకు ఖర్చు తగ్గుతుందన్నారు. -
ఉల్లి తప్ప ఏమీ కొనను!
వ్యవసాయ శాఖలో అదనపు సంచాలకురాలిగా పనిచేస్తున్న ఉషారాణి తమ కుటుంబం కోసం ఇంటిపైనే సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను సాగు చేస్తున్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని రైతు శిక్షణా కేంద్రంలో సహాయ సంచాలకులుగా పనిచేస్తున్న ఉషారాణి బిహెచ్ఇఎల్ సమీపంలోని తమ స్వగృహంపై ఇంటిపంటలు సాగు చేస్తూ.. ఉల్లిపాయలు తప్ప ఇతరత్రా అన్నీ తానే పండించుకుంటున్నారు. ఆమె భర్త యలమంద వృత్తిరీత్యా బీహెచ్ఈఎల్ ఇంజినీర్. ఆయన సహాయంతో టెర్రస్‌పై ఇనుప ఊచలతో పందిరిని ఏర్పాటు చేసుకొని తీగజాతి కూరగాయ పాదులను దానిపైకి పాకిస్తూ, నిశ్చింతగా ఇంటిపంటలు పండిస్తున్నారు. 200 లీటర్ల ఫైబర్ డ్రమ్మును మధ్యకు కత్తిరించి రెండు మడులుగా వాడుతున్నారు. వీటితోపాటు ప్లాస్టిక్ కుండీలు, ఖాళీ బక్కెట్లలో కూడా అనేక రకాల ఆకుకూరలతోపాటు కూరగాయలను సాగు చేస్తున్నారు. డ్రమ్ముల అడుగున హాలో బ్రిక్స్ పెట్టడం వల్ల టెర్రస్‌పైన పడిన నీరు వెంటనే పల్లానికి వెళ్లిపోవడానికి వీలవుతోంది. ఎర్రమట్టి, కొబ్బరిపొట్టు, వర్మీకంపోస్టు సమపాళ్లలో వేస్తారు. వేపపిండి, బోన్మీల్, జీవన ఎరువులు కొద్ది మొత్తంలో కలుపుతారు. వంటింటి వ్యర్థాలు, ఎండు పూలతో ఆవు పేడ స్లర్రీని వేసి కంపోస్టును తయారు చేసుకుంటారు. ఈ కంపోస్టును, సముద్రపు నాచుతో తయారైన గ్రాన్యూల్స్‌ను పూత, కాత సమయాల్లో మొక్కలకు అడపా దడపా వేస్తుంటారు. పురుగులు ఏమైనా కనిపిస్తే అవి చిన్నగా ఉన్నప్పుడే పుల్లమజ్జిగ, పచ్చిమిర్చి వెల్లుల్లి ద్రావణం వంటి వాటిని పిచికారీ చేస్తుంటారు. 6 రకాల వంకాయలను సాగు చేస్తున్నారు. బెండ, వంగ, బంగాళదుంపలు, ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ వంటి కూరగాయలను సాగు చేస్తున్నారు. దొండ పాదును ఇనుప పందిరిపైకి పాకించలేదు. ఇది బాగా అల్లుకుపోయి ఇతర కూరగాయ మొక్కలను పెరగకుండా చేస్తుందన్న భావనతో ట్రెల్లిస్పైకి పాకించానని ఉషారాణి తెలిపారు. అనేక పండ్ల మొక్కలను కూడా ఆమె సాగు చేస్తున్నారు. స్వీట్ లైమ్, వాటర్ ఆపిల్, అంజూర, నిమ్మ, దానిమ్మ, మామిడి, ప్యాషన్ ఫ్రూట్ తదితర పండ్ల మొక్కలను సాగు చేస్తున్నారు. ప్యాషన్ ఫ్రూట్ పాదును ఇంటి ముందు నేలలో నాటి, మేడపైకి పాకించారు. అత్యంత పోషక విలువలున్న ఈ పండ్లు చాలా ఎక్కువ సంఖ్యలో కాస్తున్నాయని ఆమె తెలిపారు. ప్యాషన్ ఫ్రూట్ రసం చాలా రుచికరంగా ఉంటుందన్నారు. ఇంటిపంటలకు అందుబాటులో ఉన్న ఏదో ఒక పోషక పదార్థాన్ని అడపా దడపా వేస్తూ ఉంటే పోషక లోపం లేకుండా మొక్కలు చక్కగా పెరుగుతూ దిగుబడులనిస్తాయని ఆమె అన్నారు. ఆపిల్ బెర్ మొక్క ఒకసారి ఎండిపోయింది. శిలీంద్రనాశిని అయిన ట్రైకోడెర్మా విరిడి పొడిని తెచ్చి మట్టిలో కలిపిన తర్వాత తిరిగి కొత్త చిగుర్లు వేసిందని ఆమె తెలిపారు. కొంచెం ప్రణాళికా బద్ధంగా సీజన్ల వారీగా నార్లు పోసుకుంటూ మొక్కలు నాటుకుంటూ ఉంటే ఏడాది పొడవునా ఇంటిపైనే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను సాగు చేసుకోవడం సులువేనని ఆమె తెలిపారు. ఫిబ్రవరిలో కాపు పొందాలనుకుంటున్న కూరగాయ మొక్కలకు సంబంధించి ఇప్పటికే తాను నారు పోశానన్నారు. భవనానికి ఇంటిపంటల కుండీలు, డ్రమ్ములు బరువై పోతాయని, భవనానికి ఏదైనా నష్టం జరుగుతుందన్న అపోహలు అవసరం లేదని ఆమె అంటారు. వాటర్ ప్రూఫింగ్ చేసిన టెర్రస్‌పైన హాలో బ్రిక్స్ పెట్టుకొని వాటిపై కుండీలు, డ్రమ్ములు పెట్టుకుంటే ఎటువంటి సమస్యా ఉండదని ఉషారాణి (81217 96299) అంటున్నారు. శ్రద్ధ ఉంటే ఇంటిపంటల సాగు కష్టమేమీ కాదని ఆమె అన్నారు. -
ఉద్యానానికి ఊతం
కడప అగ్రికల్చర్ : సంప్రదాయ పంటలతో పోల్చితే పండ్లు, కూరగాయల తోటల నుంచి రైతులకు స్థిరమైన ఆదాయం అందుతోంది. అతివృష్టిŠ, అనావృష్టి పరిస్థితుల ప్రభావం ఉద్యాన పంటలపై అంతగా ఉండకపోవడంతో దిగుబడులకు ఎలాంటి ఢోకా లేదు. రైతులకు కరువు పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు ఉద్యానశాఖ పండ్లు, కూరగాయ పంటల సాగును ప్రోత్సహిస్తోంది. జిల్లాలో నీటి వనరులున్న బోరుబావుల కింద, నదీతీర ప్రాంతాల రైతులు సూక్ష్మ సేద్యంతో పండ్లు, కూరగాయ తోటలను సాగు చేసుకుని ఆదాయం పొందుతున్నారు. ఉద్యానశాఖ కూడా ఆయా రైతులకు పంటల సాగుపై శిక్షణ ఇచ్చి మెలకువలు నేర్పించి సాగుకు చేయూతనిస్తోంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం (ఎంఐడీహెచ్), రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ద్వారా నిధులను మంజూరు చేసింది. ఉద్యాన తోటల సాగుకు సింహ భాగం కేంద్ర ప్రభుత్వ ని«ధులు పథకాలకు సమకూరుతుండగా, రాష్ట్రాభివృద్ధి ప్రణాళిక కింద అరకొరగానే నిధులు మంజూరయ్యాయి. రైతులు అనాదిగా వరి, వేరుశనగ, కంది, మినుము, పెసర తదితర పంటలు సాగు చేసినా వానలు కురవక దిగుబడులు రాక పెట్టుబడులు కూడా రాక తీవ్రంగా నష్టపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ దశలో వ్యవసాయ పంటల నుంచి రైతులు ఉద్యాన పంటల సాగువైపు దృషి సారిస్తున్నారు. 52817.7 పథక యూనిట్లకు..... రూ.38.03 కోట్లు మంజూరు.. జిల్లాలోని ఉద్యానశాఖ–1,2 డివిజన్లలో పండ్లు, కూరగాయతోటలు, పథల్లో ఇతరత్రా ఆర్థిక అవసరాల కోసం నిధుల నివేదికలను తయారు చేశారు. జిల్లా ఉద్యానశాఖ రూ.41 కోట్లు అవసరమవుతాయని ప్రతి పాదనలు పంపగా రూ.38.03 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వం నుంచి సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం (ఎంఐడీహెచ్) కింద రూ.25.70 కోట్ల ని«ధులు, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద రూ.11 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాభివృద్ధి ప్రణాళికలో రూ.1.33 కోట్లు మంజూరయ్యాయి. దీంట్లో ఇప్పటికి జిల్లా ఉద్యానశాఖ 1, 2లో 52817.7 యూనిట్లకు రూ.24.46 కోట్లు ఖర్చు చేశారు. జిల్లాకు మంజూరైన నిధులు ఖర్చు చేయగానే మరిన్ని నిధులు మళ్లీ వస్తాయని అధికారులు అంటున్నారు. కేంద్ర నిధులు అధికంగా వస్తున్నాయని, రాష్ట్ర నిధులే అరకొరగా ఉంటున్నాయని శాఖలోని కిందిస్థాయి అధికారులు అభిప్రాయపడుతున్నారు. అరటి, జామ, దానిమ్మ పంటపైనే రైతుల ఆసక్తి.. జిల్లాలో కొద్దొ గొప్పో నీటి వనరులున్న ప్రాంతాల రైతులు అరటి, జామ, దానిమ్మ పంటలపై ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రధానంగా రైతులు ఆయా పంటలను సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తుండడం గమనార్హం. అరటి, జామ, దానిమ్మ పంటలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో రైతులు ఆ పంటలపైనే దృష్టి సారించారు. జిల్లాలో అరటి 22,641 హెక్టార్లలోను, దానిమ్మ 700 హెక్టార్లు, జామ తోటలు 500 హెక్టార్లలోను సాగయ్యాయి. ఉద్యానశాఖ సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహిస్తుండడంతో చిన్న, సన్నకారు రైతులు ఆయా పంటలను సాగు చేసుకుని లబ్ధి పొందుతున్నారు. ఎకరాకు ఎంత హీనంగా వేసుకున్నా పెట్టుబడులు, ఇతర ఖర్చులు పోను అరటికి రూ.2 లక్షలు, దానిమ్మకు రూ.3లక్షలు, జామకు రూ.2 లక్షలు ఆదాయం వస్తుండడంతో రైతులు ఆ దిశగా ఆయా పంటలపైనే దృష్టి సారిస్తున్నారు. బిందు సేద్యంతో పంటల సాగు.. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి బిందు సేద్యానికి అధిక సబ్సిడీలను ఇచ్చి ప్రోత్సహించారు. దీంతో రైతులకు పండ్లతోటలకు, కూరగాయ తోటలకు నీటి మడవలు వేసే పద్ధతి లేకుండా పోయింది. బిందు సేద్యంతో కేవలం మోటారు ఆన్ చేయగానే అమర్చిన పైపుల నుంచి నీరు లేటర్ల ద్వారా చెట్లకు, మొక్కలకు చేరుతుంటాయి. దీంతో రైతులు కేవలం నీరు సక్రమంగా పోతోందా? లేదా చూసుకుంటే సరిపోతుంది. ఈ విధానం అందుబాటులోకి వచ్చిన తరువాత రైతు పని సులభమైంది. మోటారు ఆన్‌చేసి ఇతరత్రా పొలం పనులు చేసుకోవడానికి ఎంతో వీలుంటోంది. దీనివల్ల రైతులు పండ్లతోటల సాగుకు పూనుకుంటున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా పండ్లతోటల సాగు బాగా పెరిగింది. ఆయా పంటల్లో కలుపు కూడా అంతగా పెరగదు. ఎరువులు కూడా నేరుగా మొక్కలకు, చెట్లకు చేరేలా చేసుకునే వీలుంటోంది. ఉద్యానశాఖ అమలు చేస్తున్న పథకాల తీరు ఇలా.. జిల్లాలో ఉద్యానశాఖ సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం(ఎంఐడీహెచ్), రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, రాష్ట్రాభివృద్ధి ప్రణాళిక పథకాల ద్వారా పండ్లతోటల్లో మొక్కలు నాటుకున్నది మొదలు మూడు సంవత్సరాల పాటు నిర్వహణ ఖర్చులు, పంటల విస్తరణ, సస్యరక్షణ, రక్షిత సేద్యం, నీటి కుంటల(ఫాంపాండ్స్) ఏర్పాటు, కోతలో గ్రేడింగ్ కేంద్రాలు (ప్యాక్ హౌస్‌లు), యాంత్రీకరణ పరికరాలు, కోత అనంతరం చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు, పంట ఉత్పాదక సంఘాలు, పాత తోటల పునరుద్ధరణ, కూరగాయల సాగు, ఉతకర్రలతో సాగు, శాశ్వత పందిళ్లలో తీగజాతి కూరగాయల సాగు, మార్కెట్‌కు పండ్లు, కూరగాయలను చేరవేసే ప్లాస్టిక్ క్రేట్స్, చిరు సంచుల విత్తనాలు తదితర పథకాలను అమలు చేస్తున్నారు. వీటిని చిన్న, సన్నకారు రైతులే కాక పెద్ద రైతులు వినియోగించుకుంటూ మంచి దిగుబడులు తీస్తూ ఆదాయం పొందుతున్నారు. -
ఆశాజనకంగా డ్రాగన్ ఫ్రూట్ సాగు
కాక్టస్ కుటుంబానికి చెందిన డ్రాగన్ ఫ్రూట్ విదేశాల్లో విరివిగా సాగవుతున్నది. ఔషధ గుణాలు కలిగిన పండు కావడంతో దీనికి అంతర్జాతీయంగా మంచి గిరాకీ ఉంది. దీంతో తెలుగు రైతులు కూడా డ్రాగన్ ఫ్రూట్ పండ్ల తోటల సాగు వైపు దృష్టి మళ్లిస్తున్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడెంకు చెందిన వ్యాపారి కొంపల్లి యాదగిరి థాయిలాండ్ పర్యటనకు వెళ్లినప్పుడు డ్రాగన్ ఫ్రూట్ తోటలను చూసి ఉత్తేజితులయ్యారు. మిర్యాలగూడెం సమీపంలోని మొల్కపట్నం వద్ద తన క్షేత్రంలో ఏడాది క్రితం నుంచి సాగు చేస్తున్నారు. ఆయన అందించిన వివరాలు.. ఇది ఎడారి జాతికి చెందిన మొక్క కావడంతో పెద్దగా నీటి అవసరం వుండదు. ఏడాదిలో 50 సెంటీమీటర్ల వర్షం సరిపోతుంది. సేంద్రియ ఎరువులు వేస్తే మంచి దిగుబడి వస్తుంది. ఒక్కసారి నాటితే 30 ఏళ్ల పాటు దిగుబడి లభిస్తుంది. కోల్‌కతా నర్సరీల నుండి నాణ్యమైన డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను రూ.50ల చొప్పున కొనుగోలు చేశారు. 10్ఠ10 అడుగుల దూరంలో 5 అడుగుల ఎత్తు కలిగిన సిమెంట్ స్తంభాలను పాతారు. స్తంభానికి 8 కేజీల వర్మీకంపోస్టు వేశారు. స్తంభానికి తూర్పు వైపు 2 మొక్కలు, పడమర వైపు 2 మొక్కలు.. ఎకరానికి 400 మొక్కలు నాటారు. 15 రోజులకొకసారి తేలికపాటిగా నీటి తడిని డ్రిప్ ద్వారా అందించాల్సి వుంటుంది. నీరు నిలిచే బంక నేలలు మినహా అన్ని నేలలూ డ్రాగన్ ఫ్రూట్ సాగుకు అనుకూలంగా ఉంటాయి. పూత వచ్చిన 45 రోజుల్లో పండు తయారవుతుంది. నాటిన ఏడాదిలోనే దిగుబడి ప్రారంభమవుతుంది. జూన్ నుండి పూత రావడం ప్రారంభమవుతుంది. శ్రద్ధవహిస్తే 3వ సంవత్సరంలో ఆరు టన్నుల దిగుబడి లభిస్తుంది. పిలకలను కత్తిరించి నర్సరీలో మొక్కలు పెంచి రైతు అమ్ముకోవచ్చు. లేదంటే మరింత విస్తీర్ణంలో నాటుకోవచ్చు. టన్ను ధర రూ. లక్షా 50 వేలు వుంటుంది. సాధారణ సస్యరక్షణ మినహా పెద్దగా ఖర్చులు ఉండవు. 30 సంవత్సరాల పాటు దిగుబడి వస్తుందని చెబుతున్నారు. మార్కెటింగ్‌కు ఎలాంటి సమస్య వుండదని చెబుతున్నారు. అంటు మొక్కలను ఉచితంగా ఇస్తా..! వ్యాపార రీత్యా థాయిలాండ్, వియత్నాం లాంటి దేశాలకు వెళ్లినప్పుడు డ్రాగన్ పండ్ల తోటల సాగును పరిశీలించాను. 15 ఎకరాల బత్తాయి తోట సాగు అనుభవం ఉంది. కొత్త రకం పండ్ల తోటల సాగు చేపట్టే ఉద్దేశంతో డ్రాగన్ ఫ్రూట్ సాగుపై ఏడాదిగా అవగాహన పెంచుకున్నాను. కోల్‌కతా నుంచి మొక్కలు తెప్పించి.. సిమెంట్ కడీల(స్తంభాల)ను, వాటిపైన రింగ్‌లను తయారు చేయించి ఎకరంన్నరలో నాటాను. రూ.5 లక్షల వరకు ఖర్చు పెట్టాను. తొలి ఏడాది టన్నున్నర దిగుబడి వచ్చింది. రెండో∙ఏడాది 6 టన్నుల దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాను. బత్తాయి తోటలో డ్రాగన్ ఫ్రూట్ సాగును 15 ఎకరాలకు విస్తరింప జేయడానికి ఏర్పాట్లు చేస్తున్నా. మార్కెటింగ్‌కు ఎలాంటి ఇబ్బందీ లేదు. ఆసక్తి ఉన్న రైతులకు ఉచితంగా కొన్ని అంటు మొక్కలను ఇస్తాను. – కె.యాదగిరి, డ్రాగన్ ఫ్రూట్ రైతు, మొలకపట్నం, నల్లగొండ జిల్లా (వివరాలకు.. డి. రవి: 99896 50429) – కుంభం వెంకటేశ్వర్లు, సాక్షి, నల్లగొండ రూరల్ -
ఉద్యానంపై కరువు దెబ్బ
► భారీగా పడిపోతున్న దిగుబడులు ► కనీసం పెట్టుబడి కూడా రాని దుస్థితి ► పూలు, పండ్ల రైతుల పరిస్థితీ అంతే.. ► టమాటా పంటపై అధిక ప్రభావం వర్షాభావ పరిస్థితులు ఉద్యాన పంటల్ని అతలాకుతలం చేస్తున్నాయి. వరుసగా కరువు ప్రభావంతో భూగర్భజలాలు పూర్తిగా అడుగంటాయి. దీంతో బోరుబావులపై ఆధారపడిన ఉద్యాన సాగు ప్రస్తుతం సంకటంలో పడింది. ప్రస్తుత రబీ సీజన్లో జిల్లాలో 12,332 హెక్టార్లలో వివిధ రకాల కూరగాయ పంటలు, 4,090 హెక్టార్లలో పండ్లు, పూలతోటలు సాగవుతున్నాయి. తాజాగా వాతావ రణ మార్పులు, వర్షాలలేమి, బోర్లు ఇంకిపోవడం వంటివి ఉద్యాన పంటల దిగుబడులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. - సాక్షి, రంగారెడ్డి జిల్లా జిల్లాలో ఈ సీజన్లో 86,944 మెట్రిక్ టన్నుల టమాటా ఉత్పత్తి కావాల్సి ఉండగా.. అందులో ఏకంగా 30 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి తగ్గే అవకాశం ఉంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా : జిల్లాలో అన్నిప్రాంతాల్లో ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే పంట టమాటా. ప్రస్తుత రబీలో 1,976 హెక్టార్లలో ఈ పంట సాగవుతున్నట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. పరిస్థితులు అనుకూలిస్తే ఒక హెక్టారు విస్తీర్ణంలో 44 మెట్రిక్ టన్నుల టమాటా దిగుబడి వస్తుంది. నీటి శాతం అత్యధికంగా వినియోగమయ్యే ఈ పంటకు డిమాండ్ కూడా బాగానే ఉంది. ఇందులో 80శాతం దిగుబడులు మహానగరంలోని రైతుబజార్లకే తరలుతాయి. తాజా వర్షాభావ పరిస్థితులు టమాటా పంటపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. వర్షాలు లేకపోవడం.. పగటిపూట తేమశాతం తగ్గడంతో పంటలకు తెగుళ్లు సోకుతున్నాయి. ఫలితంగా మూడోవంతు దిగుబడి తగ్గనుందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఈ సీజన్లో 86,944 మెట్రిక్ టన్నుల టమాటా ఉత్పత్తి కావాల్సి ఉండగా.. అందులో ఏకంగా 30 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి తగ్గే అవకాశం ఉంది. ఉల్లి, క్యారెట్ పంటల పైనా.. చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, మేడ్చల్ డివిజన్లలో ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే ఉల్లి, క్యారెట్ పంటలపైనా కరువు తీవ్రత కనిపిస్తోంది. రబీ సీజన్లో జిల్లాలో 1,970 హెక్టార్లలో ఉల్లి, 1,236 హెక్టార్లలో క్యారెట్ పంటలు సాగ వుతున్నాయి. ప్రస్తుతం ఉల్లి సాగు గణనీయంగా పడిపోయింది. ఇప్పటివరకు 1,101 హెక్టార్లలో మాత్రమే సాగైనట్లు వ్యవసాయ శాఖ అధికారుల నివేదికలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఉల్లి దిగుబడి సాధారణం కంటే సగానికి పడిపోనుంది. అదేవిధంగా క్యారెట్ పంటలు సాగుచేస్తున్న ప్రాంతాల్లో బోర్లు పూర్తిగా ఎండిపోయాయి. చేవెళ్ల మండలం గుండాల గ్రామానికి చెందిన భాస్కర్‌రెడ్డి తనకున్న ఆరెకరాల పొలానికి అదనంగా మరో మూడెకరాలు కౌలుకు తీసుకుని క్యారెట్ పంట సాగుచేశాడు. అందులో నాలుగు బోర్లు వేయగా చుక్కనీరు రాకపోవడంతో తీవ్రంగా నష్టపోయాడు. అర ఎకరాలో వంద బస్తాల మేర వచ్చే క్యారెట్ దిగుబడి.. 30 బస్తాలకు పడిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. మొత్తంగా జిల్లాలో కరువు పరిస్థితులు రైతుకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. క్యాబేజీకి రాం రాం.. యాచారం మండలం గున్‌గల్‌కు చెందిన బాసాని నర్సిరెడ్డి మూడెకరాల్లో క్యాబేజీ పంట సాగుచేస్తున్నాడు. మూడేళ్ల క్రితం క్యాబేజీ పంట సాగుచేస్తే ఎకరాకు రూ.లక్ష వరకు ఆర్జించాడు. దీంతో అప్పటినుంచి క్యాబేజీపై ప్రత్యేక దృష్టి సారించాడు. గత రెండేళ్లుగా కరువు వెంటాడుతుండడంతో దిగుబడి భారీగా తగ్గుతోంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో పంటను చీడపీడలు ఆశిస్తున్నాయి. వేరుకుళ్లు పురుగు అధికమవుతోంది. ఎన్ని సార్లు పురుగు మందులు పిచికారీ చేసినా అదుపులోకి రావడం లేదు. ఎకరా పొలంలో సాగు కోసం రూ.40 వేలు ఖర్చు చేస్తే.. కనీసం రూ.20 వేలు కూడా చేతికందడం లేదు. దిగుబడి తగ్గిపోయింది ఇతను నర్సింహారెడ్డి. షాబాద్ మండలం పోలారం. పదేళ్లుగా వంగ పంట సాగుచేస్తున్న ఇతను ఈ ఏడాది రెండెకరాల్లో వేశాడు. ప్రస్తుతం దిగుబడి గణనీయంగా తగ్గింది. ఎకరాకు 30 క్వింటాళ్ల వరకు వచ్చే దిగుబడి.. ఇప్పుడు 15 క్వింటాళ్లకు పడిపోయింది. గతంలో మూడు రోజుల నిడివితో చేతికొచ్చే పంట.. ఇప్పుడు వారం రోజుల సమయం తీసుకుంటోంది. బోరులో నీటి మోతాదు తగ్గడం.. వాతావరణంలో వచ్చిన మార్పులతో లాభాల పోయి నష్టాలే మిగులుతున్నాయి. పంటలకు తెగుళ్లు సోకాయి.. మంచాల మండలం జాపాలకు చెందిన యాట మల్లేష్ మూడున్నరెకరాల్లో కూరగాయ పంటలే సాగు చేస్తున్నాడు. ఎకరాలో టమాటా, మరో ఎకరాలో బెండ వేశాడు. ఇటీవల నెలకొన్న వర్షాభావ పరిస్థితులు.. పగలు, రాత్రి ఉష్ణోగ్రతలో భారీ వ్యత్యాసం కారణంగా టమాటా పంటకు తెగుళ్లు సోకాయి. గతంలో ఎకరాకు నాలుగైదు క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. ఇప్పుడది సగానికి సగం పడిపోయింది. టమాటా పంట ఎకరా సాగుకు కనిష్టంగా రూ.12 వేలు ఖర్చవుతుండగా.. అందులో సగం వచ్చే పరిస్థితి లేదు.