కాక్టస్ కుటుంబానికి చెందిన డ్రాగన్ ఫ్రూట్ విదేశాల్లో విరివిగా సాగవుతున్నది. ఔషధ గుణాలు కలిగిన పండు కావడంతో దీనికి అంతర్జాతీయంగా మంచి గిరాకీ ఉంది. దీంతో తెలుగు రైతులు కూడా డ్రాగన్ ఫ్రూట్ పండ్ల తోటల సాగు వైపు దృష్టి మళ్లిస్తున్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడెంకు చెందిన వ్యాపారి కొంపల్లి యాదగిరి థాయిలాండ్ పర్యటనకు వెళ్లినప్పుడు డ్రాగన్ ఫ్రూట్ తోటలను చూసి ఉత్తేజితులయ్యారు. మిర్యాలగూడెం సమీపంలోని మొల్కపట్నం వద్ద తన క్షేత్రంలో ఏడాది క్రితం నుంచి సాగు చేస్తున్నారు. ఆయన అందించిన వివరాలు..
ఇది ఎడారి జాతికి చెందిన మొక్క కావడంతో పెద్దగా నీటి అవసరం వుండదు. ఏడాదిలో 50 సెంటీమీటర్ల వర్షం సరిపోతుంది. సేంద్రియ ఎరువులు వేస్తే మంచి దిగుబడి వస్తుంది. ఒక్కసారి నాటితే 30 ఏళ్ల పాటు దిగుబడి లభిస్తుంది. కోల్‌కతా నర్సరీల నుండి నాణ్యమైన డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను రూ.50ల చొప్పున కొనుగోలు చేశారు. 10్ఠ10 అడుగుల దూరంలో 5 అడుగుల ఎత్తు కలిగిన సిమెంట్ స్తంభాలను పాతారు. స్తంభానికి 8 కేజీల వర్మీకంపోస్టు వేశారు. స్తంభానికి తూర్పు వైపు 2 మొక్కలు, పడమర వైపు 2 మొక్కలు.. ఎకరానికి 400 మొక్కలు నాటారు.
15 రోజులకొకసారి తేలికపాటిగా నీటి తడిని డ్రిప్ ద్వారా అందించాల్సి వుంటుంది. నీరు నిలిచే బంక నేలలు మినహా అన్ని నేలలూ డ్రాగన్ ఫ్రూట్ సాగుకు అనుకూలంగా ఉంటాయి. పూత వచ్చిన 45 రోజుల్లో పండు తయారవుతుంది. నాటిన ఏడాదిలోనే దిగుబడి ప్రారంభమవుతుంది. జూన్ నుండి పూత రావడం ప్రారంభమవుతుంది. శ్రద్ధవహిస్తే 3వ సంవత్సరంలో ఆరు టన్నుల దిగుబడి లభిస్తుంది. పిలకలను కత్తిరించి నర్సరీలో మొక్కలు పెంచి రైతు అమ్ముకోవచ్చు. లేదంటే మరింత విస్తీర్ణంలో నాటుకోవచ్చు. టన్ను ధర రూ. లక్షా 50 వేలు వుంటుంది. సాధారణ సస్యరక్షణ మినహా పెద్దగా ఖర్చులు ఉండవు. 30 సంవత్సరాల పాటు దిగుబడి వస్తుందని చెబుతున్నారు. మార్కెటింగ్‌కు ఎలాంటి సమస్య వుండదని చెబుతున్నారు.
అంటు మొక్కలను ఉచితంగా ఇస్తా..!
వ్యాపార రీత్యా థాయిలాండ్, వియత్నాం లాంటి దేశాలకు వెళ్లినప్పుడు డ్రాగన్ పండ్ల తోటల సాగును పరిశీలించాను. 15 ఎకరాల బత్తాయి తోట సాగు అనుభవం ఉంది. కొత్త రకం పండ్ల తోటల సాగు చేపట్టే ఉద్దేశంతో డ్రాగన్ ఫ్రూట్ సాగుపై ఏడాదిగా అవగాహన పెంచుకున్నాను. కోల్‌కతా నుంచి మొక్కలు తెప్పించి.. సిమెంట్ కడీల(స్తంభాల)ను, వాటిపైన రింగ్‌లను తయారు చేయించి ఎకరంన్నరలో నాటాను. రూ.5 లక్షల వరకు ఖర్చు పెట్టాను. తొలి ఏడాది టన్నున్నర దిగుబడి వచ్చింది. రెండో∙ఏడాది 6 టన్నుల దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాను. బత్తాయి తోటలో డ్రాగన్ ఫ్రూట్ సాగును 15 ఎకరాలకు విస్తరింప జేయడానికి ఏర్పాట్లు చేస్తున్నా. మార్కెటింగ్‌కు ఎలాంటి ఇబ్బందీ లేదు. ఆసక్తి ఉన్న రైతులకు ఉచితంగా కొన్ని అంటు మొక్కలను ఇస్తాను.
– కె.యాదగిరి, డ్రాగన్ ఫ్రూట్ రైతు, మొలకపట్నం, నల్లగొండ జిల్లా
(వివరాలకు.. డి. రవి: 99896 50429)
– కుంభం వెంకటేశ్వర్లు, సాక్షి, నల్లగొండ రూరల్
ఆశాజనకంగా డ్రాగన్ ఫ్రూట్ సాగు
Published Tue, Jan 9 2018 4:50 AM | Last Updated on Tue, Jan 9 2018 4:50 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment