కానరీ మిలన్‌ | Canary Melon fruit cultivation in big profits | Sakshi
Sakshi News home page

కానరీ మిలన్‌

Published Tue, Nov 12 2019 5:29 AM | Last Updated on Tue, Nov 12 2019 5:29 AM

Canary Melon fruit cultivation in big profits - Sakshi

మిర్దాపల్లి గ్రామంలో సాగవుతున్న కానరీ మిలన్‌ పంట

తక్కువ రోజుల్లో ఎక్కువ లాభాలనిచ్చే కొత్త పంట కానరీ మిలన్‌ పండ్లను సాగు చేస్తున్నారు నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం మిర్దాపల్లి గ్రామానికి చెందిన ఆదర్శ రైతు కల్లెం నర్సింహారెడ్డి. పసుపురంగులో దోసకాయ మాదిరిగా ఉంటుంది. కానీ ఇది కూరగాయ కాదు. తర్బూజ మాదిరిగా తియ్యగా ఉండే పండు ఇది. నాలుగైదు నెలల్లో కోతకు వచ్చే వరి, మొక్కజొన్న వంటి పంటలు సాగు చేసి సరైన ధర లేక కష్టనష్టాలను ఎదుర్కోవడం కంటే కానరీ మిలన్‌ను సాగు చేయడం మేలని నర్సింహారెడ్డి భావిస్తున్నారు.

పంటను ప్యాకింగ్‌ చేస్తున్న కూలీలు

మంచి పోషక విలువలు కలిగి ఉండటంతో కానరీ మిలన్‌ను ఢిల్లీతో పాటు, అనేక ఉత్తరాది రాష్ట్రాల్లో దీనికి డిమాండ్‌ ఉంది. శీతలగిడ్డంగిలో పెడితే నెల రోజులైనా నిల్వ ఉంటుంది. అరబ్‌ దేశాలకు కూడా ఎగుమతి అవుతున్నట్లు చెబుతున్నారు. అనంతపురం ప్రాంత రైతులు కొంత కాలం క్రితం నుంచే కానరీ మిలన్‌ను సాగు చేసి ఢిల్లీ మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు. నిజామాబాద్‌ ప్రాంతంలో తొలుత నర్సింహారెడ్డి ఆరెకరాల్లో ఈ పంటను సాగు చేస్తున్నారు. ఆయన సమీప బందువులు కూడా ఈ పంటను సాగు చేస్తున్నారు.

విత్తనం ధర అధికం
తైవాన్‌ నుంచి తెప్పించే హైబ్రిడ్‌ విత్తనాన్ని వాడాల్సి రావడం వల్ల ధర ఎక్కువగా ఉంటున్నది. ప్రతి పంటకూ విత్తనం కొని వేయాల్సిందే. కానరీ మిలన్‌లో రెండు రకాలున్నాయి. వేసవి సీజన్‌లో అధిక దిగుబడినిచ్చే రకం కొయినూర్‌ రకం. ఇది చలిని తట్టుకోలేదు. చలికాలంలో వేరే రకం వెయ్యాలి. మరో పది రోజుల్లో ఆ రకం విత్తబోతున్నాను అన్నారు నర్సింహారెడ్డి.

రవాణా ఖర్చు కిలోకు రూ. 20
ఎకరానికి 10–15 టన్నుల కానరీ మిలన్‌ పండ్ల దిగుబడి వస్తుంది. ఢిల్లీ తీసుకెళ్లి టోకున అమ్మితే కిలోకు రూ. 50 నుంచి 60 రూపాయల ధర పలుకుతుంది. పాదికి రెండు లేక మూడు పిందెలను మాత్రమే ఉంచుతారు. పండు కిలోన్నర రెండు కిలోల బరువు వరకు పెరుగుతుంది. కిలోకన్నా ఎక్కువ బరువున్న పండే రుచిగా ఉంటుంది. ధర కూడా పలుకుతుంది. అట్ట పెట్టెకు ఆరు నుంచి ఏడు కాయలను ప్యాక్‌ చేసి లారీల్లో ఢిల్లీ మార్కెట్‌కు రవాణా చేస్తున్నారు.

రవాణాకు సిద్ధ్దమైన కానరీ మిలన్‌, రైతు నర్సింహారెడ్డి

అయితే, లారీల్లో సరుకు ఇక్కడి నుంచి తీసుకెళ్లడానికి కిలోకు రూ. 20 వరకు ఖర్చవుతుంది. హైదరాబాద్‌లో దీనికి కిలోకు రూ. 30 ధర వచ్చినా మంచిదే. అయితే, మన వాళ్లకు ఈ పండు తెలియదు. గత ఏడాది శివరాత్రికి పది టన్నులు పంపి హైదరాబాద్‌లో అమ్మాం. స్థానికంగా మార్కెట్‌ పెరిగితే బాగుంటుందని నర్సింహారెడ్డి అన్నారు. దుక్కికి రూ.10 వేలు, పశువుల ఎరువుకు రూ.పది వేలు, మల్చింగ్, ఎరువులకు మరో రూ.20 వేలు, ఇతర ఖర్చులు మరో 15 వేల వరకు ఉంటాయి. రవాణా ఖర్చులు, మధ్యవర్తుల కమిషన్లు పోగా ఎకరానికి రూ. లక్ష వరకు నికరాదాయం ఆర్జిస్తున్నారు నర్సింహారెడ్డి.

రోజూ పొలం అంతా కలియదిరగాలి
సున్నితమైన హైబ్రిడ్‌ పంట కావడంతో పంటను ప్రతిపూటా రైతు స్వయంగా తడిమి చూసుకుంటూ కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి ఉంటుంది. కూలీలపై వదిలేస్తే ఏమాత్రం కుదరదు. రోజూ ఏదో ఒక పూట పొలం అంతా కలియదిరగాల్సిందే. చీడపీడలేమైనా సోకాయేమో స్వయంగా చూసుకోవాలి. దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోకపోతే నష్టాలు పాలు కావాల్సి వస్తుందని నర్సింహారెడ్డి(97052 02562) చెబుతున్నారు.
– పాత బాలప్రసాద్, సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌

65 రోజుల్లో పంట చేతికి..
ఇది మెట్ట ప్రాంతపు పంట. నీరు ఎక్కువగా ఉండకూడదు. వర్షాకాలం దీని సాగుకు అనువైన కాలం కాదు. ఈ ఏడాది వర్షాలు నెల రోజులు ఎక్కువగా పడటం వల్ల తమ పంట దెబ్బతిన్నదని నర్సింహారెడ్డి తెలిపారు. వర్షం వల్ల కాయ తీపి కూడా తగ్గిందన్నారు. ఎకరం వరి సాగుకు అవసరమయ్యే నీటితో కనీసం నాలుగు ఎకరాల్లో ఈ పంటను పండించవచ్చని ఆయన చెబుతున్నారు. విత్తనం వేసిన తర్వాత 60 నుంచి 65 రోజుల్లో పంట చేతికందుతుంది. స్వల్పకాలిక పంట కావడంతో ఏడాదిలో రెండు నుంచి మూడు పంటలు పండించవచ్చని నర్సింహాæరెడ్డి తెలిపారు. ఎకరంలో ఎత్తు మడుల(బెడ్స్‌పై)పై మల్చింగ్‌ షీట్‌ పరచి సాగు చేయడానికి మొదట సుమారు రూ. 75 వేల వరకు ఖర్చవుతుందని, రెండు, మూడో పంటలకు ఖర్చు తగ్గుతుందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement