ఉద్యానంపై కరువు దెబ్బ | Arbor drought effect | Sakshi
Sakshi News home page

ఉద్యానంపై కరువు దెబ్బ

Published Sat, Dec 26 2015 2:41 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

ఉద్యానంపై కరువు దెబ్బ - Sakshi

ఉద్యానంపై కరువు దెబ్బ

 భారీగా పడిపోతున్న దిగుబడులు
 కనీసం పెట్టుబడి కూడా రాని దుస్థితి
 పూలు, పండ్ల రైతుల పరిస్థితీ అంతే..
 టమాటా పంటపై అధిక ప్రభావం

 వర్షాభావ పరిస్థితులు ఉద్యాన పంటల్ని అతలాకుతలం చేస్తున్నాయి. వరుసగా కరువు ప్రభావంతో భూగర్భజలాలు పూర్తిగా అడుగంటాయి. దీంతో బోరుబావులపై ఆధారపడిన ఉద్యాన సాగు ప్రస్తుతం సంకటంలో పడింది. ప్రస్తుత రబీ సీజన్‌లో జిల్లాలో 12,332 హెక్టార్లలో వివిధ రకాల కూరగాయ పంటలు, 4,090 హెక్టార్లలో పండ్లు, పూలతోటలు సాగవుతున్నాయి. తాజాగా వాతావ రణ మార్పులు, వర్షాలలేమి, బోర్లు ఇంకిపోవడం వంటివి ఉద్యాన పంటల దిగుబడులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.
                                                 - సాక్షి, రంగారెడ్డి జిల్లా
 
 జిల్లాలో ఈ సీజన్‌లో 86,944 మెట్రిక్ టన్నుల టమాటా ఉత్పత్తి కావాల్సి ఉండగా.. అందులో ఏకంగా 30 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి తగ్గే అవకాశం ఉంది.

 సాక్షి, రంగారెడ్డి జిల్లా : జిల్లాలో అన్నిప్రాంతాల్లో ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే పంట టమాటా. ప్రస్తుత రబీలో 1,976 హెక్టార్లలో ఈ పంట సాగవుతున్నట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. పరిస్థితులు అనుకూలిస్తే ఒక హెక్టారు విస్తీర్ణంలో 44 మెట్రిక్ టన్నుల టమాటా దిగుబడి వస్తుంది. నీటి శాతం అత్యధికంగా వినియోగమయ్యే ఈ పంటకు డిమాండ్ కూడా బాగానే ఉంది.
 
  ఇందులో 80శాతం దిగుబడులు మహానగరంలోని రైతుబజార్లకే తరలుతాయి. తాజా వర్షాభావ పరిస్థితులు టమాటా పంటపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. వర్షాలు లేకపోవడం.. పగటిపూట తేమశాతం తగ్గడంతో పంటలకు తెగుళ్లు సోకుతున్నాయి. ఫలితంగా మూడోవంతు దిగుబడి తగ్గనుందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఈ సీజన్‌లో 86,944 మెట్రిక్ టన్నుల టమాటా ఉత్పత్తి కావాల్సి ఉండగా.. అందులో ఏకంగా 30 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి తగ్గే అవకాశం ఉంది.

 ఉల్లి, క్యారెట్ పంటల పైనా..
 చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, మేడ్చల్ డివిజన్లలో ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే ఉల్లి, క్యారెట్ పంటలపైనా కరువు తీవ్రత కనిపిస్తోంది. రబీ సీజన్‌లో జిల్లాలో 1,970 హెక్టార్లలో ఉల్లి, 1,236 హెక్టార్లలో క్యారెట్ పంటలు సాగ వుతున్నాయి. ప్రస్తుతం ఉల్లి సాగు గణనీయంగా పడిపోయింది. ఇప్పటివరకు 1,101 హెక్టార్లలో మాత్రమే సాగైనట్లు వ్యవసాయ శాఖ అధికారుల నివేదికలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఉల్లి దిగుబడి సాధారణం కంటే సగానికి పడిపోనుంది. అదేవిధంగా క్యారెట్ పంటలు సాగుచేస్తున్న ప్రాంతాల్లో బోర్లు పూర్తిగా ఎండిపోయాయి.
 
  చేవెళ్ల మండలం గుండాల గ్రామానికి చెందిన భాస్కర్‌రెడ్డి తనకున్న ఆరెకరాల పొలానికి అదనంగా మరో మూడెకరాలు కౌలుకు తీసుకుని క్యారెట్ పంట సాగుచేశాడు. అందులో నాలుగు బోర్లు వేయగా చుక్కనీరు రాకపోవడంతో తీవ్రంగా నష్టపోయాడు. అర ఎకరాలో వంద బస్తాల మేర వచ్చే క్యారెట్ దిగుబడి.. 30 బస్తాలకు పడిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. మొత్తంగా జిల్లాలో కరువు పరిస్థితులు రైతుకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.
 
 క్యాబేజీకి రాం రాం..
 యాచారం మండలం గున్‌గల్‌కు చెందిన బాసాని నర్సిరెడ్డి మూడెకరాల్లో క్యాబేజీ పంట సాగుచేస్తున్నాడు. మూడేళ్ల క్రితం క్యాబేజీ పంట సాగుచేస్తే ఎకరాకు రూ.లక్ష వరకు ఆర్జించాడు. దీంతో అప్పటినుంచి క్యాబేజీపై ప్రత్యేక దృష్టి సారించాడు.  గత రెండేళ్లుగా కరువు వెంటాడుతుండడంతో దిగుబడి భారీగా తగ్గుతోంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో పంటను చీడపీడలు ఆశిస్తున్నాయి. వేరుకుళ్లు పురుగు అధికమవుతోంది. ఎన్ని సార్లు పురుగు మందులు పిచికారీ చేసినా అదుపులోకి రావడం లేదు. ఎకరా పొలంలో సాగు కోసం రూ.40 వేలు ఖర్చు చేస్తే.. కనీసం రూ.20 వేలు కూడా చేతికందడం లేదు.
 
  దిగుబడి తగ్గిపోయింది
 ఇతను నర్సింహారెడ్డి. షాబాద్ మండలం పోలారం. పదేళ్లుగా వంగ పంట సాగుచేస్తున్న ఇతను ఈ ఏడాది రెండెకరాల్లో వేశాడు. ప్రస్తుతం దిగుబడి గణనీయంగా తగ్గింది. ఎకరాకు 30 క్వింటాళ్ల వరకు వచ్చే దిగుబడి.. ఇప్పుడు 15 క్వింటాళ్లకు పడిపోయింది. గతంలో మూడు రోజుల నిడివితో చేతికొచ్చే పంట.. ఇప్పుడు వారం రోజుల సమయం తీసుకుంటోంది. బోరులో నీటి మోతాదు తగ్గడం.. వాతావరణంలో వచ్చిన మార్పులతో లాభాల పోయి నష్టాలే మిగులుతున్నాయి.
 
 పంటలకు తెగుళ్లు సోకాయి..
 మంచాల మండలం జాపాలకు చెందిన  యాట మల్లేష్ మూడున్నరెకరాల్లో కూరగాయ పంటలే సాగు చేస్తున్నాడు. ఎకరాలో టమాటా, మరో ఎకరాలో బెండ వేశాడు. ఇటీవల నెలకొన్న వర్షాభావ పరిస్థితులు.. పగలు, రాత్రి ఉష్ణోగ్రతలో భారీ వ్యత్యాసం కారణంగా టమాటా పంటకు తెగుళ్లు సోకాయి. గతంలో ఎకరాకు నాలుగైదు క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. ఇప్పుడది సగానికి సగం పడిపోయింది. టమాటా పంట ఎకరా సాగుకు కనిష్టంగా రూ.12 వేలు ఖర్చవుతుండగా.. అందులో సగం వచ్చే పరిస్థితి లేదు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement