home foods
-
పచ్చళ్లు, పొడులు, స్వీట్లు, జంతికలు.. మొత్తం 80 రకాలు! ఇంట్లోనే పిండివంటలు చేస్తూ..
‘‘అక్కా! ఈ జంతికలు సరిగ్గా కాలాయో లేదో ఓ సారి చూస్తావా!’’.. ‘‘ఉషా! తోటకూర వేపుడు పొడి చేయిస్తున్నావా? కమ్మటి వాసన వస్తోంది!!’’ ... ‘‘పెద్దమ్మాయి పిల్లలకు మునగాకు పొడి కావాలట. ప్యాక్ చేయించక్కా!’’.. ‘‘పాలు వచ్చాయి... కోవా బాణలి స్టవ్ మీద పెట్టమ్మాయ్. నేను వస్తున్నా... అడుగంటకుండా కాగాలి పాలు. గులాబ్ జామూన్ మృదువుగా ఉండాలి’’ సికింద్రాబాద్, న్యూ బోయిన్ పల్లి, ‘బాణలి’లో ఇద్దరు అక్కాచెల్లెళ్ల సంభాషణ ఇది. ఇద్దరూ అరవయ్యేళ్లు దాటిన వాళ్లే. వాళ్లకు అధిక బరువు సమస్య ఎలా ఉంటుందో తెలియదు. జుట్టుకు డై వేయాల్సిన అవసరమూ రాలేదు. ‘ఆరోగ్యంగా తింటే అనారోగ్యం ఎందుకు వస్తుంది’ అంటారు. ఆరోగ్యంగా తినడం అంటే... మన సంప్రదాయ వంటకాలేనంటారు వాళ్లు. ‘‘మేము రోజూ ఆవకాయతో మొదలు పెట్టి గడ్డపెరుగుతో పూర్తి చేస్తాం. ఏ అనారోగ్యమూ లేదు. రోజూ ఒక ముద్ద వేడి అన్నంలో నెయ్యి, మునగాకు పొడి కలిపి తినండి. రోజూ సున్నుండ, నువ్వులుండ తినండి. మెత్తగా జారిపోయే కేకుల బదులు వేరుశనగ పట్టీని పటపటా కొరికి బాగా నమిలి తినండి. మా ఇంట్లో అలాగే తింటాం. ఆరోగ్యంగా ఉన్నాం. అనారోగ్యం పాలవుతున్న కొత్తతరానికి ఆరోగ్యపు బాట వేయడానికే ఈ పని మొదలు పెట్టాం’’ అంటూ ‘బాణలి’ పేరుతో హోమ్‌ఫుడ్ సెంటర్ ప్రారంభించడానికి కారణాన్ని వివరించారు ఈ అక్కాచెల్లెళ్లు దాట్ల రాజేశ్వరి, పెన్మెత్స ఉష. వంటలన్నీ ఇంట్లోనే ‘‘మా పుట్టిల్లు ఆంధ్రప్రదేశ్, పశ్చిమగోదావరి జిల్లా, నరసాపురం, దర్భరేవు గ్రామం. పదహారేళ్లకే మాకు పిండివంటలు చేయడం నేర్పించింది మా అమ్మ. మా నాన్న కలిదిండి సత్యనారాయణ రాజు. ఆయన రాజకీయాల్లో చురుగ్గా ఉండడంతో రోజూ అతిథులుండేవారు. రకరకాలు వండడం వడ్డించడంలో మా అమ్మకు రోజు సరిపోయేది కాదు. పెళ్లయి అత్తగారింటికి వెళ్తే అక్కడ మామగారు మునసబు. గ్రామానికి ఏ ఉద్యోగి వచ్చినా భోజనం మా ఇంట్లోనే. ఏ ఫంక్షన్ అయినా అన్నీ ఇంట్లోనే వండేవాళ్లం. పెళ్లి, పేరంటాలకు పాతిక కావిళ్లు సారె పంపించడం... ఇలా ఎప్పుడూ వండడమే. ఒక్కమాటలో చెప్పాలంటే వండడం తప్ప మరొకటి తెలియదు, వంటల్లో మాకు తెలియనిది లేదు’’ అన్నారు రాజేశ్వరి. వంద రుచులు వచ్చు! ‘‘పచ్చళ్లు, పొడులు, స్వీట్లు, చెగోడీ–జంతికల వంటివి మొత్తం ఎనభై రకాలు వండుతాం. ఇతర వంటకాలన్నీ కలిపి వంద రకాలు వచ్చు. మాకు వంటల పుస్తకాలు తెలియదు. దినుసులన్నీ ఉజ్జాయింపుగా వేయడమే. వంటల పుస్తకాలు రాయమని చెప్తున్నారు. కానీ దేనికీ కొలతలు పాటించం, కొలతలతో వండడం మాకు తెలియదు. కొలతలతో చెప్పడమూ తెలియదు. మా అమ్మ వండుతుంటే చూసి నేర్చుకున్నాం. మా దగ్గర పని చేసే వాళ్లకూ అలాగే నేర్పించాం’’ అన్నారు ఉష. పలాస జీడిపప్పు... నర్సాపురం బెల్లం ‘‘వండడం వస్తే సరిపోదు, దినుసుల్లో నాణ్యత కూడా ముఖ్యమే. బెల్లం నర్సాపురం నుంచి, కారం బోధన్ నుంచి, జీడిపప్పు పలాస నుంచి, మంచి ఆవునెయ్యి కర్ణాటక నుంచి తెప్పించుకుంటాం. ఇంట్లో దినుసులు ఎలాగ మంచివి తెచ్చుకుంటామో అలాగే ఇదీనూ. మా అమ్మాయి హైదరాబాద్‌లో ఉండడంతో తరచూ అమ్మాయి ఇంట్లో పది– ఇరవై రోజులుండేవాళ్లం. మనుమడు ప్యాకెట్లలో దొరికే చిరుతిళ్లు తింటుంటే... ఇదేం తిండి అనిపించేది. ఒంటికి బలం రాని తిండితో పిల్లలు ఊబదేలుతారు, ఎముక పుష్టితో పెరగరు. అందుకే ఇంట్లో రకరకాల పిండివంటలు చేసేదాన్ని. అమ్మాయి స్నేహితులు, వాళ్ల పిల్లలు ఎంతో మెచ్చుకుంటూ ఉంటే సంతోషంగా అనిపించేది. ‘మీ చేతిలో ఉన్న విద్య విలువ మీకు తెలియడం లేదు. చాలామందికి మన గోదారి జిల్లాల వంటల పేర్లు తప్ప రుచి కూడా తెలియదు. అందరికీ పరిచయం చేయవచ్చు కదా! నేర్చుకునే ఆసక్తి ఉన్న వాళ్లకు నేర్పించనూ వచ్చు. అన్నింటికంటే ముందు మన పిల్లలతోపాటు అందరి పిల్లలూ ఆరోగ్యంగా పెరుగుతారు. మీకు నాలుగు డబ్బులు కూడా వస్తాయి’ అని మా వియ్యంకులు చెబితే... ఎందుకో చాలా బిడియం వేసింది. మాకు చక్కగా వండి పెట్టడమే తెలుసు, వంటను అమ్మడం చిన్నతనంగా అనిపించింది. కానీ వాళ్ల మాటలు కాదనలేక మొదలుపెట్టాం. గత ఏడాది ఉగాది రోజు మొదలైంది. ఇప్పుడు మా వంటల్ని కొన్నవాళ్లు నాలుగువేల మంది. ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్‌గారు ఈ సెంటర్‌ను చూసి మమ్మల్ని అభినందించారు. ‘ఈ వంటలు మీ తరంతో అంతరించి పోకూడదమ్మా. కొత్త తరానికి అందించండి’ అని చెప్పారాయన. అంతపెద్ద ఆఫీసర్‌గారు ప్రశంసిస్తుంటే మేము చేస్తున్న పని మంచిదే అని మాకు ధైర్యం వచ్చింది’’ అన్నారు ఉష. అక్కడ ఇడ్లీ ప్రియం! ‘ఈ స్టోర్ చూసిన వాళ్లు మీ ఇద్దరే ఇన్ని చేస్తున్నారా! అని ఆశ్చర్యపడుతుంటారు. ఈ వయసులో చక్కటి ఆరోగ్యం మీది’ అని మెచ్చుకుంటారు. దేహానికి మంచి ఆహారం, తగినంత శ్రమ ఉంటే అనారోగ్యాలెందుకు వస్తాయి? అంటారు రాజేశ్వరి. ‘చపాతీలు చేయాలంటే గోధుమలు రోట్లో దంచాం, పిండి తిరగలితో విసిరాం. గారెలకు పిండి రోట్లో రుబ్బాం. ఈ చేతులకు ఈ పని పెద్ద పనేమీ కాదు’’ అని స్టోర్‌లో ఉన్న రకరకాల పిండివంటలను చూపించారీ సీనియర్ సిస్టర్స్. ఇంకా... ‘‘మన సంప్రదాయ వంటల్లో ఆరోగ్యం ఉంది. ముందు తరాలకు అందివ్వాలి. వీటిని మన తరంతో అంతరించిపోనివ్వకండి. ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు వాళ్ల పిల్లలకు వీటిని వండడం నేర్పించండి. మనం కేకులు, పిజ్జాలు, బర్గర్లు తినడం ఫ్యాషన్ అనుకుంటున్నాం. పాశ్చాత్యదేశాల వాళ్లు మన ఇడ్లీ, దోశెలను లొట్టలేసుకుంటూ తింటున్నారు. మన రుచిని మర్చిపోవద్దు. మన పోపుల పెట్టె ఔషధాల గని. తరతరాలకు అందించండి’’ అని సాటి మహిళలకు ఓ మంచిమాట చెప్పారు. మరొక్క చిన్నమాట... ‘మేము స్వీట్లు చేస్తాం. కానీ తినం. రోజూ ప్రతి స్వీట్నీ తయారైనప్పుడు తప్పకుండా రుచి చూస్తాం. ఎక్కువ మోతాదులో తింటే రుచిని గుర్తించడం కష్టం’ అన్నారు. బహుశా! వీళ్ల విజయ రహస్యం, ఆరోగ్య రహస్యం ఇదే కావచ్చు. – వాకా మంజులారెడ్డి ఫొటోలు: మోర్ల అనిల్ కుమార్ చదవండి: Kavitha Naga Vlogs: ఆమె మనసుకు రుచి తెలుసు -
గీతా గోవింద్.. కిచెన్ నుంచి కోటి రూపాయలు మించిన సంపాదన
స్ఫూర్తిదాయక కథనాలను అందివ్వడంలో ఎప్పుడూ ముందుటారు ఆనంద్ మహీంద్రా. ఏమీ లేని స్థాయి నుంచి గొప్ప ఎత్తులకు ఎదిగిన వారు, ప్రతిభ ఉన్నా గుర్తింపు నోచుకోని వారి గురించి ప్రమోట్ చేయడానికి ఈ పారిశ్రామికవేత్త ఎప్పుడు వెనుకాడరు. ఈసారి మరో స్ఫూర్తి నింపే విషయాలను మన ముందుకు తెచ్చారు. గీత... ముంబై మహానగరంలోని విలేపార్లే లోని ఓ సాధారణ గృహిణి. ఆమె భర్త గోవింద్ పాటిల్ ఓ డెంటల్ ల్యాబ్‌లో క్లర్క్‌గా పని చేసేవాడు. ఇద్దరు పిల్లలు వినీత్, దర్శన్‌లు స్కూలుకు వెళ్తున్నారు. అయితే ఈ ఇద్దరు పిల్లల కారణంగా ప్రతీ రోజూ స్కూల్లో ఏదో ఒక గొడవ జరిగేది. పిల్లలకు రుచికరమైన వంటకాలు లంచ్‌బాక్స్‌లో సర్ధేది గీత. ఆ బాక్స్ షేర్ చేసుకుంటామంటూ వినీత్, దర్శన్ ఫ్రెండ్స్ ప్రతీ నిత్యం గొడవలు పడేవారు. ఒక్కోసారి వీళ్లకు మిగల్చకుండా తినే వాళ్లు కూడా. చుట్టుముట్టిన కష్టాలు గోవింద్ పాటిల్ ఉద్యోగం 2016లో ఉన్నట్టుండి పోయింది. అప్పటికే స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకుని కాలేజ్‌లోకి ఎంటర్ అయ్యారు వినీత్, దర్శన్‌లు. ఇంటికి ఆధారంగా ఉన్న ఉద్యోగం పోవడం ఒక సమస్య అయితే పిల్లల చదువు ఖర్చులు పెరగడం మరో సమస్యగా మారిపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో గీతాగోవింద్ దంపతులకు అదనపు ఆదాయ మార్గం చూసుకోవాల్సిన ఆగత్యం ఏర్పడింది. మా వంటగది పిల్లల లంచ్ బాక్స్ కోసం వాళ్ల ఫ్రెండ్స్ చేసే గొడవ గుర్తొచ్చింది గీతకు. భర్త సైతం ఆమె ఆలోచనలకు మద్దతు పలికాడు. అంతే ఇంట్లో కిచెన్లోనే స్నాక్స్ తయారు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. అయితే అవి అమ్ముడుపోతాయా ? వాటి మీద పెట్టే ఖర్చులు కనీసం వెనక్కి తిరిగి వస్తాయా అనే సందేహం వాళ్లను వదల్లేదు. దీంతో ముందుగా బృహాన్ ముంబై స్థానిక కార్యాలయంలో ముందుగా టీ, స్నాక్స్ అందివ్వాలని నిర్ణయించుకున్నారు. అక్కడ కూడా ఈ వంటలకు మంచి పేరు రావడంతో కిచెన్లోనే హోం ఫుడ్స్‌కు శ్రీకారం చుట్టింది గీతాగోవింద్ పాటిల్. చదువులకు అండగా మహారాష్ట్ర ప్రాంతపు పిండివంటలు, స్నాక్స్‌కు తనదైన రెసిపీనీ యాడ్ చేయడంతో గీత చేసే హోంఫుడ్స్కు ఆ ఏరియాలో ఫ్యాన్ బేస్ పెరిగింది. క్రమం తప్పకుండా ఆర్డర్లు రావడం మొదలైంది. దీంతో హోం డెలివరీ సర్వీసులు సైతం మొదలయ్యాయి. అలా రెండేళ్లు గడిచే సరికి గోవింద్ పాటిల్ మరో ఉద్యోగం వెతుక్కోవాల్సిన అవసరం లేకపోయింది. కుటుంబ పోషణతో పాటు పిల్లల చదువులు ఎలాంటి ఆటంకం లేకుండా సాగిపోయాయి. కరోనాలో ఆసరాగా కరోనా కాలం కమ్మేసిన సమయంలో ముంబైలో అనేక మంది ఉన్న ఉపాధి కోల్పోయారు. గీత నివసించే ప్రాంతంలోనే ఎన్నో కుటుంబాలు ఆర్థిక ఆసరా కోసం ఎదురు చూడాల్సిన దుస్థితిలో పడ్డాయి. ఈ తరుణంలోనే వాళ్లందరికి అండగా నిలిచింది గీత. అయితే పడుతున్న కష్టానికి చేతిలో మిగులుతున్న సొమ్ముకు పొంతన కుదరడం లేదు. ఎంత కష్టపడ్డా ఏడాది పన్నెండు లక్షలు మించి ఆదాయం కనపడలేదు. పాటిల్‌కాకి తన తల్లి చేస్తున్న వంటల్లో కమ్మదనం ఉన్నా వాటికి బ్రాండ్ ఇమేజ్ లేకపోవడం గమనించాడు వినీత్. వెంటనే తమ హోం ఫుడ్స్‌కి పాటిల్ కాకి అనే బ్రాండ్‌ను ఇచ్చాడు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రచారం నిర్వహించాడు. తమ కస్టమర్ బేస్‌తో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేశారు. అంతే ఏడాది తిరిగే సరికి పాటిల్ కాకి స్వరూపమే మారిపోయింది. రూ. కోటి క్రాస్ విల్లేపార్లేలోని చిన్న ఇంటిలో ఇరుకైన కిచెన్ నుంచి శాంతక్రాజ్ ఏరియాకు షిప్ట్ అయ్యింది పాటిల్ కాకి. మూడు వేల మందికి పైగా రెగ్యులర్ కస్టమర్ బేస్ రెడీ అయ్యింది. ఒక్క రోజులోనే వందల కొద్దీ కేజీల స్నాక్స్ హోం డెలివరీ చేయాల్సి వస్తోంది. 25 మంది రెగ్యులర్ ఎంప్లాయిస్ వచ్చి చేరారు. కేవలం ఏడాది వ్యవధిలోనే పాటిల్ కాకి రెవెన్యూ పన్నెండు లక్షల నుంచి కోటి నలభై లక్షలకు చేరుకుంది. This is the kind of ‘food’ startup that truly deserves a soaring valuation. Because the ingredients are grit & determination…you can’t learn that in Business Schools https://t.co/6m0NZjwWPv — anand mahindra (@anandmahindra) June 24, 2022 చదవండి: మహ్మద్ రఫీ పాటనే స్ఫూర్తిగా.. వేల కోట్లకు అధిపతిగా.. -
బీట్రూట్ పాప్ కార్న్ ఎప్పుడైనా తిన్నారా? మరీ బెల్గావి స్వీట్.. ఇంట్లోనే ఈజీగా
ఇంట్లో తయారు చేసిన స్నాక్స్ ఆరోగ్యానికి మేలు చేయడమేకాకుండా డబ్బును ఆదా చేస్తుంది. వెరయిటీగా ఈ వంటకాల తయారీని ప్రయత్నించి చూద్దాం.. బెల్గావి స్వీట్ చదవండి: ఎడమచేతివాటం వారు ఈ విషయాల్లో నిష్ణాతులట.. మీకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు. కావల్సిన పదార్థాలు ►వెన్నతీయని పాలు – కప్పు ►పంచదార – అర కప్పు ►కోవా – ముప్పావు కప్పు ►పెరుగు – టేబుల్ స్పూను ►జీడిపప్పు పలుకులు – నాలుగు టేబుల్ స్పూన్లు ►యాలకుల పొడి – అరటీస్పూను. తయారీ విధానం ►స్టవ్ మీద నాన్‌స్టిక్ బాణలి పెట్టి పంచదార వేయాలి. ►మీడియం మంట మీద పంచదార బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు వేయించాలి. ►రంగు మారగానే మంట తగ్గించి పాలు పోయాలి. ►ఇప్పుడు మీడియం మంట మీద పాలు కాగనివ్వాలి. పాలుకాగాక, పెరుగు వేసి తిప్పాలి. పాలు విరిగినట్లుగా అవుతాయి. అప్పుడు కోవా వేసి బాగా కలుపుకోవాలి. ►ఈ మిశ్రమాన్ని 20 నిమిషాలపాటు ఉడికించాలి. నీళ్లన్నీ ఇగిరి దగ్గర పడుతున్నప్పుడు జీడిపప్పు, యాలకుల పొడి వేసి తిప్పితే బెల్గావి రెడీ. బీట్రూట్ పాప్ కార్న్ కావల్సిన పదార్థాలు ►బీట్రూట్ – 1 (ముక్కలు కట్ చేసుకుని, ఒక గ్లాసు వాటర్ కలిపి, మిక్సీ పట్టి, వడకట్టుకుని రసం తీసుకోవాలి) ►పంచదార – అర కప్పు ►మొక్కజొన్న గింజలు – 1 కప్పు ►యాలకుల పొడి – కొద్దిగా ►రెయిన్బో స్ప్రింకిల్స్ – 1 టేబుల్ స్పూన్లు (అభిరుచిని బట్టి) ►నూనె – 2 టేబుల్ స్పూన్లు తయారీ విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని, పాత్రలో పంచదార, బీట్రూట్ జ్యూస్ వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఈలోపు మరో స్టవ్ మీద కుకర్‌లో నూనె వేసుకుని, మొక్కజొన్న గింజలు వేసుకుని పాప్‌కార్న్ చేసుకోవాలి. తర్వాత అందులో పంచదార, బీట్ రూట్ జ్యూస్ మిశ్రమాన్ని వేసి, పాప్ కార్న్‌కి బాగా పట్టించాలి. చివరిగా రెయిన్బో స్ప్రింకిల్స్ వేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చదవండి: ఈ వాటర్ బాటిల్ ధర సీఈవోల జీతం కంటే ఎక్కువే!.. రూ.45 లక్షలు.. -
ప్రసాదాలు కావాలా?
పండగ రోజు కొనే లడ్లు, కజ్జికాయలు ఎక్కడైనా దొరుకుతాయి. కాని ఆ షాపులో ఉండ్రాళ్లు, ఉగాది పచ్చడి, పులిహోర, గారెలు, బూరెలు కూడా దొరుకుతాయి. ప్రత్యేక పూజలకు నైవేద్యాలు చేయడం ఒక్కోసారి వీలు కాకపోవచ్చు. ఆ షాపుకు వెళితే పేలాల పిండి, అట్లు, కట్టెపొంగలి, చక్కెర పొంగలి దొరుకుతాయి. కొని దేవునికి పెట్టుకోవడమే. విజయవాడ కస్తూరిబాయి పేటలోని అనుభవ ఫుడ్స్ వారు రెండు దశాబ్దాలుగా వినియోగదారులకు శుచిగా ప్రసాదాలను అందిస్తున్న తీరుపై ఈ వారం ఫుడ్ ప్రింట్స్... ఉమ్మడి కుటుంబాలు అంతరించి చిన్నచిన్న కుటుంబాలు ఏర్పడుతున్నాయి. భార్యభర్తలిద్దరూ ఉద్యోగాలకు వెళ్లిపోతున్నారు. పండుగ రోజుల్లో, శుభకార్యాలప్పుడు పిండి వంటలు, సంప్రదాయ వంటలు తయారు చేసుకునే సమయం లేకపోతోంది. ‘అటువంటి వారి కోసం మేము పండుగరోజుల్లో ఉండ్రాళ్లు, కుడుములు, అట్లు, ఉగాది పచ్చడి, కట్టెపొంగలి, రవ్వ పులిహోర, పాలతాలికలు, మోదకాలు వంటివి తయారు చేసి అందచేస్తున్నాం’ అంటున్నారు అభినవ ఫుడ్స్ యజమాని మండవ చైతన్యకుమార్. నోములు, వ్రతాలు చేసుకునేవారు నైవేద్యానికి పిండివంటలు కావాలని ముందుగా కోరినట్లయితే తయారు చేయించి అందజేస్తామని ఆయన అన్నారు. అమ్మ ఆలోచనల నుంచే... ‘రెండున్నర దశాబ్దాల క్రితం మేము హోమ్పుడ్స్ పెట్టినప్పుడు కస్టమర్లకు వంటకాలను వినూత్నంగా అందించాలని మా అమ్మ ఎం.ఎం.దేవి ఆలోచించారు. షాపుకి వచ్చిన కస్టమర్లకు చిన్న కప్పుల్లో పులిహోర, చక్రపొంగలి రుచి చూడమని పెట్టేవారు. దాంతో కస్టమర్లకు సంతోషం కలిగేది. కొంతకాలం తరవాత ఆ వంటకాలను ఆర్డర్ల మీద తయారు చేసి ఇవ్వమని కోరడం మొదలుపెట్టారు. రెండు దశాబ్దాల క్రితం వినాయకచవితి, దసరా, శ్రీరామనవమి, దీపావళి పండుగల్లో ఆయా సంప్రదాయ వంటల్ని ఆర్డరుపై మా అమ్మగారు తయారు చేయించి అందించారు. మొదట్లో మా అమ్మగారే స్వయంగా వండేవారు. ఆ తరవాత కొందరు మహిళలకు రుచిగా తయారు చేయడంలో శిక్షణ ఇచ్చారు. ఇప్పటికీ మా హోమ్పుడ్స్లోని సంప్రదాయ వంటల్ని మహిళల చేతే చేయిస్తాం. భగవంతుడికి నైవేద్యం పెడతారనే ఉద్దేశ్యంతో మడిగా వండిస్తాం. ప్రసాదాలను తయారు చేయడంలో శుచికి, శుభ్రతకు ప్రాధాన్యత ఇస్తాం. పండుగ రోజుల్లో తెల్లవారు జాము నుంచే వంటలు వండటం ప్రారంభిస్తారు. ఉదయం నుంచి మధ్యాహ్నం భోజనాలు సమయం వరకు కస్టమర్లకు అందిస్తాం’ అన్నారు చైతన్య కుమార్. ప్రతిరోజు.... పులిహోర, దద్ధ్యోదనం, గారెలు, పూర్ణాలు (బూరెలు), చక్రపొంగలి, చలిమిడి, పాలతాలికలు వంటివి ప్రతిరోజు ఉదయం నుంచి వేడివేడిగా అందుబాటులో ఉంటాయి. ‘ఇంటికి బంధువులు వచ్చినప్పుడు గంటలు తరబడి వంటలు చేస్తూ కూర్చోకుండా మా దగ్గర నుంచి అప్పటికప్పుడు తీసుకువెళతారు’ అంటున్నారు చైతన్య కుమార్. విజయవాడ నగరంలో వినాయకచవితి, దసరా, శ్రీరామనవమి వంటి పండుగలకు పందిళ్లు వేసి సంప్రదాయబద్ధంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. అటువంటి సమయాల్లో పెద్ద స్థాయిలో నైవేద్యం పెట్టి భక్తులకు పంపిణీ చేయడానికి అనుభవ వారికే ఆర్డర్లు పెడుతున్నారు. ముఖ్యంగా పోలీసు, రెవిన్యూ, ఇతర ప్రభుత్వ శాఖల వారు తమ ఆఫీసు పూజలకు ఇక్కడ తయారుచేసిన ప్రసాదాలనే నివేదిస్తున్నారు. – ఉప్పులూరు శ్యామ్‌ప్రకాష్, సాక్షి, విజయవాడ ఫొటోలు: పవన్ -
ఉల్లి తప్ప ఏమీ కొనను!
వ్యవసాయ శాఖలో అదనపు సంచాలకురాలిగా పనిచేస్తున్న ఉషారాణి తమ కుటుంబం కోసం ఇంటిపైనే సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను సాగు చేస్తున్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని రైతు శిక్షణా కేంద్రంలో సహాయ సంచాలకులుగా పనిచేస్తున్న ఉషారాణి బిహెచ్ఇఎల్ సమీపంలోని తమ స్వగృహంపై ఇంటిపంటలు సాగు చేస్తూ.. ఉల్లిపాయలు తప్ప ఇతరత్రా అన్నీ తానే పండించుకుంటున్నారు. ఆమె భర్త యలమంద వృత్తిరీత్యా బీహెచ్ఈఎల్ ఇంజినీర్. ఆయన సహాయంతో టెర్రస్‌పై ఇనుప ఊచలతో పందిరిని ఏర్పాటు చేసుకొని తీగజాతి కూరగాయ పాదులను దానిపైకి పాకిస్తూ, నిశ్చింతగా ఇంటిపంటలు పండిస్తున్నారు. 200 లీటర్ల ఫైబర్ డ్రమ్మును మధ్యకు కత్తిరించి రెండు మడులుగా వాడుతున్నారు. వీటితోపాటు ప్లాస్టిక్ కుండీలు, ఖాళీ బక్కెట్లలో కూడా అనేక రకాల ఆకుకూరలతోపాటు కూరగాయలను సాగు చేస్తున్నారు. డ్రమ్ముల అడుగున హాలో బ్రిక్స్ పెట్టడం వల్ల టెర్రస్‌పైన పడిన నీరు వెంటనే పల్లానికి వెళ్లిపోవడానికి వీలవుతోంది. ఎర్రమట్టి, కొబ్బరిపొట్టు, వర్మీకంపోస్టు సమపాళ్లలో వేస్తారు. వేపపిండి, బోన్మీల్, జీవన ఎరువులు కొద్ది మొత్తంలో కలుపుతారు. వంటింటి వ్యర్థాలు, ఎండు పూలతో ఆవు పేడ స్లర్రీని వేసి కంపోస్టును తయారు చేసుకుంటారు. ఈ కంపోస్టును, సముద్రపు నాచుతో తయారైన గ్రాన్యూల్స్‌ను పూత, కాత సమయాల్లో మొక్కలకు అడపా దడపా వేస్తుంటారు. పురుగులు ఏమైనా కనిపిస్తే అవి చిన్నగా ఉన్నప్పుడే పుల్లమజ్జిగ, పచ్చిమిర్చి వెల్లుల్లి ద్రావణం వంటి వాటిని పిచికారీ చేస్తుంటారు. 6 రకాల వంకాయలను సాగు చేస్తున్నారు. బెండ, వంగ, బంగాళదుంపలు, ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ వంటి కూరగాయలను సాగు చేస్తున్నారు. దొండ పాదును ఇనుప పందిరిపైకి పాకించలేదు. ఇది బాగా అల్లుకుపోయి ఇతర కూరగాయ మొక్కలను పెరగకుండా చేస్తుందన్న భావనతో ట్రెల్లిస్పైకి పాకించానని ఉషారాణి తెలిపారు. అనేక పండ్ల మొక్కలను కూడా ఆమె సాగు చేస్తున్నారు. స్వీట్ లైమ్, వాటర్ ఆపిల్, అంజూర, నిమ్మ, దానిమ్మ, మామిడి, ప్యాషన్ ఫ్రూట్ తదితర పండ్ల మొక్కలను సాగు చేస్తున్నారు. ప్యాషన్ ఫ్రూట్ పాదును ఇంటి ముందు నేలలో నాటి, మేడపైకి పాకించారు. అత్యంత పోషక విలువలున్న ఈ పండ్లు చాలా ఎక్కువ సంఖ్యలో కాస్తున్నాయని ఆమె తెలిపారు. ప్యాషన్ ఫ్రూట్ రసం చాలా రుచికరంగా ఉంటుందన్నారు. ఇంటిపంటలకు అందుబాటులో ఉన్న ఏదో ఒక పోషక పదార్థాన్ని అడపా దడపా వేస్తూ ఉంటే పోషక లోపం లేకుండా మొక్కలు చక్కగా పెరుగుతూ దిగుబడులనిస్తాయని ఆమె అన్నారు. ఆపిల్ బెర్ మొక్క ఒకసారి ఎండిపోయింది. శిలీంద్రనాశిని అయిన ట్రైకోడెర్మా విరిడి పొడిని తెచ్చి మట్టిలో కలిపిన తర్వాత తిరిగి కొత్త చిగుర్లు వేసిందని ఆమె తెలిపారు. కొంచెం ప్రణాళికా బద్ధంగా సీజన్ల వారీగా నార్లు పోసుకుంటూ మొక్కలు నాటుకుంటూ ఉంటే ఏడాది పొడవునా ఇంటిపైనే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను సాగు చేసుకోవడం సులువేనని ఆమె తెలిపారు. ఫిబ్రవరిలో కాపు పొందాలనుకుంటున్న కూరగాయ మొక్కలకు సంబంధించి ఇప్పటికే తాను నారు పోశానన్నారు. భవనానికి ఇంటిపంటల కుండీలు, డ్రమ్ములు బరువై పోతాయని, భవనానికి ఏదైనా నష్టం జరుగుతుందన్న అపోహలు అవసరం లేదని ఆమె అంటారు. వాటర్ ప్రూఫింగ్ చేసిన టెర్రస్‌పైన హాలో బ్రిక్స్ పెట్టుకొని వాటిపై కుండీలు, డ్రమ్ములు పెట్టుకుంటే ఎటువంటి సమస్యా ఉండదని ఉషారాణి (81217 96299) అంటున్నారు. శ్రద్ధ ఉంటే ఇంటిపంటల సాగు కష్టమేమీ కాదని ఆమె అన్నారు. -
కొరీస్.. పేరు కాదు, బ్రాండ్!
ఐదేళ్ల వయసులో రోడ్డు పక్కన బిస్కెట్ ప్యాకెట్లు అమ్మిన ఇతడు... పదేళ్లు వచ్చే సరికి తన పేరు మీదనే ఒక బ్రాండ్‌ను నెలకొల్పి ఆ కంపెనీకి సీఈవో అయ్యాడు. అదే మిస్టర్ కొరీస్ కంపెనీ. న్యూజెర్సీలోని నల్లజాతి కుటుంబానికి చెందిన వాడు కొరీ. ఐదేళ్ల వయసులోనే అతనికి తండ్రి దూరమయ్యాడు. తల్లిది పోషించలేని పరిస్థితి. అప్పడు మన స్వగృహా ఫుడ్స్ తరహా వ్యాపారాన్ని మొదలుపెట్టారు ఈ తల్లీకొడుకులు. అమ్మ తయారు చేసే కుకీస్ ‘కొరీ’కి చాలా ఇష్టం. వాటిని ఎవరైనా ఇష్టపడతారని ఆ పిల్లాడు నమ్మాడు. మరి వాటిని అమ్మితే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక రోడ్డున వెళ్లే వాళ్లకు కుకీస్‌ను అమ్మడం మొదలు పెట్టాడు. తర్వాత కుకీస్‌ను షాపులకు వేశాడు. డిమాండ్ పెరిగి కొరీ మార్కెట్ విస్తరించింది. దాంతో వాటికి కూడా ఒక బ్రాండ్ నేమ్ తప్పనిసరిగా ఉండాలనుకున్నాడు కొరీ. ‘మిస్టర్. కొరీ’ అనే అర్థం వచ్చేలా ‘ఎమ్ఆర్.కొరీ’ పేరుతో లోగో చేయించాడు. తనే బ్రాండ్ అంబాసిడర్‌గా, తనే మార్కెటింగ్ ఎనలిస్టుగా మారి అమ్మకాల్లో ప్రగతి సాధించాడు. ఇప్పుడు న్యూజెర్సీలో ‘ఎమ్ఆర్. కొరీ’ కుకీస్‌కు మంచి గిరాకీ. ఈ వ్యాపారంతో కోట్లు సంపాదించక పోయినా... తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. అమ్మ సిటీ బస్సులు ఎక్కి ప్రయాణించడాన్ని చూడలేక ఆమెకో కారును బహుమతిగా ఇచ్చాడు. కొరీ ఐదేళ్ల వయసులో వ్యాపారం మొదలు పెట్టి... మరో ఐదేళ్లకే ఇంతగా ఎదగడం చాలామందిని ఆశ్చర్యపరించింది. అమెరికన్ టెలివిజన్ చానళ్లకు ఇతడో సెలబ్రిటీ అయ్యాడు. ‘మీ వ్యాపార విజయ రహస్యం ఏమిటి?’ అని అడిగితే ‘ప్రెజెంటేషన్ ఈజ్ ది కీ టు సక్సెస్’ అంటాడు. పదేళ్లకే ఇంత ప్రావీణ్యం సంపాదించిన ఇతడు భవిష్యత్తులో గొప్ప పారిశ్రామికవేత్త కాగలడని విశ్లేషకుల అభిప్రాయం. కొరీ కష్టాన్ని, తెలివితేటలను చూస్తే ఆ అభిప్రాయం నిజమయ్యే అవకాశాలే ఎక్కువ. -
వేడిగా.. రెడీగా..
గుంటూరు కల్చరల్, న్యూస్‌లైన్: సంక్రాంతి అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది పిండివంటలు. నేటి పరుగులు ప్రపంచంలో పిండివంటలు చేసే తీరిక, ఓపిక తక్కువగా ఉంటోంది. రెడీమేడ్‌గా అన్ని పిండివంటలు అనేక రకాల గృహ ఫుడ్స్, స్వీట్హోమ్స్ నుంచి తెచ్చుకుంటున్నారు. దీంతో సంక్రాంతి రెడీమేడ్‌గా మారింది. విస్తర్లలో వడ్డించే పులిహోర, చక్రపొంగలి, పాలతాలికలు కూడా రెడీమేడ్‌గానే లభిస్తున్నాయి. ప్రజల మనోభావాలను కనిపెట్టిన అనేక గృహ ఫుడ్స్ సంస్థలు పండుగరోజుల్లో అరిసెలు, చక్రాలు, కజ్జికాయలు.. వంటి సంప్రదాయ వంటకాలను వండి విక్రయిస్తున్నారు. కొన్ని గృహ ఫుడ్స్‌లో నేతితో చేసిన పిండివంటలు అందిస్తుండగా, మరికొన్ని సామాన్యులకు అందుబాటులో విధంగా మంచినూనెతో తయారు చేస్తున్నారు. వీటి నాణ్యతను బట్టి వివిధ ధరల్లో ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. నేతితో చేసిన పిండివంటల్లో అరెసెలు కిలో రూ.410, షుగర్ ఫ్రీ అరిసెలు రూ.580, గట్టి అరిసెలు రూ.420, కొబ్బరిబూరెలు రూ.280, చెక్కలు, సన్నకారపు పూస, మినప చక్రాలు, మురుకులు తదితర కారపు పిండి వంటలు కిలో రూ.300 వరకు ధర పల్డుకుతున్నాయి. విస్తర్లో వడ్డించే పాలతా లికలు, చక్రపొంగలి, పులిహోర, పూర్ణాలు, గారెలు వంటివి కిలో రూ.280 ధర పలుకుతున్నాయి. బొబ్బట్లు రూ.370, నూనెతో చేసిన పిండి వంటలు వీటికంటే 30 శాతం తక్కువ ధరల్లో అందిస్తున్నారు.