చిరుధాన్యాల సేద్యం చిన్న రైతు సుభిక్షం! | Millets to cultivate better for farmers | Sakshi
Sakshi News home page

చిరుధాన్యాల సేద్యం చిన్న రైతు సుభిక్షం!

Published Tue, Sep 22 2015 12:25 AM | Last Updated on Sun, Sep 3 2017 9:44 AM

చిరుధాన్యాల సేద్యం చిన్న రైతు సుభిక్షం!

చిరుధాన్యాల సేద్యం చిన్న రైతు సుభిక్షం!

* సంప్రదాయ సేద్య జీవన సంబురం
* జహీరాబాద్ ప్రాంత రైతులు చూపుతున్న వెలుగుబాట ఇదే
* విత్తనాలు, సేంద్రియ ఎరువులు, కషాయాలు.. అన్నీ సొంతవే
* అప్పులు అవసరం లేని.. ఆత్మహత్యల్లేని వ్యవసాయం
* కరువు కాలంలోనూ ప్రకృతితో కరచాలనం

 
చినుకు కరువై.. సాగు బరువై.. గుండె చెరువై.. అప్పులు అలవికాని భారమై రైతులు నిస్సహాయంగా ఆత్మహత్యల పాలవుతున్నారు. ఒకే పంట వేయడం.. ఖరీదైన విత్తనాలు ఏటా ఒకటికి రెండు, మూడు సార్లు కొనడం.. రసాయనిక ఎరువులు, పురుగుమందుల కోసం ఎంత వడ్డీకైనా సరే అప్పులు తెచ్చి డబ్బు ఎద పెట్టడం.. చివరికి అప్పులే మిగలడం.. ఆత్మహత్యల పాలవడం.. ఇదంతా ఆధునిక సేద్యపు ఎడారిలో ఏకాకై‘పోతున్న’ తెలుగు బడుగు రైతుల దుస్థితి!   
 
 మరోవైపు.. మెదక్ జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో వేలాది మంది రైతుల జీవనవిధానం దీనికి భిన్నంగా ఉంది. వీరిది సంప్రదాయ చిరుధాన్యాల సేద్యం. విత్తనాలు.. సేంద్రియ ఎరువులు.. కషాయాలు.. అన్నీ వారి సొంతవే, డబ్బిచ్చి కొనే పని లేదు. కఠినమైన కరువు కాలంలోనూ దిగుల్లేదు. ప్రతి పొలంలోనూ 10 - 14 రకాల చిరుధాన్యాలు, పప్పులు, నూనె గింజల పంటలను కలిపి సాగు చేస్తున్నారు. ఇవన్నీ కొద్దిపాటి వర్షానికి పండే సంప్రదాయ వంగడాలే. ఏ కష్టమొచ్చినా ‘సంఘం’ బాసటగా ఉంటుంది.
 
 ఆహార స్వావలంబన, విత్తన స్వాతంత్య్రంతోపాటు తమ సేంద్రియ ఉత్పత్తుల్ని మార్కెట్ చేసుకునే సొంత వ్యవస్థ ఈ రైతుల సొంతం. కమ్యూనిటీ రేడియో వీరి నేస్తం. నేలకు, మనిషికి, పశువుకు సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చే సంప్రదాయ పంటల సాగు పాఠాలను వీరు నేర్చింది ప్రకృతి బడిలోనే..! అప్పుల్లేవు. ఆత్మహత్యల్లేవు. ఒక్కమాటలో.. వీళ్లు కొడిగడుతున్న సేద్య దీపానికి సరికొత్త దివ్వెలు. చిన్న, సన్నకారు రైతులందరికీ ఆదర్శప్రాయమైన వీరి సుస్థిర సేద్య జీవన సారం ‘సాగుబడి’ పాఠకుల కోసం..  
 
 హైదరాబాద్‌కు 120 కిలోమీటర్ల దూరం.. మెదక్ జిల్లా జహీరాబాద్ పరిసర గ్రామాల్లోకి వె ళ్తుంటే రోడ్డుకిరువైపులా.. ఆత్మస్థయిర్యంతో నిలబడిన రైతన్నల్లా చిరుధాన్యపు పంటల కంకులు నవ్వుతూ ఆహ్వానం పలుకుతాయి. జొన్న, సజ్జ, రాగి, కొర్ర, సామ, అవిశె, పెసలు, కందులు, నువ్వులు.. కలిసి పచ్చగా పెరుగుతూ.. కరువు కాలంలోనూ నీకు మేమున్నామంటూ రైతన్నకు భరోసానిస్తుంటాయి.
 
 జహీరాబాద్, ఝరాసంగం, రాయికోడ్, న్యాల్‌కల్ మండలాల్లోని 72 గ్రామాల్లో జీవితేచ్ఛను ఇనుమడింపజేసే సంప్రదాయ చిరుధాన్యాల సేద్యం కళకళలాడుతోంది. 3,500 మంది రైతులు తమకు వారసత్వంగా వచ్చిన చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజ పంటల్ని సుమారు ఏడు వేల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. వీరిలో చాలా మంది ఎకరం, రెండెకరాలున్న బడుగు రైతులే. వీరిలో 800 మంది రైతులకు (పీజీఎస్) సేంద్రియ సర్టిఫికేషన్ కూడా ఉంది.
 
 సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయడం ద్వారా భూసారం పెరగడంతో పాటు నాణ్యతతో కూడిన మంచి దిగుబడులు లభిస్తున్నాయి. ఈ పంటలకు నీటి అవసరం తక్కువ. వీరి పొలాల్లో బోర్లు లేవు కాబట్టి సేద్యానికి విద్యుత్ అవసరం లేదు. వర్షాధారమే. చాలా తక్కువ వర్షం పడినా తమను పస్తు పెట్టకుండా, అప్పులపాలు చేయని సంప్రదాయ పంటలనే పండిస్తున్నారు. దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ 32 ఏళ్ల క్రితం వీరిని సంఘం గొడుగు కిందకు తీసుకొచ్చింది. సేంద్రియ పద్ధతుల్లో కలిపి పంటలు (మిశ్రమ పంటల) సాగు చేయడంలో మేలేమిటో చెప్పింది. తమ వారసత్వ పంటలను, వాటి సాగు విజ్ఞానాన్ని అంతరించిపోకుండా పరిరక్షించుకుంటున్నారు.  
 
 30 ఏళ్లుగా చిరుధాన్యాల సేద్యం..
 ఎర్రోళ్ల జయప్పకు (8008487517) ఎకరం పొలం ఉంది. ఇతనిది ఝరాసంఘం మండలంలోని బర్దీపూర్ గ్రామం. గత 30 ఏళ్ల నుంచి చిరు ధాన్యాల సేద్యంతోనే తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. జయప్పకు ఆరుగురు సంతానం. ఇందులో నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఒక కుమారుడిని ఇంజనీరింగ్, మరొక కుమారుడిని ఎంబీఏ చదివించారు. మరో ఇద్దరు కుమారుల్ని బీఈడీ చదివిస్తున్నారు. ఇద్దరు కుమార్తెలను నర్సింగ్ కోర్సు చేయించారు. ఇంట్లోనే ఒక పాడి ఆవును పెంచుకుంటున్నారు. ఎకరానికి ఖర్చులు పోను సంవత్సర నికరాదాయం 45 వేలు. పంటల సాగు అనుభవాలు ఆయన మాటల్లోనే...
 
 ‘నా పొలంలో 18 రకాల పంటల విత్తనాలు వేస్తాను. కొర్రలు, రాగులు, సజ్జలు, జొన్న వంటి చిరుధాన్యాలు.. కంది, ఉలవ, పెసర, అనుములు, బొబ్బర్లు వంటి పప్పుధాన్యాలు.. నువ్వు, కుసుమ వంటి నూనెగింజల పంటలు పొలంలో పక్కపక్కనే వేస్తాం. విత్తనాలు  మొలకెత్తడానికి ఒక్క వర్షం చాలు. వర్షాలు బాగా పడితే పంట మంచి దిగుబడినిస్తుంది. ఇప్పటిలాగా వర్షాలు తక్కువైనా పంట పూర్తిగా పోదు. కొన్ని పంటలైనా బాగా పండుతాయి. నా పొలానికి అవసరమైన విత్తనాల్ని సంఘం ద్వారా నడిచే విత్తన బ్యాంకు నుంచి ఉచితంగా తెచ్చుకుంటాను. పంటచేతికొచ్చినాక తీసుకున్న విత్తనాలకు రెట్టింపు గింజల్ని విత్తన బ్యాంకుకు తిరిగి ఇచ్చేస్తాను.
 
 పంటలకు చీడపీడలు ఆశించకుండా వాయిలాకు, అడ్డసరం ఆకు, వేపాకు, గానుగ ఆకు రసాల మిశ్రమాన్ని మందులుగా చల్లుతాను. భూసారాన్ని పెంచేందుకు జీవామృతం, పిడకల పొడి , వర్మీ కంపోస్టులను ఎరువులుగా వేస్తాను. జీవామృతాన్ని మా ఆవు పేడ, మూత్రంతోనే తయారు చేసుకుంటాను. మా పొలాల్లో కలుపు తీయడానికి కలుపు సంఘంలోని సభ్యులు మార్కెట్ రేటు కంటే 10 శాతం తక్కువకే వస్తారు. మా పొలం పనులు లేకపోతే నా భార్య, నేను బయటి పొలంలో కూలి పనికి వెళ్తుంటాం. మా ‘సంఘం’ 15 రోజులకొకసారి మా ఊళ్లోనే సమావేశం ఏర్పాటు చేస్తుంది.
 
 అప్పటి వాతావరణ, పంటలు, చీడపీడల పరిస్థితులను చర్చించుకుంటాం. సంఘంలోని రైతులెవరికైనా కష్టమొస్తే కలిసికట్టుగా నిలబడతాం. ఆర్థికసాయంతో పాటు మనోస్థయిర్యాన్ని అందిస్తాం. మాకు (కమ్యూనిటీ) రేడియో ఉంది. ఎప్పటికప్పుడు మాకు వ్యవసాయ సూచనలు, సలహాలను రేడియోలో చెబుతారు. విత్తనాలేసిన రెండు, మూడు నెలల నుంచి ఒక్కొక్క పంట దిగుబడి వస్తూ ఉంటుంది. మా కుటుంబం తినడానికి సరిపడా ఉంచుకుని మిగిలిన పంటను డీడీఎస్‌కు అమ్ముతాను. సంఘం తరఫున వాళ్లు వినియోగదారులకు అమ్ముతారు. ఆవుకు  మా పొలంలో పండిన చొప్పనే మేతగా వేస్తాను. మేం పండించుకున్న పంటలే తింటాం. ఉప్పు, అగ్గిపెట్టె వంటివి తప్ప బయట కొనేదేమీ లేదు..’ అని జయప్ప (80084 87517) చెప్పారు.
 
 3,500 మంది రైతులు.. ఏడు వేల హెక్టార్లు..
 జయప్ప మాదిరిగానే జహీరాబాద్ పరిసర మండలాల్లో సుమారు 3,500 మంది ైరె తులు స్వల్ప ఖర్చుతో సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో ఏడు వేల హెక్టార్లలో సంప్రదాయ మిశ్రమ పంటల్ని సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి పొలాల్లో పంటల జీవవైవిధ్యం వర్థిల్లుతోంది. రసాయనాలు వాడకుండా తమ భూములను పరిరక్షించుకుంటున్నారు. జీవితాన్ని తల్లకిందులు చేసే వాణిజ్య పంటల జోలికి వెళ్లకుండా.. తమకు కరువు కాలంలోనూ ఆహార భద్రతను, జీవన భద్రతను ఇచ్చేవి.. తాము తినడానికి అవసరమైన అన్ని రకాల పంటలను సాగు చేసుకుంటున్నారు. తాము ఆరోగ్యంగా జీవిస్తూ.. ఆరోగ్యవంతమైన ఆహారోత్పత్తులను సమాజానికి అందిస్తున్నారు. వీరిని సంఘటితపరిచి ఆత్మగౌరవంతో ముందుకు నడిపించడంలో డీడీఎస్ నిర్వహిస్తున్న పాత్ర కీలకమైనది.
 
 జహీరాబాద్ ప్రాంతంలో ఈ విధంగా సేంద్రియ సేద్యం చేస్తున్న రైతుల పొలాలను ఆసక్తి కలిగిన రైతులు స్వయంగా వెళ్లి చూడొచ్చు. రెండు, మూడు రోజుల పాటు క్షేత్రస్థాయి సందర్శనకు వెళ్లాలనుకునే రైతులు  ముందుగా డీడీఎస్ కార్యాలయం నుంచి ఈ మెయిల్ (ddshyderabad@gmail.com, 040 27764577) ద్వారా అనుమతి పొందాల్సి ఉంటుంది. సందర్శకులు బస చేసేందుకు నిర్దేశిత రుసుమును చెల్లించాల్సి వుంటుంది.
 - అరుణ్ కుమార్ మరపట్ల, సాగుబడి డెస్క్
 ఫొటోలు: పి.జి. నాగరాజు
 
 55 గ్రామాల్లో విత్తన బ్యాంకులు..
 మా విత్తన బ్యాంకులో 80 రకాల సంప్రదాయ పంటల విత్తనాలు ఉన్నాయి. నాలుగు మండలాల్లోని 55 గ్రామాల్లో విత్తనాల బ్యాంకులు పనిచేస్తున్నాయి. రైతుల నుంచి సేకరించిన విత్తనాలను వేపాకులు, బూడిద కలిపి కుండల్లో దాస్తాం. మా సంఘం సభ్యులైన రైతులకు విత్తనాలు ఇస్తాం. పంటలు పండిన తర్వాత అంతకు రెట్టింపు విత్తనాలను తిరిగి తీసుకుంటాం. సేంద్రియ పద్ధతుల్లో పండించాలనుకునే ఇతర రైతులకూ విత్తనాలు ఇస్తున్నాం. ఇతర  రాష్ట్రాలకు చెందిన సంస్థలు కూడా మా విత్తనాలు తీసుకెళ్తుంటాయి.
 - లక్ష్మమ్మ,
 విత్తన బ్యాంకు నిర్వాహకురాలు,
 పస్తాపూర్, మెదక్ జిల్లా
 
 వర్షాలు తగ్గినా పంట చేతికొస్తుంది!
 మా రెండెకరాల పొలంలో పాతికేళ్లకు పైగా 18 రకాల సంప్రదాయ పంటల్ని సాగు చేస్తున్నాం. మాకు రెండు ఆవులున్నాయి. రెండెకరాలకు రూ. ఐదువేల పెట్టుబడి అవుతుంది. విత్తన బ్యాంకు నుంచి విత్తనాలు తెచ్చుకుంటాను. వర్షాలు సరిగా కురవక పోయినా పంట చేతికొస్తుంది. మా కుటుంబానికి సరిపడా తిండి గింజల్ని ఉంచుకుని మిగతావి డీడీఎస్‌కు అమ్ముతాను. అన్ని ఖర్చులు పోనూ నికరాదాయం రూ. 50 వేల వరకు వస్తుంది. పెనిమిటి చాలా ఏళ్ల నాడే చనిపోయాడు. ఐదుగురు పిల్లలున్నారు. పంటల కోసం అప్పు చేసిందెన్నడూ లేదు.
   - కర్నేని నర్సమ్మ, మహిళా రైతు,
 గేంజేటి, న్యాల్‌కల్ మండలం, మెదక్ జిల్లా
 
 కరువును తట్టుకొనే వ్యవసాయం ఇది..
 ఆహార భద్రత, పర్యావరణ భద్రత, జీవన భద్రతలను ఇచ్చేదే సంప్రదాయ చిరుధాన్యాల వ్యవసాయం. సంప్రదాయ పంటలు కరువు పరిస్థితులను అధిగమించి దిగుబడులిస్తాయి. కాబట్టి రైతులు ఆత్మహత్యల పాలయ్యే పరిస్థితులేర్పడవు. జహీరాబాద్ ప్రాంతాల రైతులు సంఘంగా ఏర్పడి అనేక పంటలు కలిపి సాగు చేస్తున్నారు. ఈ పద్ధతుల్లో సాగుచేస్తున్న వాళ్లెవరూ ఆత్మహత్య చేసుకోలేదు. విద్యుత్తు, నీరు అవసరం లేకుండా కరువును తట్టుకొని వ్యవసాయం చేస్తున్నందుకు ప్రత్యేక బోనస్ ఇచ్చి ప్రభుత్వం ఈ రైతులను ప్రోత్సహించాలి.
 - పి.వి.సతీష్, డెరైక్టర్,
 దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ, పస్తాపూర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement