కూరగాయల సాగుకు ప్రోత్సాహం
- ‘మన ఊరు-మన కూరగాయలు’పథ కం ప్రారంభం
- ఇళ్ల వద్ద పెంపకానికి తోడ్పాటు
రాజేంద్రనగర్: కూరగాయల సాగును మరింత పెంచి, రైతుకు లాభాలు అందించేందుకు వ్యవసాయ శాఖ నడుం బిగించింది. ఇందులో భాగంగా ‘మన ఊరు-మన కూరగాయలు’ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకానికి ఉద్యాన, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు తోడ్పాటునందించనున్నాయి. నగరానికి 11 లక్షల టన్నుల కూరగాయలు అవసరం ఉండగా, కేవలం 3 లక్షల టన్నులే రైతులు ఉత్పత్తి చేస్తున్నారు. మిగిలిన వాటిని ఇతర ప్రాంతాల నుంచి తీసుకువస్తున్నారు. మన ఊరు-మన కూరగాయలు పథకం ద్వారా నగరానికి మరిన్ని కూరగాయలను సరఫరా చేసేందుకు నిర్ణయించారు. ఇందుకోసం రైతులకు శిక్షణతో పాటు తోడ్పాటునందిస్తారు. బుధవారం యూనివర్సిటీలో 42 ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించారు.
ఇళ్లలో సేద్యానికి...
పొలాలతో పాటు ఇళ్లలోనూ కూరగాయలను పండిం చేందుకు వివిధ ప్రైవేట్ నర్సరీలు సేవలందిస్తున్నాయి. మొక్కలను పెంచి, వాటిని 35 పైసల నుంచి రూ.1.50 వరకు విక్రయిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా టమాటా, క్యాప్సికమ్, వంకాయ, కాకర, సొర, బొప్పాయి, బెండ తదితర కూరగాయలతో పాటు బంతిపూలు సైతం ఉన్నాయి. మొక్కలను పొలాలు, ఇళ్లలోని కుండీలలో సైతం పెంచవచ్చని నర్సరీ సిబ్బంది సూచిస్తున్నారు.
నాణ్యమైన విత్తనాలు
రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు స్టాళ్లను ఏర్పాటు చేశారు. సాగు గురించి వివరించడంతో పాటు స్వయంగా కంపెనీల సిబ్బందే పొలాలకు వెళ్లి, పంటల ను పరిశీలించేలా చూస్తున్నారు. తద్వారా నకిలీలను అరికట్టవచ్చని చెబుతున్నారు.
సేంద్రియ ఎరువులు
ప్రస్తుతం సేంద్రియ ఎరువుల వినియోగం పెరుగుతోంది. దీంతో యూనివర్సిటీలోని సేంద్రియ ఎరువుల ఉత్పత్తి కేంద్రం నుంచి రైతులతో పాటు నగరంలోని ఇళ్లలో పెంచే వారికీ వీటిని అందించనున్నారు. ఈ స్టాల్ విశేషంగా ఆకట్టుకుంటోంది. వీటితో పాటు వ్యవసాయ పనిముట్లు, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు, సోలార్ పంప్‌సెట్‌లూ ఆకట్టుకుంటున్నాయి.