స్వచ్ఛబడిలో సేంద్రియ ఎరువుల తయారీ గురించి తెలుసుకుంటున్న పట్టణవాసులు
సాక్షి, సిద్దిపేట: చెత్తే కదా.. అని తీసిపారేయకండి. అది సేంద్రియ ఎరువుగా మారి సత్తా చాటుతోంది. మిద్దెతోటలకు జవం అవుతోంది. మొక్కలకు జీవం పోస్తోంది. ఒకటి, రెండు కాదు, ఏకంగా 1,450 ఇళ్ల ల్లో సేంద్రియ ఎరువులు తయారు చేస్తున్నారు. వీటి ని ఇంటి మేడపైన సాగవుతున్న మిద్దెతోటలకు విని యోగిస్తున్నారు.
చెత్తరహిత సమాజం దిశగా కృషి చేస్తున్న సిద్దిపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛబడిని ఏర్పాటు చేశారు. ఇంట్లోనే సేంద్రియ ఎరువులను తయారు చేసే విధానాన్ని వివరిస్తున్నారు.చెత్తను ఎరువుగా తయారు చేసి సాగుకు ప్రయోజకనకరంగా మలచడంతో సిద్దిపేట మున్సిపాలిటీ ఆదర్శంగా నిలుస్తోంది. పట్ణణవాసులందరూ ఈ విధానాన్ని అవలంబిస్తే చెత్త, డంపింగ్ యార్డుల సమ స్యలు తీరుతాయని అధికారులు అంటున్నారు.
హానికరమైన చెత్తనే
ప్రతిరోజు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెత్తబండ్లు పట్టణంలోని గృహాలకు తడి, పొడి, హానికరమైన చెత్తను వేర్వేరుగా సేకరిస్తున్నాయి. పట్టణంలో 26,045 నివాస గృహాలుండగా, 1,450 ఇళ్లలో సేంద్రియ ఎరువులు తయారు చేస్తున్నారు. ఈ గృహాలవారు కేవలం హానికరమైన చెత్తనే చెత్తబండికి అందజేస్తారు. తడి, పొడి చెత్తతో వేర్వేరుగా సేంద్రియ ఎరువును తయారు చేసి మిద్దెతోటల్లోని మొక్కలకు చల్లుతున్నారు. ఇలా ఇంట్లోనే తయారు చేసే సేంద్రియ ఎరువుతో కూరగాయల బాగా కాస్తుండటంతో పట్టణంలో సేంద్రియ ఎరువుల తయారీ సత్ఫలితాలిస్తోంది.
రోజూ తరగతులు: సిద్దిపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛబడిని ఏర్పాటు చేశారు. బెంగుళూరు తరహాలో సిద్దిపేటలో రాష్ట్ర ఆర్థికమంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో స్వచ్ఛబడిని ఏర్పాటు చేశారు. అక్కడే సేంద్రియ ఎరువుల తయారీపై శిక్షణ ఇస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లకు బదులు క్లాత్ బ్యాగులను వినియోగించాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇదే విధమైన స్వచ్ఛబడిని తమ ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు ఇతర మున్సిపాలిటీలు ముందుకొస్తున్నాయి.
హానికరమైన చెత్తనే బయటకు..
మా ఇంటిలోని తడి, పొడి చెత్తను చెత్తబండికి ఇవ్వం. గతేడాది నుంచి ఇంట్లోనే సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నాం. ఇంట్లో తయారు చేసిన ఎరువునే మిద్దెతోటలోని కూరగాయల మొక్కలకు చల్లుతున్నాం. ఇంటికి సరిపడా కూరగాయలు మిద్దె తోటలో పండుతున్నాయి.
- డాక్టర్ డీఎన్.స్వామి, సిద్దిపేట
మన చెత్త.. మన ఎరువు
మా ఇంట్లో తడి, పొడి చెత్తతోనే ఎరువు తయారు చేస్తున్నాం. మిద్దెతోట కోసం ఎరువులను ఇదివరకు బయట నుంచి కొనుగోలు చేశాం. గతేడాది నుంచి ఇంట్లోనే ఎరువు తయారు చేసి మిద్దెతోటలో వినియోగిస్తున్నాం. మా ఇంటికి వచ్చిన బంధువులు, స్నేహితులందరికి వారికి సరిపడా కూరగాయలను అందిస్తున్నా.
-నాగరాజు, సిద్దిపేట
ప్రజల్లో అవగాహన పెంచుతున్నాం
సేంద్రియ ఎరువుల తయారీపై అవగాహన పెంచు తున్నాం. మంత్రి హరీశ్‌రావు చొరవతో స్వచ్ఛ బడి ఏర్పాటు చేశాం. సేంద్రియ ఎరువులను ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాం. మున్సిపాలిటీలో ఇప్పటివరకు 1,450 నివాసాల్లో సేంద్రియ ఎరువులు సొంతంగా తయారు చేస్తున్నారు. -రమణాచారి, కమిషనర్, పురపాలక సంఘం, సిద్దిపేట
Comments
Please login to add a commentAdd a comment