junk
-
‘ఐటీ’కి మెటబాలిక్ సిండ్రోమ్!
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో సగం మందిలో మెటబాలిక్ సిండ్రోమ్ సమస్య కనిపిస్తోందని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) పేర్కొంది. ఉద్యోగ హడావుడిలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ.. మధుమేహం, తీవ్ర రక్తపోటు, గుండె జబ్బుల బారినపడుతున్నారని తమ అధ్యయనంలో తేలిందని వెల్లడించింది. ఐటీ కంపెనీలు ఉద్యోగుల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని.. సరైన పోషకాహారం తీసుకునేలా చూడటంతోపాటు వ్యాయామాలు చేయించడం, ఒత్తిడిని తగ్గించే కార్యక్రమాలను చేపట్టడం మంచిదని సూచించింది. –సాక్షి హైదరాబాద్ ఐసీఎంఆర్ నేతృత్వంలో.. భారతీయ వైద్య పరిశోధన సమాఖ్య (ఐసీఎంఆర్) నేతృత్వంలో ఎన్ఐఎన్ ఈ అధ్యయనం నిర్వహించింది. దేశంలో ప్రముఖ ఐటీ హబ్ అయిన హైదరాబాద్‌లో పెద్ద, మధ్య తరహా, చిన్న ఐటీ కంపెనీల్లో విస్తృత స్థాయిలో అధ్యయనం నిర్వహించింది. ఉద్యోగాల తీరుతెన్నులు, వాటిలో పనిచేస్తున్నవారి ఆహార అలవాట్లు, జీవనశైలి, వారి ఆరోగ్యం వంటి వివరాలను సేకరించి విశ్లేషించింది. వారిలో 46శాతం మందికిపైగా మెటబాలిక్ సిండ్రోమ్ బారినపడినట్టు గుర్తించింది. చాలా మందిలో హెచ్‌డీఎల్ (మంచి) కొవ్వులు తక్కువగా ఉండటం, రక్తపోటు, నడుము చుట్టుకొలత వంటివి ఎక్కువగా ఉండటాన్ని గమనించింది. ఐటీ ఉద్యోగులు రోజులో కనీసం ఎనిమిది గంటల పాటు కూర్చునే ఉంటున్నారని.. 22 శాతం మంది మాత్రమే వారానికి కనీసం 150 నిమిషాల శారీరక వ్యాయామం చేయాలన్న సూత్రాన్ని పాటిస్తున్నారని తేల్చింది. వ్యాయామం లేకపోవడం, తీవ్ర ఒత్తిడి, పోషకాలు లేని జంక్ ఫుడ్ తీసుకోవడం వంటివి శరీరంలో ఇన్ఫ్లమేషన్కు కారణం అవుతున్నాయని.. ఇది కాలం గడిచిన కొద్దీ మెటబాలిక్ సిండ్రోమ్‌కు దారితీస్తోందని ఎన్ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.హేమలత తెలిపారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న ఉద్యోగుల సగటు వయసు 30 ఏళ్లు మాత్రమేనని.. చిన్నవయసులోనే సమస్యల బారినపడుతున్నారని వివరించారు. ఏమిటీ మెటబాలిక్ సిండ్రోమ్! మన శరీరంలో క్రమంకొద్దీ జరగాల్సిన జీవక్రియల్లో తేడాలు రావడం, లోపాలు చోటు చేసుకోవడమే మెటబాలిక్ సిండ్రోమ్. ఊబకాయం, ట్రైగ్లిజరైడ్స్, హెచ్‌డీఎల్, రక్తపోటు, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు.. అనే ఐదు ప్రధాన రిస్క్ ఫ్యాక్టర్లను బట్టి దీన్ని నిర్ధారిస్తారు. నడుము చుట్టుకొలత, అధిక బరువు ఊబకాయాన్ని సూచిస్తాయి. వైద్య నిపుణుల సూచనల ప్రకారం.. నడుము చుట్టుకొలత పురుషుల్లోనైతే 90 సెంటీమీటర్లకన్నా, మహిళలకు 80 సెంటీమీటర్లకన్నా ఎక్కువగా ఉండటం ఊబకాయానికి సూచిక. ఇక రక్తంలో ట్రైగ్లిజరైడ్లు 150ఎంజీ/డెసిలీటర్ కంటే ఎక్కువ ఉండటం అనారోగ్యకరం. ఆరోగ్యకరమైన కొవ్వులైన హెచ్‌డీఎల్ (హైడెన్సిటీ లిపిడ్స్) పురుషుల్లోనైతే 40 ఎంజీ/డెసిలీటర్ కంటే, మహిళల్లో 50 ఎంజీ/డెసిలీటర్ కంటే ఎక్కువగా ఉండాలి. రక్తపోటు 135/85 కన్నా తక్కువగా ఉండాలి. కనీసం ఎనిమిది గంటలకన్నా ఎక్కువ సమయం ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉన్నాక రక్తంలో గ్లూకోజు స్థాయిలు 100 ఎంజీ/డెసిలీటర్ కన్నా తక్కువగా ఉండాలి. ఈ ఐదింటిలో ఏ మూడు వ్యతిరేకంగా ఉన్నా.. సదరు వ్యక్తులు మెటబాలిక్ సిండ్రోమ్ సమస్యను ఎదుర్కొంటున్నట్టేనని వైద్యులు చెప్తున్నారు. జీవన శైలిలో మార్పులే పరిష్కారం మెటబాలిక్ సిండ్రోమ్‌కు గురి కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం పెద్ద కష్టమేమీ కాదని నిపుణులు చెప్తున్నారు. తరచూ బయటి ఆహారం (ఫాస్ట్‌ఫుడ్, జంక్‌ఫుడ్) తినడం తగ్గించుకోవాలని.. కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలని, వీలైనంత వరకూ కాయగూరలు, పండ్లు తినాలని సూచిస్తున్నారు. ఐటీ ఉద్యోగులు చాలామంది సమయానికి ఆహారం తీసుకోవడం లేదని వెల్లడైందని అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.సుబ్బారావు గవరవరపు తెలిపారు. దీనికితోడు ఒత్తిడికి లోనవుతుండటం మెటబాలిక్ సిండ్రోమ్‌కు గురయ్యేందుకు దారితీస్తోందని వివరించారు. అధ్యయనంలో పాల్గొన్న వారి సంఖ్య తక్కువే అయినా.. సగటున అందరు ఉద్యోగుల జీవనశైలి, ఆహార అలవాట్లు, ఒత్తిడి దాదాపు ఒకేలా ఉన్నట్టు గుర్తించామని వెల్లడించారు. ఈ సమస్య నుంచి ఐటీ ఉద్యోగులు బయటపడేందుకు తీసుకోవాల్సిన చర్యలనివేదికను ఎన్ఐఎన్ శాస్త్రవేత్త భానుప్రకాశ్‌రెడ్డితో కలసి సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. న్యూట్రియంట్స్’ఆన్లైన్ జర్నల్‌లో ఈ అధ్యయనం వివరాలు ప్రచురితమయ్యాయి. -
ఇల్లే కదా.. ‘సేంద్రియ’ సీమ
సాక్షి, సిద్దిపేట: చెత్తే కదా.. అని తీసిపారేయకండి. అది సేంద్రియ ఎరువుగా మారి సత్తా చాటుతోంది. మిద్దెతోటలకు జవం అవుతోంది. మొక్కలకు జీవం పోస్తోంది. ఒకటి, రెండు కాదు, ఏకంగా 1,450 ఇళ్ల ల్లో సేంద్రియ ఎరువులు తయారు చేస్తున్నారు. వీటి ని ఇంటి మేడపైన సాగవుతున్న మిద్దెతోటలకు విని యోగిస్తున్నారు. చెత్తరహిత సమాజం దిశగా కృషి చేస్తున్న సిద్దిపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛబడిని ఏర్పాటు చేశారు. ఇంట్లోనే సేంద్రియ ఎరువులను తయారు చేసే విధానాన్ని వివరిస్తున్నారు.చెత్తను ఎరువుగా తయారు చేసి సాగుకు ప్రయోజకనకరంగా మలచడంతో సిద్దిపేట మున్సిపాలిటీ ఆదర్శంగా నిలుస్తోంది. పట్ణణవాసులందరూ ఈ విధానాన్ని అవలంబిస్తే చెత్త, డంపింగ్ యార్డుల సమ స్యలు తీరుతాయని అధికారులు అంటున్నారు. హానికరమైన చెత్తనే ప్రతిరోజు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెత్తబండ్లు పట్టణంలోని గృహాలకు తడి, పొడి, హానికరమైన చెత్తను వేర్వేరుగా సేకరిస్తున్నాయి. పట్టణంలో 26,045 నివాస గృహాలుండగా, 1,450 ఇళ్లలో సేంద్రియ ఎరువులు తయారు చేస్తున్నారు. ఈ గృహాలవారు కేవలం హానికరమైన చెత్తనే చెత్తబండికి అందజేస్తారు. తడి, పొడి చెత్తతో వేర్వేరుగా సేంద్రియ ఎరువును తయారు చేసి మిద్దెతోటల్లోని మొక్కలకు చల్లుతున్నారు. ఇలా ఇంట్లోనే తయారు చేసే సేంద్రియ ఎరువుతో కూరగాయల బాగా కాస్తుండటంతో పట్టణంలో సేంద్రియ ఎరువుల తయారీ సత్ఫలితాలిస్తోంది. రోజూ తరగతులు: సిద్దిపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛబడిని ఏర్పాటు చేశారు. బెంగుళూరు తరహాలో సిద్దిపేటలో రాష్ట్ర ఆర్థికమంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో స్వచ్ఛబడిని ఏర్పాటు చేశారు. అక్కడే సేంద్రియ ఎరువుల తయారీపై శిక్షణ ఇస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లకు బదులు క్లాత్ బ్యాగులను వినియోగించాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇదే విధమైన స్వచ్ఛబడిని తమ ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు ఇతర మున్సిపాలిటీలు ముందుకొస్తున్నాయి. హానికరమైన చెత్తనే బయటకు.. మా ఇంటిలోని తడి, పొడి చెత్తను చెత్తబండికి ఇవ్వం. గతేడాది నుంచి ఇంట్లోనే సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నాం. ఇంట్లో తయారు చేసిన ఎరువునే మిద్దెతోటలోని కూరగాయల మొక్కలకు చల్లుతున్నాం. ఇంటికి సరిపడా కూరగాయలు మిద్దె తోటలో పండుతున్నాయి. - డాక్టర్ డీఎన్.స్వామి, సిద్దిపేట మన చెత్త.. మన ఎరువు మా ఇంట్లో తడి, పొడి చెత్తతోనే ఎరువు తయారు చేస్తున్నాం. మిద్దెతోట కోసం ఎరువులను ఇదివరకు బయట నుంచి కొనుగోలు చేశాం. గతేడాది నుంచి ఇంట్లోనే ఎరువు తయారు చేసి మిద్దెతోటలో వినియోగిస్తున్నాం. మా ఇంటికి వచ్చిన బంధువులు, స్నేహితులందరికి వారికి సరిపడా కూరగాయలను అందిస్తున్నా. -నాగరాజు, సిద్దిపేట ప్రజల్లో అవగాహన పెంచుతున్నాం సేంద్రియ ఎరువుల తయారీపై అవగాహన పెంచు తున్నాం. మంత్రి హరీశ్‌రావు చొరవతో స్వచ్ఛ బడి ఏర్పాటు చేశాం. సేంద్రియ ఎరువులను ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాం. మున్సిపాలిటీలో ఇప్పటివరకు 1,450 నివాసాల్లో సేంద్రియ ఎరువులు సొంతంగా తయారు చేస్తున్నారు. -రమణాచారి, కమిషనర్, పురపాలక సంఘం, సిద్దిపేట -
చేప గాలానికి.. 22 అడుగుల ‘తిమింగలం’
బరంపురం: పనికిరాని వ్యర్థ వస్తువులతో చేప గాలానికి 22 అడుగుల తిమింగలం తయారు చేసి బరంపురం ఐటీఐ విద్యార్థులు ప్రతిభను కనబరిచారు. ఐటీఐ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ 22 అడుగుల తిమింగలం సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా ఐటీఐ ప్రిన్సిపాల్ రజత్ కుమార్ పాణిగ్రహి శుక్రవారం సాక్షితో మాట్లాడుతూ గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ లక్ష్యంతో ఐటీఐ కళాశాలలో చదువుతున్న ఫిట్టర్, వెల్డర్, పెయింటర్ ట్రేడ్లకు చెందిన 25 మంది విద్యార్థులు 40 రోజుల పాటు శ్రమించి వ్యర్థ పదార్థాలతో చేప గాలానికి 22 అడుగుల తిమింగలం తయారు చేసి రికార్డు సృష్టించారని చెప్పారు. ఇది సుమారు 400 కిలోల బరువు ఉన్నట్లు తెలిపారు. గతంలో కూడా ఇదే విద్యార్థులు 70 అడుగుల గిటార్‌ను తయారు చేసి అసియా బుక్ అఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్నారన్నారు. ప్రస్తుతం ఈ చేప గాలానికి చిక్కిన 22 అడుగుల తిమింగలం ప్రపంచంలో మరెక్కడా లేదని ఈ నేపథ్యంలో బరంపురం ఐటీఐ విద్యార్థులకు గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో తప్పక స్థానం దక్కుతుందని ప్రిన్సిపాల్ రజత్ పాణిగ్రహి ఆశాభావం వెలిబుచ్చారు. -
చెత్తకు రీసైక్లింగ్
ప్రపంచంలో ఏ మూలకెళ్లినా కనిపించే సమస్య.. ప్లాస్టిక్ చెత్త!. బాటిళ్లు, పాలిథీన్ కవర్లు ఇలా రకరకాల రూపాల్లో అందరినీ చికాకుపెట్టే ప్లాస్టిక్‌ను వదలించుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. కానీ ఈలోపుగా... పర్యావరణానికి జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. మినీవిజ్ అనే డిజైనింగ్ కంపెనీ మాత్రం ఇకపై ప్లాస్టిక్ చింత వద్దంటోంది. అన్ని రకాల చెత్తను ఈ మెషీన్ (ఫొటోలో ఉన్నదే)లో పడేయండి.. టైల్స్గా మార్చేసుకోండి అంటోంది. ఈ యంత్రం పేరు కూడా చేసే పనికి తగ్గట్టుగా ఉందండోయ్! ‘ట్రాష్ప్రెస్లో’! ఓ 40 అడుగుల పొడవైన షిప్పింగ్ కంటెయినర్లో ఇమిడిపోగల ట్రాష్ప్రెస్లో చేసే పని చాలా తేలికైనది. వేసిన ప్లాస్లిక్ మొత్తాన్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగేస్తుంది. ఆ తరువాత కరిగించి టైల్స్ రూపంలో అచ్చు వేస్తుందన్నమాట. ఈ టైల్స్‌ను ఇళ్లల్లో, పేవ్మెంట్లపై ఎక్కడైనా వాడుకోవచ్చు. ఐదు ప్లాస్టిక్ బాటిళ్లను వాడితే ఒక టైల్ బయటికొస్తుందని, తగినంత చెత్త ఉపయోగిస్తే గంట తిరక్కుండానే 10 చదరపు మీటర్ల సైజున్న టైల్స్‌ను సిద్ధం చేయవచ్చునని మినీవిజ్ అంటోంది. అంతేకాదండోయ్... ఈ యంత్రం నడిచేందుకు పెట్రోలు, డీజిల్ లాంటివి ఏవీ వాడాల్సిన అవసరం లేదు. మొత్తం సౌరశక్తితోనే పనిచేసేలా ఏర్పాట్లు ఉన్నాయి. హిమాలయ పర్వతాల సమీపంలోని నియాన్బావో యూజీ హిమనదం వద్ద పర్యాటకులు వాడిపారేసిన చెత్త మొతాన్ని చక్కబెట్టేందుకు త్వరలో దీన్ని వాడనున్నారు.