సిద్దిపేట, న్యూస్‌లైన్: స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా భాసిల్లుతోన్న సిద్దిపేటలో సర్కారు స్థలాలకు ఆపద ముంచుకొస్తోంది. ఇప్పటికే విలువైన సర్కారు భూమి పప్పు బెల్లాల్లా పరులపాలైంది. పోరంపోగు స్థలాలను డేగ కళ్లతో గుర్తిస్తున్న అక్రమార్కులు గద్దల్లా వాటిని తన్నుకుపోతున్నారు. ఆక్రమణలు, ఆపై అమ్మకాలు సాగిస్తూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. సామాన్యుడు జీవితాంతం కష్టపడినా సంపాదించలేని సొమ్ములను కూడబెట్టేస్తున్నారు.
క్యాష్...కమాండింగ్
సర్కారు భూములను ఆక్రమించి లెక్కకందని డబ్బులు సంపాదించిన కొందరు అక్రమార్కులు సర్కారు వ్యవస్థలనూ కమాండింగ్ చేసే స్థాయికి ఎగబాకారు. ఇలాంటి నేపథ్యమున్న ఓ ల్యాండ్ మాఫియా ఇప్పుడు హౌసింగ్ బోర్డు కాలనీలోని నాలుగు ఎకరాల 15 గుంటల సర్కారు స్థలాన్ని ఆక్రమించుకునేందుకు సిద్ధమైంది. సంబంధిత శాఖల అధికారులను శాసించైనా కబ్జా చేసేందుకు కుయుక్తులు పన్నుతోంది. ఎకరాకు కోటి రూపాయలు పలుకుతుందని మార్కెట్ గురూలు అంచనా వేస్తోన్న సదరు స్థలాన్ని సొమ్ము చేసుకుందుకు కాపుకాసి ఉంది.
96 ఎకరాల్లో మిగిలింది ఇదే...
సిద్దిపేట పట్టణంలో వేగంగా అభివృద్ధి చెందుతోన్న ఏరియాల్లో హౌసింగ్ బోర్డు కాలనీ ఒక టి. నిజానికి ఆ ప్రదేశంలో ఒకప్పుడు 96 ఎకరాల ప్రభుత్వ స్థలాలుండేవి. వాటిల్లో దళితులకు, హౌసింగ్ బోర్డు వంటి వాటికి అధికారికంగా పంచగా ప్రస్తుతం మిగిలింది కేవలం నాలుగు ఎకరాల 15 గుంటలేనని తెలుస్తోంది. దీని విలువ మార్కెట్‌లో రూ. నాలుగు కోట్లకు పైమాటే. నిజానికి ఈ జాగాను కేంద్రీయ విద్యాలయానికి కేటాయించాలని అప్పట్లో యోచించారు. కానీ..ఆ దిశగా కదలికల్లేకపోవడంతో ఎలాంటి రక్షణ లేకుండా జాగా అగాధంలో పడింది. ఈ స్థలంతోపాటు సర్వే నంబరు 1301లో మూడెకరాలు, సర్వే నంబరు 1871లో ఒక ఎకరం ప్రభుత్వ స్థలాలకూ తగిన ఏర్పాట్లు లేవు. కనీసం ఉన్న జాగాలనైనా ప్రజా ప్రయోజనాల కోసం కాపాడక పోతే అంతే సంగతులు.
జాగు చేస్తే జాగా గల్లంతు!
Published Wed, Oct 30 2013 11:39 PM | Last Updated on Sat, Sep 2 2017 12:08 AM
Advertisement
Advertisement