reveneu
-
ఆగ్రోకెమికల్స్ ఆదాయం డౌన్! దశాబ్దకాలంలో ఇదే తొలిసారి..
ముంబై: ఉత్పత్తుల ధరల తగ్గుదల, డిమాండ్ అంతంతమాత్రంగా ఉండటం, రబీ పంట సీజన్లో రిజర్వాయర్లలో నీటి నిల్వలు ఒక మోస్తరుగా ఉండటం తదితర అంశాల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశీ ఆగ్రోకెమికల్స్ రంగం ఆదాయం 3 శాతం మేర క్షీణించనుంది. క్రెడిట్ రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ ఒక నివేదికలో ఈ మేరకు అంచనాలు వేసింది. దశాబ్దకాలంలో ఇలా జరగడం ఇదే తొలిసారని పేర్కొంది. చైనా నుంచి సరఫరా వెల్లువెత్తడంతో అంతర్జాతీయంగా ఆగ్రోకెమికల్స్ ధరలు పడిపోయాయని, ఎగుమతులకు డిమాండ్ తగ్గిందని క్రిసిల్ తెలిపింది. అటు అమ్మకాల పరిమాణం, వసూళ్లు తగ్గడం వల్ల నిర్వహణ మార్జిన్లు 400–450 బేసిస్ పాయింట్లు (బీపీఎస్) మేర క్షీణించి దశాబ్దపు కనిష్టమైన 10–11 శాతానికి పడిపోవచ్చని వివరించింది. డిమాండ్ అంతంతమాత్రంగా ఉండటంతో తయారీ సంస్థలు తమ మూలధన వ్యయాల ప్రణాళికలను కూడా మార్చుకునే పరిస్థితి నెలకొందని క్రిసిల్ పేర్కొంది. లాటిన్ అమెరికా, అమెరికాలో పంటల సీజన్ మళ్లీ ప్రారంభమయ్యే సమయానికి అంతర్జాతీయంగా తయారీ సంస్థలు తిరిగి నిల్వలను పెంచుకోవడం మొదలెట్టాక నవంబర్ నుంచి ఎగుమతులకు డిమాండ్ మెరుగుపడవచ్చని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ పూనమ్ ఉపాధ్యాయ్ తెలిపారు. ఎగుమతుల్లో ఆ రెండు మార్కెట్ల వాటా 55 శాతం ఉంటుంది. నివేదికలో మరిన్ని విశేషాలు.. ఎగుమతులు మందగించడంతో దేశీ తయారీ సంస్థల దగ్గర నిల్వలు భారీగా పేరుకుపోయిన నేపథ్యంలో దేశీయంగా అమ్మకాల వృద్ధి సింగిల్ డిజిట్ స్థాయిలోనే ఉండొచ్చు. వర్షపాతం ఆశించినంత స్థాయిలో లేకపోవడం వల్ల రిజర్వాయర్లలో నీటి నిల్వలు తక్కువగా ఉండటం రబీ పంటలపై ప్రభావం చూపనుంది. ఫలితంగా ఆగ్రోకెమికల్స్ పరిశ్రమపైనా ప్రతికూల ప్రభావం పడనుంది. సాధారణంగా దేశీయంగా క్రిమిసంహారకాల వినియోగంలో ఈ సీజన్ వాటా 35 శాతం ఉంటుంది. అటు ఎగుమతులు మందగించడం, ఇటు దేశీయంగా డిమాండ్ నెమ్మదించడం వంటి అంశాల కారణంగా ఆగ్రోకెమికల్స్ తయారీ సంస్థల నిర్వహణ లాభదాయకత దెబ్బతినే అవకాశం ఉంది. ఇప్పటికే తొలి త్రైమాసికంలో వాటి ఆపరేటింగ్ మార్జిన్ వార్షిక ప్రాతిపదికన 700–1,000 బేసిస్ పాయింట్ల మేర క్షీణించింది. అయితే, మూడో త్రైమాసికం నుంచి డిమాండ్ పుంజుకునే అవకాశం ఉండటం వల్ల నిర్వహణ లాభదాయకత సీక్వెన్షియల్‌గా మెరుగుపడవచ్చు. అయినప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరంలో కాస్త తక్కువగా 10–11 శాతానికే పరిమితం కావచ్చు. గత ఆర్థిక సంవత్సరంలో ఇది 15.2 శాతంగా నమోదైంది. రాబోయే రోజుల్లో డిమాండు, కీలక ఎగుమతి మార్కెట్లలో వాతావరణ పరిస్థితులు, ఉత్పత్తులు.. ముడిసరుకు ధరలు మొదలైన వాటిని నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. -
ప్రభాస్ మొదటి సినిమాకు ఎంత లాభం వచ్చిందో తెలుసా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నట ప్రస్థానం 'ఈశ్వర్' సినిమాతో మొదలైంది. ఈ చిత్రం 2002 నవంబరు 11న విడుదలై అప్పట్లో ఓ ట్రెండ్ సెట్ చేసింది. ధూల్‌పేట్ ఈశ్వర్‌గా ప్రభాస్ దుమ్ములేపాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు ‘జయంత్ సి పరాన్జీ’ తెరకెక్కించిన విషయం తెలిసిందే. రెబెల్ స్టార్ కృష్ణం రాజు నట వారసుడిగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చినా.. తన సొంత టాలెంట్‌తోనే అవకాశాలు దక్కించుకున్నాడు ప్రభాస్. (ఇదీ చదవండి: ‘ఆదిపురుష్’ మూవీ రివ్యూ) అప్పట్లో రూ.2 కోట్ల బడ్జెట్‌తో ఈశ్వర్ సినిమాను తెరకెక్కిస్తే. నాలుగు కోట్ల రూపాయలు వసూళ్లు చేసింది. మొదటి సినిమాతోనే యూత్, మాస్ ప్రేక్షకులలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ప్రభాస్ సంపాదించుకున్నాడు. ఈశ్వర్ తర్వాత 'రాఘవేంద్ర' సినిమాతో నిరాశపర్చినా.. అనంతరం శోభన్ దర్శకత్వంలో వచ్చిన 'వర్షం' చిత్రంతో అమ్మాయిల హృదయాలతో పాటు రూ. 21 కోట్ల కలెక్షన్స్‌ను కొల్లగొట్టాడు. ఈ సినిమాలో చేసిన యాక్షన్ సీక్వెన్సులతో యంగ్ రెబల్ స్టార్‌గా అప్పట్లో చెరగని ముద్రవేశాడు. ప్రస్తుతం సలార్, ప్రాజెక్టు కె (వర్కింగ్ టైటిల్)లతో వినోదం పంచేందుకు ప్రభాస్ సిద్ధమవుతున్నారు. (ఇదీ చదవండి: మళ్లీ అత్తమామల దగ్గరకు ఉపాసన) -
‘నిధుల విషయంలో కేంద్రం అసత్యాలు చెబుతోంది’
-
కరోనా పోటు రూ. 52,750 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కరోనా రూపంలో గట్టి దెబ్బే పడింది. ఆశించిన ఆదాయం గణనీయంగా తగ్గి... ఆర్థిక ప్రణాళిక తల్లకిందులైంది. ఇప్పుడు నికరంగా వచ్చేదెంతో చూసుకొని.. ప్రాధాన్యాలను బట్టి పద్దులను సరిచేసుకోవాల్సి వస్తోంది. కరోనా నియంత్రణకు విధించిన లాక్‌డౌన్‌తో ప్రస్తుత (2020–21) ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి వచ్చే ఆదాయం అన్నివిధాలా కలిసి రూ.52,750 కోట్లు తగ్గనుందని ఆర్థిక శాఖ అధికారులు తేల్చారు. ఆదాయంలో భారీ తగ్గుదల నేపథ్యంలో 2020–21 బడ్జెట్ అంచనాల్లో కూడా మార్పులు, సవరణలు అనివార్యమని ప్రభుత్వానికి సూచించారు. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం కేసీఆర్ శనివా రం ప్రగతిభవన్‌లో ఆర్థికశాఖ అధికారులతో సమావేశమయ్యారు. 2020–21 బడ్జెట్‌పై మధ్యంతర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ అధికారులు కరోనా వల్ల తలెత్తిన పరిస్థితిని వివరించారు. తల్లకిందులైన బడ్జెట్ అంచనాలు ‘రాష్ట్రానికి పన్నులు, పన్నేతర మార్గాల ద్వారా 2019–20 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఏడు నెలల కాలంలో రాష్ట్రానికి రూ.39,608 కోట్ల ఆదాయం వచ్చింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ వరకు రూ.33,704 కోట్లు మాత్రమే వచ్చాయి. వాస్తవానికి రాష్ట్ర ఆదాయ వృద్ధి రేటు 15 శాతం ఉంటుందని అంచనా వేసి 2020–21 బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించడం జరిగింది. ఆశించిన 15 శాతం వృద్ధి లేకపోగా.. కరోనా వల్ల గత ఏడాది వచ్చిన ఆదాయం కూడా ఈ ఏడాది రాలేదు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి పన్నులు, పన్నేతర మార్గాల ద్వారా మొత్తం రూ.1,15,900 కోట్ల ఆదాయం వస్తుందనే అంచనాతో బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందాయి. కానీ ఈ ఆర్థిక సంవత్సరాంతానికి కేవలం రూ.68,781 కోట్ల ఆదాయం మాత్రమే సమకూరే అవకాశాలున్నాయి. దీంతో రాష్ట్రానికి వచ్చే స్వీయ ఆదాయం రూ.47,119 కోట్లు తగ్గనుంది’అని ఆర్థికశాఖ అధికారులు తెలిపారు. ‘రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లిన పన్నుల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటా కూడా భారీగా తగ్గింది. తెలంగాణకు 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.16,727 కోట్లను పన్నుల్లో రాష్ట్ర వాటాగా చెల్లిస్తామని కేంద్ర బడ్జెట్లో పేర్కొన్నారు. దీని ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు పన్నుల్లో వాటా కింద రూ.8,363 కోట్లు రావాలి. కానీ రూ.6,339 కోట్లు మాత్రమే వచ్చాయి. పన్నుల్లో వాటా ఇప్పటికే రూ.2,024 కోట్లు తగ్గింది. 2020–21 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.16,727 కోట్లకు గాను కేవలం రూ.11,898 కోట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. దీంతో పన్నుల్లో వాటా రూ.4,829 కోట్లు తగ్గనున్నాయి. వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాల కింద కేంద్ర ప్రభుత్వం నుంచి 2020–21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రూ.9,725 కోట్లు రావాల్సి ఉంది. దీని ప్రకారం అక్టోబర్ నెల వరకు రూ.5,673 కోట్లు రావాలి. కానీ ఇప్పటి వరకు కేవలం రూ.4,592 కోట్లు వచ్చాయి. అక్టోబర్ మాసం వరకే రావాల్సిన నిధుల్లో రూ.1,081 కోత పడింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ. 9,725 కోట్లకు గాను, రూ.8,923 కోట్లు మాత్రమే వచ్చే అవకాశాలున్నాయి. మొత్తంగా కేంద్ర పథకాల కింద వచ్చే నిధుల్లో రూ.802 కోట్ల కోతపడే అవకాశం ఉంది’అని ఆర్థికశాఖ అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రానికి మొత్తంగా రూ.52,750 కోట్ల ఆదాయం తగ్గుతున్నందున దానికి అనుగుణంగా ప్రాధాన్యతాక్రమాన్ని నిర్ధారించుకుని, ఆర్థిక నిర్వహణ ప్రణాళిక రూపొందించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కేంద్రం ఇచ్చింది శూన్యం: కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానివి శుష్క ప్రియాలు, శూన్య హస్తాలే అని మరోసారి నిరూపణ అయిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వర్షాలు, వరదలతో భారీగా పంట నష్టం, ఆస్తి నష్టం జరిగినా ఒక్క రూపాయి కూడా సాయం అందించకపోవడం కేంద్ర ప్రభుత్వ వైఖరిని తేటతెల్లం చేస్తోందని విమర్శించారు. దేశంలోని అతిపెద్ద నగరాల్లో ఒకటైన హైదరాబాద్‌కు నష్టం జరిగితే కూడా స్పందించి సాయం చేయకపోవడం దారుణమన్నారు. ‘ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రానికి ఎంతో నష్టం జరిగినా కేంద్ర ప్రభుత్వం నుంచి నయాపైసా కూడా సాయం అందలేదని ఆర్థికశాఖ అధికారులు సీఎంకు తెలిపారు. ‘హైదరాబాద్ నగరాన్ని వరదలు ముంచెత్తాయి. అనేక రంగాలకు తీవ్ర నష్టం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా పంట నష్టం కూడా జరిగింది. దాదాపు రూ.5వేల కోట్ల వరకు నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేసి, రూ.1,350 కోట్లను తక్షణ సాయంగా అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అక్టోబర్ 15న లేఖ రాశారు. వర్షాలు, వరదలతో జరిగిన నష్టంపై రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి దిగ్భ్రాంతి కూడా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌తో వారు స్వయంగా మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. కేంద్ర బృందం కూడా రాష్ట్రంలో పర్యటించి, పరిస్థితిని స్వయంగా చూసింది. ఇంత జరిగిన తర్వాత కేంద్రం నుంచి ఎంతోకొంత సాయం అందుతుందని ఆశించాం. కానీ కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా సాయం అందలేదు’అని ఆర్థిక శాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్ రాస్ పాల్గొన్నారు. -
భూమి హక్కు పక్కా
సాక్షి, హైదరాబాద్: ‘కంక్లూజివ్ టైటిల్’... సీఎం కేసీఆర్ చెప్పిన ఈ మాట గురించి రెవెన్యూ శాఖలో పెద్ద చర్చే జరుగుతోంది. భూ యాజమాన్య హక్కు వివాదాలకు శాశ్వతంగా తెరదించాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి చేసిన ఈ ప్రతిపాదన అమలు సాధ్యాసాధ్యాలపై అధికారుల్లో లోతైన చర్చ జరుగుతోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన మంచిదే అయినా చరిత్ర, భవిష్యత్తుతోపాటు వర్తమానాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ విషయంలో ముందడుగు వేయాల్సి ఉంటుందని, లేదంటే మున్ముందు భూ సమస్యలు మరింత పెరిగిపోతాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టైటిల్ గ్యారంటీ ఇచ్చే విషయంలో పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత కొత్త రెవెన్యూ చట్టంలో భూ యాజమాన్య హక్కులపై స్పష్టత ఇవ్వాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నాణేనికి అటూ... ఇటూ కొత్త రెవెన్యూ చట్టంపై మల్లగుల్లాలు పడుతున్న ప్రభుత్వం మూడు మార్గాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒకటి నిజాం కాలంలో ప్రవేశపెట్టిన తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్–1907కు ప్రాణం పోయడం, రెండోది ప్రస్తుతం అమల్లో ఉన్న రికార్డ్స్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్–1971) చట్టానికి మార్పులు చేయడం, మూడోది టైటిల్ గ్యారంటీ చట్టాన్ని తీసుకురావడం. ఈ మూడింటిలో అత్యుత్తమమైనదిగా టైటిల్ గ్యారంటీ చట్టాన్ని ప్రభుత్వం పరిగణిస్తోంది. తద్వారా పట్టాదారులకు భూమిపై పక్కాగా హక్కులు రావడమే కాకుండా భవిష్యత్తులో ఎలాంటి భూ వివాదాలకు తావుండదని అంచనా వేస్తోంది. అయితే ప్రభుత్వ ప్రతిపాదన, ముఖ్యమంత్రి ఆలోచన సాకారం కావాలంటే దీని అమల్లో ఎదురయ్యే కష్టసాధ్యాలపై మరింత కసరత్తు అవసరమని నిపుణులు అంటున్నారు. టైటిల్ గ్యారెంటీపై రెవెన్యూశాఖలో జరుగుతున్న చర్చ ప్రకారం రికార్డులు అప్డేట్గా తప్పులు లేకుండా ఉంటేనే టైటిల్ గ్యారెంటీపై ముందుడుగు వేయగలమని, అది కూడా హద్దులు నిర్ధారించాకే సాధ్యపడుతుందని చెబుతున్నారు. ఒకసారి టైటిల్ గ్యారెంటీని గనుక అమలు చేస్తే రికార్డులను సవరించే వీలుండదు. ఒకవేళ భవిష్యత్తులో సదరు టైటిల్లో గనుక తప్పులున్నట్లు తేలితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ మేరకు భూ యజమానులకు నష్టపరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుంది. తప్పులను పూర్తిస్థాయిలో సవరించి రెవెన్యూ రికార్డులను పటిష్టంగా రూపొందించాల్సి ఉంటుంది. అమెరికాలోని ఒకట్రెండు రాష్ట్రాలు నష్టపరిహారం భారం కావడంతో టైటిల్ గ్యారెంటీ నుంచి వెనక్కి తగ్గాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తెస్తున్న కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనలో మరింత జాగ్రత్త అవసరం కానుంది. మరోవైపు బీమా కంపెనీలు కూడా రికార్డులు పక్కాగా ఉంటేనే బీమా వర్తింపజేస్తాయి. ఇప్పటికే భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం కూడా రికార్డుల్లో తప్పులు దొర్లాయని కోకొల్లలుగా ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో ఈ తప్పులను సరిచేసేందుకు అవకాశం ఇచ్చాకే టైటిల్ గ్యారెంటీని అమల్లోకి తేవాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పహాణీలు బ్యాక్ ఎండ్‌లోనే... కొత్త చట్టాన్ని తీసుకొస్తే ఇన్నాళ్లూ రెవెన్యూ రికార్డుల మాతృకగా ఉన్న పహాణీలు రికార్డులుగా మిగిలిపోనున్నాయి. వాటి ప్రామాణికంగానే రికార్డులను అప్డేట్ చేస్తారు గనుక.. జాగ్రత్తగా భద్రపరుస్తారు. పహాణీల్లో నిక్షిప్తమైన సమాచారం మేరకు 1బీ రికార్డులను పటిష్టం చేస్తే సరిపోతుందని రెవెన్యూ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఫలానా వ్యక్తికి ఫలానా భూమి ఎక్కడి నుంచి వచ్చిందన్న సమాచారం 1బీ రికార్డుల్లో ఉంటుంది కనుక ఈ రికార్డులను పూర్తిస్థాయిలో పటిష్టంగా తయారు చేస్తే భవిష్యత్తులో సమస్యలు రావని భావిస్తున్నాయి. 1బీ రికార్డులను గ్రామ సభల్లో ప్రదర్శించి తప్పులు సరిదిద్దితే సమస్యలకు ముగింపు పలక వచ్చని అంచనా వేస్తున్నాయి. కొత్త చట్టం అమల్లో ఉండే ఇబ్బందులు సహజమే కానీ అంతిమంగా రైతుకు తన భూమిపై హక్కులు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని ఉన్నతాధికారులు చెబుతున్నారు. దీనికితోడు ప్రస్తుతమున్న ఇనాం, వక్ఫ్, దేవాదాయ, భూదాన్, రక్షిత కౌలుదారు తదితర చట్టాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడం ద్వారా భూ వివాదాలకు అంతిమ పరిష్కారం తీసుకురాగలమని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. భూములు పరాధీనమైతే? టైటిల్ గ్యారంటీ చట్టం అమల్లోకి వస్తే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యే అవకాశం లేకపోలేదు. కంక్లూజివ్ టైటిల్ యాక్ట్ ప్రకారం నిర్దేశిత భూమిపై ఆరు నెలల్లోగా అభ్యంతరాలు వస్తే సరి. లేకుంటే సదరు భూమిని క్లియర్ టైటిల్‌గా పరిగణించి క్లెయిమ్ చేసిన పట్టాదారుకు యాజ మాన్య హక్కు కల్పించాల్సి ఉంటుంది. దీనివల్ల చట్టంలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకొని బడా బాబులు, భూ మాఫియా సర్కారు భూములపై హక్కులను సంపాదించే అవకాశమూ లేకపోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భూ కబ్జాలపై ఉక్కుపాదం మోపడం ద్వారానే టైటిల్ గ్యారంటీ పారదర్శకంగా ఉంటుందనే చర్చ జరుగుతోంది. -
కరుణించు ‘ధరణి’ మాతా
సాక్షి, హైదరాబాద్: చీదెళ్ల అనే ఇంటి పేరు ఉన్న ఓ రైతు ఆధార్‌కార్డులో ఇంటి పేరు సీహెచ్ అని ఇంగ్లిష్‌లో నమోదయింది. అదే పట్టాదారు భూరికార్డుల్లో చీదెళ్ల అని పూర్తిగా తెలుగులో నమోదయి ఉంది. ఆధార్‌లో సీహెచ్ అని, పట్టాదారు రికార్డుల్లో చీదెళ్ల అని వేర్వేరుగా ఇంటిపేరు ఉండి సరిపోలకపోవడంతో పాసుపుస్తకం మంజూరుకు సాఫ్ట్వేర్ సహకరించడం లేదు. ఆ రైతు మీ సేవలో తన వేలిముద్రలను ఇచ్చి పట్టాదారు రికార్డుల్లోగాని, ఆధార్ కార్డుల్లోగాని ఒకే విధమైన ఇంటి పేరును నమోదు చేసుకుంటేనే పాసుపుస్తకం జారీకి వీలవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ధరణి’వెబ్సైట్ ద్వారా రెవెన్యూ సేవల విషయంలో కలుగుతున్న అవాంతరాలకు ఇదో మచ్చుతునక. ధరణి సాఫ్ట్‌వేర్‌ను రూపొందించే కాంట్రాక్టును అనుభవం లేని ఐఎల్ఎఫ్ఎస్ అనే సాఫ్ట్వేర్ సంస్థకు ఇవ్వడం, ఏ అధికారి స్థాయిలో ఏ సమస్యను పరిష్కరించే అధికారం ఇవ్వాలనే విషయంలో సమగ్రత లోపించడం, రెవెన్యూ సిబ్బందిపై పడుతున్న అదనపు పనిభారం వెరసి రాష్ట్ర రైతాంగం క్షేత్రస్థాయిలో చాలా ఇబ్బందులు పడుతోంది. ధరణి ప్రాజెక్టు ద్వారా రైతులకు సమీకృత రెవెన్యూ సేవలందించాలని, క్రయ, విక్రమాలు జరగ్గానే రైతు ఇంటికి నేరుగా పాసుపుస్తకాలు పంపాలని, ఆ పాసుపుస్తకాలు బ్యాంకుల్లో తనఖా పెట్టకుండానే రికార్డుల ద్వారా సదరు రైతులకు రుణాలిప్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రారంభించిన ఈ ప్రాజెక్టు పుట్ల కొద్దీ సమస్యలతో ఇటు రైతులను, అటు రెవెన్యూ అధికారులను ముప్పుతిప్పలు పెడుతోంది. ధరణి ప్రాజెక్టులో ఎదురవుతున్న సమస్యలివే... –ఆధార్ కార్డు, పట్టాదారు రికార్డుల్లో పేర్లు సరిపోలకపోతే పాసుపుస్తకం జారీకి సాంకేతిక ఇబ్బందులు వస్తున్నాయి. ఒక్కో ఎంట్రీకి గంటల కొద్దీ సమయం పడుతోంది. –తహసీల్దార్లు డిజిటల్ సంతకాలు చేసి పంపిన పాసు పుస్తకాలు ఆరునెలలు దాటినా ఇంతవరకు రాలేదు. చెన్నై, కోల్‌కతా, బెంగళూరు ప్రాంతాల కంపెనీలకు ఈ పుస్తకాల ముద్రణ కాంట్రాక్టు ఇవ్వడంతో అసలు ఏ కంపెనీని ఆరా తీయాలో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. పాసుపుస్తకాలు ఎప్పుడు వస్తాయో కూడా తెలియని దుస్థితి. –ధరణి సాఫ్ట్‌వేర్‌లో ఏదైనా తప్పుగా నమోదైతే మళ్లీ దాన్ని సరిచేసే అవకాశం తహసీల్దార్ స్థాయిలో కూడా లేదు. ఆర్డీవో లాగిన్లోకి వెళ్లి దానిని సరిచేయాల్సి వస్తోంది. ఆర్డీవోలు అనేక కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో ఈ పనులు చేయలేని పరిస్థితి నెలకొంది. భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా నమోదు చేసిన కొత్త సర్వే నంబర్లను ధరణిలో నమోదు చేసే అధికారం తహసీల్దార్ స్థాయిలో లేదు. అదే విధంగా గత రికార్డుల్లో మిస్సింగ్ అయిన నంబర్లను కూడా నమోదు చేయలేకపోతున్నారు. ఇవి కూడా ఆర్డీవో స్థాయి లాగిన్ ద్వారా చేయాల్సి వస్తుండడంతో తీవ్ర కాలయాపన అవుతోంది. రీసెటిల్మెంట్ రిజిస్టర్(ఆర్ఎస్ఆర్)ను సరిచేసే అధికారం జేసీలకిచ్చారు. ఉదాహరణకు ఒక సర్వేనంబర్ రికార్డుల్లో 20 ఎకరాల భూమి ఉంటే... క్షేత్రస్థాయిలో నిజంగా భూమి 18 ఎకరాలే ఉందనుకోండి. అప్పుడు ఆ భూమికి సంబంధించిన వాస్తవ వివరాలను ధరణిలో నమోదు చేయలేకపోతున్నారు. ఆర్డీవో, జేసీల లాగిన్‌లో ఉన్న అధికారాల పరంగా మార్పులు చేయాలంటే సదరు ఆర్డీవో లేదా జేసీ బయోమెట్రిక్ నమోదు తప్పనిసరి చేశారు. దీంతో ఆర్టీవో, జేసీ స్థాయి అధికారులు అనేక పనుల్లో బిజీగా ఉండడం, వారే స్వయంగా లాగిన్‌ను బయోమెట్రిక్ ద్వారా ఓపెన్ చేయాల్సి రావడంతో సమస్యల పరిష్కారానికి నెలల సమయం పడుతోంది. ఒక్క పాసుపుస్తకం మంజూరు కావాలంటే తహసీల్దార్ నాలుగు సార్లు బయోమెట్రిక్ నమోదు చేయాల్సి వస్తోంది. ఒక సర్వే నంబర్లో ఐదెకరాల భూమి ఉంటే... అందులో నాలుగెకరాలు సాగు భూమి, మరో ఎకరం వ్యవసాయేతర భూమి ఉందనుకోండి. ఈ రెండింటిని విడివిడిగా నమోదు చేసేందుకు సాఫ్ట్వేర్ సహకరించడం లేదు. ఇంతవరకు ధరణి ప్రాజెక్టు వివరాలను పబ్లిక్ డొమైన్‌లోకి తేలేదు. సీసీఎల్ఏ వెబ్సైట్లో అన్ని రికార్డులు ఉంచామని చెపుతున్నా అవి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. మీ సేవా కేంద్రాలు, లేదంటే సొంత కంప్యూటర్లు, ఫోన్ల ద్వారా ధరణిలోని భూముల వివరాలు అందుబాటులోకి తేవడంతో పాటు సమస్యల పరిష్కారానికి ఓ టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాల్సి ఉంది. కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా... బేతుపల్లి సర్వే నంబరు 878/211/అ లో నాకు 1.10 ఎకరాల వ్యసాయభూమి ఉంది. భూప్రక్షాళనలో నా భూమి రికార్డు చేయలేదు. ఎన్నిసార్లు రెవెన్యూ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసినా పట్టించుకోవటం లేదు. నా సర్వే నంబర్లో భూమి లేదని అధికారులు చెబుతున్నారు. 40 ఏళ్ల నుంచి భూమిని సాగు చేసి అనుభవిస్తున్నాం. రెవెన్యూ యంత్రాంగం భూమి లేనివాళ్లకు కూడా రికార్డుల్లో ఎక్కించటం వల్లే నిజమైన రైతులకు అన్యాయం జరుగుతుంది. నాతోపాటు వందమందికిపైగా రైతులకు పాస్ పుస్తకాలు రాలేదు. ఎస్.వీరరాఘవులు, నారాయణపురం, సత్తుపల్లి మండలం, ఖమ్మంజిల్లా కొలువు లేదు.. సాయం లేదు ‘నాకు అశ్వారావుపేటలో సర్వే నంబరు 1228లో నా తండ్రి పంచి ఇచ్చిన రెండున్నర ఎకరాల భూమి ఉంది. ఈ భూమికి పట్టా జారీ కాలేదు. అసైన్డ్ భూమి కావడంతో భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా వారసత్వం చేసి ఇవ్వాలి. కానీ ఎన్నికలు, ఇతర కారణాల వల్ల కొత్త పట్టాదారు పాస్‌పుస్తకం జారీ కాలేదు. దీంతో రైతుబంధు సహాయం అందటం లేదు. నార్లపాటి బుచ్చిబాబు, అశ్వారావుపేట, కొత్తగూడెం జిల్లా సంవత్సరం నుండి తిరుగుతున్నాం మా కుటుంబానికి చింతలపాలెం శివారులోని 226 సర్వే నంబరులో 2.20 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి పాసుపుస్తకాల కోసం రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి వేసారి పోయాం. అదిగో ఇస్తున్నాం... ఇదిగో ఇస్తున్నాం.. అని తిప్పుతున్నారు. గట్టిగా అడిగితే సైట్ ఓపెన్ కావడం లేదంటున్నారు. ఉన్నతాధికారులకు పంపామని చెబుతున్నారు. –దేవిరెడ్డి నాగమణి, గుడిమల్కాపురం, చింతలపాలెం మండలం, సూర్యాపేట జిల్లా సిబ్బంది పెంచి పనిభారం తగ్గించాలి రిజిస్ట్రేషన్ పద్ధతిలో మార్పు తేవడంతోపాటు కోర్ బ్యాంకింగ్ ద్వారా రైతులకు మేలు చేయాలనే తలంపుతో చేపట్టిన ధరణి నిజంగా మంచి ప్రాజెక్టే. అయితే, రైతులకు ఆశించిన మేలు జరగాలంటే మాత్రం సాంకేతిక సమస్యలను పరిష్కరించాలి. రెవెన్యూ సిబ్బందిపై ఉన్న అదనపు భారాన్ని తగ్గించాలి. కొత్తమండలాలు, జిల్లాలకు అనుగుణంగా సిబ్బందిని పెంచాలి. –కె. గౌతం కుమార్, తెలంగాణ తహసీల్దార్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు -
యథావిధిగా రెవెన్యూ సేవలు
డిజిటల్ కీ వెనక్కి తీసుకున్న తహసీల్దార్లు ఏసీబీ వలలో వీఆర్వో, వీఆర్ఏ విధుల్లో చేరిన కొద్దిసేపటికే పట్టుబడిన వైనం పట్టా పుస్తకం కోసం రూ.నాలుగువేలు లంచం ముకరంపుర : వెబ్‌ల్యాండ్‌లో నెలకొన్న సాంకేతిక సమస్యలు పరిష్కరించాలంటూ సమ్మెకు దిగిన తహసీల్దార్లు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. సమస్యను పరిష్కరిస్తామని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రదీప్ చంద్ర హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ఆర్డీవోకు ఇచ్చిన డిజిటల్ ‘కీ’ని వెనక్కి తీసుకున్నారు. శనివారం ఎప్పటిలాగే రెవెన్యూ సేవలను అందించారు. విద్యార్థులకు అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు, పహాణీలు, మీసేవకు అనుసంధానమైన తదితర సేవలన్నీ కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆందోళనను తాత్కాలికంగా విరమించామని తహసీల్దార్ల సంఘం జిల్లా అధ్యక్షుడు బైరం పద్మయ్య తెలిపారు. సమస్యల పరిష్కారంపై ఆగస్టు 3న సీసీఎల్ఏతో చర్చిస్తామన్నారు. సీబీఐ వలలో వీఆర్వో, వీఆర్ఏ ‘మేం మంచివాళ్లం.. ప్రజలకు నిస్వార్థ సేవలు అందస్తున్నం. అలాంటి మాపై పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారు..’ అంటూ రెవెన్యూ అధికారులు ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి రోజైనా గడవకముందే ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ వీఆర్వో, వీఆర్ఏ అవినీతి నిరోధక అధికారులకు పట్టుబడడం చర్చనీయాంశమైంది. హుజూరాబాద్ మండలం కందుగుల వీఆర్ఏ రవీందర్, వీఆర్వో రాజేందర్ ఓ రైతుకు పట్టాదార్ పాస్‌పుస్తకం ఇచ్చేందుకు రూ.నాలుగు వేలు లంచం డిమాండ్ చేసి.. రైతు నుంచి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. హుజూరాబాద్ వీఆర్వోగా పనిచేసిన ఓ ఉద్యోగిపై పోలీసులు చర్య తీసుకోవడాన్ని నిరసిస్తూ వీఆర్వోల సంఘం ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తిరిగి అదే హుజూరాబాద్‌లో రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడడం ఆ శాఖ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోందని పలువురు చర్చించుకుంటున్నారు. రెవెన్యూశాఖ పరువు నిలబెట్టేలా సిబ్బంది వ్యవహరించాలని, లంచాలు తీసుకోవద్దని పేర్కొంటూ తహశీల్దార్ల సంఘం, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ బాధ్యులు వీఆర్వోలకు జిల్లాకేంద్రంలో శుక్రవారం హితోపదేశం చేశారు కూడా. కానీ.. అధికారుల మాటలను ఓ చెవితో విని మరో చెవితో విడిచిపెట్టి మరీ లంచం తీసుకోవడం రెవెన్యూ తీరును బజారుకీడ్చినట్లయ్యింది. ఎప్పటిలాగే రెవెన్యూపై ఉన్న అవినీతి మచ్చ.. మాయని మచ్చలాగే మిగిలింది.