- డిజిటల్ కీ వెనక్కి తీసుకున్న తహసీల్దార్లు
- ఏసీబీ వలలో వీఆర్వో, వీఆర్‌ఏ
- విధుల్లో చేరిన కొద్దిసేపటికే పట్టుబడిన వైనం
- పట్టా పుస్తకం కోసం రూ.నాలుగువేలు లంచం
యథావిధిగా రెవెన్యూ సేవలు
Published Sat, Jul 30 2016 10:55 PM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM
ముకరంపుర : వెబ్‌ల్యాండ్‌లో నెలకొన్న సాంకేతిక సమస్యలు పరిష్కరించాలంటూ సమ్మెకు దిగిన తహసీల్దార్లు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. సమస్యను పరిష్కరిస్తామని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రదీప్ చంద్ర హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ఆర్డీవోకు ఇచ్చిన డిజిటల్ ‘కీ’ని వెనక్కి తీసుకున్నారు. శనివారం ఎప్పటిలాగే రెవెన్యూ సేవలను అందించారు. విద్యార్థులకు అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు, పహాణీలు, మీసేవకు అనుసంధానమైన తదితర సేవలన్నీ కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆందోళనను తాత్కాలికంగా విరమించామని తహసీల్దార్ల సంఘం జిల్లా అధ్యక్షుడు బైరం పద్మయ్య తెలిపారు. సమస్యల పరిష్కారంపై ఆగస్టు 3న సీసీఎల్‌ఏతో చర్చిస్తామన్నారు.
సీబీఐ వలలో వీఆర్వో, వీఆర్‌ఏ
‘మేం మంచివాళ్లం.. ప్రజలకు నిస్వార్థ సేవలు అందస్తున్నం. అలాంటి మాపై పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారు..’ అంటూ రెవెన్యూ అధికారులు ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి రోజైనా గడవకముందే ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ వీఆర్వో, వీఆర్‌ఏ అవినీతి నిరోధక అధికారులకు పట్టుబడడం చర్చనీయాంశమైంది. హుజూరాబాద్ మండలం కందుగుల వీఆర్‌ఏ రవీందర్, వీఆర్వో రాజేందర్ ఓ రైతుకు పట్టాదార్ పాస్‌పుస్తకం ఇచ్చేందుకు రూ.నాలుగు వేలు లంచం డిమాండ్ చేసి.. రైతు నుంచి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. హుజూరాబాద్ వీఆర్‌వోగా పనిచేసిన ఓ ఉద్యోగిపై పోలీసులు చర్య తీసుకోవడాన్ని నిరసిస్తూ వీఆర్‌వోల సంఘం ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తిరిగి అదే హుజూరాబాద్‌లో రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడడం ఆ శాఖ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోందని పలువురు చర్చించుకుంటున్నారు. రెవెన్యూశాఖ పరువు నిలబెట్టేలా సిబ్బంది వ్యవహరించాలని, లంచాలు తీసుకోవద్దని పేర్కొంటూ తహశీల్దార్ల సంఘం, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ బాధ్యులు వీఆర్వోలకు జిల్లాకేంద్రంలో శుక్రవారం హితోపదేశం చేశారు కూడా. కానీ.. అధికారుల మాటలను ఓ చెవితో విని మరో చెవితో విడిచిపెట్టి మరీ లంచం తీసుకోవడం రెవెన్యూ తీరును బజారుకీడ్చినట్లయ్యింది. ఎప్పటిలాగే రెవెన్యూపై ఉన్న అవినీతి మచ్చ.. మాయని మచ్చలాగే మిగిలింది.
Advertisement
Advertisement