సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కరోనా రూపంలో గట్టి దెబ్బే పడింది. ఆశించిన ఆదాయం గణనీయంగా తగ్గి... ఆర్థిక ప్రణాళిక తల్లకిందులైంది. ఇప్పుడు నికరంగా వచ్చేదెంతో చూసుకొని.. ప్రాధాన్యాలను బట్టి పద్దులను సరిచేసుకోవాల్సి వస్తోంది. కరోనా నియంత్రణకు విధించిన లాక్‌డౌన్‌తో ప్రస్తుత (2020–21) ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి వచ్చే ఆదాయం అన్నివిధాలా కలిసి రూ.52,750 కోట్లు తగ్గనుందని ఆర్థిక శాఖ అధికారులు తేల్చారు. ఆదాయంలో భారీ తగ్గుదల నేపథ్యంలో 2020–21 బడ్జెట్ అంచనాల్లో కూడా మార్పులు, సవరణలు అనివార్యమని ప్రభుత్వానికి సూచించారు. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం కేసీఆర్ శనివా రం ప్రగతిభవన్‌లో ఆర్థికశాఖ అధికారులతో సమావేశమయ్యారు. 2020–21 బడ్జెట్‌పై మధ్యంతర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ అధికారులు కరోనా వల్ల తలెత్తిన పరిస్థితిని వివరించారు.
తల్లకిందులైన బడ్జెట్ అంచనాలు
‘రాష్ట్రానికి పన్నులు, పన్నేతర మార్గాల ద్వారా 2019–20 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఏడు నెలల కాలంలో రాష్ట్రానికి రూ.39,608 కోట్ల ఆదాయం వచ్చింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ వరకు రూ.33,704 కోట్లు మాత్రమే వచ్చాయి. వాస్తవానికి రాష్ట్ర ఆదాయ వృద్ధి రేటు 15 శాతం ఉంటుందని అంచనా వేసి 2020–21 బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించడం జరిగింది. ఆశించిన 15 శాతం వృద్ధి లేకపోగా.. కరోనా వల్ల గత ఏడాది వచ్చిన ఆదాయం కూడా ఈ ఏడాది రాలేదు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి పన్నులు, పన్నేతర మార్గాల ద్వారా మొత్తం రూ.1,15,900 కోట్ల ఆదాయం వస్తుందనే అంచనాతో బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందాయి. కానీ ఈ ఆర్థిక సంవత్సరాంతానికి కేవలం రూ.68,781 కోట్ల ఆదాయం మాత్రమే సమకూరే అవకాశాలున్నాయి. దీంతో రాష్ట్రానికి వచ్చే స్వీయ ఆదాయం రూ.47,119 కోట్లు తగ్గనుంది’అని ఆర్థికశాఖ అధికారులు తెలిపారు.
‘రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లిన పన్నుల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటా కూడా భారీగా తగ్గింది. తెలంగాణకు 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.16,727 కోట్లను పన్నుల్లో రాష్ట్ర వాటాగా చెల్లిస్తామని కేంద్ర బడ్జెట్లో పేర్కొన్నారు. దీని ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు పన్నుల్లో వాటా కింద రూ.8,363 కోట్లు రావాలి. కానీ రూ.6,339 కోట్లు మాత్రమే వచ్చాయి. పన్నుల్లో వాటా ఇప్పటికే రూ.2,024 కోట్లు తగ్గింది. 2020–21 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.16,727 కోట్లకు గాను కేవలం రూ.11,898 కోట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. దీంతో పన్నుల్లో వాటా రూ.4,829 కోట్లు తగ్గనున్నాయి. వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాల కింద కేంద్ర ప్రభుత్వం నుంచి 2020–21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రూ.9,725 కోట్లు రావాల్సి ఉంది.
దీని ప్రకారం అక్టోబర్ నెల వరకు రూ.5,673 కోట్లు రావాలి. కానీ ఇప్పటి వరకు కేవలం రూ.4,592 కోట్లు వచ్చాయి. అక్టోబర్ మాసం వరకే రావాల్సిన నిధుల్లో రూ.1,081 కోత పడింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ. 9,725 కోట్లకు గాను, రూ.8,923 కోట్లు మాత్రమే వచ్చే అవకాశాలున్నాయి. మొత్తంగా కేంద్ర పథకాల కింద వచ్చే నిధుల్లో రూ.802 కోట్ల కోతపడే అవకాశం ఉంది’అని ఆర్థికశాఖ అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రానికి మొత్తంగా రూ.52,750 కోట్ల ఆదాయం తగ్గుతున్నందున దానికి అనుగుణంగా ప్రాధాన్యతాక్రమాన్ని నిర్ధారించుకుని, ఆర్థిక నిర్వహణ ప్రణాళిక రూపొందించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
కేంద్రం ఇచ్చింది శూన్యం: కేసీఆర్
కేంద్ర ప్రభుత్వానివి శుష్క ప్రియాలు, శూన్య హస్తాలే అని మరోసారి నిరూపణ అయిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వర్షాలు, వరదలతో భారీగా పంట నష్టం, ఆస్తి నష్టం జరిగినా ఒక్క రూపాయి కూడా సాయం అందించకపోవడం కేంద్ర ప్రభుత్వ వైఖరిని తేటతెల్లం చేస్తోందని విమర్శించారు. దేశంలోని అతిపెద్ద నగరాల్లో ఒకటైన హైదరాబాద్‌కు నష్టం జరిగితే కూడా స్పందించి సాయం చేయకపోవడం దారుణమన్నారు. ‘ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రానికి ఎంతో నష్టం జరిగినా కేంద్ర ప్రభుత్వం నుంచి నయాపైసా కూడా సాయం అందలేదని ఆర్థికశాఖ అధికారులు సీఎంకు తెలిపారు. ‘హైదరాబాద్ నగరాన్ని వరదలు ముంచెత్తాయి. అనేక రంగాలకు తీవ్ర నష్టం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా పంట నష్టం కూడా జరిగింది. దాదాపు రూ.5వేల కోట్ల వరకు నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేసి, రూ.1,350 కోట్లను తక్షణ సాయంగా అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అక్టోబర్ 15న లేఖ రాశారు.
వర్షాలు, వరదలతో జరిగిన నష్టంపై రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి దిగ్భ్రాంతి కూడా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌తో వారు స్వయంగా మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. కేంద్ర బృందం కూడా రాష్ట్రంలో పర్యటించి, పరిస్థితిని స్వయంగా చూసింది. ఇంత జరిగిన తర్వాత కేంద్రం నుంచి ఎంతోకొంత సాయం అందుతుందని ఆశించాం. కానీ కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా సాయం అందలేదు’అని ఆర్థిక శాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్ రాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment