కరుణించు ‘ధరణి’ మాతా | Telangana Government NOt Issue Passbooks | Sakshi
Sakshi News home page

కరుణించు ‘ధరణి’ మాతా

Published Mon, Jan 28 2019 1:53 AM | Last Updated on Mon, Jan 28 2019 1:53 AM

Telangana Government NOt Issue Passbooks - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చీదెళ్ల అనే ఇంటి పేరు ఉన్న ఓ రైతు ఆధార్‌కార్డులో ఇంటి పేరు సీహెచ్‌ అని ఇంగ్లిష్‌లో నమోదయింది. అదే పట్టాదారు భూరికార్డుల్లో చీదెళ్ల అని పూర్తిగా తెలుగులో నమోదయి ఉంది. ఆధార్‌లో సీహెచ్‌ అని, పట్టాదారు రికార్డుల్లో చీదెళ్ల అని వేర్వేరుగా ఇంటిపేరు ఉండి సరిపోలకపోవడంతో పాసుపుస్తకం మంజూరుకు సాఫ్ట్‌వేర్‌ సహకరించడం లేదు. ఆ రైతు మీ సేవలో తన వేలిముద్రలను ఇచ్చి పట్టాదారు రికార్డుల్లోగాని, ఆధార్‌ కార్డుల్లోగాని ఒకే విధమైన ఇంటి పేరును నమోదు చేసుకుంటేనే పాసుపుస్తకం జారీకి వీలవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ధరణి’వెబ్‌సైట్‌ ద్వారా రెవెన్యూ సేవల విషయంలో కలుగుతున్న అవాంతరాలకు ఇదో మచ్చుతునక.

ధరణి సాఫ్ట్‌వేర్‌ను రూపొందించే కాంట్రాక్టును అనుభవం లేని ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ అనే సాఫ్ట్‌వేర్‌ సంస్థకు ఇవ్వడం, ఏ అధికారి స్థాయిలో ఏ సమస్యను పరిష్కరించే అధికారం ఇవ్వాలనే విషయంలో సమగ్రత లోపించడం, రెవెన్యూ సిబ్బందిపై పడుతున్న అదనపు పనిభారం వెరసి రాష్ట్ర రైతాంగం క్షేత్రస్థాయిలో చాలా ఇబ్బందులు పడుతోంది. ధరణి ప్రాజెక్టు ద్వారా రైతులకు సమీకృత రెవెన్యూ సేవలందించాలని, క్రయ, విక్రమాలు జరగ్గానే రైతు ఇంటికి నేరుగా పాసుపుస్తకాలు పంపాలని, ఆ పాసుపుస్తకాలు బ్యాంకుల్లో తనఖా పెట్టకుండానే రికార్డుల ద్వారా సదరు రైతులకు రుణాలిప్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రారంభించిన ఈ ప్రాజెక్టు పుట్ల కొద్దీ సమస్యలతో ఇటు రైతులను, అటు రెవెన్యూ అధికారులను ముప్పుతిప్పలు పెడుతోంది. 
  
ధరణి ప్రాజెక్టులో ఎదురవుతున్న సమస్యలివే... 
–ఆధార్‌ కార్డు, పట్టాదారు రికార్డుల్లో పేర్లు సరిపోలకపోతే పాసుపుస్తకం జారీకి సాంకేతిక ఇబ్బందులు వస్తున్నాయి. ఒక్కో ఎంట్రీకి గంటల కొద్దీ సమయం పడుతోంది.  
–తహసీల్దార్లు డిజిటల్‌ సంతకాలు చేసి పంపిన పాసు పుస్తకాలు ఆరునెలలు దాటినా ఇంతవరకు రాలేదు. చెన్నై, కోల్‌కతా, బెంగళూరు ప్రాంతాల కంపెనీలకు ఈ పుస్తకాల ముద్రణ కాంట్రాక్టు ఇవ్వడంతో అసలు ఏ కంపెనీని ఆరా తీయాలో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. పాసుపుస్తకాలు ఎప్పుడు వస్తాయో కూడా తెలియని దుస్థితి.  
–ధరణి సాఫ్ట్‌వేర్‌లో ఏదైనా తప్పుగా నమోదైతే మళ్లీ దాన్ని సరిచేసే అవకాశం తహసీల్దార్‌ స్థాయిలో కూడా లేదు. ఆర్డీవో లాగిన్‌లోకి వెళ్లి దానిని సరిచేయాల్సి వస్తోంది. ఆర్డీవోలు అనేక కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో ఈ పనులు చేయలేని పరిస్థితి నెలకొంది.  

  • భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా నమోదు చేసిన కొత్త సర్వే నంబర్లను ధరణిలో నమోదు చేసే అధికారం తహసీల్దార్‌ స్థాయిలో లేదు. అదే విధంగా గత రికార్డుల్లో మిస్సింగ్‌ అయిన నంబర్లను కూడా నమోదు చేయలేకపోతున్నారు. ఇవి కూడా ఆర్డీవో స్థాయి లాగిన్‌ ద్వారా చేయాల్సి వస్తుండడంతో తీవ్ర కాలయాపన అవుతోంది.  
  • రీసెటిల్‌మెంట్‌ రిజిస్టర్‌(ఆర్‌ఎస్‌ఆర్‌)ను సరిచేసే అధికారం జేసీలకిచ్చారు. ఉదాహరణకు ఒక సర్వేనంబర్‌ రికార్డుల్లో 20 ఎకరాల భూమి ఉంటే... క్షేత్రస్థాయిలో నిజంగా భూమి 18 ఎకరాలే ఉందనుకోండి. అప్పుడు ఆ భూమికి సంబంధించిన వాస్తవ వివరాలను ధరణిలో నమోదు చేయలేకపోతున్నారు.  
  • ఆర్డీవో, జేసీల లాగిన్‌లో ఉన్న అధికారాల పరంగా మార్పులు చేయాలంటే సదరు ఆర్డీవో లేదా జేసీ బయోమెట్రిక్‌ నమోదు తప్పనిసరి చేశారు. దీంతో ఆర్టీవో, జేసీ స్థాయి అధికారులు అనేక పనుల్లో బిజీగా ఉండడం, వారే స్వయంగా లాగిన్‌ను బయోమెట్రిక్‌ ద్వారా ఓపెన్‌ చేయాల్సి రావడంతో సమస్యల పరిష్కారానికి నెలల సమయం పడుతోంది. ఒక్క పాసుపుస్తకం మంజూరు కావాలంటే తహసీల్దార్‌ నాలుగు సార్లు బయోమెట్రిక్‌ నమోదు చేయాల్సి వస్తోంది.  
  • ఒక సర్వే నంబర్‌లో ఐదెకరాల భూమి ఉంటే... అందులో నాలుగెకరాలు సాగు భూమి, మరో ఎకరం వ్యవసాయేతర భూమి ఉందనుకోండి. ఈ రెండింటిని విడివిడిగా నమోదు చేసేందుకు సాఫ్ట్‌వేర్‌ సహకరించడం లేదు.  
  • ఇంతవరకు ధరణి ప్రాజెక్టు వివరాలను పబ్లిక్‌ డొమైన్‌లోకి తేలేదు. సీసీఎల్‌ఏ వెబ్‌సైట్‌లో అన్ని రికార్డులు ఉంచామని చెపుతున్నా అవి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. మీ సేవా కేంద్రాలు, లేదంటే సొంత కంప్యూటర్లు, ఫోన్ల ద్వారా ధరణిలోని భూముల వివరాలు అందుబాటులోకి తేవడంతో పాటు సమస్యల పరిష్కారానికి ఓ టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేయాల్సి ఉంది.  

కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా... 
బేతుపల్లి సర్వే నంబరు 878/211/అ లో నాకు 1.10 ఎకరాల వ్యసాయభూమి ఉంది. భూప్రక్షాళనలో నా భూమి రికార్డు చేయలేదు. ఎన్నిసార్లు రెవెన్యూ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసినా పట్టించుకోవటం లేదు. నా సర్వే నంబర్‌లో భూమి లేదని అధికారులు చెబుతున్నారు. 40 ఏళ్ల నుంచి భూమిని సాగు చేసి అనుభవిస్తున్నాం. రెవెన్యూ యంత్రాంగం భూమి లేనివాళ్లకు కూడా రికార్డుల్లో ఎక్కించటం వల్లే నిజమైన రైతులకు అన్యాయం జరుగుతుంది. నాతోపాటు వందమందికిపైగా రైతులకు పాస్‌ పుస్తకాలు రాలేదు.  ఎస్‌.వీరరాఘవులు, నారాయణపురం, సత్తుపల్లి మండలం, ఖమ్మంజిల్లా 

కొలువు లేదు.. సాయం లేదు  

‘నాకు అశ్వారావుపేటలో సర్వే నంబరు 1228లో నా తండ్రి పంచి ఇచ్చిన రెండున్నర ఎకరాల భూమి ఉంది. ఈ భూమికి పట్టా జారీ కాలేదు. అసైన్డ్‌ భూమి కావడంతో భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా వారసత్వం చేసి ఇవ్వాలి. కానీ ఎన్నికలు, ఇతర కారణాల వల్ల కొత్త పట్టాదారు పాస్‌పుస్తకం జారీ కాలేదు. దీంతో రైతుబంధు సహాయం అందటం లేదు.  నార్లపాటి బుచ్చిబాబు, అశ్వారావుపేట, కొత్తగూడెం జిల్లా 

సంవత్సరం నుండి తిరుగుతున్నాం
 
మా కుటుంబానికి చింతలపాలెం శివారులోని 226 సర్వే నంబరులో 2.20 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి పాసుపుస్తకాల కోసం రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి వేసారి పోయాం. అదిగో ఇస్తున్నాం... ఇదిగో ఇస్తున్నాం.. అని తిప్పుతున్నారు. గట్టిగా అడిగితే సైట్‌ ఓపెన్‌ కావడం లేదంటున్నారు. ఉన్నతాధికారులకు పంపామని చెబుతున్నారు. –దేవిరెడ్డి నాగమణి, గుడిమల్కాపురం, చింతలపాలెం మండలం, సూర్యాపేట జిల్లా 

సిబ్బంది పెంచి పనిభారం తగ్గించాలి  

రిజిస్ట్రేషన్‌ పద్ధతిలో మార్పు తేవడంతోపాటు కోర్‌ బ్యాంకింగ్‌ ద్వారా రైతులకు మేలు చేయాలనే తలంపుతో చేపట్టిన ధరణి నిజంగా మంచి ప్రాజెక్టే. అయితే, రైతులకు ఆశించిన మేలు జరగాలంటే మాత్రం సాంకేతిక సమస్యలను పరిష్కరించాలి. రెవెన్యూ సిబ్బందిపై ఉన్న అదనపు భారాన్ని తగ్గించాలి. కొత్తమండలాలు, జిల్లాలకు అనుగుణంగా సిబ్బందిని పెంచాలి. –కె. గౌతం కుమార్, తెలంగాణ తహసీల్దార్ల అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement